Patidars
-
గుజరాత్ ఎన్నికల చిత్రం.. పటేళ్ల రూటు ఎటు?
గుజరాత్లో ఎన్నికలంటే చాలు అందరి దృష్టినీ ఆకర్షించే వర్గం పాటీదార్లు. పటేళ్ల ఆగ్రహం, అనుగ్రహాలపైనే రాష్ట్రంలో అధికారం ఆధారపడి ఉంటుంది. అందుకే అన్ని పార్టీలు వీరి మద్దతు కోసం కష్టపడతాయి. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కమలనాథులను భయపెట్టింది ఈ పటేళ్లే. మరి ఈసారి పటేళ్ల దారెటు..? పాటిదార్లే పవర్ ఫుల్ గుజరాత్ జనాభాలో పాటీదార్ల సంఖ్య సుమారు 15 శాతం. వ్యవసాయం నుంచి వ్యాపారవాణిజ్యాల వరకూ అన్ని రంగాల్లో బలంగా పాతుకుపోయారు. సౌరాష్ట్ర ప్రాంతంలోని రాజ్‌కోట్, అమ్రేలి, మోర్బీ జిల్లాలతోపాటు ఆనంద్, ఖేడా, మెహ్సనా, పటాన్, అహ్మదాబాదుల్లో పటేళ్ల ప్రాబల్యం ఎక్కువ. 182 సీట్ల అసెంబ్లీలో 50 చోట్ల వీరి ఓట్లు అత్యంత కీలకం. ఈ 50 నియోజకవర్గాల్లో పాటీదార్ ఓట్లు 20 శాతం పైగా ఉన్నాయి. మరో 40 సీట్లను ప్రభావితం చేస్తారనేది పార్టీల అంచనా.! మద్ధతు నుంచి ఉద్యమం దాకా 1990 నుంచి పాటీదార్లు బీజేపీకి మద్దతుగా నిలుస్తున్నారు. అయితే పటేళ్ల ఉద్యమం ఈ పరిస్థితిని మార్చింది. ఓబీసీల తరహాలో తమకూ విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కావాలంటూ ఆందోళనకు దిగారు పాటిదార్లు. 2007లోనే నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా మాజీ ముఖ్యమంత్రి కేశూభాయ్ పటేల్ సర్దార్ పటేల్ ఉత్కర్ష్ సమితిని ఏర్పాటుచేశారు. 2015లో హార్దిక్ పటేల్ సారథ్యంలో పటేళ్ల ఆందోళన ఉవ్వెత్తున ఎగసిపడింది. ఈ ఉద్యమాన్ని బీజేపీ ప్రభుత్వం అణచివేసింది. పోలీసు కాల్పుల్లో అనేకమంది పాటీదార్ యువకులు చనిపోయారు. దీంతో పటేళ్లు, బీజేపీ మధ్య దూరం పెరిగింది. 2017 ఎన్నికల్లో ఆ ప్రభావం స్పష్టంగా కనిపించింది. ఎప్పుడూ మూడంకెల సీట్లు దాటే బీజేపీ.. 99కే పరిమితమైంది. కమలం గూట్లో ఉద్యమనేత 2017లో జరిగిన తప్పులకు.. ఇప్పుడు బీజేపీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు రిజర్వేషన్ల రూపంలో పటేళ్లకు సాయం అందుతుందని బీజేపీ ప్రచారం చేస్తోంది. పటేల్ వర్గానికి చెందిన 45మందిని పోటీలో నిలబెట్టింది. మరీ ముఖ్యంగా.. 2015లో ఆందోళన చేసిన హార్దిక్ పటేల్‌ను పార్టీలో చేర్చుకుని సీటిచ్చింది. పటేళ్ల ఆగ్రహాన్ని చల్లార్చేందుకు.. ఎన్నికలకు ఏడాది ముందు విజయ్ రూపానీను తప్పించి.. భూపేంద్ర పటేల్‌కు ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించింది. ఈ చర్యలన్నీ పాటీదార్లను తిరిగి తమవైపు మొగ్గు చూపేలా చేస్తాయనేది కమలనాథుల ఆశ. గుజరాత్లో బీజేపీ 150 సీట్ల టార్గెట్ చేరుకోవాలంటే పటేళ్ల మద్దతు తప్పనిసరి. చేయి కలుపుతారా? చేయిస్తారా? గుజరాత్లో క్షత్రియ, హరిజన్, ఆదివాసీ, ముస్లిం ఓట్లపై ఆధారపడిన కాంగ్రెస్‌కు.. 2017 ఎన్నికల్లో పాటిదార్ల అండ దొరికింది. అందుకే ఏకంగా 77 సీట్లు సాధించగలిగింది. ఈసారి అదే కొనసాగుతుందని ఆశిస్తోంది. అయితే అసెంబ్లీ ఎన్నికల ముందు హార్దిక్ పటేల్ బీజేపీలోకి వెళ్లిపోవడం కాంగ్రెస్ పెద్ద దెబ్బ. కాంగ్రెస్ నాయకత్వం, రాహుల్ గాంధీపై హార్దిక్ చేసిన విమర్శలు.. హస్తం పార్టీని డిఫెన్స్‌లో పడేశాయి. అయినా పాటిదార్ ఓట్ల కోసం గట్టిగానే ప్రయత్నిస్తోంది కాంగ్రెస్. 42మంది పటేళ్లకు సీట్లు ఇచ్చింది. తొలిసారి గుజరాత్‌ను ఊడ్చేయాలని ఉవ్విళ్లూరుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ కూడా పాటీదార్లను బుట్టలో వేసుకోవటానికి గట్టిగానే యత్నిస్తోంది. అందుకే బీజేపీ, కాంగ్రెస్ కంటే ఎక్కువగా పటేళ్లకు సీట్లిచ్చింది. 46 మంది పాటీదార్లను అసెంబ్లీ బరిలోకి దించింది ఆప్. వీరిలో 2015 నాటి ఉద్యమ నాయకులు ఎక్కువగా ఉన్నారు. మరి పటేళ్ల మొగ్గు ఎటువైపో తెలియాలంటే, డిసెంబర్ 8 వరకూ ఆగాల్సిందే. పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
Gujarat Assembly Election 2022: సౌరాష్ట్ర ఎవరికి సై?
సౌరాష్ట్ర.. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత కీలక ప్రాంతం. పటీదార్ల ఉద్యమానికి కేంద్ర బిందువు. ఈ ఉద్యమ ప్రభావంతో గత ఎన్నికల్లో ఈ ప్రాంతంపై పట్టు కోల్పోయిన బీజేపీ తిరిగి పూర్వవైభవం సాధించడానికి ప్రయత్నిస్తోంది. మరి సౌరాష్ట్ర ఓటర్లు ఎవరకి జై కొడతారు...? సౌరాష్ట్ర కేంద్రంగా 2015లో మొదలైన పటీదార్ (పటేళ్లు) ఉద్యమం రాష్ట్రవ్యాప్తంగా ఉవ్వెత్తున ఎగిసిపడింది. రాష్ట్రంలో అగ్రకులమైన పటేళ్లను ఒబిసిలో చేర్చాలని, వారికి కూడా విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్‌తో యువ నాయకుడు హార్థిక్ పటేల్ నేతృత్వంలో సాగిన ఉద్యమం 2017 ఎన్నికల్లో బీజేపీని బాగా దెబ్బ తీసింది. సౌరాష్ట్రలో పటీదార్లు, ఒబీసీ ఓటర్ల సంఖ్య ఎక్కువ. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పటీదార్లు చేసిన ఉద్యమంతో 2017 ఎన్నికల్లో మొత్తం 48 స్థానాలకు గాను 19 సీట్లను మాత్రమే గెలుచుకుంది. ఆ ఎన్నికల్లో హార్దిక్ పటేల్ కాంగ్రెస్‌కు వెలుపల నుంచి మద్దతు ఇవ్వడంతో ఆ పార్టీ ఏకంగా 28 స్థానాలను గెలుచుకొని తన పట్టు పెంచుకుంది. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీని 99 స్థానాలకే పరిమితం చేయగలిగింది. ఇప్పుడపా మాదిరి భావోద్వేగ పరిస్థితుల్లేవు. పటీదార్ల ఉద్యమం చల్లారింది. హార్దిక్ పటేల్ కాంగ్రెస్‌లో చేరినా 2019 ఎన్నికల్లో ఆ పార్టీ ఒక్క సీటూ గెలవలేకపోయింది. హార్దిక్ ఇప్పుడు బీజేపీలో చేరారు. విరమ్గమ్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా బరిలోకి దిగింది. ఈ పరిణామాలన్నీ కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బగా మారేలా ఉన్నాయి. సౌరాష్ట్రలో పటీదార్లు, కొలి జనాభా 40% దాకా ఉంది. 18 అసెంబ్లీ స్థానాల్లో పటీదార్ల ఓట్లు, 10 అసెంబ్లీ స్థానాల్లో కొలి వర్గం ఓట్లు నిర్ణయాత్మకం. ఓబీసీ, క్షత్రియులు, మత్స్యకారులు కూడా ప్రభావం చూపించగలరు. ‘‘సౌరాష్ట్ర యువ ఓటర్లు ఈసారి ఆప్‌వైపు మొగ్గుతున్నారు. పటీదార్లు వ్యాపారాలంతా ఆప్‌కు అవకాశమిద్దామని అనుకుంటున్నారు. కొలి, ఇతర ఓబీసీ ఓటర్లు కాంగ్రెస్‌కి ఓటేయొచ్చు’’ అని రాజకీయ విశ్లేషకుడు దిలీప్ గొహ్లి అభిప్రాయపడ్డారు. బీజేపీ ఓబీసీ మంత్రం సౌరాష్ట్రలో 48 సీట్లలో సగానికిపైగా స్థానాల్లో పటేళ్ల ఆధిక్యం ఉంది. హార్దిక్ వంటి నాయకుల్ని బీజేపీ తమ వైపు తిప్పుకున్నా పటేళ్లలో ఉపకులాల కారణంగా అందరూ బీజేపీ వైపుండే పరిస్థితి లేదు. దీంతో బీజేపీ ఓబీసీలకు టిక్కెట్లు ఎక్కువ ఇచ్చింది. 2017 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ నుంచి తొమ్మిది మంది ఎమ్మెల్యేలు బీజేపీలోకి జంపయ్యారు. పటీదార్, కొలి, అహిర్ సామాజిక వర్గాలకు చెందిన కున్వర్జీ బవాలియా, బ్రిజేశ్ మెర్జా, చవడ వంటి అగ్రనాయకులూ కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరడం ఆ పార్టీకి కలిసొచ్చే అంశం. సంపన్న సౌరాష్ట్ర సౌరాష్ట్ర ప్రాంతం మొదట్నుంచి సంపన్న ప్రాంతమే. అరేబియా తీరంలో ఉండే ఈ ప్రాంతంలో సహజవనరులు చాలా ఎక్కువ. నీటి లభ్యత ఎక్కువగా ఉండడం వల్ల పారిశ్రామికంగా అభివృద్ధి చెందింది. ఇటీవల కాలంలో కరువు కోరల్లో చిక్కుకొని విలవిలలాడుతోంది.2019లో సర్దార్ సరోవర్ డ్యామ్ దగ్గర నర్మద నది నుంచి నీళ్ల ట్యాంకర్లతో సరఫరా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఈ ప్రాంతంలో 11 జిల్లాలున్నాయి. సురేంద్రనగర్, మోర్బీ, రాజ్‌కోట్, జామ్‌నగర్, దేవ్‌భూమి ద్వారక, పోర్బందర్, జునాగఢ్, గిర్ సోమ్‌నాథ్, అమ్రేలి, భావనగర్, బోతాడ్.. ఈ 11 జిల్లాలకు గాను బీజేపీ 2017 ఎన్నికల్లో మోర్బీ, గిర్ సోమ్‌నాథ్, అమ్రేలి జిల్లాల్లో ఒక్క సీటు సాధించలేకపోయింది. ఈ సారి ఎన్నికల్లో అధిక ధరలు, రైతు సమస్యలు, నిరుద్యోగం, నీటి సమస్య కీలకం కానున్నాయి. – సాక్షి నేషనల్ డెస్క్ -
హార్థిక్ ఎఫెక్ట్? గుజరాత్ కేబినెట్లో పటేళ్ల ముద్ర..!
సాక్షి, గాంధీ నగర్ : గుజరాత్లో పటేదార్ల ఉద్యమం.. ఎన్నికలపైనా, ప్రస్తుత మంత్రివర్గకూర్పుపైనా.. ప్రస్ఫుటంగా కనిపించింది. ముఖ్యంగా మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పటేదార్ వర్గం నుంచి అధికార బీజేపీ తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంది. పటేదార్లకు రిజర్వేషన్ కల్పిస్తామంటూ రాహుల్ గాంధీ ఆ వర్గాన్ని ఆకర్షించడం ద్వారా బీజేపీకి ఓటమి భయాన్ని కల్పించారు. ఇక కౌంటింగ్ సమయంలో పటేదార్లు బలంగా ఉన్న నియోజకవర్గాల్లో గెలుపోటములు ఊగిసలాడాయి. ఈ నేపథ్యంలో తాజా మంత్రివర్గంలో పటేదార్లకు బీజేపీ భారీ ప్రాముఖ్యత కల్పించింది. విజయ్‌రూపానీ నేతృత్వంలో కొత్తగా కొలువుదీరిన 20 మంది మంత్రుల్లో.. 6 మంది పటేదార్లకు పదవులు కట్టబెట్టింది బీజేపీ. తాజా మంత్రివర్గంలో మంత్రి పదవులు దక్కించుకున్న పటేదార్లలో ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్ ఉన్నారు. ఆయతో సహా కౌశిక్ పటేల్, సౌరభ్ పటేల్, ప్రభాత్ పటేల్, ఈశ్వర్ పటేల్, రచ్చండ భాయ్ పటేల్ ఉన్నారు. ఇదిలా ఉండగా బ్రాహ్మణ వర్గానికి చెందిన విభావరిబెన్ దేవ్ మంత్రి పదవి దక్కించుకున్నారు. ప్రస్తుత కేబినెట్లో పదవి దక్కించుకున్న ఏకైక మహిళ కూడా విభావరిబెన్ కావడం గమనార్హం. ఇక విజయ్ రూపానీ కేబినెట్లో ఐదు మంది ఓబీసీలు, ఎస్టీలు, ఎస్టీలు, క్షత్రియ వర్గాని తలా మూడు పదవులు దక్కాయి. మొత్తం 20 మంది మంత్రుల్లో.. 10 మంది కేబినెట్ హోదాలు దక్కగా.. మరో పదిమందికి సహాయ మంత్రి పదవులు దక్కాయి. -
కాంగ్రెస్‌కు పంగ నామాలు పెట్టారు..
సాక్షి, న్యూఢిల్లీ : వస్త్ర ప్రపంచానికి పుట్టినిల్లుగా పేరుగాంచిన గుజరాత్‌లోని సూరత్‌లో భారతీయ జనతా పార్టీ అఖండ విజయం సాధించడం పట్ల అన్ని వర్గాల ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో పెద్ద నోట్లను రద్దు చేసినప్పుడు, జీఎస్టీని ప్రవేశపెట్టినప్పుడు ప్రజలు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి ఆందోళన చేసిన సూరత్‌లో 16 సీట్లకు 15 సీట్లను బీజేపీ గెలుచుకుంది. ఎస్టీలకు కేటాయించడం వల్ల మాండ్వీ ఒక్క సీటును మాత్రం కాంగ్రెస్ పార్టీ గెలుచుకో కలిగింది. పెద్ద నోట్లను రద్దు చేసినప్పుడు దాదాపు రెండు నెలలపాటు వస్త్రాల మిల్లులు, షాపులు మూతపడ్డాయి. లక్షలాది మంది యువకులు రోడ్డున పడ్డారు. జీఎస్టీ బిల్లుతో తాము నష్టపోతున్నామంటూ సూరత్‌లో 65 వేల మంది వస్త్రవ్యాపారులు రోడ్డెక్కారు. వారిలో 90 శాతం మంది పాటిదార్లే ఉన్నారు. గతంలో తమకూ రిజర్వేషన్లు కావాలంటే భారీ ఉద్యమాన్ని నడిపిన ఈ పాటిదార్లు ఇప్పుడు హార్దిక్ పటేల్ నాయకత్వాన ఏకమై కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకించారు. హార్దిక్ పటేల్ పిలుపుకు కాంగ్రెస్‌కు ఓటేసేందుకు సిద్ధమయ్యారు. నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థుల ప్రచారానికి అడుగడుగున పాటిదార్లు అడ్డంకులు సృష్టించారు. డిసెంబర్ 3వ తేదీన హార్దిక్ పటేల్ నిర్వహించిన బైక్ ర్యాలీకి వేలాది మంది తరలివచ్చారు. బీజేపీ కార్యకర్తలు కనిపిస్తే చాలు, వారిని అవహేళన చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎస్టీ స్థానంతో పాటు వరచ్చా, కటార్‌గామ్, కామ్రెజ్, సూరత్ నార్త్ నియోజక వర్గాల్లో కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా విజయం సాధిస్తుందని రాజకీయ పార్టీలే కాకుండా రాజకీయ విశ్లేషకులు భావించాయి. కొన్ని పోల్ సర్వేలు కూడా అలాగే అంచనా వేశాయి. మరి ఎందుకు కాంగ్రెస్‌ను కాదని ఓటర్లు, అంటే పాటిదార్లు బీజేపీకి పట్టంకట్టారు. ‘మేం చాలా దిగ్భ్రాంతికి గురయ్యాం. ఎందుకు ఇలా జరిగిందో మాకు అర్థం కావడం లేదు’ అని పాటిదార్ల అనామత్ ఆందోళన్ సమితి సూరత్ కన్వీనర్ అల్పేష్ కత్రియా వ్యాఖ్యానించారు. బీజేపీ ప్రభుత్వం పట్ల ఇక్కడి ప్రజలు తీవ్ర కోపంతో ఉన్నారని, అయినప్పటికీ బీజేపీ విజయానికి కారణాలేమిటో తమకు అంతుచిక్కడం లేదని ఆయన చెప్పారు. ‘సూరత్‌లో ఎన్నికల ఫలితాలు అనూహ్యం. జీఎస్టీకి వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించారు. బీజేపీ అభ్యర్థులను ప్రచారానికి కూడా అనుమతించలేదు. మరి చివరి నిమిషంలో వారినే ఎందుకు గెలిపించారో అర్థం కావడం లేదు’ అని సూరత్‌కు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వ్యాఖ్యానించారు. ఈవీఎంలను ట్యాంపర్ చేయడం వల్లనే బీజేపీ విజయం సాధించిందని పాటిదార్ల యువ నాయకుడు హార్దిక్ పటేల్ ఇంతకుముందే ఆరోపించిన విషయం తెల్సిందే. సూరత్ ఫలితాలను చూసి తాను కూడా ఆశ్చర్యపడ్డానని అహ్మదాబాద్‌కు చెందిన రాజకీయ శాస్త్రవేత్త వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ నాలుగైదు సీట్లను కచ్చితంగా గెలుచుకుంటుందని భావించానని, అయితే అలా జరగలేదని ఆయన అన్నారు. పాటిదార్లు తమ నరనరాన పేరుకుపోయిన హిందూత్వ ఏజెండాను వదులుకోలేక పోయారని, అందుకనే వారు ఎంత కోపం, వ్యతిరేకత ఉన్నా బీజేపీకే ఓటేసి ఉంటారని ఆయన అన్నారు. ఈ లెక్కన కాంగ్రెస్ పార్టీ విజయావకాశాలను పాటిదార్లే దెబ్బతీశారన్న మాట. -
గుజరాత్ ఫలితాలపై ‘పల్లీల’ ప్రభావం
సాక్షి, న్యూఢిల్లీ : ప్రతిష్టాత్మకమైన గుజరాత్ అసెంబ్లీకి తొలి విడత పోలింగ్ శనివారం 9వ తేదీన, మలి విడత పోలింగ్ 14వ తేదీన జరుగుతున్న విషయం తెల్సిందే. ఇదివరకటిలాగే ఈ ఎన్నికల్లో కూడా పాటిదార్ కమ్యూనిటీ లేదా పటేళ్లు నిర్ణయాత్మక పాత్ర వహించనున్నారు. రాష్ట్ర జనాభా ఆరు కోట్ల మందిలో 14 నుంచి 16 శాతం వరకున్న పాటిదార్లు రాష్ట్ర ఓటర్లలో 15 శాతం ఉన్నారు. వారు గత రెండున్నర దశాబ్దాలుగా సంప్రదాయబద్ధంగా భారతీయ జనతా పార్టీకి ఓటేస్తూ వచ్చారు. ప్రభుత్వ విద్యా, ఉపాధి అవకాశాల్లో తమకూ పది శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ 2015లో భారీ ఎత్తున గుజరాత్లో ఆందోళన చేసినప్పటి నుంచి వారి వైఖరి మారిపోయింది. వారి డిమాండ్లను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అంగీకరించక పోవడమే అందుకు కారణం. నాటి పాటిదార్ల ఆందోళనకు నాయకత్వం వహించిన హార్దిక్ పటేల్ రిజర్వేషన్ల అంశంపై కాంగ్రెస్ పార్టీతో అవగాహనకు వచ్చి ఈ సారి కాంగ్రెస్‌కు ఓటు వేయాలని పాటిదార్లకు పిలుపునిచ్చారు. ఆయన పిలుపుకు స్పందించిన యువత కాంగ్రెస్‌కు ఓటు వేసేందుకు ముందుకురాగా, వృద్ధతరం మాత్రం ఇప్పటికీ బీజేపీకే ఓటు వేయాలని భావివిస్తున్నట్లు పలు సర్వేల ద్వారా తెలుస్తోంది. ఓట్ల ఫలితాలను నిర్దేశించే స్థాయికి చేరకున్న పాటిదార్లు నేడు రాష్ట్రంలో భూస్వాములుగా చెలామణి అవుతున్నారు. ఆది నుంచి భూమిని నమ్ముకున్న వారిలోనూ ఉత్తాన పతనాలు ఉన్నాయి. కౌలు రైతుగా జీవితాలను ప్రారంభించిన పాటిదార్లు ధనిక రైతులుగా ఎదగడం, మళ్లీ పండించిన పంటలకు గిట్టుబాటు ధరరాక చితకిపోవడం, ఓబీసీల్లాగా తమకూ రిజర్వేషన్లు కల్పించాలంటూ ఆందోళన చేయడం వరకు దారి తీసిన పరిస్థితులను లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాస్తవానికి ఉత్తర గుజరాత్‌కు చెందిన పాటిదార్లు 1950 ప్రాంతంలో సౌరాష్ట్రకు వలసపోయారు. అక్కడ చవగ్గా భూములను కౌలుకు తీసుకొని వ్యవసాయాన్ని ప్రారంభించారు. 1956లో భూసంస్కరణల చట్టం రావడంతో ఒక్కసారిగా వారి జీవితాలే మారిపోయాయి. వారంతా భూ యజమానులుగా మారిపోయారు. అప్పటి వరకు చిరు ధాన్యాలు పండించిన వారు వేరుశెనగ పంటకు మళ్లారు. ఆ పంటలకు వారికి మంచి గిట్టుబాటు ధర రావడంతోపాటు మిగులు కూడా ఎక్కువే ఉండడంతో పాల డెయిరీ, నూనె, పిండి మిల్లులు లాంటి వ్యవసాయ పరిశ్రమలపై దృష్టిని కేంద్రీకరించారు. మరి కొందరు రైతుల వ్యవసాయ సాగుకు ఉపయోగించే పరికరాలు, మరికొందరు సిరామిక్స్, పంపులు తయారుచేసే ఇంజనీరింగ్ పరిశ్రమలను స్థాపించారు. వారి ఉత్తాన పతనాల్తో వేరు శెనగ పంటనే కీలక పాత్ర పోషించిందని ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త అచ్యుత్ యాగ్నిక్ తెలిపారు. అయితే ధనిక రైతులకుగానీ, ధీరుభాయి అంబానీ లాంటి పారిశ్రామిక వేత్తలకు ఇక్కడ ఏమీ నష్టం వాటిల్ల లేదు. సన్న, చిన్నకారు, మధ్య తరగతి రైతులే ఎక్కువ దెబ్బతిన్నారు. ఎప్పుడూ వంద కిలోల పల్లీలకు నాలుగువేల రూపాయలకు తక్కువగా కనీస మద్దతు ధర ఉండేది కాదు. వరుసగా గత మూడేళ్లుగా పల్లీల కనీస మద్దతుధర 3000 నుంచి 3200 రూపాయలను మించడం లేదు. అది కూడా అందరికి అందడం లేదు. వారంతా చమురు మిల్లులకు పల్లీలను అమ్ముకుంటున్నారు. ఒకప్పుడు వాటికి 3,200 రూపాయల వరకు ధర పలికేది. పామాయిల్ లాంటి చమురు ఉత్పత్తులను విదేశాల నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకోవడం వల్ల పల్లి నూనెలకు కూడా దారుణంగా డిమాండ్ పడిపోయింది. పామాయిల్ దిగుమతి కారణంగా 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు వంట నూనెల మార్కెట్లో పల్లి నూనె వాట 15 శాతం నుంచి ఒక్క శాతానికి పడిపోయింది. కేంద్రంలోని ప్రభుత్వాలు ప్రధానంగా ఇండోనేసియా, మలేషియాల నుంచి వచ్చే పామాయిల్‌పై దిగుమతి సుంకాన్ని క్రమంగా తగ్గిస్తూ చివరకు పూర్తిగా ఎత్తివేయడం పల్లి నూనెపై ప్రధానంగా ప్రభావం చూపింది. 2005 సంవత్సరం వరకు పామాయిల్‌పై దిగుమతి సుంకం 80 శాతం ఉండగా, 2008 నాటికి పూర్తిగా ఎత్తివేశారు. రైతులు, దేశీయ చమురు మిల్లుల యజమానులు గొడవ చేయడంతో మళ్లీ పామాయిల్‌పై 15 శాతం వరకు దిగుమతి సుంకం విధించారు. ఈలోగానే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల 1992-93 సంవత్సరంలో మనకు కావాల్సిన వంటనూనెలో 3 శాతాన్ని మాత్రమే దిగుమతి చేసుకోగా, ఇప్పుడు 75 శాతాన్ని దిగుమతి చేసుకుంటున్నాం. దిగుమతి సుంకాలను తగ్గించడం వల్ల మన దేశ రైతులు, మిల్లులు భారీగా నష్టపోయాయని భారత చమురు ఉత్పత్తిదారులకు ప్రాతినిధ్యం వహిస్తున్న ‘సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోపియేషన్’ అధ్యక్షుడు భారత్ మెహతా, పతంజలికి పల్లి నూనెను, స్నిక్కర్స్కు పల్లీలను సరఫరా చేసే ‘శ్రీయా పీనట్స్’ యజమాని దయాభాయ్ థూమర్ తెలిపారు. పల్లి నూనెలో సగం రేటుకే మామాయిల్ రావడం వల్లనే దాని దిగుమతికి వ్యాపారులు ఎగబడుతున్నారు. ఇలాంటి దిగుమతులుపై కేంద్రంలోని వాణిజ్యశాఖ నియంత్ర లేకపోవడం ఓ పెద్ద కుంభకోణమని ఇటీవలనే కాగ్ కూడా కేంద్ర ప్రభుత్వానికి అక్షింతలు విధించిన విషయం తెల్సిందే. 2001లో అప్పటి ప్రధాన మంత్రి అటల్ బిహారి వాజపేయి మలేసియా టూర్‌కు వెళ్లొచ్చి మలేసియా నుంచి వచ్చే పామాయిల్ నూనెలపై దిగుమతి సుంకాన్ని తగ్గించడంతో పల్లీలకు ఎసరు మొదలయింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన యూపీఏ కూడా దిగుమతి సుంకాలను తగ్గిస్తూ వచ్చింది. సోయా, సన్‌ఫ్లవర్ నూనెల దిగుమతులు కూడా పల్లి నూనెపై ప్రభావం చూపాయి. అయితే వాటి ప్రభావం దీనంత ఎక్కువగా లేదు. ఈ రోజున భారత్ వంట నూనెల దిగుమతుల్లో నెంబర్ వన్ దేశంగా గుర్తింపు పొందింది. ఏడాదికి 70 వేల కోట్ల రూపాయల నూనెలను దిగుమతి చేసుకుంటున్నట్లు ప్రభుత్వ లెక్కలే తెలియజేస్తున్నాయి. గుజరాత్‌లోని ఒక్క సౌరాష్ట్రలోనే 1400 చమురు మిల్లులు ఉన్నాయి. ఆ మిల్లుల యజమానులను ‘తేలియా రాజాస్’, అంటే ఆయిల్ కింగ్స్ అని పిలిచేవారు. 1980, 1990వ దశకాల్లో వారే గుజరాత్ ముఖ్యమంత్రి అభ్యర్థులను నిర్ణయించేవారని సౌరాష్ట్ర చమురు మిల్లుల అసోసియేషన్ సంఘం మాజీ అధ్యక్షుడు ఉకాభాయ్ పటేల్ తెలిపారు. వాటిలో దాదాపు 500 మిల్లులు మూతపడ్డాయి. వారంతా రోడ్డున పడ్డారు. పండించిన పల్లీలకు గిట్టుబాటు ధర లేక రైతులు కూడా రోడ్డున పడ్డారు. వారిలో 96 శాతం మంది పాటిదార్లే అవడం వల్ల వారు 2015లో రిజర్వేషన్ల కోసం రోడ్డెక్కారు. గుజరాత్లో ఒకప్పటికి ఇప్పటికీ 60 లక్షల టన్నుల పల్లీల ఉత్పత్తి పడిపోయింది. -
కాంగ్రెస్ మా షరతులను అంగీకరించింది : హార్ధిక్
