గాంధీనగర్ : తమ సమస్యలను పరిష్కరించడానికి కాంగ్రెస్ పార్టీ ఒప్పుకున్నట్లు పటీదార్ ఉద్యమ నేత హర్ధిక్ పటేల్ బుధవారం ప్రకటించారు. ఈ మేరకు మీడియా సమావేశంలో విలేకరులతో మాట్లాడారు. గుజరాత్‌లో పటీదార్లకు రిజర్వేషన్లు ఇవ్వడానికి కూడా కాంగ్రెస్ పార్టీ అంగీకరించినట్లు తెలిపారు. సెక్షన్ 31, సెక్షన్ 46 కింద పటీదార్లను బీసీల్లో చేర్చడానికి కాంగ్రెస్ ఒప్పకుందని వెల్లడించారు.
గుజరాత్‌లో అధికారం చేపట్టిన అనంతరం కాంగ్రెస్ పార్టీ పటీదార్ల రిజర్వేషన్లకు ఓ బిల్లును తీసుకొస్తుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీని తాము టికెట్లు కోరలేదని వెల్లడించారు. పటీదార్ అనామత్ ఆందోళన్ సమితి(పీఏఏఎస్)లో ఎలాంటి అంతర్గత విభేదాలు లేవని వివరించారు. కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయమని ఇంతవరకూ తాము ఎవరినీ కోరలేదని చెప్పారు. అది ప్రజలకే వదిలేస్తున్నామని అన్నారు.
ఉత్తర గుజరాత్‌లో పీఏఏఎస్‌కు చెందిన పలువురిని కొనుగోలు చేసేందుకు బీజేపీ పలుమార్లు ప్రయత్నించిందని, రూ. 50 లక్షలు ఆఫర్ చేసిందని ఆరోపించారు. ఓటమి భయంతోనే బీజేపీ ఇలాంటి పనులకు దిగుతోందని ఎద్దేవా చేశారు. తాను ఏ రాజకీయ పార్టీలోనూ చేరబోవడం లేదని వెల్లడించారు. పటీదార్ల రిజర్వేషన్లను కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో చేర్చాల్సివుంటుందని చెప్పారు. గుజరాత్ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా తాము పోరాడతామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment