బస్సులో స్పీకర్
రేగొండ మండల కేంద్రం నుంచి జూబ్లీనగర్ వయా ములుగు.. ఆ పై గ్రామాలకు వెళ్లే బస్సును సోమవారం రాష్ట్ర శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి ప్రారంభించారు. అనంతరం టికెట్ తీసుకుని బస్సులో కొంతదూరంప్రయూణించారు.
భూపాలపల్లి : తెలంగాణ రాష్ట్రంలోని అట్టడుగు వర్గాల అభివృద్ధికి కృషి చేస్తానని శాసనసభాపతి, భూపాలపల్లి ఎమ్మెల్యే సిరికొండ మధుసూదనాచారి అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన అనంతరం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలోని బు డిగెజంగాలు, రాజన్నలు, నాయకపు, కోయ, గుత్తికోయ, సింధు, చెంచు కులస్తులు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారని, ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాట్లాడి ఆయా కులాల అభ్యున్నతికి ప్రత్యేక ప్యాకేజీ, కార్యక్రమాలు చేపట్టడానికి కృషి చేస్తానని చెప్పారు.
అక్షరమంటే తెలియని రేగొండ మండలంలోని చెంచుకాలనీ విద్యార్థులతో ఆరు నెలల్లో సీఎంతో ఇంగ్లిష్ లో మాట్లాడేలా చేస్తానని అన్నారు. చెంచు విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగడానికి వెన్నుదన్నుగా నిలుస్తానని హామీ ఇచ్చారు. తెలంగాణ పునర్నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. స్పీకర్ వెంట జెడ్పీటీసీ సభ్యురాలు జర్పుల మీరాబాయి, ఎంపీపీ కళ్లెపు రఘుపతిరావ్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కుంచాల సదావిజయ్‌కుమార్ ఉన్నారు.
మారుమూల ప్రాంతాలకు రోడ్డు సౌకర్యం
రేగొండ : భూపాలపల్లి నియోజకవర్గంలోని మారుముల ప్రాంతాలకు రోడ్డు, రవాణా సౌకర్యం కల్పిస్తామని శాసనసభాపతి సిరికొండ మధుసూదనాచారి అన్నారు. సోమవారం మండల కేంద్ర నుంచి జూబ్లీనగర్ వయా ములుగు ఆపై గ్రామాలకు వెళ్లే బస్సును ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ విద్యార్థులు చదువుల కోసం ములుగు, పరాలకు వెళ్లి రావడానికి సమయానుకూలంగా రెండు ట్రిప్పులు బస్సు నడిపించేలా పరకాల డిపో మేనేజర్‌తో మాట్లాడి సౌకర్యం కల్పించినట్లు చెప్పారు.
కార్యక్రమంలో పరకాల ఆర్టీసీ డీఎం గంగాసాని రాజేందర్‌రెడ్డి, ఎంపీపీ ఈర్ల సదానందం, ఎంపీటీసీ సభ్యులు పట్టెం శంకర్, లెంకల రాఘవరెడ్డి, జూబ్లీనగర్ సర్పంచ్ లెంకల రత్నమాల, బీజేపీ జిల్లా ఉపాద్యక్షడు వెన్నంపల్లి పాపయ్య, మండల పార్టీ అధ్యక్షడు పున్నం రవి, జిల్లా నాయకులు మోడెం ఉమేష్‌గౌడ్, వడ్లకొండ రమేష్‌గౌడ్, అయిలి శ్రీధర్‌గౌడ్, ఆశోకరెడ్డి, గండి తిరుపతి పాల్గొన్నారు.