patel reservation issue
-
హార్దిక్ పటేల్‌కు భారీ ఎదురుదెబ్బ
అహ్మదాబాద్: పటేల్ కోటా ఉద్యమ నేత హార్దిక్ పటేల్‌కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. 2015లో పటేల్ రిజర్వేషన్ల ఉద్యమం సందర్భంగా చెలరేగిన అల్లర్ల కేసులో హార్దిక్‌కు రెండు సంవత్సరాల జైలు శిక్షను ఖరారు చేస్తూ గుజరాత్‌లోని స్థానిక కోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. దీంతో పాటు 50వేల రూపాయల జరిమానాను విధిస్తూ తీర్పు చెప్పింది. మొత్తం 17మందిని నిందితులుగా చేర్చిన ఈ కేసులో ముగ్గురిని కోర్టు దోషులుగా తేల్చింది. హార్దిక్‌తోపాటు సర్దార్ పటేల్ వర్గం నేత లాల్జీ పటేల్, ఏకే పటేల్‌ను కూడా దోషులుగా నిర్దారించింది. వీరికి కూడా రెండేళ్ల జైలు శిక్షతోపాటు రూ.50 వేల జరిమానాను కోర్టు విధించింది. మరోవైపు తీర్పువెలువడిన వెంటనే హార్దిక్‌కు చెందిన న్యాయవాది కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. గుజరాత్ రాష్ట్రంలో రిజర్వేషన్ల కోసం హార్దిక్ పటేల్ నేతృత్వంలో 2015లో పటేల్ వర్గానికి రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ తీవ్ర ఉద్యమం జరిగింది. ఈ సందర్భంగా భారీ హింస చెలరేగింది. ఉద్యమనేత హార్దిక్ పటేల్.. హింసకు ప్రేరేపించారని, ప్రభుత్వ ఆస్తులకు భారీగా నష్టం కలిగించారంటూ కేసు నమోదైంది. -
రిజర్వేషన్ల కోసం ఆఖరి పోరాటం: హార్దిక్
అహ్మదాబాద్: పటేల్ వర్గీయులకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం ఆగస్టు 25 నుంచి నిరవధిక నిరాహార దీక్షకు దిగనున్నట్లు పటీదార్ ఆందోళన్ సమితి అధ్యక్షుడు హార్దిక్ పటేల్ ప్రకటించారు. తన వర్గీయులకు రిజర్వేషన్లు సాధించడమే తన లక్ష్యమని ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. కోటా సాధనలో తన ప్రాణాలు పోయినా లెక్కచేయనన్నారు. ‘ఈ పోరాటంలో మీ అందరి మద్దతు కోరుతున్నా. పటీదార్ క్రాంతి దివస్ అయిన ఆగస్టు 25 నుంచి నిరాహార దీక్షకు దిగబోతున్నా. రిజర్వేషన్లు సాధించే వరకు ఆహారం, నీరు ముట్టుకోను’ అన్నారు. -
‘పటేళ్లకు రిజర్వేషన్లపై 24 గంటల్లో తేల్చండి’
గాంధీనగర్: గుజరాత్లో అధికారంలోకి వస్తే పటేల్ సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కల్పిస్తారో లేదో 24 గంటల్లోగా తేల్చి చెప్పాలని కాంగ్రెస్ పార్టీకి పాస్ (పటీదార్ అనామత్ ఆందోళన్ సమితి) గడువు విధించింది. పాస్ నేతలతో ఢిల్లీలో గుజరాత్ కాంగ్రెస్ అధ్యక్షుడు భరత్ సిన్హ్ తొలుత స్వల్పకాలంపాటు భేటీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం అయిన తర్వాత మళ్లీ మాట్లాడతామని చెప్పి ఆయన వెళ్లిపోయారు. పాస్ నేత దినేశ్ బమానియా మాట్లాడుతూ ‘సమావేశం అయిపోయినా ఆయన మమ్మల్ని కలవలేదు. మేం ఫోన్ చేస్తున్నా స్పందించలేదు. ఇది మాకు అవమానం’ అని అన్నారు. దీంతో రిజర్వేషన్ల అంశంపై 24 గంటల్లోగా తేల్చి చెప్పాలని దినేశ్ కాంగ్రెస్ వారికి కరాఖండిగా చెప్పినట్లు సమాచారం. మరోవైపు పాస్ నేత హర్దిక్ పటేల్ మాజీ సన్నిహితులు ఇద్దరు తాజాగా కాషాయ కండువా కప్పుకున్నారు. గతేడాది ఆగస్టులో పాస్ నుంచి బహిష్కరణకు గురైన కేతన్ పటేల్, అమరేశ్ పటేల్‌లు శనివారం బీజేపీలో చేరారు -