గాంధీనగర్ : తమ సమస్యలను పరిష్కరించడానికి కాంగ్రెస్ పార్టీ ఒప్పుకున్నట్లు పటీదార్ ఉద్యమ నేత హర్ధిక్ పటేల్ బుధవారం ప్రకటించారు. ఈ మేరకు మీడియా సమావేశంలో విలేకరులతో మాట్లాడారు. గుజరాత్లో పటీదార్లకు రిజర్వేషన్లు ఇవ్వడానికి కూడా కాంగ్రెస్ పార్టీ అంగీకరించినట్లు తెలిపారు. సెక్షన్ 31, సెక్షన్ 46 కింద పటీదార్లను బీసీల్లో చేర్చడానికి కాంగ్రెస్ ఒప్పకుందని వెల్లడించారు. గుజరాత్లో అధికారం చేపట్టిన అనంతరం కాంగ్రెస్ పార్టీ పటీదార్ల రిజర్వేషన్లకు ఓ బిల్లును తీసుకొస్తుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీని తాము టికెట్లు కోరలేదని వెల్లడించారు. పటీదార్ అనామత్ ఆందోళన్ సమితి(పీఏఏఎస్)లో ఎలాంటి అంతర్గత విభేదాలు లేవని వివరించారు. కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయమని ఇంతవరకూ తాము ఎవరినీ కోరలేదని చెప్పారు. అది ప్రజలకే వదిలేస్తున్నామని అన్నారు. ఉత్తర గుజరాత్లో పీఏఏఎస్కు చెందిన పలువురిని కొనుగోలు చేసేందుకు బీజేపీ పలుమార్లు ప్రయత్నించిందని, రూ. 50 లక్షలు ఆఫర్ చేసిందని ఆరోపించారు. ఓటమి భయంతోనే బీజేపీ ఇలాంటి పనులకు దిగుతోందని ఎద్దేవా చేశారు. తాను ఏ రాజకీయ పార్టీలోనూ చేరబోవడం లేదని వెల్లడించారు. పటీదార్ల రిజర్వేషన్లను కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో చేర్చాల్సివుంటుందని చెప్పారు. గుజరాత్ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా తాము పోరాడతామని తెలిపారు. -
అమిత్ షా సభలో రెచ్చిపోయిన పటేదార్లు
సూరత్ : బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా సభలో పటేదార్లు విరుచుకుపడ్డారు. విద్యా ఉద్యోగాల్లో తమకు కోటా కల్పించాలంటూ హార్థిక్ పటేల్ మద్దతు దారులు సభలోని కుర్చీలను, ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాని నేతృత్వంలో కొత్తగా ఎంపికైన పటేదారు మంత్రులను గౌరవించడానికి ఈ సభను ఏర్పాటుచేశారు. బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన భారీ ర్యాలీలో అమిత్ షా పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో కేవలం బీజేపీ బలాన్ని చూపించడానికే కాక, పటేల్ కమ్యూనిటీతో మళ్లీ బీజేపీ కనెక్ట్ అవుతుందనే సంకేతాలతో ఈ భారీ సభను ఏర్పాటుచేశారు. కొంతమంది పటేదార్లు నేతలు కూడా ఈ ప్రోగ్రామ్‌లో పాల్గొన్నారు. అమిత్ షా స్టేజ్ మీదకు వచ్చిన అనంతరం కేంద్రమంత్రి పురుషోత్తం రూపాలా ప్రసంగించే సమయంలో ఈ రగడ చెలరేగింది. హార్థిక్, హార్థిక్ అంటూ నినాదాలు చేస్తూ సభలో ఏర్పాటుచేసిన కుర్చీలను విరగొట్టారు. వెంటనే స్పందించిన పోలీసులు 40 మంది పటేదార్ల నేతలను అదుపులోకి తీసుకున్నారు. ఆందోళనకారులు నినదించిన హార్థిక్ పటేల్, పటేదార్లకు రిజర్వేషన్లు కల్పించాలంటూ గతేడాది 40 రోజులు ఆందోళన కొనసాగించిన సంగతి తెలిసిందే. పటేదార్ల కమ్యూనిటీని హర్ట్ చేస్తే, ప్రభుత్వం కూలిపోతుందని హెచ్చరించారు. ఈ విషయంపై అమిత్ షాకు కూడా ఫేస్బుక్లో హార్థిక్ చాలెంజ్ చేశాడు. రిజర్వేషన్ల కోసం పటేల్ కమ్యూనిటీ చేస్తున్న ఆందోళనకు దూరంగా ఉండాలని, తాను చనిపోయేంత వరకు ఈ ఉద్యమం ఆగదని వ్యాఖ్యానించారు.