patnam sunitha reddy
-
Malkajgiri Lok Sabha: మల్కాజిగిరి మాదే...
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సిట్టింగ్ స్థానం.. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన ఈటల రాజేందర్ .. అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ విజయం.. ఇలా విభిన్నమైన రాజకీయ సమీకరణాలతో అందరి దృష్టి ఆకర్షిస్తోంది మల్కాజిగిరిలోక్ సభ నియోజకవర్గం. ఎంతో మంది రాజకీయ నాయకుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసిన చోట జిల్లాపరిషత్ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయాలు సాధించిన పట్నం సునీతా మహేందర్ రెడ్డి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా ఆమె ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు.. సీఎం రేవంత్‌రెడ్డి సిట్టింగ్ స్థానం నుంచి పోటీచేయడానికి అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నాను. మరో మారు ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని సీఎం చాలెంజ్‌గా తీసుకున్నారు. గతంలో ఆయన విజయానికి పనిచేసిన నేతలు, కేడర్ అంతా కలిసికట్టుగా ఏకతాటిపై పనిచేస్తున్నారు. తెలంగాణ సమాజం రేవంత్‌రెడ్డిని గట్టిగా నమ్ముతోంది. సానుకూల వాతావరణం ఉంది.. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పదేళ్ల పాటు జిల్లాపరిషత్ అధ్యక్షురాలిగా పనిచేశాను. ప్రతి మండలం, గ్రామ స్థాయిలో పారీ్టలతో సంబంధం లేకుండా అన్ని వర్గాలల అభివృద్ధికి నిధులు అందించాను. ఏ ప్రాంతానికి వెళ్లినా ప్రజలు, నాయకులు బ్రహ్మరథం పడుతున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ నుంచి నాయకులు, కార్యకర్తలు భారీగా పారీ్టలో చేరుతున్నారు. తోటి మహిళను గెలిపించుకుంటామని మహిళలంతా స్వతహాగా ముందుకొస్తున్నారు. స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా.. పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో సమస్యలపై స్పష్టమైన అవగాహన ఉంది. మహేశ్వరం, ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురిస్తే ఎల్బీ నగర్ నియోజకవర్గంలో నివాస గృహాలు మునిగిపోతున్నాయి. తక్షణం వరద సమస్య పరిష్కరించడానికి సీఎం సానుకూలంగా ఉన్నారు. ఉప్పల్, మేడ్చల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి నియోజకవర్గాలో ట్రాఫిక్, ఇతర సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మూసీ పరివాహక ప్రాంతంలో శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మల్కాజిగిరి నియోజకవర్గానికి ప్రత్యేకంగా ఒక మేనిఫెస్టో తయారు చేశాం. ఆ రెండు పార్టీల మధ్య చీకటి ఒప్పందం.. బీజేపీ, బీఆర్ఎస్ల మధ్య చీకటి ఒప్పందం నడుస్తోంది. మాజీ మంత్రి మల్లారెడ్డి బీజేపీ అభ్యర్థి రాజేందర్ మ«ధ్య జరిగిన సంభాషణే ఇందుకు సాక్ష్యం. బయట ఎన్ని మాటలు మాట్లాడినా లోలోపల వాళ్లంతా ఒక్కటే. ఎన్నికల సమయంలో పరస్పర అవగాహనతోనే ముందుకెళుతున్నారు.మోసపూరిత వాగ్దానాలను ప్రజలు నమ్మరు.. ఎన్నికలు అనగానే రాజకీయ పారీ్టలు రకాల హామీలతో ప్రజల ముందుకొస్తారు. గతంలో ఈ ప్రాంతంలో వరదలు వచ్చినపుడు అప్పటి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండిపోతే బండి ఇస్తామన్నారు. ఒక్కరినీ ఆదుకున్న పాపాన పోలేదు. ఇలాంటివి ఎన్నో హామీలు గాలికి వదిలేశారు. అందుకే ఈ సారి బీజేపీని నమ్మే పరిస్థితి కనిపించడం లేదు. ఈటల రాజేందర్ ఇక్కడి ప్రజలకు కొత్త. స్థానిక సమస్యలపై ఆయనకు అవగాహన లేదు. బీఆర్ఎస్ పట్ల ప్రజల్లో నమ్మకం పోయింది. అందుకే ఆ పార్టీ తరపున పోటీ చేయడానికే ఎవరూ ముందుకు రాలేదు.ఉప్పల్, ఎల్బీ నగర్లో ఐటీ అభివృద్ధి చేస్తాం. ఉప్పల్, ఎల్బీ నగర్ ప్రాంతాల్లో ఐటీ అభివృద్ధి చేస్తాం. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో జేఈఈ, నీట్, క్యాట్ శిక్షణ తగతులు ఏర్పాటు చేస్తాం. మౌలిక సదుపాయాలు, ఉపాధి అవకాశాల కల్పనకు తగిన చర్యలు తీసుకుంటాం. ట్రాఫిక్ ఇబ్బందులు తీర్చేందుకు పై వంతెనలు (ఫ్లై ఓవర్ బ్రిడ్జ్) నిర్మాణం, అంతర్గత రహదారులు, కాలుష్య నివారణకు తగిన చర్యలు తీసుకోవడం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇస్తాం. -
కాంగ్రెస్ గూటికి పట్నం సునీతారెడ్డి
-
ఇది ప్రజావిజయం:సునీతారెడ్డి
ఇది ప్రజా విజయం. ఉమ్మడి రాష్ట్రంలో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా నేనే ఉన్నా. కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రంలోనూ జిల్లాకు తొలి చైర్‌పర్సన్‌గా ఎన్నిక కావడం నా అదృష్టం. ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు. మారుమూల గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ పరిపాలన సాగి స్తాం. అన్ని రంగాల్లో జిల్లాను అభివృద్ధి చేయడమే లక్ష్యం. ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా.’ - పట్నం సునీతారెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లా పరిషత్ అధ్యక్ష పీఠంపై రెండు నెలలపాటు కొనసాగిన సస్పెన్స్‌కు తెరపడింది. ఆదివారం జిల్లాపరిషత్‌లో జరిగిన పరోక్ష ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన యాలాల జెడ్పీటీసీ పట్నం సునీతారెడ్డి చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. తెలుగుదేశం పార్టీకి చెందిన కుత్భుల్లాపూర్ జెడ్పీటీసీ సభ్యుడు బి.ప్రభాకర్‌రెడ్డి జెడ్పీ వైస్ చైర్మన్‌గా గెలుపొందారు. జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాల్లో అధ్యక్ష పీఠం సొంత చేసుకునే అంశంలో ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం రాలేదు. 14 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందగా, 12 స్థానాలు గెలుచుకుని టీఆర్ఎస్ రెండో వరుసలో నిలిచింది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఏడు స్థానాలను సంపాదించుకుంది. ఏ పార్టీకి మేజిక్ ఫిగర్ లేకపోవడంతో క్యాంపు రాజకీయాలకు తెరలేచింది. ఈ క్రమంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను టీఆర్ఎస్ అనుకూలంగా మలుచుకుంది. ఫలితంగా ఆదివారం నాటకీయంగా అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకుంది. అధ్యక్ష ఎన్నికలో సహకరించిన తెలుగుదేశం పార్టీకి ఉపాధ్యక్ష పీఠాన్ని కట్టబెట్టడంతో జెడ్పీ రాజకీయాలకు తెరవేసినట్లైంది. టెన్షన్.. టెన్షన్ జెడ్పీ చైర్పర్సన్, వైస్ చైర్మన్ల ఎన్నిక నేపథ్యంలో ఆదివారం ఉదయం నుంచి జిల్లా పరిషత్‌లో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. వాస్తవానికి ఈనెల 6న ఎన్నిక జరగాల్సి ఉండగా.. కోరం లేకపోవడంతో వారం రోజులపాటు ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ క్రమంలో అధ్యక్ష పీఠాన్ని దక్కించుకునేందుకు మరో వారం సమయం చిక్కడంతో అన్ని పార్టీలు తమ వ్యూహాలకు పదునుపెట్టాయి. ఈ క్రమంలో టీడీపీ సభ్యులకు ఉపాధ్యక్ష పదవిని ఎరవేస్తూ టీఆర్ఎస్ పార్టీ నెరిపిన రాజకీయ వ్యూహం ఫలించింది. కాంగ్రెస్ పార్టీకి సహకరించి పదవీకాలాన్ని పంచుకోవాలని టీడీపీ అధినాయకత్వం నిర్ణయించి చర్చలు జరిపినప్పటికీ.. మధ్యలో నెలకొన్న అవాంతరాలతో వారి మధ్య స్నేహం చిగురించలేదు. అయితే అంతర్గతంగా టీఆర్ఎస్, టీడీపీ మధ్య ఒప్పందం కుదిరినప్పటికీ.. బయటకు రానీయకుండా ఇరు పార్టీల నేతలు జాగ్రత్త పడ్డారు. ఈ క్రమంలో ఆదివారం ఎన్నిక ప్రక్రియ ఉండడంతో జెడ్పీలో హాట్ హాట్ వాతావరణం కనిపించింది. అయితే మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో జరిగిన కో-ఆప్షన్ ఎన్నికలో టీఆర్ఎస్కు టీడీపీ పూర్తి సహకారం ఇవ్వడంతో అధ్యక్ష పీఠం కూడా టీఆర్ఎస్కే దక్కనున్నట్లు స్పష్టమైంది. ఏకపక్షంగా ఎన్నిక * కో-ఆప్షన్ సభ్యులు ఎన్నికకు ఆరుగురు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. ఇద్దరు తమ నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో బరిలో నలుగురు అభ్యర్థులు నిలిచారు. ఖాజామొయినుద్దీన్, నవాజ్ ముంతాజ్, మహ్మద్ రఫీ, మీర్ మహ్మద్ అలీ ఉన్నారు. వీరిలో ఖాజామొయినుద్దీన్, మీర్ మహ్మద్‌అలీ కోఆప్షన్ సభ్యులుగా 21 మంది మద్దతుతో గెలుపొందారు. * జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం సునీతారెడ్డిని తాండూరు జెడ్పీటీసీ సభ్యుడు రవిగౌడ్ ప్రతిపాదించగా, యాచా రం జెడ్పీటీసీ రమేష్ బలపర్చారు. * కాంగ్రెస్ పార్టీ నుంచి చైర్పర్సన్ అభ్యర్థిగా ఏనుగు జంగారెడ్డిని మంచాల జెడ్పీటీసీ మహిపాల్ ప్రతిపాదించగా, శంషాబాద్ జెడ్పీటీసీ సతీష్ బలపర్చారు. * టీఆర్ఎస్ సభ్యులు 12మంది, టీడీపీ సభ్యులు ఏడుగురితోపాటు, కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఇద్దరు సునీతారెడ్డికి మద్దతు పలికారు. మొత్తంగా 21 మంది మద్దతుతో ఆమె చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జంగారెడ్డికి 12 మంది మద్దతు తెలిపారు. * వైస్ చైర్మన్‌గా టీడీపీకి చెందిన కుత్బుల్లాపూర్ జెడ్పీటీసీ ప్రభాకర్‌రెడ్డిని ఘట్కేసర్ జెడ్పీటీసీ సంజీవరెడ్డి ప్రతిపాదించగా, ఇబ్రహీంపట్నం జెడ్పీటీసీ ఐలయ్య బలపర్చారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వైస్‌చైర్మన్ అభ్యర్థిత్వం లేకపోవడం.. ఒకే అభ్యర్థి మాత్రమే పోటీ ఉండడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. వైస్ చైర్మన్‌గా ప్రభాకర్‌రెడ్డి ఎన్నికైనట్లు కలెక్టర్ శ్రీధర్ ప్రకటించారు.