Paramount
-
పారామౌంట్ గ్లోబల్‌తో రిలయన్స్ డీల్
న్యూఢిల్లీ: పారామౌంట్ గ్లోబల్ సంస్థ భారత్‌లోని టీవీ వ్యాపార విభాగం వయాకామ్ 18లో తమకున్న 13.01 శాతం వాటాలను రిలయన్స్ ఇండస్ట్రీస్‌కి విక్రయించనుంది. ఇందుకు సంబంధించి పారామౌంట్ గ్లోబల్‌కి చెందిన రెండు అనుబంధ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు రిలయన్స్ తెలిపింది. ఈ డీల్ విలువ రూ. 4,286 కోట్లుగా ఉంటుందని వివరించింది. రిలయన్స్‌కి చెందిన టీవీ18 బ్రాడ్‌కాస్ట్‌కి వయాకామ్18 అనుబంధ సంస్థ. కంపల్సరీ కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్ల ద్వారా అందులో రిలయన్స్‌కి 57.48 శాతం వాటా ఉంది. పారామౌంట్ గ్లోబల్‌తో ఒప్పందం పూర్తయ్యాక ఇది 70.49 శాతానికి పెరుగుతుంది. తమ కంటెంట్‌కి సంబంధించి వయాకామ్18కి లైసెన్సును ఇకపైనా కొనసాగిస్తామని పారామౌంట్ వెల్లడించింది. నియంత్రణ సంస్థల అనుమతులు, రిలయన్స్–స్టార్ డిస్నీ జాయింట్ వెంచర్ పూర్తి కావడం తదితర అంశాలకు లోబడి ఈ ఒప్పందం ఉంటుందని పేర్కొంది. మీడియాలో రిలయన్స్ మరింత పటిష్టం.. 2014లో నెట్వర్క్18లో మెజారిటీ వాటాలు కొనుగోలు చేసిన రిలయన్స్ ఆ తర్వాత నుంచి మీడియా రంగంలో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంటోంది. భారత్‌లో తమ మీడియా కార్యకలాపాలను విలీనం చేసుకునేందుకు వాల్ట్ డిస్నీ, రిలయన్స్ కుదుర్చుకున్న ఒప్పందం ఇందుకు దోహదపడనుంది. సదరు జాయింట్ వెంచర్లో రిలయన్స్ రూ. 11,500 కోట్లు ఇన్వెస్ట్ చేయడం ద్వారా సోనీ, నెట్‌ఫ్లిక్స్‌కు గట్టి పోటీనిచ్చేందుకు రిలయన్స్ సన్నద్ధమవుతోంది. ప్రస్తుతం రిలయన్స్‌కి చెందిన మీడియా వెంచర్స్ అన్నీ నెట్వర్క్18 కింద ఉన్నాయి. ఇది టీవీ18 బ్రాండ్ పేరిట న్యూస్ చానళ్లు, ఇతరత్రా స్పోర్ట్స్, ఎంటర్టైన్మెంట్ చానల్స్‌ని నిర్వహిస్తోంది. అలాగే, మనీకంట్రోల్డాట్కామ్, బుక్‌మైషో వంటి సంస్థల్లోనూ నెట్ట్ వర్క్18కి వాటాలు ఉన్నాయి. వీటితో పాటు రిలయన్స్‌కి జియోసూ్టడియోస్ అనే సినిమా నిర్మాణ సంస్థ ఉంది. రెండు లిస్టెడ్ కేబుల్ డి్రస్టిబ్యూషన్ కంపెనీల్లో (డెన్, హాథ్‌వే) మెజారిటీ వాటాలు ఉన్నాయి. -
97 ఏళ్ల వయసులో రెక్కలు కట్టుకుని...!
