Paruchuri Venkateswararao
-
రచయితలు సరస్వతీ పుత్రులు
‘‘రచయితల సంఘం అంటే సరస్వతీ పుత్రుల సంఘం. అలాంటి సరస్వతీపుత్రుల సంఘం లక్ష్మీదేవి కటాక్షంతో అద్భుతమైన సొంత భవనం కట్టుకునేలా అభివృద్ధి చెందాలి’’ అని సీనియర్ నటుడు కృష్ణంరాజు అన్నారు. ఈ ఏడాది నవంబరు 3న రచయితల సంఘం రజతోత్సవ వేడుక జరగనుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ని ఫిలిం నగర్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ హాల్లో జరిగిన కరై్టన్ రైజర్ వేడుకకు సంబంధించిన టీజర్‌ను కృష్ణంరాజు ఆవిష్కరించారు. 1932 నుంచి ఇప్పటి వరకు తెలుగు చిత్రపరిశ్రమ అభివృద్ధి కోసం సినీ రచయితల కృషిని గుర్తు చేసుకున్నారు కొందరు అగ్ర రచయితలు. ఈ వేడుకలో కృష్ణంరాజు మాట్లాడుతూ – ‘‘‘లక్ష్మీ ఎదురుగా వస్తే నమస్కరించు. కానీ సరస్వతి ఎక్కడ ఉన్నా వెతికి వెతికి నమస్కరించు’ అని మా నాన్నగారు చెప్పారు. అందుకే ఈ వేడుకకు వచ్చాను. రచయితలకు ఏకాగ్రత, అంకితభావం ఉండాలి. కాలంతో పాటు రచయిత రచనల్లోనూ మార్పు వచ్చింది. ఆ రచనలు మంచి మర్గానికి దోహదపడాలి. నేను పెద్ద పెద్ద మహానుభావులతో పని చేశాను. ఆత్రేయగారు ఏదైనా సీన్ రాసేప్పుడు ఆయన ఆ క్యారెక్టర్లోకి వెళ్లిపోయి డైలాగ్స్ రాసేవారు’’ అని అన్నారు. ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ సినిమా పుట్టుపూర్వోత్తరాల గురించి మాట్లాడారు. ఆ రోజుల్లో పద్యానికి దగ్గరగా పాట ఉండేదని అభిప్రాయపడ్డారు. రచయిత సముద్రాల రాఘవాచారి నుంచి చక్రపాణి వరకు సాగిన చరిత్రను గుర్తు చేశారు ఎస్.వి. రామారావు. పాతాళభైరవి, మిస్సమ్మ...వంటి నాటి ప్రముఖ సినిమాలు, దర్శకులు, రచయితల గురించి మాట్లాడారు నాగబాల సురేష్. 1 950 నుంచి 60వరకు వచ్చిన సినిమాల గురించి మాట్లాడారు. 1961–70 నాటి కాల సినిమాల గురించి ప్రస్తావించారు వడ్డేపల్లి కృష్ణమూర్తి. పాతతరం, కొత్తతరం రచయితలు కలిసి ముందుకు వెళ్లాల్సిన దశాబ్దం ఇదే అన్నారు చిలుకుమార్ నట్రాజ్. 1981–90 కాలంలో ఉన్న రచయితలు, దర్శకులు, సినిమాల గురించి మాట్లాడారు అనురాధ. ఈ కార్యక్రమంలో బలభద్రపాత్రుని రమణి, ప్రధాన కార్యదర్శి ఆకెళ్ల, పరుచూరి వెంకటేశ్వరరావు తదితర ప్రముఖులు పాల్గొన్నారు. -
రంగు పడనివ్వం
తనీశ్, పరుచూరి రవి, ప్రియా సింగ్, పరుచూరి వెంకటేశ్వరరావు, పోసాని కృష్ణమురళి, షఫీ ముఖ్య తారలుగా కార్తికేయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రంగు’. నల్లస్వామి సమర్పణలో యు అండ్ ఐ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఎ.పద్మనాభ రెడ్డి, నల్ల అయ్యన్న నాయుడు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 23న విడుదలవుతోంది. విజయవాడకు చెందిన లారా (పవన్ కుమార్) అనే వ్యక్తి జీవితం ఆధారంగా ‘రంగు’ సినిమా తెరకెక్కించారు. లారా కుటుంబ సభ్యుడైన దిలీప్, స్నేహితులు సందీప్, ధనుంజయ్ ఈ సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో దిలీప్ (లారా బావ మరిది) మాట్లాడుతూ– ‘‘లారా గురించి సమాచారం సేకరించడానికి దర్శకుడు కార్తికేయ ఏడాది క్రితం విజయవాడ వచ్చినప్పుడు మమ్మల్ని సంప్రదించలేదు. పది రోజుల క్రితం సినిమా ట్రైలర్, ప్రెస్‌మీట్ చూశాం. లారా అనే రౌడీషీటర్.. అనే వాయిస్‌తో ట్రైలర్ మొదలైంది. లారా మీద రౌడీషీట్ అన్యాయంగా తెరిచారు. ఇప్పుడు ఆయన పిల్లలు చదువుకుంటున్నారు. ఈ సినిమా రిలీజ్ అయితే వాళ్ల మీద ఎంత ఎఫెక్ట్ పడుతుందో ఆలోచించాలి. సినిమా ట్రైలర్ చూసిన దగ్గర నుంచి ‘రంగు’ దర్శక, నిర్మాతలను కలవాలని ప్రయత్నించాను, కానీ కుదరలేదు. సినిమాని ముందుగా మాకు చూపించి, మా అంగీకారంతోనే విడుదల చేయాలి. లేదంటే సినిమా విడుదలని లీగల్‌గా అడ్డుకుంటాం. విజయవాడలో పోస్టర్ పడనీయం’’ అన్నారు. లారా స్నేహితులు సందీప్, ధనుంజయ్ పాల్గొన్నారు. -
శోభన్‌బాబు చిరస్థాయిగా ఉంటారు
‘‘ఎన్టీ రామారావుగారు ముందుగా పరిచయమైనా హీరోగా మా ఫస్ట్ సినిమా శోభన్బాబుగారికే రాశాం. ఆ తర్వాత ఆయనతో 13 సినిమాలకు కలసి పనిచేశాం. శోభన్‌బాబుగారు సినిమాలు మానేసే దశలో మా డైరెక్షన్లో ‘సర్పయాగం’తో పాటు ‘దోషి–నిర్దోషి’ అనే చిత్రం రాశాం. రెండూ మంచి హిట్టయ్యాయి. అప్పుడు శోభన్‌బాబుగారు ఫోన్ చేసి.. ‘నేను గౌరవంగా రిటైర్ అయ్యేలా హిట్లు ఇచ్చారు.. ఫ్రీగా ఓ సినిమా చేసుకోమన్నారు. కానీ మేము చేయలేదు. మేము సినిమా చేసినా, చేయకున్నా మా మనసుల్లోనే కాదు అందరి మనసుల్లోనూ ఆయన చిరస్థాయిగా బతికే ఉన్నారు. ఎప్పటికీ ఉంటారు కూడా’’ అని రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు అన్నారు. దివంగత శోభన్‌బాబు పేరిట ‘అఖిల భారత శోభన్ బాబు సేవాసమితి’ ఆధ్వర్యంలో డిసెంబర్ 23న ప్రతిష్టాత్మక పురస్కారాలను అందజేయనున్నారు. 2017కి గానూ నటీనటులు, సాంకేతిక నిపుణులకు వివిధ కేటగిరిల్లో ఈ అవార్డులు అందజేయనున్నారు. ఈ అవార్డుల కార్యక్రమం పోస్టర్ని రచయితలు పరుచూరి బ్రదర్స్ రిలీజ్ చేయగా, దర్శకుడు మారుతి టీజర్‌ను ఆవిష్కరించారు. ఓ సందర్భంలో ‘నేను మీకు పెద్దన్నయ్యను’ అన్నారు శోభన్‌బాబుగారు. అంత ప్రేమాభిమానాలు మాపై వర్షింపజేసిన ఆయన కోసం వారి అభిమానులతో కలసి ఎన్ని సంవత్సరాలైనా ఈ పరుచూరి బ్రదర్స్ అడుగేస్తారు’’ అన్నారు పరుచూరి గోపాలకృష్ణ. అఖిల భారత శోభన్‌బాబు సేవాసమితి సభ్యులు వీరప్రసాద్, నిర్మాత ఎమ్.నరసింహారావు, శోభన్‌బాబు అభిమానులు సుధాకర్ బాబు (మాజీ ఎమ్మెల్యే) జె.రామాంజనేయులు, జేష్ట రమేశ్ బాబు (మాజీ ఎమ్మెల్యే), సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. -
ఆయన నవ్వు చాలామందికి స్ఫూర్తి – కృష్ణంరాజు
‘‘సారధితో నాది 50 ఏళ్ల స్నేహం. హీరో అవుదామని ఇండస్ట్రీకొచ్చి హాస్య నటుడయ్యారు. ఆయన నవ్వులో ప్రత్యేకత ఉంది. అదే ఆయన్ను హాస్య నటుణ్ణి చేసింది. ఆ నవ్వు చాలామందికి స్ఫూర్తిగా, ఆదర్శంగా నిలిచింది. సారధిగారు ఇలాగే నవ్వుతూ నవ్విస్తూ ఉండాలి’’ అని నటుడు కృష్ణంరాజు అన్నారు. ప్రముఖ నటులు కె.జె సారధిపై రచయిత, చిత్రకారుడు రాంపా రచించిన ‘సినీ స్వర్ణయుగంలో సారధి’ పుస్తకాన్ని కృష్ణంరాజు ఆవిష్కరించగా, రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు స్వీకరించారు. ఈ పుస్తకాన్ని కృష్ణంరాజుకు అంకితమిచ్చారు రాంపా. సారధి మాట్లాడుతూ– ‘‘ఏమీ లేకుండా చిత్రపరిశ్రమకు వచ్చి ఇంతటివాడినయ్యా. 378 సినిమాల్లో నటించా. ఈ స్థానంలో ఉన్నానంటే కారణం ప్రేక్షకులే. ఎన్టీఆర్, ఎస్వీ రంగారావు, నాగేశ్వరరావు, రేలంగి, కృష్ణ, చిరంజీవిలతో నటించా. వెంకటేశ్ ‘గణేష్’ చిత్రం తర్వాత సినిమాలు చేయలేదు. కృష్ణంరాజు ‘భక్తకన్నప్ప’ నా జీవితాన్నే మార్చేసింది. తర్వాత చాలా మంచి పాత్రలతో ప్రేక్షకులను అలరించాను’’ అన్నారు. ‘‘సారధి, ప్రభాకర్‌రెడ్డిగారి కృషి వల్లే చిత్రపురి కాలనీ ఏర్పాటైంది’’ అన్నారు పరుచూరి వెంకటేశ్వరరావు. నటుడు గిరిబాబు. కృష్ణంరాజు సతీమణి శ్యామల, ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా, కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ, నిర్మాత సురేశ్‌కొండేటి పాల్గొన్నారు. -
నా పుట్టినరోజున మొదలైన సినిమాలన్నీ హిట్టే!
‘‘ఏ నిర్మాత అయినా మూటలతో వస్తాడు కానీ, వీఆర్ కన్నెగంటి మాత్రం మాటలతో వచ్చాడు. నా పుట్టినరోజున మొదలైన సినిమాలన్నీ హిట్టయ్యాయి. ఈ వైవిధ్యభరితమైన ప్రేమకథాచిత్రంలో నేను బలరామయ్య పాత్ర పోషిస్తున్నాను’’ అని సీనియర్ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు చెప్పారు. పరుచూరి వెంకటేశ్వరరావు పుట్టినరోజు వేడుకలు శనివారం సాయంత్రం హైదరాబాద్‌లో జరిగాయి. ఈ సందర్భంగా కన్నెగంటి సంస్థ లోగోను ఆయన ఆవిష్కరించారు. ఎన్టీఆర్ వంటి మహానటులతో పనిచేసిన పరుచూరి వెంకటేశ్వరరావు తమ సినిమాలో నటించటం పట్ల నిర్మాత ఆనందం వెలిబుచ్చారు. నాయకానాయికలను ఎంపిక చేసి, వచ్చే నెల నుంచి చిత్రీకరణ మొదలుపెడతామని దర్శకుడు రతన్ కాంబ్లే చెప్పారు. ఈ కార్యక్రమంలో రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి, నిర్మాత ఠాగూర్ మధు, నటుడు కృష్ణమాధవ్ తదితరులు పాల్గొన్నారు.