
వయాకామ్ 18లో పారామౌంట్ వాటాల కొనుగోలు
13 శాతానికి రూ. 4,286 కోట్లు
న్యూఢిల్లీ: పారామౌంట్ గ్లోబల్ సంస్థ భారత్‌లోని టీవీ వ్యాపార విభాగం వయాకామ్ 18లో తమకున్న 13.01 శాతం వాటాలను రిలయన్స్ ఇండస్ట్రీస్‌కి విక్రయించనుంది. ఇందుకు సంబంధించి పారామౌంట్ గ్లోబల్‌కి చెందిన రెండు అనుబంధ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు రిలయన్స్ తెలిపింది. ఈ డీల్ విలువ రూ. 4,286 కోట్లుగా ఉంటుందని వివరించింది. రిలయన్స్‌కి చెందిన టీవీ18 బ్రాడ్‌కాస్ట్‌కి వయాకామ్18 అనుబంధ సంస్థ.
కంపల్సరీ కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్ల ద్వారా అందులో రిలయన్స్‌కి 57.48 శాతం వాటా ఉంది. పారామౌంట్ గ్లోబల్‌తో ఒప్పందం పూర్తయ్యాక ఇది 70.49 శాతానికి పెరుగుతుంది. తమ కంటెంట్‌కి సంబంధించి వయాకామ్18కి లైసెన్సును ఇకపైనా కొనసాగిస్తామని పారామౌంట్ వెల్లడించింది. నియంత్రణ సంస్థల అనుమతులు, రిలయన్స్–స్టార్ డిస్నీ జాయింట్ వెంచర్ పూర్తి కావడం తదితర అంశాలకు లోబడి ఈ ఒప్పందం ఉంటుందని పేర్కొంది.
మీడియాలో రిలయన్స్ మరింత పటిష్టం..
2014లో నెట్‌వర్క్18లో మెజారిటీ వాటాలు కొనుగోలు చేసిన రిలయన్స్ ఆ తర్వాత నుంచి మీడియా రంగంలో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంటోంది. భారత్‌లో తమ మీడియా కార్యకలాపాలను విలీనం చేసుకునేందుకు వాల్ట్ డిస్నీ, రిలయన్స్ కుదుర్చుకున్న ఒప్పందం ఇందుకు దోహదపడనుంది. సదరు జాయింట్ వెంచర్‌లో రిలయన్స్ రూ. 11,500 కోట్లు ఇన్వెస్ట్ చేయడం ద్వారా సోనీ, నెట్‌ఫ్లిక్స్‌కు గట్టి పోటీనిచ్చేందుకు రిలయన్స్ సన్నద్ధమవుతోంది.
ప్రస్తుతం రిలయన్స్‌కి చెందిన మీడియా వెంచర్స్ అన్నీ నెట్‌వర్క్18 కింద ఉన్నాయి. ఇది టీవీ18 బ్రాండ్ పేరిట న్యూస్ చానళ్లు, ఇతరత్రా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్‌మెంట్ చానల్స్‌ని నిర్వహిస్తోంది. అలాగే, మనీకంట్రోల్‌డాట్‌కామ్, బుక్‌మైషో వంటి సంస్థల్లోనూ నెట్‌ట్ వర్క్18కి వాటాలు ఉన్నాయి. వీటితో పాటు రిలయన్స్‌కి జియోసూ్టడియోస్ అనే సినిమా నిర్మాణ సంస్థ ఉంది. రెండు లిస్టెడ్ కేబుల్ డి్రస్టిబ్యూషన్ కంపెనీల్లో (డెన్, హాథ్‌వే) మెజారిటీ వాటాలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment