ఫీజుల నియంత్రణకు ప్రాణాలే ఫణంగా
ఉతన్య పాఠశాల ఎదుట ఆందోళన
బీసీ సంక్షేమ సంఘం నేత ఆత్మహత్యాయత్నం
సంగారెడ్డిలో ఉద్రిక్తత
సంగారెడ్డి క్రైం/రూరల్ ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు పేద విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తూ నిలువు దోపిడీ చేస్తున్నాయని బీసీ సంఘం నేత గత కొన్ని సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నాడు. ఉద్యమాలు, ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టాడు. అయినా ప్రభుత్వంలోగానీ, అధికార యంత్రాంగంలోగానీ, పాఠశాలల యాజమాన్యాల్లో గానీ స్పందన రాలేదు. దీంతో తన ప్రాణాన్ని ఫణంగా పెట్టేందుకు ప్రయత్నించాడు.
పాఠశాల వద్ద ఉద్రిక్తత
బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి సిరిబాబు ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడన్న వార్త పట్టణంలో దావాణంలా వ్యాపించడంతో ఆ సంఘం నాయకులు, పలు విద్యార్థి సంఘాల నాయకులు శ్రీచైతన్య పాఠశాల వద్దకు చేరుకున్నారు. అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొన్నది. ఫీజులను నియంత్రించడంలో ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఇప్పటికైనా ఫీజులను నియంత్రించడంలో తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంఘటనా స్థలానికి సంగారెడ్డి రూరల్ ఎస్ఐ బాలస్వామి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. కాగా జిల్లాలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని గిరిజన విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేశారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి సిరిబాబు ఆత్మహత్యాయత్నానికి బాధ్యులైన శ్రీచైతన్య పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు.