Paruchuri Brothers
-
పరుచూరి బ్రదర్స్ ఇంట్లో 5 ఏళ్ళు ఉన్న..
-
వేషం ఇస్తా అని పిలిచి దారుణంగా అవమానించారు.. శపథం చేశా వెళ్ళిపోయా..
-
నా వల్ల మా అన్నయ్య జైలుకు పోయేవాడు..
-
పరుచూరి బ్రదర్స్‌కు జీవిత సాఫల్య పురస్కారం
మే 4న దర్శకరత్న డా. దాసరి నారాయణరావు 75వ జయంతి. ఈ సందర్భంగా అంతర్జాతీయ సాంస్కృతిక సాహితీ సేవాసంస్థ వంశీ ఆర్ట్ థియేటర్స్ ఇంటర్నేషనల్, రేలంగి నరసింహారావు చైర్మన్‌గా ఏర్పడిన డా. దాసరి– వంశీ జీవిత సాఫల్య పురస్కారం కమిటీలు ఈ నెల 10న ప్రముఖ సినీరచయితలు పరుచూరి బ్రదర్స్ (పరుచూరి వెంకటేశ్వరరావు పరుచూరి గోపాలకృష్ణ)కు జీవిత సాఫల్య పురస్కారం అందజేస్తున్నట్టు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొంటారని వంశీ వ్యవస్థాపక అధ్యక్షులు వంశీ రామరాజు పేర్కొన్నారు. -
డిసెంబర్ 23న శోభన్‌బాబు అవార్డుల ప్రదానం
ప్రముఖ కథానాయకుడు శోభన్‌బాబు పేరిట ప్రతిష్టాత్మక పురస్కారాలను అందజేయబోతోంది అఖిల భారత శోభన్ బాబు సేవాసమితి. డిసెంబర్ 23న ఈ అవార్డుల వేడుక జరగనుంది. 2017 సంవత్సరానికి గానూ నటీనటులు, సాంకేతిక నిపుణులకు వివిధ కేటగిరిల్లో ఈ అవార్డులు అందజేయనున్నారు. ఆ వివరాలను వెల్లడించేందుకు హైదరాబాద్‌లో విలేఖరుల సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా హాజరైన పరుచూరి బ్రదర్స్ పోస్టర్‌ను, మారుతి అవార్డ్స్ టీజర్‌ను ఆవిష్కరించారు. నిర్మాత ఎమ్.నరసింహారావు, శోభన్‌బాబు అభిమానులు సుధాకర్ బాబు, జె.రామాంజనేయులు, వీరప్రసాద్, జేష్ట రమేశ్ బాబు (మాజీ ఎమ్మెల్యే), సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. -
డై..లాగి కొడితే....
సినిమా : అసెంబ్లీ రౌడీ రచన: పరుచూరి బ్రదర్స్, దర్శకత్వం: బి. గోపాల్ ఇండిపెండెంట్‌గా నిలబడి ఎమ్మెల్యేగా గెలుస్తాడు శివాజీ (మోహన్‌బాబు). ముఖ్యమంత్రి కావాలనే ఆశతో ఉంటాడు మంత్రి (సత్యనారాయణ). శివాజీ, అతని వెనక ఉన్న పాతికమంది ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు సపోర్ట్ చేస్తే తాను ముఖ్యమంత్రిని అవుతాననీ, అందుకు శివాజీకి పదిలక్షలు, మిగిలిన వారికి ఐదు లక్షల చొప్పున ఇస్తాననీ తన పీఏ ద్వారా శివాజీకి డబ్బు పంపిస్తాడు సత్యనారాయణ. ఆ డబ్బు తీసుకున్న శివాజీ, మంత్రి వద్దకు వెళ్లి విలేకరుల ముందు ఆయన్ను కడిగి పారేసి, డబ్బు తిరిగిచ్చేస్తాడు. రేయ్ అని మంత్రి మాట్లాడబోతుండగా .. ‘అరిస్తే చరుస్తా.. చరుస్తే కరుస్తా.. కరిస్తే ఉరి తీయిస్తా’ అని వార్నింగ్ ఇస్తాడు శివాజీ. పాతికేళ్ల క్రితం విడుదలైన ఈ చిత్రంలోని ఈ డైలాగ్ ఇప్పటికీ పాపులర్. -
డై..లాగి కొడితే...
