పట్టాలు తప్పిన రైలు.. ఇద్దరి మృతి
పట్నా నుంచి గువాహటి వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పడంతో ఇద్దరు మరణించడగా, ఆరుగురు గాయపడ్డారు. ఈ ఘటన పశ్చిమబెంగాల్లోని సముక్తల స్టేషన్ సమీపంలో జరిగింది. ఈ ఘటనకు కారణం ఏంటో ఇంకా తెలియలేదు. రెస్క్యూ బృందాలను హుటాహుటిన ఘటనా స్థలానికి తరలించారు. రైలు డ్రైవర్ సిగ్నల్‌ను పట్టించుకోకపోవడం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇంజన్, మరో రెండు బోగీలు పట్టాలు తప్పాయి. వాటిలో ఒకటి ఎస్ఎల్ఆర్ కాగా, మరొకటి జనరల్ సెకండ్ క్లాస్ బోగీ. బిహార్‌లోని దానాపూర్ నుంచి గువాహటికి ఈ రైలు వెళ్లాల్సి ఉంది. క్షతగాత్రులను వెంటనే సమీపంలో ఉన్న అలీపుర్దౌర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు.
రైల్వే మంత్రి సురేష్ ప్రభు ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రైలు ఆగిపోవడంతో ఇరుక్కుపోయిన దాదాపు 150 మంది ప్రయాణికులను కామాఖ్య-అలీపుర్దౌర్ జంక్షన్ ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్‌లో అలీపుర్దౌర్ తీసుకెళ్లారు. అక్కడ పట్టాలను బాగుచేసిన తర్వాత ఆ మార్గంలో రైళ్ల రాకపోకలను పునరుద్ధరిస్తారు.
హెల్ప్‌లైన్ నంబర్లు
ఈ ప్రమాదం విషయంలో ఏమైనా తెలుసుకోవాలంటే రైల్వేశాఖ హెల్ప్‌లైన్ నంబర్లను ప్రకటించింది. అవి.. 9002052957, 8585082833 మరియు 03564-259935.