షిగ్యారేజ్ | She Garage | Sakshi
Sakshi News home page

షిగ్యారేజ్

Published Wed, Dec 9 2015 12:26 AM | Last Updated on Mon, Oct 22 2018 7:27 PM

గ్యారేజీలో కార్ రిపేర్ చేస్తున్న మహిళా మెకానిక్‌లతో విద్యా నంబిరాజన్ - Sakshi

గ్యారేజీలో కార్ రిపేర్ చేస్తున్న మహిళా మెకానిక్‌లతో విద్యా నంబిరాజన్

ఒకప్పటి పాట- కారులో షికారుకెళ్లే పాలబుగ్గల పసిడీదానా బుగ్గ మీద గులాబీ రంగు ఎలా వచ్చెనో చెప్పగలవా? ఇప్పటి పాట- బుగ్గ మీద ఆయిల్ మరక ఎలా వచ్చెనో చెప్పగలవా? ఆడవాళ్లు గ్యారేజ్ నడపడం అన్నది మరీ అంత ఊహకు అందని విషయమేమీ కాదు. కాని ఆడవాళ్ల కింద మగ మెకానిక్‌లు పని చేస్తున్నారంటే మాత్రం ఊహకు అందడం లేదు. సాటి మగవాళ్లకు మింగుడు పడటం లేదు. ఇలాంటి ఎన్నో స్పీడ్ బ్రేకర్లను సామాజిక అవరోధాలను దాటుకొని రోడ్డెక్కిన షీ గ్యారేజ్ - పారామౌంట్. చూస్తే మీరూ అంటారు... ఆడాళ్లూ మీకు జోహార్లు.

‘పారామౌంట్ గ్యారేజ్ ఎక్కడండీ?’  ‘ఆ గ్యారేజ్ అడ్రస్ ఎందుకండీ బాబూ.. అది ఓ మేకప్ గ్యారేజ్! మీ వెహికిల్‌కి మంచి సర్వీసింగ్ కావాలంటే వేరే గ్యారేజ్‌కి వెళ్లండి!’
‘అరే.. పారామౌంట్ గ్యారేజ్‌లో జాబ్ దొరికిందిరా.. జాయిన్ అవుదామనుకుంటున్నా?’ ‘నీకేమన్నా దిమాగ్ ఖరాబైందారా? పోయి పోయి గండ్ల జాయిన్ అవుతా అంటున్నవ్?’ ‘ఎందుకురా.. జీతం సరిగ్గ ఇయ్యరా?’
‘జీతం బారాబరే ఇస్తరు.. కానీ ఆడోళ్ల కింద పరిజేసి ఇజ్జత్ దీసుకునుడు అవసరమారా నీకు? ఈడ గాకపోతే ఇంకేడన్నా కొలువు దొరుకుతది. ఇజ్జత్ ముఖ్యం మనకు!’ ‘అన్నా.. పారామౌంట్ గ్యారేజ్‌లో మెకానిక్‌గా ట్రైనింగ్‌కి వెళ్తా అన్నా!’ ‘అక్కడ మగవాళ్లు కాదు ఆడవాళ్లు ఉంటారట. వాళ్లకేం వస్తుందని నీకు నేర్పుతార్రా? ఇంకేదైనా మంచి గ్యారేజ్ చూసుకో!’
 
పదేళ్ల కిందట ఆ గ్యారేజీ పగ్గాలు చేపట్టినప్పుడు విద్యానంబిరాజన్‌కు ఇలాంటి హేళనలే ఎదురయ్యాయి. వాటిని భరిస్తూనే ఆమె తన గ్యారేజీని అంతర్జాతీయ ప్రమాణాలకు మారుపేరుగా తీర్చిదిద్దుకున్నారు. ఆడవాళ్ల జాడే లేని ఆటోమొబైల్
 
మెకానిజంలో అడుగుపెట్టడమే సాహసం అనుకుంటే, అత్యుత్తమ సేవలతో ఈ రంగంలో తన ఉనికిని సుస్థిరం చేసుకున్నారామె. ఇదంతా సాఫీగా సాగిన ప్రయాణం కాదు. స్పీడ్ బ్రేకర్లు ఎక్కడ ఉండొచ్చో అంచనా వేయడానికి అదేమీ ఆమెకు తెలిసిన దారి కూడా కాదు. నిజానికి అప్పటి వరకు ఆమె రూటే వేరు. విద్యా నంబిరాజన్ పుట్టింది చెన్నైలో అయినా పెరిగింది హైదరాబాద్‌లోనే. ఆమె తండ్రి నంబిరాజన్ ఈసీఐఎల్‌లో ఇంజనీర్‌గా పనిచేసేవారు. తల్లి శకుంతల గృహిణి. విద్యకు ఒక అన్న, తమ్ముడు.
 
సవాలుగా స్వీకరించి...

విద్య తండ్రి నంబిరాజన్ 1988లో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాక, సైనిక్‌పురిలోని మధురానగర్ రోడ్ నం:4లో ‘పారామౌంట్ ఆటోబే సర్వీసెస్’ పేరిట గ్యారేజీ పెట్టారు. పన్నెండేళ్లు ఆయనే చూసుకున్నారు. ఆయన ఆరోగ్యం 2000 సంవత్సరంలో క్షీణించింది. అప్పటికే కొడుకులిద్దరూ విదేశాల్లో స్థిరపడ్డారు. ఇద్దరు కొడుకుల కంటే ఆయనకు ఎందుకో కూతురి మీదే గురి. అందుకే, ఎంబీఏ చదివి చెన్నైలో మార్కెటింగ్ రంగంలో స్థిరపడ్డ కూతురిని రప్పించారు.

ఆమెకు గ్యారేజ్ అప్పగించి, విశ్రాంతి కోరుకున్నారు. అప్పటికి డ్రైవింగ్ తప్ప వెహికల్స్ గురించి విద్యకు ఏమీ తెలియదు. చదివిన చదువుకు, ఉద్యోగానుభవానికి ఏమాత్రం పొంతన లేని బాధ్యత అది. అయినా తండ్రి అప్పగించిన బాధ్యతను సవాలుగా స్వీకరించారామె.
 
ఒంటరి పోరాటం...
‘పారామౌంట్’ బాధ్యతలను విద్య చేపట్టే నాటికి అందులో పన్నెండు మంది మగవాళ్లు పనిచేస్తున్నారు. ఆడబిడ్డ హోదాలో చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడల్లా  ‘అక్కా’ అంటూ ఆప్యాయంగా పలకరించేవాళ్లే యజమాని హోదాలో ఆమె గ్యారేజీ బాధ్యతలను స్వీకరించడాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఒక్కొక్కరే ఉద్యోగం వదిలి వెళ్లిపోయారు. ‘ఎందుకలా వెళ్లిపోతున్నార’ని తండ్రీ కూతుళ్లిద్దరూ అడిగారు. ‘ఆడవాళ్ల కింద పనిచేయడం ఇష్టంలేదు’.. అందరిదీ ఒకటే మాట.
 
ముగ్గురితో మళ్లీ మొదలు...

అప్పటి వరకు పనిచేస్తున్న వాళ్లందరూ వెళ్లిపోయినా, విద్య ఏమాత్రం కుంగిపోలేదు. కొత్తగా ముగ్గురు మెకానిక్‌లను పనిలోకి తీసుకుని, మళ్లీ మొదలుపెట్టారు. ఆ ముగ్గురిలో ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి. ఆమ్మాయి పేరు పద్మ. గ్యారేజీని బాగా నడిపించాలంటే తానూ మెలకువలు నేర్చుకోవాలనుకున్నారు విద్య. అందుకే పద్మతో పాటు తాను కూడా ఇద్దరు అబ్బాయిల దగ్గర పని నేర్చుకున్నారు.

అయినా, సర్వీసింగ్‌కు వచ్చే కస్టమర్లు అంతంత మాత్రమే! కారణం.. దుష్ర్పచారం. ‘మెకానిక్ పని ఆడోళ్లు చేస్తరా? ఆ గ్యారేజీకి పోతే మీ బండ్లు అంతే సంగతి’ అంటూ మిగిలిన గ్యారేజీల వాళ్లు ప్రచారం చేసేవాళ్లు. అయినా కుంగిపోలేదు విద్య. మార్కెట్‌లోకి ఏ కొత్త మెషినరీ విడుదలైనా వెంటనే తెప్పించడం మొదలుపెట్టారు. అలా కార్ వాష్ మెషిన్‌ను, ఇంజన్ స్కానర్‌నూ తెప్పించారు. మెషిన్‌తో కార్లు వాష్ చేసిన తొలి గ్యారేజీ ఆమెదే.
 
సాఫ్ట్‌స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్‌మెంట్..
తన గ్యారేజీలో పనిచేసే అమ్మాయిలకు సాఫ్ట్‌స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్‌మెంట్ వంటివి నేర్పిస్తే బాగుంటుందనుకున్నారు విద్య. ట్రైనింగ్ సంస్థల సహకారంతో శిక్షణ ఇప్పించారు. వారిని చూసి అబ్బాయిలు కూడా సాఫ్ట్‌స్కిల్స్ పెంపొందించుకోవాలనుకున్నారు.

వారిని కూడా శిక్షణకు పంపారు విద్య. వర్కర్స్‌ను, గ్యారేజీని ఎప్పటికప్పుడు అప్ టు డేట్ చేస్తూ ఇప్పుడు పదిహేను డివిజన్లలో సర్వీసులు అందిస్తున్నారు. మెరుగైన సర్వీసులకు గుర్తింపుగా ‘పారామౌంట్’ గ్యారేజీకి ఐఎస్‌ఓ సర్టిఫికేట్, జర్మనీలోని డాక్స్ సర్టిఫికేట్ దక్కాయి.
 