సినిమా : ఆది రచయితలు: పరుచూరి బ్రదర్స్ దర్శకత్వం: వీవీ వినాయక్ ఆది (ఎన్టీఆర్), నందు (కీర్తిచావ్లా) కాలేజీలో ప్రేమించుకుంటారు. తన ప్రేమ విషయం తండ్రి నాగిరెడ్డికి (రాజన్ పి.దేవ్) చెబుతుంది నందు. ఆదిని ఇంటికి పిలిపించమని కూతురికి చెబుతాడు తండ్రి. నాగిరెడ్డి ఇంటికొచ్చిన ఆది.. నా పేరు ఆదికేశవ రెడ్డి అంటాడు. అంటే.. అని నాగిరెడ్డి ఆరా తీయబోతుండగా.. ఎస్.. ఆయన మనవడినే. ‘నాగిరెడ్డి.. నేనెవరో తెలిసాక నువ్వు పరువుగా ఫీలయ్యే నీ కూతుర్ని నాకిచ్చి పెళ్లి చేయవని నాకు బాగా తెలుసు. కానీ, నువ్వు చేసినా.. చేయకపోయినా నీ పరువుకి తాళి కట్టేది నేనే’ అంటాడు ఆది. రేయ్ అని నాగిరెడ్డి అరిస్తే.. రేయ్..అరవకు.. అమ్మతోడు.. అడ్డంగా నరికేస్తా! చెప్పేది విను అంటూ నాగిరెడ్డికి వార్నింగ్ ఇస్తాడు ఆది. అమ్మ తోడు... ఈ డైలాగ్ సూపర్ హిట్.. -
సీఎంను కలిసిన పరుచూరి బ్రదర్స్
ఉండవల్లి (తాడేపల్లి రూరల్) : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడుతో ప్రముఖ సినీ మాటల రచయితలు పరుచూరి బ్రదర్స్ భేటీ అయ్యారు. ఉండవల్లి అమరావతి కరకట్ట వెంబడి నివాసముంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నివాసానికి పరుచూరి బ్రదర్స్ మంగళవారం చేరుకున్నారు. అనంతరం చంద్రబాబుతో వారు సమావేశమయ్యారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలపై స్క్రిప్ట్ రాయించేందుకు వారిద్దరిని చంద్రబాబు పిలిపించినట్లు సమాచారం. -
సిద్ధార్థ ఏం చేశాడు?
సాగర్ (ఆర్.కె. నాయుడు), రాగిణీ నంద్వానీ జంటగా లంకాల బుచ్చిరెడ్డి సమర్పణలో రామదూత క్రియేషన్స్ పతాకంపై దాసరి కిరణ్‌కుమార్ నిర్మిస్తున్న చిత్రం ‘సిద్ధార్థ’. తన లక్ష్య సాధన సిద్ధార్థ అనే కుర్రాడు ఏం చేశాడు? అనే పాయింట్‌తో తెరకెక్కుతున్న లవ్, యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. దయానంద రెడ్డి దర్శకుడు. దాదాపు 22 రోజుల పాటు ఈ చిత్రం షూటింగ్ మలేసియాలో జరిగింది. సాగర్ మాట్లాడుతూ -‘బుల్లితెరపై ఎంత పేరు వచ్చిందో, వెండితెరపై కూడా అంతే రావాలి. అందుకోసం కష్టపడుతున్నా’’ అని చెప్పారు. నిర్మాత మాట్లాడుతూ -‘‘పరుచూరి బ్రదర్స్, ఎస్. గోపాలరెడ్డి మా సంస్థకు వెన్నెముకలాంటివారు. సాగర్ నటన ఈ చిత్రానికి హైలైట్’’అని చెప్పారు. అనంతరం సాగర్ బర్త్‌డే కేక్ కట్ చేశారు. ఈ వేడుకలో మల్టీ డైమన్షన్ వాసు, విస్సు, స్వామినాయుడు, రమేశ్ వర్మ, డీయస్ రావు తదితరులు పాల్గొని, శుభాకాంక్షలు తెలియజేశారు. -
నడి వయస్సు ప్రేమకు నీరాజనం
పోసాని కృష్ణమురళి రచయిత-దర్శకుడు-నటుడు అందుకే... అంత బాగుంది! ఫాలింగ్ ఇన్ లవ్ (1984) తారాగణం: రాబర్ట్ డినీరో, మెరిల్ స్ట్రీప్, డయానె వీస్ట్, డేవిడ్ క్లెనోన్, జేన్ కేగ్జ్మెరక్, జార్జ్ మార్టిన్, హార్వే కీటిల్; సంగీతం: డేవ్ గ్రసిన్ ఛాయాగ్రహణం: పీటర్ సస్చిట్జికీ దర్శకత్వం: ఉలూ గ్రాస్‌బార్డ్ విడుదల తేదీ: 1984 నవంబర్ 21 నిర్మాణ వ్యయం: 12 మిలియన్ డాలర్లు (సుమారు 74 కోట్ల 40 లక్షల రూపాయలు) రచయితలు పరుచూరి బ్రదర్స్ దగ్గర నేను అసిస్టెంట్‌గా పనిచేస్తున్న రోజులవి. సినిమాలు, రచన... ఇదే నా ప్రపంచం. ఏ సినిమా వచ్చినా వదిలిపెట్టేవాణ్ణి కాదు. అప్పట్లో నేను సంపాదించిందంతా వీడియో క్యాసెట్లు కొనడానికే సరిపోయేది. ఆ రోజు ‘గాన్ విత్ ద విండ్’ చూసి షాకయిపోయా. మళ్లీ మళ్లీ చూశాను. ఆ తర్వాత నేను చూసిన సినిమా ‘ఫాలింగ్ ఇన్ లవ్’. అంతే... ఆ క్షణమే ఆ సినిమాతో నేను ప్రేమలో పడిపోయా. అంతకు ముందు చూసిన సినిమాలన్నీ ఎరేజ్ అయిపోయి, కేవలం ఈ ఒక్క సినిమానే నా మైండ్ థియేటర్లో కొన్నేళ్లుగా రివైండ్ అవుతోంది. ఇప్పటికి ఓ వందసార్లు... కాదు కాదు.. అంతకన్నా ఎక్కువసార్లే చూసుంటాను. ఎప్పుడు చూసినా నాలో ఫస్ట్ టైమ్ చూస్తున్న ఫీలింగే కలుగుతుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం! నా మనసులో రైలు కూత మొదలవుతోంది. అవును... ఈ సినిమాలో ప్రేమకథకు రైలు ఓ వాహకం. ఆ రైల్లో బోలెడంతమంది ప్రయాణం చేస్తుంటారు. అందులో ఓ అందమైన అమ్మాయి కనిపిస్తుంది. అబ్బ... ఎంత బాగుంటుందో! ఇలాంటమ్మాయి కనిపిస్తే, ఏ అబ్బాయికైనా వెంటనే మనసు పారేసుకోవాలనిపిస్తుంది. ఆమె పేరు మోలీ గ్లిమోర్ (నటి మెరిల్ స్ట్రీప్). హాస్పిటల్లో ఉన్న తండ్రిని చూడడం కోసం రోజూ రైల్లో వెళ్లి వస్తుంటుంది. అదే రైల్లో ఓ అందమైన అబ్బాయి కూడా ప్రయాణిస్తుంటాడు. అబ్బాయిల్లో కూడా ఇంత అందగాళ్లు ఉంటారా అనిపిస్తుంది అతణ్ణి చూస్తే. అతని పేరు ఫ్రాంక్ రాఫ్టిన్ (నటుడు రాబర్ట్ డినీరో). ఎక్కడో ఉద్యోగం! రానూ పోనూ రైలు ప్రయాణం. ఆ అమ్మాయి, ఈ అబ్బాయి ఒకసారి చూసుకుంటే బాగుంటుంది కదా అనే ఫీలింగ్ మనలో మొదలవుతుంది. మన కోరికకు తగ్గట్టుగానే వాళ్లిద్దరూ కలిసే సమయం వచ్చేసింది. కానీ మనకేమో ఇది సరిపోదు. వాళ్లింకా దగ్గర అయితే బాగుంటుంది కదా అనిపిస్తుంది. ఆ ఆకాంక్ష కూడా ఫలిస్తుంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే... ఆ అమ్మాయికి ఆల్రెడీ పెళ్లయిపోయింది. పిల్లలు కూడా ఉంటారు. ఇక్కడ ఈ అబ్బాయికీ భార్యా, పిల్లలు ఉంటారు. క్రిస్మస్ దగ్గరకొస్తోంది. భార్యకూ, పిల్లలకూ గిఫ్ట్ కొనడానికి ఫ్రాంక్ రాఫ్టిన్ ఓ షాపుకెళ్తాడు. అక్కడికే మోలీ గ్లిమోర్ కూడా వెళ్తుంది. తన భర్తకు మంచి గిఫ్ట్ కొంటుంది. పొరపాటున ఇద్దరి గిఫ్ట్‌లూ మారిపోతాయి. అక్కడ నుంచీ వారిద్దరి మధ్యనా పరిచయం మొలకలేస్తుంది. ఇద్దరూ రోజూ కలిసే వెళ్తుంటారు. ఈ పరిచయం కాస్తా స్నేహం అవుతుంది. ఎదురుచూపులు మొదలయ్యాయి. ఫోన్లు మాట్లాడుకోవడం మొదలయింది. లంచ్‌లకు వెళ్లడం మొదలయింది. ఒకరి సమక్షం ఇంకొకరికి హాయిగా ఉంటోంది. కొత్త నవ్వులు... కొత్త స్పందనలు... కొత్త ఆశలు... జీవితమంతా కొత్తగా అనిపిస్తోంది. దువ్విన తలనే దువ్వడం - అద్దం వదలకపోవడం లాంటివన్నీ జరుగుతుంటాయి. గాఢ చుంబనాలు... గాఢ పరిష్వం గాలు... అంతా గాఢతే.