ఆసక్తి , పట్టుదల ఉండాలే గానీ వయసుతో పనేముంది. ఒక్కసారి మనసులో గట్టిగా అనుకుంటే చాలు.. ఎంత రిస్క్ అయినా చేయొచ్చు. బోలెడంత ఆనందాన్ని సొంతం చేసుకోవచ్చు. 97ఏళ్ల వయసులో ఈ పెద్దావిడ సాహసం, తెగువ చూస్తే మీరు కూడా ఇలాగే అనుకుంటారు. ఈ బామ్మకు సెల్యూట్ చేయకుండా ఉండరు! అందుకే పారిశ్రామికవేత్త, ఎంఅండ్ఎం అధినేత ఆనంద్ మహీంద్రను కూడా బామ్మ బాగా ఆకట్టుకుంది. ఆమే నా హీరో అంటూ ఈ వీడియోను ట్విట్ చేశారు. దీంతో నెటిజన్లు బామ్మపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. పువ్వులా నేనే...నవ్వుకోవాలి....గాలినే నేనై... సాగిపోవాలి చిన్నిచిన్నిఆశ.. అంటూ సాగే తమిళ బ్యాగ్ గ్రౌండ్ పాటతో ఈ వీడియో మరింత హృద్యంగా నిలిచింది. అనుకున్న పని సాధించాలంటే వయసుతో పని ఏముంది సార్..అని ఒకరు, అద్భుతమైన వీడియో, బామ్మకు అభినందనలు మరికొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఫ్లయింగ్ రైనో పారామోటరింగ్ అనే ఇన్‌స్టా పేజ్ ఈ వీడియోను ఇటీవల షేర్ చేసింది. 97 ఏళ్ళ వయసులో ఎగిరే ప్రయత్నం చేసిన, సక్సెస్ అయిన ఈ బామ్మ ధైర్యానికి సెల్యూట్ అని పేర్కొంది. మహారాష్ట్ర జెజురి పట్టణంలోని కొండపై ఉన్న ఖండోబా ఆలయం సమీపంలో ఈ ఫీట్ చేశారు బామ్మ. It’s NEVER too late to fly. She’s my hero of the day… pic.twitter.com/qjskoIaUt3— anand mahindra (@anandmahindra) November 23, 2023 -
Vidya Nambirajan: తండ్రి వారసురాలు.. ఉద్యోగం చేసుకోమని మీ నాన్న అయినా చెప్పలేదా?
‘‘అమ్మాయిలకు ఇక్కడేం పని?’’ నలుగురూ నడిచే దారిలో కాకుండా తనకంటూ కొత్తబాట వేసుకున్న స్త్రీలకు ఎదురయే తప్పనిసరి ప్రశ్న. ‘‘అప్పట్లో కార్పొరేట్ ఉద్యోగం చేసినట్లున్నావు!’’ ఆశ్చర్యం రూపంలో ఎదురయ్యే మరో ప్రశ్న. ‘‘నువ్వు చదివింది లైఫ్ సైన్స్ కదా!?’’ ‘‘గ్యారేజ్‌లోనే ఉంటావా! ఉద్యోగానికి వెళ్లవా!?’’ ‘‘నీకీ కష్టం ఎందుకే అమ్మాయి’’ ఆత్మీయుల ఆవేదన. ‘‘పెళ్లి చేసుకుని వెళ్లాల్సిన నువ్వు ఎంతకాలం ఇలాగ!! ఉద్యోగం చేసుకోమని మీ నాన్న అయినా చెప్పలేదా?’’ అన్నింటికీ ఆమె సమాధానం ఒక్కటే. ‘మా నాన్న కోసమే ఈ గ్యారేజ్‌లోకి వచ్చాను’. విద్యానంబిరాజన్... పేరులోనే తమిళదనాన్ని నింపుకున్న ఆమె పుట్టింది చెన్నైలో, పెరిగింది హైదరాబాద్‌లో. తంజావూరులో అయ్యంగార్ కుటుంబం, మాడభూషి వంశం. తాత హైకోర్టు న్యాయమూర్తి, తండ్రి నంబిరాజన్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్. ముంబయిలోని శాంతాక్రజ్‌లో సివిల్ ఏవియేషన్‌లో ఉద్యోగం, ఆ తర్వాత హైదరాబాద్ ఈసీఐఎల్‌లో ఉద్యోగం. రిటైర్ అయిన తరవాత సికింద్రాబాద్, సైనిక్‌పురిలో ఇంటి ఆవరణలోనే ‘పారామౌంట్ ఆటో బే సర్వీసెస్’ పేరుతో తన కలల సామ్రాజ్యాన్ని స్థాపించారాయన. అలా 1988లో మొదలైన గ్యారేజ్‌ను తన ప్రయోగాలకు వేదిక చేసుకున్నారాయన. కుటుంబ కారణాల రీత్యా పరిశ్రమ బాధ్యత చేపట్టిన తర్వాత ఎదురైన సవాళ్లను విద్యానంబిరాజన్ ‘సాక్షి’తో పంచుకున్నారు. అక్కా అన్న వాళ్లే... ‘‘మా ఇంట్లోనే గ్యారేజ్ కావడంతో నాన్న దగ్గర పని చేసే ఉద్యోగులందరూ పరిచయమే. నేను చెన్నై నుంచి వచ్చినప్పుడు అందరూ ‘అక్కా’ అంటూ ఆత్మీయంగా పలకరించేవారు. అలాంటిది నేను గ్యారేజ్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మారిపోయారు. నన్ను బాస్‌గా స్వీకరించలేకపోయారు. నేనేమో అప్పటివరకు కార్పొరేట్ సెక్టార్లోనే ఉద్యోగం చేశాను. ఒక మాట చెబితే ఆ పని పూర్తయిపోవాలి. అలాంటిది ఇక్కడ ఏదో ఒక నెపం చెప్పి పనిని వాయిదా వేసేవారు. ఇక కస్టమర్లయితే ‘రాంగ్ ప్లేస్‌కి వచ్చామా’ అన్నట్లు చూసేవారు. కారు ఇవ్వవచ్చా, మరో గ్యారేజ్‌కి వెళ్లిపోదామా అనే సందిగ్ధం కనిపించేది. ఇంటర్వ్యూ చేసినట్లు మెకానికల్ రంగం గురించి అనేక ప్రశ్నలు వేసేవాళ్లు. రిపేర్, పెయింటింగ్, ఐసీ ఇంజిన్ వంటివన్నీ నాన్న నేర్పించారు. అయితే అప్పట్లో ఫియట్లు, అంబాసిడర్లే ఎక్కువ. నేను 2001లో టేకప్ చేసినప్పటి నుంచి ఆటోమొబైల్ రంగం చాలా వేగంగా మార్పులు సంతరించుకుంది. టెక్నాలజీ అంతా సాఫ్ట్వేర్ ఆధారితంగా మారిపోయింది. ఒక్కొక్కటిగా నేర్చుకున్నాను. ఎంత నేర్చుకున్నప్పటికీ, నా ధోరణి మాత్రం సీఈవో తన సీట్లో నుంచి కదలాల్సిన అవసరమేముంది? అన్నట్లు ఉండేది. నాన్న అందుకు ఒప్పుకునేవారు కాదు. ‘వాహనం రిపేరు చేస్తున్నది మెకానిక్ అయినా సరే పని జరుగుతున్నప్పుడు నువ్వు దగ్గర ఉండాలి’ అనేవారు. అలాగేనని నేను దగ్గర ఉంటే మెకానిక్‌లు నేను కారు దగ్గర ఉన్నంతసేపు పని పూర్తిచేసే వారు కాదు. పది నిమిషాలు మరో విభాగంలోకి వెళ్లి వచ్చేలోపు అంతా సెట్ చేసి పెట్టేసేవాళ్లు. ‘ప్రాబ్లమ్ ఏంటి’ అంటే మాట దాట వేసే వాళ్లు. మళ్లీ మళ్లీ అడుగుతుంటే వాళ్లకు నచ్చేది కాదు. నేనే స్వయంగా పని చేయడానికి టూల్స్ తీసుకుంటే అవమానంగా భావించేవాళ్లు. అలా నాన్నతో ఉన్నవాళ్లు ఒక్కొక్కరుగా వెళ్లిపోయారు. మొత్తానికి నాకు పని వచ్చని తెలిసిన సందర్భం ఏదంటే... మా సీనియర్ మెకానిక్ ఉద్యోగం మానేసి వెళ్లినప్పుడు. గ్యారేజ్‌లో ఇలా ఉంటే... ఇక మెటీరియల్ కొనేటప్పుడు కూడా ఘోరంగా మోసపోతుండేదాన్ని. వాళ్ల రిసీవింగ్ గొప్పగా ఉండేది. ‘ఎంత మంచి ఇంగ్లిష్ మాట్లాడుతున్నారో’ అని ప్రశంసిస్తూ ‘మేడమ్‌కి స్పెషల్ మెటీరియల్ ఇవ్వమని’ చెప్పేవాళ్లు. సీల్ పక్కాగా ఉండేది. ఒకసారి ప్రయత్నించి విఫలమైన వస్తువులను కూడా తిరిగి ప్యాక్ చేసి సీల్ చేస్తారని తెలిసింది. ఈ ప్రొఫెషన్ వదిలి వెళ్లిపోవాలనిపించిన ఇలాంటి సందర్భాలెన్నో. ఉద్యోగ జీవితం నాకు నల్లేరు మీద నడకలా సాగింది మరి. చూస్తూ ఊరుకోకూడదు! ‘ఒక ఉద్యోగి మన గ్యారేజ్ వదిలి వెళ్తున్నాడంటే అందుకు కారణం ఏమిటో స్వయంగా నువ్వే తెలుసుకోవాలి. ఒక ఉద్యోగి నాలుగ్గోడల మధ్య యజమాని ముందు మాత్రమే మనసు విప్పి మాట్లాడతారు’ అని చెప్పేవారు నాన్న. అలాగే ‘నాకు టైమ్ లేదు’ అని ఎవరైనా అన్నారంటే అందుకు ఒప్పుకునేవారు కాదు. తెలివైన వారయితే టైమ్ కుదుర్చుకుంటారు... అని కూడా చెప్పేవారు. నా సేవింగ్స్ మూడు లక్షలు, బ్యాంకు లోన్ మూడున్నర లక్షలు పెట్టి గ్యారేజ్‌ను విస్తరించాను. ఉద్యోగులకు జీతాలిస్తూ, బ్యాంకు వాయిదాలు కట్టడం కష్టమైపోయింది. తుంటి ఎముక విరగడంతో అమ్మ మూడేళ్లు మంచంలోనే ఉంది. ఉదయం తొమ్మిది నుంచి రాత్రి తొమ్మిది– పది వరకు ఇల్లు, గ్యారేజ్ పని. నా పరిస్థితి చూసి నాన్న ఓసారి చాలా బాధగా ‘నీ కెరియర్ స్పాయిల్ చేశానా విద్యా?’ అన్నారు. ఉద్యోగంలో కొనసాగి ఉంటే ఇప్పటికి ఏదో ఓ పెద్ద కంపెనీకి సీఈవో అయ్యేదానివి... అన్నారు. నా శ్రమను మరో కంపెనీ అభివృద్ధి కోసం వినియోగించడం ఎందుకు నాన్నా? నీ పరిశ్రమను విస్తరించడానికే ఉపయోగపెడతానని చెప్పాను. అదే సమయంలోనే ఈ రంగంలో స్కానర్ వచ్చింది. నా చదువు ఆ టెక్నాలజీని అర్థం చేసుకోవడానికి బాగా ఉపకరించింది. అప్పటినుంచి మెకానిక్‌లు నన్ను తేలికగా చూడడానికి సాహసించలేకపోయారు. గ్యారేజ్ మొత్తం నా నియంత్రణలోకి వచ్చేసింది. అప్పటికి 2012 వచ్చింది. అప్పుడు నాన్న సంతోషంగా ‘నువ్వు పదిమందికి జీవితాన్ని ఇవ్వగలవు’ అన్నారు. అది నాకు అసలైన సర్టిఫికేట్. మూడు నెలల శిక్షణ తరగతులు మా గ్యారేజ్‌ను పతాక స్థాయికి తీసుకువెళ్లాయి. నాన్న పేరుతో ఫౌండేషన్ స్థాపించి శిక్షణనిస్తున్నాం. మన గవర్నమెంట్లో ఏఎస్‌డీసీ సహకారంతో ట్రైనింగ్ క్లాసుల ద్వారా ఎనిమిది వందల మందికి శిక్షణనిచ్చాం. జర్మనీ కంపెనీతో నేరుగా అంగీకారం కుదుర్చుకున్నాం. అనేక కాలేజ్‌లు మాతో అనుసంధానం అయి ఉన్నాయిప్పుడు’’ అని మెండైన ఆత్మవిశ్వాసంతో చెప్పారు విద్యానంబిరాజన్. ప్రయాణం ఆపలేదు! గ్యారేజ్ నిర్వహణలో ఓ దశలో నా బంగారం కూడా తాకట్టు పెట్టాల్సి వచ్చింది. అన్న, తమ్ముడు యూఎస్‌లో మంచి స్థితిలోనే ఉన్నారు కానీ వారి నుంచి సహాయం తీసుకోవడం నాన్నకు ఇష్టం లేదు. కష్టమైనా నష్టమైనా మనిద్దరమే భరించాలనేవారు. ఇప్పుడు ఆయన లేకపోయినా ఆయన చెప్పినట్లే నడిపిస్తున్నాను. కరోనా సమయంలో మాత్రం మా తమ్ముడు ‘గ్యారేజ్ నడవకపోతే నీ ఉద్యోగుల జీతాలకు డబ్బు ఎలాగ’ అని కొంత డబ్బు పంపించాడు. ఎన్నో సంతోషాలు, సవాళ్లు... ఎన్ని సవాళ్లు ఎదురైనా నా జర్నీని