నడి వయస్సు ప్రేమకు నీరాజనం | Falling in Love (1984) | Sakshi
Sakshi News home page

నడి వయస్సు ప్రేమకు నీరాజనం

Published Sun, Apr 12 2015 10:06 PM | Last Updated on Thu, Jul 11 2019 8:56 PM

నడి వయస్సు ప్రేమకు నీరాజనం - Sakshi

నడి వయస్సు ప్రేమకు నీరాజనం

పోసాని కృష్ణమురళి
 రచయిత-దర్శకుడు-నటుడు

 

అందుకే... అంత బాగుంది!
 ఫాలింగ్ ఇన్ లవ్ (1984)
 తారాగణం: రాబర్ట్ డినీరో, మెరిల్ స్ట్రీప్, డయానె వీస్ట్, డేవిడ్ క్లెనోన్, జేన్ కేగ్జ్‌మెరక్, జార్జ్ మార్టిన్, హార్వే కీటిల్; సంగీతం: డేవ్ గ్రసిన్
 ఛాయాగ్రహణం: పీటర్ సస్చిట్జికీ
 దర్శకత్వం: ఉలూ గ్రాస్‌బార్డ్
 విడుదల తేదీ: 1984 నవంబర్ 21
 నిర్మాణ వ్యయం: 12 మిలియన్ డాలర్లు
 (సుమారు 74 కోట్ల 40 లక్షల రూపాయలు)

రచయితలు పరుచూరి బ్రదర్స్ దగ్గర నేను అసిస్టెంట్‌గా పనిచేస్తున్న రోజులవి. సినిమాలు, రచన... ఇదే నా ప్రపంచం. ఏ సినిమా వచ్చినా వదిలిపెట్టేవాణ్ణి కాదు. అప్పట్లో నేను సంపాదించిందంతా వీడియో క్యాసెట్లు కొనడానికే సరిపోయేది. ఆ రోజు ‘గాన్ విత్ ద విండ్’ చూసి షాకయిపోయా. మళ్లీ మళ్లీ చూశాను. ఆ తర్వాత నేను చూసిన సినిమా ‘ఫాలింగ్ ఇన్ లవ్’. అంతే... ఆ క్షణమే ఆ సినిమాతో నేను ప్రేమలో పడిపోయా. అంతకు ముందు చూసిన సినిమాలన్నీ ఎరేజ్ అయిపోయి, కేవలం ఈ ఒక్క సినిమానే నా మైండ్ థియేటర్‌లో కొన్నేళ్లుగా రివైండ్ అవుతోంది. ఇప్పటికి ఓ వందసార్లు... కాదు కాదు.. అంతకన్నా ఎక్కువసార్లే చూసుంటాను. ఎప్పుడు చూసినా నాలో ఫస్ట్ టైమ్ చూస్తున్న ఫీలింగే కలుగుతుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం!
 
 నా మనసులో రైలు కూత మొదలవుతోంది. అవును... ఈ సినిమాలో ప్రేమకథకు రైలు ఓ వాహకం. ఆ రైల్లో బోలెడంతమంది ప్రయాణం చేస్తుంటారు. అందులో ఓ అందమైన అమ్మాయి కనిపిస్తుంది. అబ్బ... ఎంత బాగుంటుందో! ఇలాంటమ్మాయి కనిపిస్తే, ఏ అబ్బాయికైనా వెంటనే మనసు పారేసుకోవాలనిపిస్తుంది. ఆమె పేరు మోలీ గ్లిమోర్ (నటి మెరిల్ స్ట్రీప్). హాస్పిటల్లో ఉన్న తండ్రిని చూడడం కోసం రోజూ రైల్లో వెళ్లి వస్తుంటుంది. అదే రైల్లో ఓ అందమైన అబ్బాయి కూడా ప్రయాణిస్తుంటాడు.
 
  అబ్బాయిల్లో కూడా ఇంత అందగాళ్లు ఉంటారా అనిపిస్తుంది అతణ్ణి చూస్తే. అతని పేరు ఫ్రాంక్ రాఫ్టిన్ (నటుడు రాబర్ట్ డినీరో). ఎక్కడో ఉద్యోగం! రానూ పోనూ రైలు ప్రయాణం. ఆ అమ్మాయి, ఈ అబ్బాయి ఒకసారి చూసుకుంటే బాగుంటుంది కదా అనే ఫీలింగ్ మనలో మొదలవుతుంది. మన కోరికకు తగ్గట్టుగానే వాళ్లిద్దరూ కలిసే సమయం వచ్చేసింది. కానీ మనకేమో ఇది సరిపోదు. వాళ్లింకా దగ్గర అయితే బాగుంటుంది కదా అనిపిస్తుంది. ఆ ఆకాంక్ష కూడా ఫలిస్తుంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే... ఆ అమ్మాయికి ఆల్రెడీ పెళ్లయిపోయింది. పిల్లలు కూడా ఉంటారు. ఇక్కడ ఈ అబ్బాయికీ భార్యా, పిల్లలు ఉంటారు.
 
 క్రిస్‌మస్ దగ్గరకొస్తోంది. భార్యకూ, పిల్లలకూ గిఫ్ట్ కొనడానికి ఫ్రాంక్ రాఫ్టిన్ ఓ షాపుకెళ్తాడు. అక్కడికే మోలీ గ్లిమోర్ కూడా వెళ్తుంది. తన భర్తకు మంచి గిఫ్ట్ కొంటుంది. పొరపాటున ఇద్దరి గిఫ్ట్‌లూ మారిపోతాయి. అక్కడ నుంచీ వారిద్దరి మధ్యనా పరిచయం మొలకలేస్తుంది. ఇద్దరూ రోజూ కలిసే వెళ్తుంటారు. ఈ పరిచయం కాస్తా స్నేహం అవుతుంది. ఎదురుచూపులు మొదలయ్యాయి. ఫోన్లు మాట్లాడుకోవడం మొదలయింది. లంచ్‌లకు వెళ్లడం మొదలయింది. ఒకరి సమక్షం ఇంకొకరికి హాయిగా ఉంటోంది. కొత్త నవ్వులు... కొత్త స్పందనలు... కొత్త ఆశలు... జీవితమంతా కొత్తగా అనిపిస్తోంది. దువ్విన తలనే దువ్వడం - అద్దం వదలకపోవడం లాంటివన్నీ జరుగుతుంటాయి.
 
  గాఢ చుంబనాలు... గాఢ పరిష్వం గాలు... అంతా గాఢతే.వీళ్ల ప్రేమను చూసి కాలం కుళ్లుకున్నట్టుంది. ఇద్దరి విషయం కుటుంబాలకు తెలిసిపోయింది. కలవరాలు... కల్లోలాలు..! సమాజం విధించిన కట్టుబాటు వాళ్లని విడగొట్టేస్తుంది. అది చూసి మనం తట్టుకోలేం. గుండెను అరచేతుల్లో పట్టి పిండేస్తున్నంత బాధ. ఎలాగైనా ఆ జంట కలవాలని మనసులోనే మొక్కుకుంటాం. కానీ కలవరు! కలవలేరు అదంతే!!
 ఇదీ క్లుప్తంగా ఆ సినిమా కథ. ‘ఆ... ఏముంది ఇందులో విషయం’ అనుకుంటే మీ ఇష్టం. కానీ ఒక్కసారి నేను చెప్పినట్టుగా ఈ సినిమా చూడండి.
 
 ఆ రెండున్నర గంటలూ మీ సెల్‌ఫోన్‌ను మ్యూట్‌లో పెట్టేయండి. లేకపోతే స్విచాఫ్ చేసేయండి. అంతేగానీ ఫేస్‌బుక్‌లో లైక్‌లు కొడుతూ, ట్వీట్‌లు చేస్తూ, కేఎఫ్‌సీ నుంచి తెప్పించుకున్న చికెన్ పాప్‌కార్న్ తింటూ చూస్తే మాత్రం ఈ సినిమాలోని ఫీల్ మీ హార్ట్‌కి ఏ మాత్రం ఇంజెక్ట్ కాదు. ఇందులో హీరోగా చేసింది రాబర్ట్ డినీరో. నాకు తెలిసి హాలీవుడ్‌లో అంత అందగాణ్ణి చూడలేదు. నేను మగాణ్ణయినా కూడా ‘ఐ లవ్యూ రాజా’ అనాలనిపిస్తుంది. ఆయన అద్భుతమైన నటుడు కూడా. ఆస్కార్‌కు 7 సార్లు నామినేట్ అయిన ఘనుడు. ‘గాడ్ ఫాదర్-2’ (1974)కు ఉత్తమ సహాయ నటునిగా, ‘రేజింగ్ బుల్’ (1980)కి ఉత్తమ నటుడిగా రెండు సార్లు ఆస్కార్‌లు అందుకున్నాడు. ఆయన మంచి డెరైక్టర్ కూడా. ‘ద గుడ్ షెపర్డ్’ (2006), ‘ఎ బ్రాంక్స్ టేల్’(1993) సినిమాలు డెరైక్ట్ చేశాడు.
 
 ఈ సినిమాకు ముందు రాబర్ట్ డినీరో చేసినవన్నీ యాక్షన్ సినిమాలే. ఏదైనా కొత్తగా చేద్దామనే ప్రయత్నంలో ఉన్నప్పుడు, ఈ సినిమా చేసే అవకాశమొచ్చింది. ఇక హీరోయిన్ మెరిల్ స్ట్రీప్ అందాన్ని పొగడడానికి మనకున్న ఉపమానాలు సరిపోవు. ‘దేవుడా..! ఇలాంటమ్మాయి ఇంతవరకూ మనకు ఎందుకు తారసపడలేదా’ అనే బాధ కలుగుతుంది. ఇంతటి అందగత్తె కోసం ప్రపంచంలో అన్నీ వదిలేసుకున్నా నష్టం లేదనిపిస్తుంది. నేనైతే ఈ సినిమా చూసిన ప్రతిసారీ, రాబర్ట్ డినీరోగా నన్ను నేను ఊహించుకునేవాణ్ణి. 19 సార్లు ఆస్కార్ అవార్డుల రేసులో నామినేట్ అయిన అమెరికన్ నటి మెరిల్ స్ట్రీప్. ఆమె తన 37 ఏళ్ల సినీ ప్రస్థానంలో మొత్తం 405 అవార్డులకు నామినేట్ అయితే, 151 పురస్కారాలను తన కొప్పున కట్టేసుకుంది.
 
 రాబర్ట్ డినీరో, మెరిల్ స్ట్రీప్... జంట చాలా బావుంటుంది. వీళ్లిద్దరూ కలిసి ఇంతకు ముందు ‘డీర్ హంటర్’ (1978) అనే సినిమా చేశారు. ఆ తర్వాత మళ్లీ కలవడం ఇదే.నాకు హీరో, హీరోయిన్, కథ, స్క్రీన్‌ప్లే, షాట్స్ అన్నీ గుర్తున్నాయి. కానీ, దర్శకుడి పేరు ఎప్పుడూ మరిచిపోతుంటాను. నిజం చెప్పాలంటే ఇంత గొప్ప ప్రేమను ముందు తను ఫీలయ్యి, తర్వాత మనం ఫీలయ్యేలా చేసిన ఆ దర్శకుడికి హేట్సాఫ్! నేనీ సినిమా చూడమని చాలామందికి డీవీడీ గిఫ్ట్‌గా కూడా ఇచ్చాను. ఈ ప్రపంచానికి ‘ప్రేమ’ అనే మరో కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసిందీ సినిమా. భూతద్దం పెట్టి వెతికినా, ఎక్కడా బూతు సీన్లు కనబడవు. బూతు మాటలు వినబడవు. పార్కుకు ఎందుకు వెళుతాం... స్వచ్ఛమైన గాలి కోసం. మరి స్వచ్ఛమైన ప్రేమను కళ్లారా ఆస్వాదించాలనుకుంటే మాత్రం యూ మస్ట్ వాచ్ - ‘ఫాలింగ్ ఇన్ లవ్’.
 
