అన్యాయంపై గళమెత్తండి...
పార్లమెంటులో కేంద్రాన్ని నిలదీయండి..
గవర్నర్‌కు ప్రత్యేకాధికారాలను వ్యతిరేకించండి
పోలవరంపై తెచ్చే బిల్లును అడ్డుకోండి..
తెలంగాణలో ఏ ఒక్క గ్రామాన్నీ వదులుకునేది లేదు
టీఆర్ఎస్ ఎంపీలకు సీఎం కేసీఆర్ ఉపదేశం
రాష్ట్రం పరిధిలోకి వచ్చే శాంతిభద్రతలు వంటి వాటిని గవర్నర్‌కు అప్పగిస్తూ కేంద్రం తెలంగాణను తన చెప్పుచేతల్లోకి తీసుకునేలా వ్యవహరిస్తోంది. దీన్ని పార్లమెంటులో లేవనె త్తండి.
- ఎంపీలతో కేసీఆర్
పోలవరం ఆర్డినెన్స్‌పై తీసుకొచ్చే బిల్లును పార్లమెంట్లో గట్టిగా అడ్డుకోవాలని టీఆర్ఎస్ ఎంపీలను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. నీళ్లు, ఉద్యోగుల కేటాయింపు వంటి అంశాలతోపాటు తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై గళమెత్తాలని, ఉభయ సభల్లోనూ కేంద్రాన్ని నిలదీయాలని పేర్కొన్నారు. ఉమ్మడి రాజధానిలో గవర్నర్‌కు ప్రత్యేకాధికారాలు కట్టబెట్టే ప్రతిపాదనలను కూడా తీవ్రంగా వ్యతిరేకించాలని సూచించారు. సోమవారం నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో టీఆర్ఎస్ అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ కసరత్తు చేశారు.
ఇందులో భాగంగా ఆదివారం నాడు పార్టీ ఎంపీలను మధ్యాహ్న విందుకు ఆహ్వానించారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ విందు సమావేశానికి ఎంపీలు కె.కేశవరావు, జితేందర్‌రెడ్డి, బి.వినోద్‌కుమార్, కడియం శ్రీహరి, కవిత, బూర నర్సయ్యగౌడ్, బీబీ పాటిల్, కె.విశ్వేశ్వరరెడ్డి, సీతారాం నాయక్, జి.నగేష్, బాల్క సుమన్‌తో పాటు ఉప ముఖ్యమంత్రి డాక్టర్ టి.రాజయ్య, ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ హాజరయ్యారు. పార్లమెంట్లో ప్రస్తావించాల్సిన పలు అంశాలు, వాటి విషయంలో పాటించాల్సిన విధానంపై ఈ సందర్భంగా చర్చ జరిగింది. పార్టీ వర్గాల సమాచారం మేరకు ఎంపీలకు కేసీఆర్ చేసిన సూచనలివే... - సాక్షి, హైదరాబాద్
పోలవరం ముంపు పేరిట ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేస్తూ తీసుకొచ్చిన ఆర్డినెన్సును ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే చట్టంగా మార్చాలని కేంద్రం నిర్ణయించింది. దీన్ని మీరంతా ముక్తకంఠంతో వ్యతిరేకించండి. భద్రాచలం, పాల్వంచ డివిజన్లు సహా తెలంగాణలోని ఏ ఒక్క గ్రామాన్ని కూడా ఏపీలో కలపడానికి ఒప్పుకొనే ప్రసక్తే లేదు. ఈ విషయంలో మీరు ఎందాకైనా వెళ్లండి.
ఉమ్మడి రాజధానిలో గవర్నర్‌కు ప్రత్యేకాధికారాలు కట్టబెట్టడానికి సంబంధించి రాష్ట్ర విభజన బిల్లులోని సెక్షన్-8లో మార్పులు చేస్తూ కేంద్రం పంపిన ముసాయిదాను వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తిప్పి పంపింది. పార్లమెంట్‌లోనూ ఈ అంశాన్ని ప్రస్తావించి కేంద్రం తీరును ఎండగట్టండి. శాంతిభద్రతలు, అధికారుల బదిలీ వంటి అంశాలన్నీ రాష్ట్రం పరిధిలోకి వస్తాయి. కేంద్రం మాత్రం అందుకు భిన్నంగా వాటిని గవర్నర్‌కు అప్పగిస్తూ తెలంగాణను తన చెప్పుచేతల్లోకి తీసుకునే విధంగా వ్యవహరిస్తోంది. వాయిదా తీర్మానం రూపంలో ఈ అంశాన్ని సభలో లేవనె త్తండి.
