Pathankot Terrorist Attack
-
పఠాన్‌కోట్ దాడిపై భారత్ చేరిన పాక్ విచారణ టీం
న్యూఢిల్లీ: పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై ఉగ్రదాడి ఘటనను విచారించేందుకు పాకిస్తాన్ నుంచి ఐదుగురు సభ్యులతో కూడిన సంయుక్త విచారణ బృందం (జిట్) ఆదివారం ప్రత్యేక విమానంలో భారత్‌కు చేరుకుంది. దేశంలో ఉగ్రదాడి ఘటనలకు సంబంధించి విచారణ కోసం విదేశీ అధికారులు భారత్‌ను సందర్శించడం ఇదే తొలిసారి. పఠాన్‌కోట్ ఘటనపై మనదేశానికి చెందిన జాతీయ భద్రతా సంస్థ (ఎన్ఐఏ) కూడా విచారణ చేస్తోంది. భారత్‌కు చేరుకున్న పాక్ విచారణ బృందానికి ఎన్ఐఏ అధికారులు స్వాగతం పలికారు. పాక్ విచారణ బృందంతో పాటు ఎన్ఐఏ అధికారులు కూడా మంగళవారం పఠాన్‌కోట్ ఎయిర్ బేస్‌ను సందర్శించనున్నారు. ఉగ్రవాద నిరోధక ప్రత్యేక విభాగం పంజాబ్ చీఫ్ మహమ్మద్ అజీమ్ అర్షద్ పాకిస్తాన్ విచారణ బృందానికి సారథ్యం వహిస్తున్నారు. సోమవారం ఎన్ఐఏ కార్యాలయంలో ఈ బృందానికి ఎన్ఐఏ 90 నిమిషాల ప్రజెంటేషన్ ఇవ్వనుంది. పఠాన్‌కోట్ ఘటనలో సేకరించిన ఆధారాలను వివరించనుంది. అనంతరం పఠాన్‌కోట్ ఘటనలో పాక్ ప్రమేయంపై ఉన్న సందేహాలను పాక్ విచారణ బృందం నివృత్తి చేసుకోనుంది. మంగళవారం ఎన్ఐఏ, జిట్ టీంలు ప్రత్యేక విమానంలో పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌ను సందర్శించనున్నారు. -
ఎస్పీపై అటాక్ తోనే అలర్టయ్యాం
- కీలక ప్రాంతంలోకి చొరబడకుండా ఉగ్రవాదుల్ని అడ్డుకున్నాం - పఠాన్ కోట్ ఉగ్రదాడిపై కేంద్ర హోం శాఖ కార్యదర్శి రాజీవ్ మెహర్షి వివరణ న్యూఢిల్లీ: పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ లో పటిష్ఠ నిఘా ఉండటం వల్లే ఉగ్రవాదులు కీలక ప్రాంతంలోకి చొరబడలేకపోయారని కేంద్ర హోం శాఖ కార్యదర్శి రాజీవ్ మెహర్షి అన్నారు. పఠాన్ కోట్ లో ఉగ్రదాడిపై ఆదివారం ఢిల్లీలో అధికారిక ప్రకటన చేసిన ఆయన.. ఎస్పీపై దాడి జరిగిందని తెలిసిన వెంటనే అప్రమత్తమైనట్లు చెప్పారు. 'శుక్రవారం గురుదాస్ పూర్ ఎస్పీ సల్వీందర్ సింగ్ పై ఉగ్రవాదులు దాడిచేసి, కారును అపహరించారని తెలిసిన వెంటనే ఇంటెలిజెన్స్, ఎయిర్ ఫోర్స్ వర్గాలు అప్రమత్తమయ్యాయి. పఠాన్ కోట్ ఎయిర్ బేస్ వద్ద నిఘా పెంచాం. అందువల్లే ఉగ్రవాదులు టెక్నికల్ ఏరియాలోకి అడుగుపెట్టలేకపోయారు. ముష్కరులు.. నాన్ ఆపరేషన్ ఏరియా దాటి రాకుండా నివారించగలిగాం. తద్వారా భారీ ముప్పు తప్పినట్లయింది. దాడిలో పాల్గొన్న మొత్తం ఆరుగురు ఉగ్రవాదుల్ని భద్రతా బలగాలు అంతమొందించాయి' అని రాజీవ్ మెహర్షి చెప్పారు. ఇప్పటివరకు భద్రతా బలగాలు ఆరుగురు ఉగ్రవాదులను హతమార్చగా మరో ఉగ్రవాది ఇంకా సజీవంగా ఉన్నట్లు సమాచారం. ఆ ఒక్కడినీ అంతం చేసేందుకు ఆపరేషన్ కొనసాగుతోంది. మొత్తంగా ఈ ఘటనలో ఎంతమంది చనిపోయారనే విషయం మృతదేహాలు సేకరించిన తర్వాతే ప్రకటిస్తామని ఎయిర్ మార్షల్ అనిల్ ఖోస్లా అన్నారు. నిఘా వ్యవస్థ సమర్థవంతంగా పనిచేయటం వల్లే పఠాన్ కోట్ ఎయిర్ బేస్ కు భారీ ముప్పు తప్పిందని, ఒకవేళ ఇంటెలిజెన్స్ సకాలంలో స్పందించకపోయి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. -
పఠాన్‌కోట్‌లో ఆపరేషన్ కొనసాగుతూనే..!
పఠాన్‌కోట్/న్యూఢిల్లీ: పంజాబ్‌లోని పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌లో భద్రతా దళాలు చేపట్టిన ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన ఈ వైమానిక స్థావరం ఆదివారం ఉదయం కూడా కాల్పులతో దద్దరిల్లింది. ఈ నేపథ్యంలో ఎయిర్‌బేస్‌లో నక్కిన ఒక ఉగ్రవాదిని భద్రతా దళాలు హతమార్చాయి. మరో ఉగ్రవాదిని కూడా హతమార్చినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఎయిర్‌బేస్‌లో భద్రతా దళాల ఆపరేషన్ కొనసాగుతున్నదని, ఇప్పటికే సైనిక దుస్తుల్లో ఉన్న ఉగ్రవాదులను జవాన్ల నుంచి వేరుచేసిన బలగాలు.. వారిని ఏరివేసేందుకు ప్రయత్నిస్తున్నాయని కేంద్రంలోని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. అయితే ఇప్పటివరకు ఎయిర్‌బేస్‌లో ఎంతమంది ఉగ్రవాదులను ఏరివేశారు, ఇంకా ఎంతమంది నక్కి ఉన్నారన్నది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. ఎయిర్‌బేస్‌లో నక్కిన మరో ఇద్దరు ఉగ్రవాదులతో కమాండోల ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయని, ఈ ఆపరేషన్ త్వరగా ముగుస్తుందని భావిస్తున్నామని కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్ మహర్షి ఢిల్లీలో ఆదివారం సాయంత్రం తెలిపారు. ఈ ఉగ్రవాద దాడి విషయంలో కేంద్రం వ్యవహరించిన తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకు ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారంటూ కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ ట్విట్టర్లో చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకున్నారు. దీంతో ఇప్పటివరకు ఈ ఘటనలో ఎంతమంది ఉగ్రవాదులు హతమయ్యారన్నది అధికారికంగా సరైన సమాచారం అందకపోవడం సందిగ్ధతకు దారితీస్తోంది. ఎయిర్‌బేస్‌పై దాడిచేసిన మొత్తం ఆరుగురు ఉగ్రవాదుల్లో ఐదుగురు చనిపోయినట్టు ఇప్పటివరకు అందిన సమాచారం. అయితే, కేంద్ర ప్రభుత్వం మాత్రం ఎయిర్‌బేస్‌పై దాడి చేసిన ఉగ్రవాదుల్లో నలుగురు శనివారం హతమయ్యారని ప్రకటించింది. ఎయిర్‌బేస్‌లో నక్కిన మరో ఇద్దరు ఉగ్రవాదులను ఏరివేసేందుకు ఆపరేషన్ కొనసాగుతున్నదని తెలిపింది. ఎయిర్‌బేస్‌లో నక్కిన ఇద్దరు ఉగ్రవాదులు ఆదివారం ఉదయం కాల్పులకు తెగబడటంతో మళ్లీ కలకలం రేగింది. శనివారం ఉదయం పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రవాదులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో ఏడుగురు జవాన్లు మృతి చెందారు. 20 మంది గాయపడ్డారు. ఉగ్రవాదుల దాడిని దీటుగా తిప్పికొట్టిన బలగాలు నలుగురిని హతమార్చాయి. అయినా ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్ శనివారంతో ముగియలేదు. మరో ఇద్దరు ఉగ్రవాదులు ఎయిర్‌బేస్‌లో దాగి ఉన్నట్టు తేలడం.. ఆదివారం ఉదయం కాల్పులు చోటుచేసుకోవడంతో బలగాలు మరో ఆపరేషన్ చేపట్టాయి. ఎదురుకాల్పుల్లో ఇప్పటికే ఐదో ఉగ్రవాది మధాహ్నం హతమవ్వగా.. మరికొంత ప్రతిఘటన అనంతరం ఆరో ఉగ్రవాది కూడా మృతిచెందినట్టు సమాచారం అందుతోంది. దీనిని అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. కాగా, ఎయిర్ బేస్ లో ఆదివారం ఉదయం గ్రనేడ్ పేలిన ఘటనలో ఆర్మీ ఆఫీసర్ నిరంజన్ సింగ్ మృతిచెందగా, మరో ఐదుగురు సిబ్బంది గాయపడినట్లు తెలుస్తోంది. ఉగ్రవాదులు తీసుకొచ్చిన గ్రనేడ్ నిర్వీర్యం చేస్తుండగా ఈ ఘటన సంభవించింది. -
ఎస్పీపై అటాక్ తోనే అలర్టయ్యాం
-
సొంతంగా కమాండో యూనిట్ ఏర్పాటు
- పంజాబ్ ప్రభుత్వం నిర్ణయం - సరిహద్దులో భద్రత పెంచాల్సిందిగా కేంద్రానికి వినతి చండీగఢ్: సరిహద్దులో అవసరమైన మేరకు భద్రతా దళాలను మోహరించకపోవటం వల్లే ఉగ్రవాదులు పంజాబ్ ను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతున్నారనే విమర్శల నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. సరిహద్దు భద్రతకు సొంతంగా కమాండో యూనిట్ ను ఏర్పాటుచేస్తున్నట్లు ప్రకటించింది. జమ్ముకశ్మీర్ లాగే పంజాబ్ సరిహద్దులోనూ భద్రత పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సుఖ్బీర్ సింగ్ బాదల్ ఆదివారం సాయంత్రం విలేకరులకు ఈ విషయాలు చెప్పారు. 'ఇటీవలి వరుస దాడులతో పంజాబ్ సరిహద్దులోనూ పటిష్ఠభద్రత అవసరమని భావిస్తున్నాం. ఆ మేరకు పఠాన్ కోట్ లో స్వాట్ బలగాల శాశ్వత స్థావరాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రానికి విన్నవించాం. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేక కమాండో యూనిట్ ఏర్పాటు చేస్తాం. ఈ బలగాలు రెండో రక్షణ పంక్తి(సెకండ్ లైన్ ఆఫ్ డిఫెన్స్)గా ఉపయోగపడుతుంది' అని సుఖ్బీర్ పేర్కొన్నారు. పఠాన్ కోట్ ఎయిర్ బేస్ లక్ష్యంగా జైష్ ఏ మహమ్మద్ ఉగ్రవాదులు జరిపిన దాడులు, భారత భద్రతా బలగాలు జరిపిన ప్రతిదాడుల్లో ఇప్పటివరకు 12 మంది చనిపోయారు. వీరిలో ఏడుగురు జవాన్లుకాగా, ఐదుగురు ముష్కరులు. ఎయిర్ బేస్ లో నక్కిఉన్న మరో ఉగ్రవాది కోసం ఆపరేషన్ కొనసాగుతోంది.