 తారల ప్రతిభా ప్ర‘దర్శకుడు’
 అమెరికన్ రంగస్థలంపై కృషి చేసిన చిత్ర దర్శక, నిర్మాత - ఉలూ గ్రాస్‌బార్డ్ (1929 - 2012). ఆయన అసలు పేరు - ఇజ్రాయెల్. కానీ, ఇంట్లో వాళ్ళ అన్నయ్య పిలిచిన ముద్దుపేరు ‘ఉలూ’ అన్నదే పాపులరైంది. వజ్రాల వ్యాపారి కుమారుడిగా బెల్జియమ్‌లో పుట్టిన ఆయన యూనివర్సిటీ ఆఫ్ చికాగోలో చదువుకున్నారు. ఇటు రంగస్థలంపై, అటు వెండితెరపై సమాన స్థాయిలో కృషి చేశారు. 1960ల తొలినాళ్ళ నుంచి న్యూయార్క్‌లో రంగస్థలంపై కృషి చేయడం మొదలుపెట్టారు. సహజమైన నాటకాలపై ప్రేమతో బ్రాడ్వేలో ప్రముఖ నాటక రచయితలు ఉడీ అలెన్, ఆర్థర్ మిల్లర్ లాంటి వారితో కలసి ఉలూ పనిచేశారు. అనేక ప్రసిద్ధ నాటకాలను ప్రదర్శించారు.
 
  హాలీవుడ్‌లో ప్రవేశించి ‘వెస్ట్ సైడ్ స్టోరీ’ లాంటి ప్రసిద్ధ హాలీవుడ్ చిత్రాలకు అసిస్టెంట్ డెరైక్టర్‌గా పనిచేశారు. ఆ తరువాత దర్శకుడయ్యారు. దాదాపు అర్ధశతాబ్దం పాటు రంగస్థల, సినిమా రంగాల్లో ఉన్నప్పటికీ, ఉలూ ఆచితూచి తన ప్రాజెక్ట్‌లను ఎంపిక చేసుకొనేవారు. నటీనటులలో ఇతరులు గుర్తించని ప్రత్యేక ప్రతిభను గుర్తుపట్టి, వారి నుంచి అద్భుతమైన అభినయాన్ని రాబట్టే టెక్నిక్ ఆయన సొంతం. ఏదైనా నిర్దుష్టంగా ఉండాలనే తపనతో, స్క్రిప్టుకు నిరంతరం మెరుగులు పెడుతూనే ఉండేవారు. డస్టిన్ హాఫ్‌మన్, రాబర్డ్ డినీరో లాంటి ప్రసిద్ధ తారలతో అనుబంధం ఉండేది.
 
  హాఫ్‌మన్, రాబర్ట్ దువల్, జాన్ వాయిట్ లాంటి వారి నట జీవితాలకు నారుపోసి, నీరుపెట్టారు. రంగస్థల నాటకానికి సినీ అనుసరణ అయిన ‘ది సబ్జెక్ట్ వజ్ రోజెస్’ (1968)తో దర్శకుడిగా పరిచయమైన గ్రాస్‌బార్డ్ ఆ తరువాత డస్టిన్ హాఫ్‌మన్‌తో ‘స్ట్రయిట్ టైమ్’ (1978) చేశారు. కుటుంబ కథా చిత్రాలు ‘జార్జియా’ (1995), ‘ది డీప్ ఎండ్ ఆఫ్ ది ఓషన్’ (1999) లాంటివి చేసినా, నడివయస్సు అమెరికన్ ప్రేమకథ ‘ఫాలింగ్ ఇన్ లవ్’ది ప్రత్యేక స్థానం. సరిగ్గా మూడేళ్ళ క్రితం ఈ రంగస్థల, సినీ కృషీవలుడు కన్నుమూశారు.
 
 సంభాషణ: పులగం చిన్నారాయణ
 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement