సంక్రాంతి తర్వాతే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో జరిగే అవకాశాల్లేవని తేలింది. కేబినెట్ విస్తరణకు తొందరేం లేదంటూ శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సంక్రాంతి పండుగ వరకు విస్తరణ ఉండదని తెలుస్తోంది. పీడదినాల్లో విస్తరణ వద్దని కేసీఆర్ నిర్ణయించుకున్నారని, సంక్రాంతి తర్వాతే మంత్రివర్గ విస్తరణ, శాసనసభ సమావేశాలు, ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ల ఎన్నిక తదితర కార్యక్రమాలన్నింటినీ పూర్తి చేయాలని సీఎం నిర్ణయించినట్లు సమాచారం. ఒకే స్వభావం కలిగిన శాఖలన్నింటినీ కలిపి ఒకే మంత్రిత్వశాఖ పరిధిలోకి తేవాలని కూడా సీఎం కేసీఆర్ యోచిస్తున్నారు. దీనికోసం ఇప్పటికే అధికారులు కసరత్తు ప్రారంభించగా ఈ ప్రక్రియ ముగిశాక ఏ శాఖను ఎవరికి అప్పగించాలన్న దానిపై సీఎం నిర్ణయం తీసకోనున్నారు. దీన్నిబట్టి ఈసారి మంత్రివర్గంలో మార్పులతోపాటు కొద్ది మందికే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. అందుకే సంక్రాంతి తర్వాత తొలి విడత మంత్రివర్గాన్ని విస్తరించాలని, లోక్‌సభ ఎన్నికల తర్వాతే పూర్తిస్థాయి కేబినెట్‌ను ఏర్పాటు చేయాలని కేసీఆర్ యోచిస్తున్నారు.
పార్లమెంటరీ కార్యదర్శుల నియామకం దిశగా కసరత్తు...
మంత్రివర్గంలోకి తీసుకునే మంత్రుల సంఖ్య తక్కువగా ఉండే అవకాశమున్నందున మళ్లీ పార్లమెంటరీ కార్యదర్శుల అంశం తెరపైకి రానుంది. ఇందుకోసం న్యాయశాఖ అధికారులు గత కొంతకాలంగా కుస్తీలు పడుతున్నారు. గతంలోనూ పార్లమెంటరీ కార్యదర్శులను నియమించినప్పటికీ కోర్టు నుంచి చుక్కెదురు కావడంతో ఈసారి న్యాయపరమైన అడ్డంకులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అవసరమైతే ఇందుకోసం ప్రత్యేక చట్టాన్ని తేవాలనే యోచనలో కేసీఆర్ ఉన్నారని సమాచారం. పార్లమెంటు సెక్రటరీలుగా ఎంత మందిని నియమించాలి? ఎవరిని నియమించాలి? స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవులకు ఎవరిని ఎంపిక చేయాలి? లాంటి నిర్ణయాలన్నీ తీసుకున్న తర్వాత ఒకేసారి నియామకాలు జరపాలని సీఎం భావిస్తున్నట్లు తెలిసింది.
ఎమ్మెల్యేల ప్రమాణం లాంఛనమే...
శాసనసభ సమావేశాల నిర్వహణ కూడా సంక్రాంతి తర్వాతే అని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికయినట్లు రిటర్నింగ్ అధికారి ధ్రువీకరణ పత్రం ఇచ్చినప్పటి నుంచీ అధికారికంగా ఎమ్మెల్యేగా ఉంటారని చట్టాలు చెపుతున్నాయని, అయితే ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం లాంఛనప్రాయమేనని సీఎం కార్యాలయ వర్గాలంటున్నాయి. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గెలిచిన 53 రోజులకు ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేశారని, గత ఎన్నికలు ముగిశాక కూడా ప్రమాణస్వీకారానికి 29 రోజులు పట్టిందని గుర్తుచేస్తున్నాయి. అధికారిక హోదాలో ఇప్పటికే ఎమ్మెల్యేలు ఉన్నారని, అయితే శాసనసభలో రాజ్యాంగపరమైన విధులు నిర్వహించేందుకు మాత్రమే ప్రమాణస్వీకారమని అంటున్నాయి. ఈ నేపథ్యంలో సంక్రాంతి తర్వాతే అసెంబ్లీని సమావేశపరచి, అన్ని అధికారిక కార్యక్రమాల లాంఛనాలను అప్పుడే పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించుకున్నారని సమాచారం.