తల నరికినా బీజేపీకి మద్దతివ్వం: హార్దిక్
అహ్మదాబాద్: పటేళ్లకు రిజర్వేషన్లు ఇచ్చే అంశంలో రాజ్యాంగ భద్రత కల్పించేందుకు కాంగ్రెస్ అంగీకరించిందని పటీదార్ ఉద్యమనేత హార్దిక్ పటేల్ పేర్కొన్నారు. కాంగ్రెస్‌తో తాను కలిసిలేనని.. అలాగని వారికి వ్యతిరేకమూ కాదని స్పష్టం చేశారు. పటేళ్లకు వ్యతిరేకంగా బీజేపీ అనుసరిస్తున్న అహంకారపూరిత వైఖరికి వ్యతిరేకంగా తన పోరాటం కొనసాగుతుందన్నారు. అహ్మదాబాద్‌లో గుజరాత్ కాంగ్రెస్ చీఫ్ భరత్‌సింగ్ సోలంకితో కలసి పటేల్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ‘నేను కాంగ్రెస్‌తో కలిసి లేను. అలాగని వారికి వ్యతిరేకమూ కాదు. కానీ బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తా. అయితే ఓబీసీ కేటగిరీలో పటేళ్లకు ఎలా రిజర్వేషన్లు కల్పిస్తారని కాంగ్రెస్ వివరించాలి. మీరు ఆకాశం నుంచి తెస్తారా! పాతాళం నుంచి తోడుకొస్తారా! నాకు తెలీదు. నాకు రిజర్వేషన్ కావాలంతే’ అని హార్దిక్ స్పష్టం చేశారు. ‘మా డిమాండ్లను అధికార పక్షం విననప్పుడు, ప్రతిపక్షంతో మాట్లాడటం మా హక్కు. మా తలలు నరికినా, జైళ్లకు పంపినా ఎట్టిపరిస్థితుల్లోనూ బీజేపీకి మద్దతివ్వం. 25 ఏళ్లు పటేళ్లు బీజేపీ వెంటే ఉన్నారు. ఇప్పడు మేం వారితో కలసి పనిచేయం’ అని చెప్పారు. -
'గాంధీ పుట్టిన గడ్డపై నెత్తుటి మరకలు బాధాకరం'
గుజరాత్ లో ఇటీవల పటీదార్ (పటేల్) కులస్తులు నిర్వహించిన ఆందోళనల్లో హింస చోటుచేసుకున్న నేపథ్యంలో శాంతి యుతంగా ఉండాలంటూ అక్కడి ప్రజలకు పిలుపునిచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. మరోసారి అదే అంశంపై తన మనసులోని మాటలను వెల్లడించారు. ప్రతినెల చివరి ఆదివారం ఆలిండియా రేడియో ఢిల్లీ కేంద్రంలో నిర్వహించే మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తాజాగా గుజరాత్లో చెలరేగిన హింస యావత్ భారతావనిని బాధించిందన్నారు. 'ఇటీవల గుజరాత్ రాష్ట్రంలో చోటుచేసుకున్న హింస దేశం మొత్తాన్ని బాధించింది. అయితే విజ్ఞులైన గుజరాతీలు తక్షణమే స్పందించడం వల్ల పరిస్థితి తిరిగి అదుపులోకి వచ్చింది. జాతిపిత మహాత్మా గాంధీ నడయాడిన నేలలో ఇలా హింస జరగడం అత్యంత బాధాకారం. అల్లర్లు సర్దుమణిగిన తర్వాత గుజరాత్లో శాంతి వెల్లివిరిసింది' అని మోదీ అన్నారు. తమను ఓబీసీ జాబితాలో చేర్చాలని పటేల్ కులస్తులు నిర్వహించిన ఆందోళనల్లో తొమ్మిది మంది మృతి చెందగా, వందల మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేటుకు చెందిన దాదాపు 200 వాహనాలు అగ్నికి ఆహుతి అయిన విషయం తెలిసిందే.