నీళ్లు, ఉద్యోగుల కేటాయింపు వంటి అంశాలతోపాటు తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఉభయ సభల దృష్టికి తీసుకెళ్లండి.
అపాయింట్మెంట్ ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి నేను మూడు వారాల కిందట లేఖ రాసినా ఇంతవరకు స్పందన లేదు. అసలు ఎందుకు అపాయిట్మెంట్ ఇవ్వడం లేదో అర్థం కావడం లేదు. ఇట్లయితే కేంద్ర-రాష్ట్రాల మధ్య సఖ్యత ఎలా సాధ్యమో పార్లమెంట్లో ప్రధానిని కలిసి ప్రశ్నించండి.
తెలంగాణ అభివృద్ధిని కాంక్షిస్తూ గతంలో కేంద్రానికి 14 ప్రతిపాదనలు సమర్పించాం. వాటిపై ఎలాంటి పురోగతి లేదు. ఈ విషయంలో కేంద్రంపై ఒత్తిడి చేయండి.
తెలంగాణలో మారుమూల గ్రామం నుంచి రాజధాని వరకు ఎక్కడెక్కడ ఏయే సమస్యలున్నాయి? వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలేమిటి? ఆయా గ్రామాల అభివృద్ధికి చేపట్టాల్సిన కార్యక్రమాలేమిటి? అనే అంశంపై పూర్తిస్థాయి ప్రణాళికను రూపొందిస్తున్నాం. మరో రెండు వారాల్లో దీనికి సంబంధించి బ్లూప్రింట్ సిద్ధమవుతుంది. తర్వాత అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి అన్ని పార్టీల నేతలకు వాటిని అందజేస్తాం. వారి సలహాలు కూడా స్వీకరించి తదనుగుణంగా చర్యలు తీసుకుంటాం.
రాష్ర్టంలో సామాజిక ఆర్థిక సర్వే కూడా చేపట్టాం. ఇది మరో పక్షం రోజుల్లో పూర్తవుతుంది. సర్వేలో వెల్లడైన అంశాల మేరకు ప్రభుత్వ ప్రాధాన్యతలను నిర్ణయించి ఆ ప్రకారమే వాటిని అమలు చేస్తాం. అలాగే ఒక్కో గ్రామంలోనూ 30 వేల మొక్కలు నాటడంతోపాటు ప్రతి మూడు గ్రామాలకు ఓ నర్సరీని ఏర్పాటు చేస్తాం. అంతిమంగా మూడేళ్లలో ఈ లక్ష్యాన్ని సాధించేలా ప్రణాళికను రూపొందించాం.
కాగా, సోమవారం సభ ఆరంభానికి ముందే వాయిదా తీర్మానం నోటీస్‌ను ఉభయ సభాధిపతులకు అందజేయాలని టీఆర్ఎస్ ఎంపీలు నిర్ణయించారు. సమావేశానంతరం కేకే, నర్సయ్యగౌడ్ మీడియాకు వివరాలు వెల్లడించారు. ‘బంగారు తెలంగాణ’ చేతిలో పెట్టినా టీఆర్ఎస్ పార్టీ రాజకీయం చేస్తోందంటూ వస్తున్న విమర్శలపై ఘాటుగా స్పందిస్తామని జితేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ‘పోలవరం పేరుతో గిరిజనుల భూములను లాక్కుంటున్నారు. తాగునీటి పేరుతో తెలంగాణకు రావాల్సిన నీటిని మళ్లించుకుంటున్నారు. ఇదేనా బంగారు తెలంగాణ. నిజంగా బీజేపీ నేతలకు ఏమాత్రం ప్రేమ ఉన్నా వెంటనే తెలంగాణ వ్యతిరేక విధానాలను ఆపాలి’ అని వ్యాఖ్యానించారు.
అన్యాయంపై కేంద్రాన్ని నిలదీస్తాం: రాపోలు
పోలవరం ఆర్డినెన్స్, నీళ్లు, ఉద్యోగుల కేటాయింపులో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై పార్లమెంట్ వేదికగా కేంద్రాన్ని నిలదీస్తామని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్ చెప్పారు. పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రం తీరును ఎండగడతామన్నారు. గవర్నర్‌కు ప్రత్యేకాధికారాల బదలాయింపుపై చట్ట సవరణకు సంబంధించిన ముసాయిదా బిల్లును వ్యతిరేకిస్తూ రాష్ర్ట ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి లేఖ రాసినట్లు గుర్తుచేశారు. కేంద్రం రూపొందించిన ఆ ముసాయిదా బిల్లును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేరిట పంపారని, ఎన్డీయే ప్రభుత్వానికి కనీస అవగాహన లేదనడానికి ఇదే నిదర్శనమని ఆయన ఎద్దేవా చేశారు.