ఆపలేదు. ఎన్నిసార్లు కిందపడ్డామని కాదు, ఎన్నిసార్లు లేచామనేది ముఖ్యం. మొదటిసారి పడినప్పుడు లేవడానికి ఎక్కువ సమయం పట్టవచ్చు. ఆ తర్వాత పడిన మరుక్షణం లేచి పొరపాటును సరిదిద్దుకోగలుగుతారు ఎవరైనా. నాన్న కోసం ఎంచుకున్న రంగానికి వన్నె తెచ్చానని చెప్పగలను. మా కంపెనీ లోగోలో ఉన్నట్లు నా ప్రయాణం శిఖరానికి చేరువవుతోంది. – విద్యానంబిరాజన్, సీఈవో, పారామౌంట్ ఆటో బే సర్వీసెస్, సికింద్రాబాద్. నాన్నా! నేనున్నాను! నంబిరాజన్ గ్యారేజ్ స్థాపించి పదేళ్లు గడిచిపోయాయి. ఇద్దరు కొడుకులు యూఎస్‌లో స్థిరపడ్డారు. కూతురు విద్య హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, అన్నపూర్ణ ఫాయిల్స్కి రీజియనల్ మేనేజర్. తల్లిదండ్రులు అనారోగ్యం బారిన పడితే ఉన్నఫళాన ఫ్లయిట్ ఎక్కి హైదరాబాద్‌కు రాగలిగింది ఇండియాలో ఉన్న కూతురు మాత్రమే. అలాంటి పరిస్థితుల్లో విద్యానంబిరాజన్కు ఎయిర్టెల్, హైదరాబాద్ విభాగంలో పెద్ద ప్యాకేజ్‌తో ఉద్యోగం వచ్చింది. అప్పటికే పాలిన్ ఎలర్జీ, అల్ట్రా వయొలెట్ కిరణాలను భరించలేకపోవడం వంటి సమస్యలు తండ్రిని తీవ్రమైన చర్మసమస్యకు గురి చేశాయి. కూతురు దగ్గరే ఉంది. కానీ ఆయనలో తీవ్రమైన బెంగ. కొడుకులు దగ్గర లేరు. తాను నిర్మించుకున్న ఈ చిన్న సామ్రాజ్యాన్ని ఎవరి చేతిలో పెట్టాలి? ఇది ఆడపిల్లలు చేయగలిగిన పని కాదు కదా అని మథనపడుతున్నారు. సరిగ్గా అలాంటి సమయంలో విద్యానంబిరాజన్ తన ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి, ఇంటికి వచ్చి ‘మీ ఇండస్ట్రీని నేను నడిపిస్తాను’ అని చెప్పారు. -వాకా మంజులారెడ్డి ఫొటోలు: నోముల రాజేశ్‌రెడ్డి -
పాల్‌పై డాక్యుమెంటరీ
‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ హాలీవుడ్ మూవీ సిరీస్ ద్వారా అందులో ఒక హీరో పాల్ వాకర్ సుపరిచితుడే. 2013లో జరిగిన కార్ యాక్సిడెంట్లో పాల్ మరణించిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ హీరో మీద ఓ డాక్యుమెంటరీ రూపొందించింది హాలీవుడ్ సంస్థ పారామౌంట్ పిక్చర్స్. ‘ఐ యామ్’ పేరుతో డాక్యుమెంటరీ సిరీస్‌ను రూపొందిస్తుంటుంది పారామౌంట్ సంస్థ. ఈ సిరీస్‌లో భాగంగానే పాల్ వాకర్‌పై కూడా ఓ డాక్యుమెంటరీ రూపొందించారు. ఇందులో పాల్ బాల్యంలోని కొన్ని వీడియోలను చూపించనున్నారు. అలాగే ఆయన కుటుంబ సభ్యులు, ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ సిరీస్‌లో పాల్‌తో పాటు యాక్ట్ చేసిన యాక్టర్స్, డైరెక్టర్స్‌తో ఇంటర్వ్యూలను కూడా పొందుపరిచారట. దీనికి సంబంధించిన ట్రైలర్‌ను ఇటీవలే రిలీజ్ చేసింది పారామౌంట్. ఈ డాక్యుమెంటరీ ఆగస్ట్ 11న ప్రసారం కానుంది. -
షిగ్యారేజ్
ఒకప్పటి పాట- కారులో షికారుకెళ్లే పాలబుగ్గల పసిడీదానా బుగ్గ మీద గులాబీ రంగు ఎలా వచ్చెనో చెప్పగలవా? ఇప్పటి పాట- బుగ్గ మీద ఆయిల్ మరక ఎలా వచ్చెనో చెప్పగలవా? ఆడవాళ్లు గ్యారేజ్ నడపడం అన్నది మరీ అంత ఊహకు అందని విషయమేమీ కాదు. కాని ఆడవాళ్ల కింద మగ మెకానిక్‌లు పని చేస్తున్నారంటే మాత్రం ఊహకు అందడం లేదు. సాటి మగవాళ్లకు మింగుడు పడటం లేదు. ఇలాంటి ఎన్నో స్పీడ్ బ్రేకర్లను సామాజిక అవరోధాలను దాటుకొని రోడ్డెక్కిన షీ గ్యారేజ్ - పారామౌంట్. చూస్తే మీరూ అంటారు... ఆడాళ్లూ మీకు జోహార్లు. ‘పారామౌంట్ గ్యారేజ్ ఎక్కడండీ?’ ‘ఆ గ్యారేజ్ అడ్రస్ ఎందుకండీ బాబూ.. అది ఓ మేకప్ గ్యారేజ్! మీ వెహికిల్‌కి మంచి సర్వీసింగ్ కావాలంటే వేరే గ్యారేజ్‌కి వెళ్లండి!’ ‘అరే.. పారామౌంట్ గ్యారేజ్‌లో జాబ్ దొరికిందిరా.. జాయిన్ అవుదామనుకుంటున్నా?’ ‘నీకేమన్నా దిమాగ్ ఖరాబైందారా? పోయి పోయి గండ్ల జాయిన్ అవుతా అంటున్నవ్?’ ‘ఎందుకురా.. జీతం సరిగ్గ ఇయ్యరా?’ ‘జీతం బారాబరే ఇస్తరు.. కానీ ఆడోళ్ల కింద పరిజేసి ఇజ్జత్ దీసుకునుడు అవసరమారా నీకు? ఈడ గాకపోతే ఇంకేడన్నా కొలువు దొరుకుతది. ఇజ్జత్ ముఖ్యం మనకు!’ ‘అన్నా.. పారామౌంట్ గ్యారేజ్‌లో మెకానిక్‌గా ట్రైనింగ్‌కి వెళ్తా అన్నా!’ ‘అక్కడ మగవాళ్లు కాదు ఆడవాళ్లు ఉంటారట. వాళ్లకేం వస్తుందని నీకు నేర్పుతార్రా? ఇంకేదైనా మంచి గ్యారేజ్ చూసుకో!’ పదేళ్ల కిందట ఆ గ్యారేజీ పగ్గాలు చేపట్టినప్పుడు విద్యానంబిరాజన్కు ఇలాంటి హేళనలే ఎదురయ్యాయి. వాటిని భరిస్తూనే ఆమె తన గ్యారేజీని అంతర్జాతీయ ప్రమాణాలకు మారుపేరుగా తీర్చిదిద్దుకున్నారు. ఆడవాళ్ల జాడే లేని ఆటోమొబైల్ మెకానిజంలో అడుగుపెట్టడమే సాహసం అనుకుంటే, అత్యుత్తమ సేవలతో ఈ రంగంలో తన ఉనికిని సుస్థిరం చేసుకున్నారామె. ఇదంతా సాఫీగా సాగిన ప్రయాణం కాదు. స్పీడ్ బ్రేకర్లు ఎక్కడ ఉండొచ్చో అంచనా వేయడానికి అదేమీ ఆమెకు తెలిసిన దారి కూడా కాదు. నిజానికి అప్పటి వరకు ఆమె రూటే వేరు. విద్యా నంబిరాజన్ పుట్టింది చెన్నైలో అయినా పెరిగింది హైదరాబాద్‌లోనే. ఆమె తండ్రి నంబిరాజన్ ఈసీఐఎల్‌లో ఇంజనీర్‌గా పనిచేసేవారు. తల్లి శకుంతల గృహిణి. విద్యకు ఒక అన్న, తమ్ముడు. సవాలుగా స్వీకరించి... విద్య తండ్రి నంబిరాజన్ 1988లో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాక, సైనిక్‌పురిలోని మధురానగర్ రోడ్ నం:4లో ‘పారామౌంట్ ఆటోబే సర్వీసెస్’ పేరిట గ్యారేజీ పెట్టారు. పన్నెండేళ్లు ఆయనే చూసుకున్నారు. ఆయన ఆరోగ్యం 2000 సంవత్సరంలో క్షీణించింది. అప్పటికే కొడుకులిద్దరూ విదేశాల్లో స్థిరపడ్డారు. ఇద్దరు కొడుకుల కంటే ఆయనకు ఎందుకో కూతురి మీదే గురి. అందుకే, ఎంబీఏ చదివి చెన్నైలో మార్కెటింగ్ రంగంలో స్థిరపడ్డ కూతురిని రప్పించారు. ఆమెకు గ్యారేజ్ అప్పగించి, విశ్రాంతి కోరుకున్నారు. అప్పటికి డ్రైవింగ్ తప్ప వెహికల్స్ గురించి విద్యకు ఏమీ తెలియదు. చదివిన చదువుకు, ఉద్యోగానుభవానికి ఏమాత్రం పొంతన లేని బాధ్యత అది. అయినా తండ్రి అప్పగించిన బాధ్యతను సవాలుగా స్వీకరించారామె. ఒంటరి పోరాటం... ‘పారామౌంట్’ బాధ్యతలను విద్య చేపట్టే నాటికి అందులో పన్నెండు మంది మగవాళ్లు పనిచేస్తున్నారు. ఆడబిడ్డ హోదాలో చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడల్లా ‘అక్కా’ అంటూ ఆప్యాయంగా పలకరించేవాళ్లే యజమాని హోదాలో ఆమె గ్యారేజీ బాధ్యతలను స్వీకరించడాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఒక్కొక్కరే ఉద్యోగం వదిలి వెళ్లిపోయారు. ‘ఎందుకలా వెళ్లిపోతున్నార’ని తండ్రీ కూతుళ్లిద్దరూ అడిగారు. ‘ఆడవాళ్ల కింద పనిచేయడం ఇష్టంలేదు’.. అందరిదీ ఒకటే మాట. ముగ్గురితో మళ్లీ మొదలు... అప్పటి వరకు పనిచేస్తున్న వాళ్లందరూ వెళ్లిపోయినా, విద్య ఏమాత్రం కుంగిపోలేదు. కొత్తగా ముగ్గురు మెకానిక్‌లను పనిలోకి తీసుకుని, మళ్లీ మొదలుపెట్టారు. ఆ ముగ్గురిలో ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి. ఆమ్మాయి పేరు పద్మ. గ్యారేజీని బాగా నడిపించాలంటే తానూ మెలకువలు నేర్చుకోవాలనుకున్నారు విద్య. అందుకే పద్మతో పాటు తాను కూడా ఇద్దరు అబ్బాయిల దగ్గర పని నేర్చుకున్నారు. అయినా, సర్వీసింగ్‌కు వచ్చే కస్టమర్లు అంతంత మాత్రమే! కారణం.. దుష్ర్పచారం. ‘మెకానిక్ పని ఆడోళ్లు చేస్తరా? ఆ గ్యారేజీకి పోతే మీ బండ్లు అంతే సంగతి’ అంటూ మిగిలిన గ్యారేజీల వాళ్లు ప్రచారం చేసేవాళ్లు. అయినా కుంగిపోలేదు విద్య. మార్కెట్లోకి ఏ కొత్త మెషినరీ విడుదలైనా వెంటనే తెప్పించడం మొదలుపెట్టారు. అలా కార్ వాష్ మెషిన్‌ను, ఇంజన్ స్కానర్‌నూ తెప్పించారు. మెషిన్‌తో కార్లు వాష్ చేసిన తొలి గ్యారేజీ ఆమెదే. సాఫ్ట్‌స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్.. తన గ్యారేజీలో పనిచేసే అమ్మాయిలకు సాఫ్ట్‌స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్ వంటివి నేర్పిస్తే బాగుంటుందనుకున్నారు విద్య. ట్రైనింగ్ సంస్థల సహకారంతో శిక్షణ ఇప్పించారు. వారిని చూసి అబ్బాయిలు కూడా సాఫ్ట్‌స్కిల్స్ పెంపొందించుకోవాలనుకున్నారు. వారిని కూడా శిక్షణకు పంపారు విద్య. వర్కర్స్‌ను, గ్యారేజీని ఎప్పటికప్పుడు అప్ టు డేట్ చేస్తూ ఇప్పుడు పదిహేను డివిజన్లలో సర్వీసులు అందిస్తున్నారు. మెరుగైన సర్వీసులకు గుర్తింపుగా ‘పారామౌంట్’ గ్యారేజీకి ఐఎస్ఓ సర్టిఫికేట్, జర్మనీలోని డాక్స్ సర్టిఫికేట్ దక్కాయి. ‘పారామౌంట్’ శిక్షణే పాస్‌పోర్ట్... ఇప్పుడు ఇక్కడ శిక్షణ పొందిన వాళ్లకు నిస్సాన్, మహీంద్ర, లక్ష్మీ హ్యూండై వంటి వాళ్లు మంచి జీతంతో ఉద్యోగాలిస్తున్నారు. ‘పారామౌంట్’ వర్కర్స్‌లో నైపుణ్యం పెంపొందించడానికి జర్మనీ, ఫ్రాన్స్‌లోని పెద్ద కార్ల కంపెనీలతో సమన్వయం కుదుర్చుకున్నారు విద్య. ఇండియన్ మార్కెట్లోకి ఏ కొత్త హైఎండ్ కారు విడుదలైనా ఆయా కంపెనీలకు చెందిన సిబ్బంది ‘పారామౌంట్’కు వచ్చి ఆ కార్ల పనితనాన్ని, మెకానిజం నేర్పించి వెళ్తున్నారు. నంబిరాజన్ ఫౌండేషన్.. పారామౌంట్ ఆటో బే సర్వీసెస్ వ్యవస్థాపకుడు, విద్యా తండ్రి నంబిరాజన్ 2014లో కన్నుమూశారు. తండ్రి పేరు మీద ‘నంబిరాజన్ ఫౌండేషన్’ స్థాపించి ఎందరో అమ్మాయిలకు ఉచిత శిక్షణ ఇప్పిస్తున్నారు. చదువు మీద ఆసక్తి ఉన్న పేద అమ్మాయిలకు బీఈ, మెకానిజంలో డిప్లొమా కోర్సులు చదవడానికి ఆర్థిక సాయం చేస్తున్నారు. అబ్బాయిలకూ నామమాత్రపు రుసుముతో శిక్షణను ఇప్పించి గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాలకు పంపిస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు వందమంది గల్ఫ్ వెళ్లారు. ‘చాలా అవమానాలు, ఆర్థిక భారాలు మోసి ఈ స్థితికి వచ్చా. ఒక్కోసారి జీతాలు ఇచ్చేందుకూ డబ్బు ఉండేది కాదు. అమ్మాయివి నీకెందుకు అని లోకమంతా అంటున్నా నా కుటుంబమే నాకు అండగా నిలబడింది’ అంటారు విద్యా నంబిరాజన్. తల్లిగా, చెల్లిగా, కూతురిగా, గృహిణిగా, ఉద్యోగినిగా, యజమానిగా ప్రతి బాధ్యతా మహిళకు సవాలే. ప్రతి సవాలులోనూ ఆమెది విజయమే. అలాంటి విజయానికి ప్రతీక విద్యా నంబిరాజన్. ది వన్ అండ్ ఓన్లీ లేడీ ఓనర్ ఆఫ్ ఆటోమొబైల్ వర్క్‌షాప్. - సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫలించిన వ్యూహం... అమ్మాయిలను ఈ రంగం వైపు ఆకర్షించేందుకు రోడ్ షోలూ నిర్వహించారు. ఆసక్తి ఉన్న అమ్మాయిలు చాలామందే చేరారు. అయితే ఇంట్లో వాళ్లు నిరుత్సాహపరచడంతో మధ్యలోనే మానేసేవారు. దీంతో ఆమె వ్యూహాన్ని మార్చారు. ‘మీ ఇళ్లల్లోని అమ్మాయిలకు పని నేర్పిద్దాం’ అంటూ గ్యారేజ్‌లోని మేల్ వర్కర్స్కు నచ్చచెప్పారు. వాళ్లు సానుకూలంగానే స్పందించారు. కొందరు తమ చెల్లెళ్లను, ఇంకొందరు తమ భార్యలను పనిలో చేర్చారు. అప్పటి నుంచి గ్యారేజీ వాతావరణమే మారిపోయింది. పనిలో సహకారం పెరిగింది. ఆ ఫలితం విద్యలో ఉత్సాహాన్ని నింపింది. ఒకరోజు ‘మీకు తెలిసిన అమ్మాయిలకూ చెప్పండి... ఫ్రీగానే వర్క్ నేర్పించి, పని ఇప్పిస్తా’ అని తన గ్యారేజీలో పనిచేసే అమ్మాయిలకు చెప్పారు. వాళ్ల ద్వారా చాలామందే వచ్చి, గ్యారేజీలోనే స్థిరపడ్డారు. అబ్బాయిల కంటే అమ్మాయిలో నిబద్ధతతో పనిచేయడం గమనించి, వారిని బిల్లింగ్, స్టాక్ చెకింగ్ వంటి కీలకమైన బాధ్యతల్లోనూ నియమించారు.