patancheru police
-
ఎమ్మెల్యే లాస్య యాక్సిడెంట్ కేసు: ఏం జరిగిందో చెప్పిన ఆకాష్
హైదరాబాద్, సాక్షి: కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత యాక్సిడెంట్ కేసులో.. ఆమె పీఏ-డ్రైవర్ ఆకాష్‌పై కేసు నమోదైందన్న విషయం తెలిసిందే. ఆకాష్ నిర్లక్ష్యపూరితంగా వాహనం నడపడం వల్లే లాస్య చనిపోయిందని ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న ఆకాష్ నుంచి స్టేట్మెంట్ తీసుకున్నారు పటాన్చెరు పోలీసులు. మేజిస్ట్రేట్ సమక్షంలో స్పృహలో ఉన్న ఆకాష్ వాంగ్మూలం ఇచ్చాడు. ఆ స్టేట్మెంట్లో.. ‘‘దర్గా నుండి హైదరాబాద్ చేరుకుని.. లాస్య కారులో ఉన్న తన అక్క కూతుర్ని మరో కారులోకి ఎక్కించాం. లాస్య తినడం కోసం వెళ్దామని చెప్పడంతో హోటల్స్ వెతుక్కుంటూ వెళ్లాం. ప్రమాదం ఎలా జరిగిందో అర్థం అవ్వట్లేదు. ఆ టైంలో నా మైండ్ బ్లాంక్ అయ్యింది’’ అని ఆకాష్ పేర్కొన్నారు. ఇక ప్రమాదం జరిగిన తీరును స్థానిక డీఎస్పీ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ముందు వెళ్తున్న వాహనం ఢీకొట్టిన తర్వాత ఎమ్మెల్యే కారు కంట్రోల్ కాక ఓఆర్ఆర్పై లెఫ్ట్ సైడ్ రెయిలింగ్‌కు ఢీ కొట్టింది. ప్రమాదం కంటే ముందే కారు ముందు భాగం పగిలి కింద పడిపోయి ఉన్నాయి. నిర్లక్షం గా అతివేగంగా నడపడం వల్లే ప్రమాదం జరిగింది’’ అని వివరించారు. లాస్య సోదరి నివేదిత ఫిర్యాదుతో ఆకాష్ మీద ఐపీసీ సెక్షన్ 304 ఏ కింద పటాన్చెరు పీఎస్‌లో కేసు నమోదు అయ్యింది. శుక్రవారం వేకువఝామున ఉదయం 5గంటల 15 గంటలకు ఆకాష్ తమకు ఫోన్ చేశాడని, ప్రమాదం జరిగి.. ఇద్దరికీ దెబ్బలు తగిలాయని లొకేషన్ షేర్ చేశాడని నివేదిత ఫిర్యాదులో పేర్కొన్నారు. తీరా స్పాట్‌కు తాము వెళ్లి చూస్తే.. నుజ్జునుజ్జు అయి కారు మాత్రమే ఉందని ఆమె తెలిపారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. సదాశివపేటలోని ఓ దర్గాలో మొక్కులు చెల్లించడానికి ఎమ్మెల్యే లాస్య నందిత తన కుటుంబ సభ్యులతో వెళ్లారు. అక్కడి నుంచి తిరిగొచ్చి.. కుటుంబ సభ్యులను ఇంటి దగ్గర దింపిన తర్వాతే టిఫిన్ కోసం సంగారెడ్డి వైపు వెళ్లారని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ప్రమాదంలో లాస్య చనిపోగా.. ఆకాష్ కాళ్లు విరిగాయి. షామీర్ పేట వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపైకి లాస్య కారు ఎంట్రీ అయినట్టు పోలీసులు గుర్తించారు. నిద్ర మత్తులోకి జారిపోవడం వల్లనే ప్రమాదం జరిగినట్టు ఆకాష్ చెప్తున్నప్పటికీ.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. -
ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించొద్దు
సాక్షి, హైదరాబాద్: ప్రజల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేలా పోలీసులు ప్రవర్తించకూడదని డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. పటాన్చెరులో బుధవారం కానిస్టేబుల్ అనుచిత ప్రవర్తన నేపథ్యంలో పోలీస్ ఉన్నతాధికారులు, పోలీస్ కమిషనర్లు, ట్రైనింగ్ కళాశాలలు, పోలీస్ బె టాలియన్లు, ఎస్పీలు, ఇతర యూనిట్ అధికారులు, ఎస్హెచ్ఓ, కానిస్టేబుల్, హోంగార్డ్ అధికారులతో కలసి ఒకేసారి వేయి కార్యాలయాలతో అనుసంధానిస్తూ సాయంత్రం దాదాపు 3 గంటల పాటు డీజీపీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా డీజీపీ మాట్లాడుతూ.. పటాన్చెరులో జరిగిన దురదృష్ట సంఘటనS వల్ల మొత్తం పోలీస్‌శాఖ అప్రతిష్ట పాలయ్యే ప్రమాదం ఏర్పడిందన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా.. నైతిక విలువలు, మానవత తదితర అంశాలపై పోలీస్ అధికారులు, సిబ్బందికి నిరంతరం పునశ్చరణ నిర్వహించాలని సూచించారు. కాగా, పోలీస్ కానిస్టేబుల్ నుంచి అడిషనల్ డీజీ స్థాయి వరకు అధికారులు తమ అభిప్రాయాలను సమావేశంలో వెల్లడించారు. ఈ అభిప్రాయాలపై చర్చించి తగిన కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించారు. కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న మహేందర్‌రెడ్డి -
ఒకే భూమిని పలువురికి విక్రయించిన వ్యక్తి అరెస్టు
పటాన్చెరు: మృతిచెందిన తన వ్యాపార భాగస్వామి పేరు మీద ఉన్న భూమిని పలువురికి విక్రయించి రూ.కోట్లు సొమ్ము చేసుకున్న వ్యక్తిని మెదక్ జిల్లా పటాన్చెరు పోలీసులు అరెస్టు చేశారు. సీఐ శంకర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. లైట్ క్రియేట్ పరిశ్రమ స్థాపిస్తామంటూ అయినంపూడి క్షీరసాగర్, ఘన్‌శ్యాంలు పటాన్చెరు ఏపీఐఐసీకి దరఖాస్తు చేసుకున్నారు. సాగర్ పేరున 110 ఎకరాల ప్రభుత్వ భూమిని పొందారు. అయితే 1994లో సాగర్ మృతి చెందాడు. దీంతో ఘన్‌శ్యాం ఆ భూమిని అమ్మకానికి పెట్టాడు. ఈ క్రమంలో హైదరాబాద్‌కు చెందిన పత్తిపాటి శ్రీనివాస్‌రావుకు భూమిని అమ్మినట్లు ఒప్పందం చేసుకుని అతనివద్ద రూ.2.01 కోట్లు తీసుకున్నాడు. మోసపోయినట్లు తెలుసుకున్న శ్రీనివాస్‌రావు పోలీసులను ఆశ్రయించడంతో కోర్డు ఆదేశాల మేరకు ఘన్‌శ్యాంను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. అయితే ఇదే భూమిని పలువురికి విక్రయించిన ఘన్‌శ్యాం రూ.100 కోట్ల మేర సొమ్ము చేసుకున్నట్లు భావిస్తున్నారు.