వీళ్ల ప్రేమను చూసి కాలం కుళ్లుకున్నట్టుంది. ఇద్దరి విషయం కుటుంబాలకు తెలిసిపోయింది. కలవరాలు... కల్లోలాలు..! సమాజం విధించిన కట్టుబాటు వాళ్లని విడగొట్టేస్తుంది. అది చూసి మనం తట్టుకోలేం. గుండెను అరచేతుల్లో పట్టి పిండేస్తున్నంత బాధ. ఎలాగైనా ఆ జంట కలవాలని మనసులోనే మొక్కుకుంటాం. కానీ కలవరు! కలవలేరు అదంతే!! ఇదీ క్లుప్తంగా ఆ సినిమా కథ. ‘ఆ... ఏముంది ఇందులో విషయం’ అనుకుంటే మీ ఇష్టం. కానీ ఒక్కసారి నేను చెప్పినట్టుగా ఈ సినిమా చూడండి. ఆ రెండున్నర గంటలూ మీ సెల్‌ఫోన్‌ను మ్యూట్‌లో పెట్టేయండి. లేకపోతే స్విచాఫ్ చేసేయండి. అంతేగానీ ఫేస్బుక్లో లైక్‌లు కొడుతూ, ట్వీట్లు చేస్తూ, కేఎఫ్‌సీ నుంచి తెప్పించుకున్న చికెన్ పాప్‌కార్న్ తింటూ చూస్తే మాత్రం ఈ సినిమాలోని ఫీల్ మీ హార్ట్‌కి ఏ మాత్రం ఇంజెక్ట్ కాదు. ఇందులో హీరోగా చేసింది రాబర్ట్ డినీరో. నాకు తెలిసి హాలీవుడ్లో అంత అందగాణ్ణి చూడలేదు. నేను మగాణ్ణయినా కూడా ‘ఐ లవ్యూ రాజా’ అనాలనిపిస్తుంది. ఆయన అద్భుతమైన నటుడు కూడా. ఆస్కార్‌కు 7 సార్లు నామినేట్ అయిన ఘనుడు. ‘గాడ్ ఫాదర్-2’ (1974)కు ఉత్తమ సహాయ నటునిగా, ‘రేజింగ్ బుల్’ (1980)కి ఉత్తమ నటుడిగా రెండు సార్లు ఆస్కార్లు అందుకున్నాడు. ఆయన మంచి డెరైక్టర్ కూడా. ‘ద గుడ్ షెపర్డ్’ (2006), ‘ఎ బ్రాంక్స్ టేల్’(1993) సినిమాలు డెరైక్ట్ చేశాడు. ఈ సినిమాకు ముందు రాబర్ట్ డినీరో చేసినవన్నీ యాక్షన్ సినిమాలే. ఏదైనా కొత్తగా చేద్దామనే ప్రయత్నంలో ఉన్నప్పుడు, ఈ సినిమా చేసే అవకాశమొచ్చింది. ఇక హీరోయిన్ మెరిల్ స్ట్రీప్ అందాన్ని పొగడడానికి మనకున్న ఉపమానాలు సరిపోవు. ‘దేవుడా..! ఇలాంటమ్మాయి ఇంతవరకూ మనకు ఎందుకు తారసపడలేదా’ అనే బాధ కలుగుతుంది. ఇంతటి అందగత్తె కోసం ప్రపంచంలో అన్నీ వదిలేసుకున్నా నష్టం లేదనిపిస్తుంది. నేనైతే ఈ సినిమా చూసిన ప్రతిసారీ, రాబర్ట్ డినీరోగా నన్ను నేను ఊహించుకునేవాణ్ణి. 19 సార్లు ఆస్కార్ అవార్డుల రేసులో నామినేట్ అయిన అమెరికన్ నటి మెరిల్ స్ట్రీప్. ఆమె తన 37 ఏళ్ల సినీ ప్రస్థానంలో మొత్తం 405 అవార్డులకు నామినేట్ అయితే, 151 పురస్కారాలను తన కొప్పున కట్టేసుకుంది. రాబర్ట్ డినీరో, మెరిల్ స్ట్రీప్... జంట చాలా బావుంటుంది. వీళ్లిద్దరూ కలిసి ఇంతకు ముందు ‘డీర్ హంటర్’ (1978) అనే సినిమా చేశారు. ఆ తర్వాత మళ్లీ కలవడం ఇదే.నాకు హీరో, హీరోయిన్, కథ, స్క్రీన్‌ప్లే, షాట్స్ అన్నీ గుర్తున్నాయి. కానీ, దర్శకుడి పేరు ఎప్పుడూ మరిచిపోతుంటాను. నిజం చెప్పాలంటే ఇంత గొప్ప ప్రేమను ముందు తను ఫీలయ్యి, తర్వాత మనం ఫీలయ్యేలా చేసిన ఆ దర్శకుడికి హేట్సాఫ్! నేనీ సినిమా చూడమని చాలామందికి డీవీడీ గిఫ్ట్‌గా కూడా ఇచ్చాను. ఈ ప్రపంచానికి ‘ప్రేమ’ అనే మరో కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసిందీ సినిమా. భూతద్దం పెట్టి వెతికినా, ఎక్కడా బూతు సీన్లు కనబడవు. బూతు మాటలు వినబడవు. పార్కుకు ఎందుకు వెళుతాం... స్వచ్ఛమైన గాలి కోసం. మరి స్వచ్ఛమైన ప్రేమను కళ్లారా ఆస్వాదించాలనుకుంటే మాత్రం యూ మస్ట్ వాచ్ - ‘ఫాలింగ్ ఇన్ లవ్’. తారల ప్రతిభా ప్ర‘దర్శకుడు’ అమెరికన్ రంగస్థలంపై కృషి చేసిన చిత్ర దర్శక, నిర్మాత - ఉలూ గ్రాస్‌బార్డ్ (1929 - 2012). ఆయన అసలు పేరు - ఇజ్రాయెల్. కానీ, ఇంట్లో వాళ్ళ అన్నయ్య పిలిచిన ముద్దుపేరు ‘ఉలూ’ అన్నదే పాపులరైంది. వజ్రాల వ్యాపారి కుమారుడిగా బెల్జియమ్‌లో పుట్టిన ఆయన యూనివర్సిటీ ఆఫ్ చికాగోలో చదువుకున్నారు. ఇటు రంగస్థలంపై, అటు వెండితెరపై సమాన స్థాయిలో కృషి చేశారు. 1960ల తొలినాళ్ళ నుంచి న్యూయార్క్‌లో రంగస్థలంపై కృషి చేయడం మొదలుపెట్టారు. సహజమైన నాటకాలపై ప్రేమతో బ్రాడ్వేలో ప్రముఖ నాటక రచయితలు ఉడీ అలెన్, ఆర్థర్ మిల్లర్ లాంటి వారితో కలసి ఉలూ పనిచేశారు. అనేక ప్రసిద్ధ నాటకాలను ప్రదర్శించారు. హాలీవుడ్లో ప్రవేశించి ‘వెస్ట్ సైడ్ స్టోరీ’ లాంటి ప్రసిద్ధ హాలీవుడ్ చిత్రాలకు అసిస్టెంట్ డెరైక్టర్‌గా పనిచేశారు. ఆ తరువాత దర్శకుడయ్యారు. దాదాపు అర్ధశతాబ్దం పాటు రంగస్థల, సినిమా రంగాల్లో ఉన్నప్పటికీ, ఉలూ ఆచితూచి తన ప్రాజెక్ట్‌లను ఎంపిక చేసుకొనేవారు. నటీనటులలో ఇతరులు గుర్తించని ప్రత్యేక ప్రతిభను గుర్తుపట్టి, వారి నుంచి అద్భుతమైన అభినయాన్ని రాబట్టే టెక్నిక్ ఆయన సొంతం. ఏదైనా నిర్దుష్టంగా ఉండాలనే తపనతో, స్క్రిప్టుకు నిరంతరం మెరుగులు పెడుతూనే ఉండేవారు. డస్టిన్ హాఫ్మన్, రాబర్డ్ డినీరో లాంటి ప్రసిద్ధ తారలతో అనుబంధం ఉండేది. హాఫ్మన్, రాబర్ట్ దువల్, జాన్ వాయిట్ లాంటి వారి నట జీవితాలకు నారుపోసి, నీరుపెట్టారు. రంగస్థల నాటకానికి సినీ అనుసరణ అయిన ‘ది సబ్జెక్ట్ వజ్ రోజెస్’ (1968)తో దర్శకుడిగా పరిచయమైన గ్రాస్‌బార్డ్ ఆ తరువాత డస్టిన్ హాఫ్మన్తో ‘స్ట్రయిట్ టైమ్’ (1978) చేశారు. కుటుంబ కథా చిత్రాలు ‘జార్జియా’ (1995), ‘ది డీప్ ఎండ్ ఆఫ్ ది ఓషన్’ (1999) లాంటివి చేసినా, నడివయస్సు అమెరికన్ ప్రేమకథ ‘ఫాలింగ్ ఇన్ లవ్’ది ప్రత్యేక స్థానం. సరిగ్గా మూడేళ్ళ క్రితం ఈ రంగస్థల, సినీ కృషీవలుడు కన్నుమూశారు. సంభాషణ: పులగం చిన్నారాయణ -
గుర్తుకొస్తున్నాయీ...
గణేశ్ పాత్రో 1945 జూన్ 22 - 2015 జనవరి 5 ప్రముఖ నాటక, సినీ రచయిత గణేశ్ పాత్రో మరణంతో ఒక మంచి కలం కాలంలో కరిగిపోయింది. ఆయన మరణం పట్ల దర్శకుడు కె. విశ్వనాథ్, చిరంజీవి, తెలుగు సినీ రచయితల సంఘం సభ్యులు పరుచూరి బ్రదర్స్, జొన్న విత్తుల, ఆకెళ్ళ, దర్శకుడు వీరశంకర్ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. పాత్రోతో తమకున్న అనుబంధం గురించి మరికొందరు సినీ ప్రముఖుల జ్ఞాపకాలు... మాది చక్కటి టీమ్! ‘‘నేను స్కూల్లో చదివే రోజుల్లోనే గణేశ్ పాత్రోగారి ‘పావలా’, ‘కొడుకు పుట్టాల’ నాటకాలు చూశా. పాత్రో రచయితగా, ఆయన మామగారు కుప్పిలి వెంకటేశ్వరరావు గారు నాటక ప్రయోక్తగా అప్పటి నుంచే బాగా తెలుసు. నేను, ఆయన కలసి పనిచేసిన తొలిసినిమా భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ వారి ‘ముక్కుపుడక’. అక్కడ నుంచి మా ఇద్దరి కాంబినేషన్లో ‘మంగమ్మ గారి మనవడు’, ‘మా పల్లెలో గోపాలుడు’, ‘ముద్దుల మామయ్య’, ‘ముద్దుల కృష్ణయ్య’, ‘మా బాలాజీ’ - ఇలా మొత్తం 26 సినిమాలు వచ్చాయి. నేను, నిర్మాత ‘భార్గవ్ ఆర్ట్స్’ గోపాలరెడ్డి, పాత్రో - ముగ్గురం ఒక చక్కటి టీవ్.పాత్రో మంచి రచయితే కాక, మంచి విమర్శకుడు, విశ్లేషకుడు కూడా! అందుకనే, నేను ఇతరులతో చేస్తున్న బయట సినిమాల కథా చర్చలకు కూడా ఆయనను పిలిచేవాణ్ణి. ఆ కథలు చెప్పి, సలహాలు, సూచనలు తీసుకొనేవాణ్ణి. మా సినిమాలకు పనిచేస్తున్న రోజుల్లోనే మరోపక్క ఆయన దర్శకులు కె. బాలచందర్ గారి చిత్రాలకూ, నట - నిర్మాత మురళీమోహన్ గారి చిత్రాలకూ, దర్శక - నిర్మాత క్రాంతికుమార్ గారి సినిమాలకూ రెగ్యులర్ రైటర్. పాత్రో గారి ద్వారానే నాకు బాలచందర్ గారితో పరిచయమైంది. ఆయనతో నా కథలు చర్చించే వీలు చిక్కింది. రచయితగా పాత్రోలోని గొప్పతనం ఏమిటంటే - ఆయన సెంటిమెంట్, ఎమోషన్ ఎంత బాగా రాస్తారో, అదే సమయంలో కామెడీ కూడా అంతే బాగా రాసేవారు. అలాగే, ఆయన మంచి పాటల రచయిత కూడా! నా దర్శకత్వంలో మురళీమోహన్ గారి ‘పెళ్ళాం చెబితే వినాలి’లో ఒక మంచి పాట రాశారు. ఇక, ఆ తరువాత ‘నిర్ణయం’లో రాసిన పాట బాగా పాపులర్. ఆయన కెరీర్లో మొత్తం పది పదిహేను పైగా పాటల దాకా రాశారు. సన్నివేశంలో ఏదో ఒక ఎమోషన్, టచ్ ఉండాలని రచయితగా ఆయన, దర్శకుడిగా నేను ఆలోచించేవాళ్ళం. ఎప్పటికప్పుడు మనల్ని మనం కాలానికి తగ్గట్లు మార్చుకోవాలని ఆయన అనేవారు. తన రచనను కూడా అలాగే మార్చుకొనేవారు. అందుకే, బాలచందర్ సైతం ‘‘పాత్రో ఎప్పుడూ విద్యార్థి లాగా ఉంటారు. ఎప్పటికప్పుడు జనం నుంచి నేర్చుకోవాలని అనుకుంటారు. అది ఆయనలోని విశేషం’’ అని ఆయనను మెచ్చుకుంటూ, నాతో అభిమానంగా చెప్పారు. కథ సిద్ధమయ్యాక, దర్శకుడి ఆలోచనల్లో దాని ట్రీట్మెంట్తో సహా మొత్తం చెప్పించుకొనేవారు. ఆ వెంటనే నాలుగు రోజుల్లో మొత్తం స్క్రిప్టు ఫస్ట్ వెర్షన్ రాసి ఇచ్చేసేవారు. రచయితగా ఆయనలోని మరో గొప్పదనం ఏమిటంటే, దర్శకుడు గనక ‘గురూజీ! ఎందుకో తృప్తిగా లేదు’ అని అంటే, మారుమాట్లాడకుండా, మరో నాలుగు రోజులు టైమ్ తీసుకొని మార్చి, మరో వెర్షన్ రాసి ఇచ్చేవారు. ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు కొత్త వెర్షన్స్ రాసి ఇచ్చేవారు. మా కాంబినేషన్లోని తొలి చిత్రం ‘ముక్కుపుడక’ కోసం ఆయన ఏకంగా నాలుగు వెర్షన్లు రాసి ఇచ్చారు. అలాగే, ఒక్కో సీన్ ఒక్కోసారి కాకుండా ఏకబిగిన స్క్రిప్టు మొత్తం రాస్తే, ఆ బిగి వస్తుందని ఆయన నమ్మేవారు. అలాగే, చకచకా రాసి ఇచ్చేవారు. డిస్కషన్సలో మేము దెబ్బలాడుకున్న రోజులూ ఉన్నాయి. ‘మా పల్లెలో గోపాలుడు’ సినిమా అంతా పూర్తయ్యాక, విడుదలకు వారం ముందు క్లైమాక్స్‌పై ఆయనకు ఏదో అనుమానం వచ్చింది. కానీ, చివరకు నా జడ్జిమెంటే కరెక్టని అభినందించారు. అలాగే, ‘మంగమ్మ గారి మనవడు’లోని కొన్ని డైలాగుల్ని భానుమతి గారు చెప్పనంటే, ఆమెను సమాధానపరిచి, ఆమెతో ఆ డైలాగులు చెప్పించాం మేమిద్దరం. పాత్రో గారి ఇంట్లో రాత్రి తెల్లవార్లూ కూర్చొని కథలు చర్చించుకొంటూ, అక్కడే నిద్రపోయిన రోజులూ ఉన్నాయి. నేను తీసిన చిత్రాలు కాకపోయినా, ‘మనిషికో చరిత్ర’కూ, బాలచందర్ గారి ‘మరో చరిత్ర’కూ, ‘దాహం దాహం’ (తమిళ ‘తన్నీర్ తన్నీర్’కు అనువాదం)కూ ఆయన అద్భుతమైన డైలాగ్స్ రాశారు. ఆయన డైలాగ్స్‌లో అనేకం కొటేషన్లుగా వాడడానికి తగ్గట్లుండేవి. అక్కినేని గారు సైతం ఆ మాట నాతో అన్నారు. అయితే, తన విలువల్ని నమ్మి తన దగ్గరకొచ్చిన దర్శక, నిర్మాతలకు పాత్రో రాసేవారే తప్ప, తానుగా అవకాశాల కోసం వెంటపడేవారు కాదు. ఆ మధ్య కూడా మా గురువు గారు దాసరి పిలిపించి, ఆయనతో స్క్రిప్ట్ డిస్కషన్ చేశారు. ఏడాది క్రితం ఆయన హైదరాబాద్ వచ్చి నాకు ఒక స్క్రిప్టు నాలుగు వెర్షన్లు రాసిచ్చారు. అందుకే, పాత్రో నాకు నచ్చిన రచయితే కాదు... ఒక దర్శకుడికి కావాల్సిన రచయిత.’’ - కోడి రామకృష్ణ, దర్శకుడు - పాత్రోకు సన్నిహితుడు తెరపై అద్భుతమైన నా పాత్రలన్నీ అతని రచనలే! ‘‘నాకూ, పాత్రోకూ ఉన్న స్నేహానికి చాలా వయసుంది. నన్ను ‘గురువా’ అనేవాడు. ప్రేమ పెరిగినప్పుడు ‘ఒరే‘ అనేవాడు. అలా నన్ను పిలిచే అతి కొద్దిమందిలో అతను ఒకడు. ఆప్యాయత పెల్లుబికినప్పుడు ‘మారుతీ’ అనేవాడు. నిజానికి, పాత్రో నా శిష్యుడు. నా రచనా శైలికి వీరాభిమాని. ఆ మాట అతనే సభాముఖంగా చాలాసార్లు చెప్పాడు. తొలి రోజుల్లో నాతో పరిచయం పెంచుకోవడం కోసం మా తమ్ముణ్ణి పట్టుకొనేవాడు. నేను ఎప్పుడు పని మీద విశాఖపట్నం వచ్చినా, మళ్ళీ నేను తిరుగు ప్రయాణమయ్యే దాకా నా వెంటే ఉండేవాడు. రచన ఎలా చేయాలి, వ్యాసం ఎలా రాయాలి, నాటకం ఎలా రాయాలి లాంటివి నేను మాట్లాడుతుంటే చెవులొగ్గి వినేవాడు. ఆ తరువాత అతనూ నాటక రచయితగా చాలా పేరు తెచ్చుకున్నాడు. సినీ రంగానికి వచ్చి పైకి ఎదిగాడు. రచయితగా అతను అద్భుతమైన తెలుగు పలుకుబడి ఉన్నవాడు. ఒడుపు ఉన్నవాడు. నటజీవితంలో నేను పోషించిన అద్భుత పాత్రలన్నీ అతని రచనలే! ‘సంసారం ఒక చదరంగం’, ‘మనిషికో చరిత్ర’, ‘ఇద్దరూ ఇద్దరే’ - ఇలా నాకు పేరు తెచ్చిన అనేక చిత్రాలు, పాత్రలూ పాత్రో కలం నుంచి వచ్చినవే. అలవాట్లు అతని ఆరోగ్యాన్ని దెబ్బతీశాయనిపిస్తుంది. మందలించే వయసూ వాడిది కాదు... మందలించాల్సిన పాత్రా నాది కాదు. అయినా సరే, జర్దా కిళ్ళీ మానుకోమని కొన్నేళ్ళ క్రితం హెచ్చరించాను. అప్పటికే ఆలస్యమైనట్లుంది. గతంలో ఒకసారి అతని పెద్ద పేగుకు ఆపరేషన్ జరిగింది. ఆ ఆపరేషన్ సరిగ్గా జరగక అవస్థ పడ్డాడు. జర్దా కిళ్ళీ అలవాటు వల్ల ఈ మధ్యే నాలుకకు ఆపరేట్ చేశారట! క్యాన్సర్ మరో మంచి రచయితనూ, స్నేహితుణ్ణీ తినేసింది. ఇరవై రోజుల క్రితమే నాకో మెసెజ్ పెట్టాడు. అప్పుడు రిప్లై ఇచ్చా. మళ్ళీ మొన్న 2వ తేదీన ‘ఆర్ యు ఇంప్రూవింగ్’ అని మెసేజ్ ఇచ్చా. జవాబివ్వకుండానే వెళ్ళిపోయాడు. నాటక, సినీ రంగాలకే కాదు... నాకూ తీరని దుఃఖం మిగిల్చాడు.’’ - గొల్లపూడి మారుతీరావు, ప్రముఖ నాటక - సినీ రచయిత ఆయన ప్రేరణతోనే ‘కుక్క’ రాశా! ‘‘నాకూ, గణేశ్ పాత్రోకూ వ్యక్తిగత పరిచయం తక్కువే కానీ, అతని నాటకాలతో, సినీ రచనలతో పరిచయం ఎక్కువే. పాత్రో నాటకాలు రాసే రోజుల్లో అతని నాటకాలతో పోటీపడడం అప్పట్లో నాటకాలు రాస్తున్న మాకో సవాలుగా ఉండేది. కానీ, ఎప్పుడూ అతనే నెగ్గేవాడు. దానికి కారణం - అతని మామ గారైన ప్రసిద్ధ రంగస్థల ప్రయోక్త కె. వెంకటేశ్వరరావు గారు అని మేము సమాధానపడేవాళ్ళం. కానీ, నిజానికి నాటకీయత, సహజత్వం (రియలిజమ్) - ఈ రెంటినీ సమర్థంగా రాయడంలో పాత్రో అంతటివాడు లేడనేది నిర్వివాదాంశం. ఆయన విశాఖ మాండలికంలో ఆయన ‘కొడుకు పుట్టాల’ నాటకం రాస్తే, ఆ ప్రేరణతోనే నేను తెలంగాణ మాండలికంలో ‘కుక్క’ నాటకం రాశాను. ఒక మంచి నాటక రచయితను మనం పోగొట్టుకున్నాం.’’ - యండమూరి వీరేంద్రనాథ్, ప్రముఖ నాటక - సినీ రచయిత ఆ పాటతో గుర్తుండిపోయారు! ‘‘సినీ రంగానికి రాక ముందు నుంచి పాత్రో గారి రచనలతో నాకు పరిచయం. మద్రాసుకు వచ్చాక మంచి స్నేహితుడయ్యారు. అప్పట్లో ‘భార్గవ్ ఆర్ట్స’ గోపాలరెడ్డి గారు తీసిన చిత్రాలకు సి. నారాయణరెడ్డి గారి తరువాత ఆస్థాన గీతరచయితను నేనైతే, పర్మినెంట్ డైలాగ్ రైటర్ గణేశ్ పాత్రో. నిర్మాత గోపాలరెడ్డి గారికి మా మీద ఎంత గురి అంటే - ప్రముఖ దర్శకుడు విసుతో సినిమా తీయడానికి ఆయన సిద్ధమయ్యారు. అన్నీ మాట్లాడుకున్నారు. సరే అనుకున్నారు. కాకపోతే, డైలాగ్ రైటర్‌గా పాత్రో, పాటల రచయితగా వెన్నెలకంటి ఉండాలనీ, మిగతావాళ్ళను ఇష్టమైనవాళ్ళను పెట్టుకోమనీ గోపాలరెడ్డి చెప్పారు. కానీ, విసు తన వాళ్ళనే పెట్టుకుంటానన్నారు. దాంతో, పాత్రో గారినీ, నన్నూ వదులుకొనేది లేదని చివరకు ఆ సినిమానే చేయడం మానుకున్నారు గోపాలరెడ్డి. పాత్రో రచన మీద గోపాలరెడ్డి గారికి అంత గురి. మధ్యతరగతి జీవితంలోని సంఘటనల్నీ, పాత్రల్నీ అంత అద్భుతంగా మాటల్లో పొదిగిన రచయితలు చాలా తక్కువ. పాత్రో గారు స్వతహాగా మాటల రచయితైనా, ‘నిర్ణయం’ చిత్రంలో నాగార్జున, అమలను టీజ్ చేస్తూ పాడే ‘హలో గురూ ప్రేమ కోసమేరోయ్ జీవితం...’ పాట ఆయనను పాపులర్ గీత రచయితను చేసింది. బాలచందర్, నటి రాధిక తీసిన అనేక సీరియల్స్‌కూ పాత్రో రచన చేశారు. ఎంతో అనుబంధమున్న బాలచందర్, పాత్రోలిద్దరూ కొద్ది రోజుల తేడాలో వెళ్ళిపోవడం దురదృష్టం.’’ - వెన్నెలకంటి, సినీ రచయిత ఆ మర్మం తెలిసిన రచయిత ‘‘పాత్రో గారూ, నేనూ ఎప్పుడు కలిసినా సాహిత్యం, రష్యన్ నవలల గురించే మాట్లాడుకొనేవాళ్ళం. 1950ల తర్వాతి రైటర్స్‌ను గమనిస్తే, పింగళి, ఆత్రేయ, ముళ్ళపూడి లాంటి వారు ఒక్కొక్కరూ ఒక్కో శైలితో అలరించారు. పాత్రోది వాళ్ళందరి కన్నా విభిన్నశైలి. అప్పటి ‘మరో చరిత్ర’ మొదలు ‘సీతారామయ్య గారి మనవరాలు’, ‘రుద్రవీణ’ లాంటి సినిమాల దాకా అనేక చిత్రాలు అందుకు నిదర్శనం. ఆయన రచన ఎక్కడా రొటీన్‌గా ఉండదు. మాటను ఎంత వరకు, ఎలా ఉపయోగించాలో తెలిసిన పర్ఫెక్ట్ రైటర్ ఆయన. నాటక రచన నుంచి వచ్చిన అనుభవం అది. అలాగే, పాత్రను పోషించే నటుణ్ణి బట్టి, అతని డైలాగ్ డిక్షన్‌ను బట్టి ‘టైలర్ మేడ్ డైలాగ్’లు రాసే మర్మం పాత్రోకు బాగా తెలుసు. దృశ్యమాధ్యమమైన సినిమాల్లో అభాసు పాలుకాకుండానే విప్పీ విప్పకుండా, చెప్పీ చెప్పకుండానే శృంగారాన్ని డైలాగుల్లో చెప్పడమనే ఒరవడిని ఆయన తెచ్చారు. రచయితతో పాటు చక్కటి విమర్శకుడు కూడా ఆయనలో ఉండేవాడు. ఒక సినిమా చూశాక అందులోని మంచి, చెడుల్ని విశ్లేషణాత్మకంగా చెప్పేవారు. మద్రాసులో తెలుగు సినీ రచయితల సంఘం ఏర్పడినప్పుడు ఎం.ఎం. థియేటర్లో సంఘానికి సంబంధించిన బై లాస్, వగైరా తయారుచేసే బరువు బాధ్యతలు తలకెత్తుకొని, ఆ పని చేసి పెట్టారు. ప్రత్యేక వ్యక్తిత్వమున్న రచయితగా నిలబడడమే కాక, రాసిన డైలాగ్స్‌కు కూడా గొప్ప వ్యక్తిత్వమిచ్చిన ఆయనకు రావాల్సినంత పేరు, గౌరవం దక్కలేదనిపిస్తుంటుంది.’’ - భువనచంద్ర, సినీ గీత రచయిత