'గాంధీ పుట్టిన గడ్డపై నెత్తుటి మరకలు బాధాకరం'
గుజరాత్ లో ఇటీవల పటీదార్ (పటేల్) కులస్తులు నిర్వహించిన ఆందోళనల్లో హింస చోటుచేసుకున్న నేపథ్యంలో శాంతి యుతంగా ఉండాలంటూ అక్కడి ప్రజలకు పిలుపునిచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. మరోసారి అదే అంశంపై తన మనసులోని మాటలను వెల్లడించారు. ప్రతినెల చివరి ఆదివారం ఆలిండియా రేడియో ఢిల్లీ కేంద్రంలో నిర్వహించే మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తాజాగా గుజరాత్లో చెలరేగిన హింస యావత్ భారతావనిని బాధించిందన్నారు.
'ఇటీవల గుజరాత్ రాష్ట్రంలో చోటుచేసుకున్న హింస దేశం మొత్తాన్ని బాధించింది. అయితే విజ్ఞులైన గుజరాతీలు తక్షణమే స్పందించడం వల్ల పరిస్థితి తిరిగి అదుపులోకి వచ్చింది. జాతిపిత మహాత్మా గాంధీ నడయాడిన నేలలో ఇలా హింస జరగడం అత్యంత బాధాకారం. అల్లర్లు సర్దుమణిగిన తర్వాత గుజరాత్లో శాంతి వెల్లివిరిసింది' అని మోదీ అన్నారు.
తమను ఓబీసీ జాబితాలో చేర్చాలని పటేల్ కులస్తులు నిర్వహించిన ఆందోళనల్లో తొమ్మిది మంది మృతి చెందగా, వందల మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేటుకు చెందిన దాదాపు 200 వాహనాలు అగ్నికి ఆహుతి అయిన విషయం తెలిసిందే.