‘పారామౌంట్’ శిక్షణే పాస్‌పోర్ట్...
ఇప్పుడు ఇక్కడ శిక్షణ పొందిన వాళ్లకు నిస్సాన్, మహీంద్ర, లక్ష్మీ హ్యూండై వంటి వాళ్లు మంచి జీతంతో ఉద్యోగాలిస్తున్నారు. ‘పారామౌంట్’ వర్కర్స్‌లో నైపుణ్యం పెంపొందించడానికి జర్మనీ, ఫ్రాన్స్‌లోని పెద్ద కార్ల కంపెనీలతో సమన్వయం కుదుర్చుకున్నారు విద్య. ఇండియన్ మార్కెట్‌లోకి ఏ కొత్త హైఎండ్ కారు విడుదలైనా ఆయా కంపెనీలకు చెందిన సిబ్బంది ‘పారామౌంట్’కు వచ్చి ఆ కార్ల పనితనాన్ని, మెకానిజం నేర్పించి వెళ్తున్నారు.
 
నంబిరాజన్ ఫౌండేషన్..
పారామౌంట్ ఆటో బే సర్వీసెస్ వ్యవస్థాపకుడు, విద్యా తండ్రి నంబిరాజన్ 2014లో కన్నుమూశారు. తండ్రి పేరు మీద ‘నంబిరాజన్ ఫౌండేషన్’ స్థాపించి ఎందరో అమ్మాయిలకు ఉచిత శిక్షణ ఇప్పిస్తున్నారు. చదువు మీద ఆసక్తి ఉన్న పేద అమ్మాయిలకు బీఈ, మెకానిజంలో డిప్లొమా కోర్సులు చదవడానికి ఆర్థిక సాయం చేస్తున్నారు.

అబ్బాయిలకూ నామమాత్రపు రుసుముతో శిక్షణను ఇప్పించి గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాలకు పంపిస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు వందమంది గల్ఫ్ వెళ్లారు.  ‘చాలా అవమానాలు, ఆర్థిక భారాలు మోసి ఈ స్థితికి వచ్చా. ఒక్కోసారి జీతాలు ఇచ్చేందుకూ డబ్బు ఉండేది కాదు. అమ్మాయివి నీకెందుకు అని లోకమంతా అంటున్నా నా కుటుంబమే నాకు అండగా నిలబడింది’ అంటారు విద్యా నంబిరాజన్.

తల్లిగా, చెల్లిగా, కూతురిగా, గృహిణిగా, ఉద్యోగినిగా, యజమానిగా ప్రతి బాధ్యతా మహిళకు సవాలే. ప్రతి సవాలులోనూ ఆమెది విజయమే. అలాంటి విజయానికి ప్రతీక విద్యా నంబిరాజన్. ది వన్ అండ్ ఓన్లీ లేడీ ఓనర్ ఆఫ్ ఆటోమొబైల్ వర్క్‌షాప్.
- సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
 
ఫలించిన వ్యూహం...
అమ్మాయిలను ఈ రంగం వైపు ఆకర్షించేందుకు రోడ్ షోలూ నిర్వహించారు. ఆసక్తి ఉన్న అమ్మాయిలు చాలామందే చేరారు. అయితే ఇంట్లో వాళ్లు నిరుత్సాహపరచడంతో మధ్యలోనే మానేసేవారు. దీంతో ఆమె వ్యూహాన్ని మార్చారు. ‘మీ ఇళ్లల్లోని అమ్మాయిలకు పని నేర్పిద్దాం’ అంటూ గ్యారేజ్‌లోని మేల్ వర్కర్స్‌కు నచ్చచెప్పారు. వాళ్లు సానుకూలంగానే స్పందించారు.

కొందరు తమ చెల్లెళ్లను, ఇంకొందరు తమ భార్యలను పనిలో చేర్చారు. అప్పటి నుంచి గ్యారేజీ వాతావరణమే మారిపోయింది. పనిలో సహకారం పెరిగింది. ఆ ఫలితం విద్యలో ఉత్సాహాన్ని నింపింది. ఒకరోజు ‘మీకు తెలిసిన అమ్మాయిలకూ చెప్పండి... ఫ్రీగానే వర్క్ నేర్పించి, పని ఇప్పిస్తా’ అని తన గ్యారేజీలో పనిచేసే అమ్మాయిలకు చెప్పారు. వాళ్ల ద్వారా చాలామందే వచ్చి, గ్యారేజీలోనే స్థిరపడ్డారు. అబ్బాయిల కంటే అమ్మాయిలో నిబద్ధతతో పనిచేయడం గమనించి, వారిని బిల్లింగ్, స్టాక్ చెకింగ్ వంటి కీలకమైన బాధ్యతల్లోనూ నియమించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement