pattadar passbook
-
కొత్త రెవెన్యూ చట్టం!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పట్టాదారు పాస్‌పుస్తకాల చట్టం (రికార్డ్ ఆఫ్ రైట్స్)–2020 స్థానంలో కొత్త రెవెన్యూ చట్టం రానున్నట్టు సమాచారం. ధరణి పోర్టల్ ద్వారా రైతు లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఈ చట్టం అడ్డంకిగా మారిందనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో కొత్త చట్టం ప్రవేశపెట్టాలని సర్కారు భావి స్తోందని సమాచారం. ప్రస్తుత చట్టంలోని అనేక అంశాలకు సవరణలు సూచిస్తూ, ధరణి పోర్టల్ పునర్నిర్మాణ కమిటీ 20 పేజీల ముసాయిదాను రూపొందించిందని, అయితే అన్ని సవరణలతో అతుకుల బొంత లాంటి చట్టాన్ని మను గడలో ఉంచడానికి బదులు కొత్త చట్టాన్ని తీసుకురావడమే మంచిదని ప్రభుత్వం భావించిందనే చర్చ రెవెన్యూ వర్గా ల్లో జరుగుతోంది. దీనిపై ఆర్డినెన్స్ తేవాలనే చర్చ కూడా ప్రభుత్వ వర్గాల్లో జరిగినా, అసెంబ్లీ ప్రొరోగ్ కానందున ఆర్డినెన్స్ చేసే అవకాశం లేదన్న న్యాయ నిపుణుల అభిప్రా యంతో ఆ ప్రతిపాదనను ఉపసంహరించుకున్నట్టు తెలు స్తోంది. అయితే అప్పటివరకు ధరణి దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా స్పెషల్ డ్రైవ్ ద్వారా దరఖాస్తుల పరిష్కార ప్రక్రియను ప్రభుత్వం చేపట్టిందని, అధికారాల వికేంద్రీకరణ ఉత్తర్వులిచ్చిందని సమాచారం. తహసీల్దార్లలో నైరాశ్యం అధికారాల వికేంద్రీకరణ పేరుతో ప్రభుత్వం ఇచ్చిన ఉత్త ర్వులు తహసీల్దార్లలో నైరాశ్యానికి కారణమయ్యాయి. వికేంద్రీకరణ పేరుతో కలెక్టర్లకే ఎక్కువ అధికారాలు కట్టబె ట్టారని వారంటున్నారు. గతంలో తమకు ఉన్న అధికారా లనే మళ్లీ ఇచ్చారని, వారసత్వ హక్కుల సంక్రమణ, జీపీ ఏ, ఎస్‌పీఏల ఆధారంగా పట్టాలు చేసే అధికారం ఇప్పుడు కూడా తమకే ఉందని, మళ్లీ ఆ అధికారాలనే ఇచ్చి వికేంద్రీ కరణ అంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. క్షేత్రస్థాయిలో తమ వద్ద సిబ్బంది లేరని, ఇలాంటి పరిస్థితుల్లో వారం రోజుల సమయం ఇచ్చి అన్ని దరఖాస్తులూ పరిష్కరించాలంటే ఎలా సాధ్యమనే చర్చ కూడా రెవెన్యూ వర్గాల్లో జరుగుతోంది. హడావుడిలో తప్పులు జరిగితే సమస్య మళ్లీ మొదటి కొచ్చినట్టే కదా అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. వికేంద్రీకరణ తాత్కాలికమే! అయితే ప్రస్తుతం చేపట్టిన అధికార వికేంద్రీకరణ, స్పెషల్ డ్రైవ్‌లు తాత్కాలికమేనని ప్రభుత్వ వర్గాలంటున్నాయి. ధర ణి కమిటీ సూచన మేరకు తాత్కాలికంగానే ఈ ఏర్పాట్లు చేశామని, కొత్త ఆర్వోఆర్ చట్టంలో అధికార వికేంద్రీకరణ కు చట్టబద్ధత కల్పిస్తామని రెవెన్యూ ఉన్నతాధికారులు చెబు తున్నారు. మరోవైపు కలెక్టర్లు తీసుకునే నిర్ణయాలను కూడా తెలంగాణ ల్యాండ్ రెవెన్యూ యాక్ట్–1908లోని 166బీ నిబంధన ప్రకారం సవాల్ చేయవచ్చని అంటున్నారు. ప్రస్తుతం చేసిన అధికారాల పంపిణీ కూడా తాత్కాలికమేనని, ఆర్వో ఆర్ కొత్త చట్టంలో పకడ్బందీగా వికేంద్రీకరణ ఉంటుందని పేర్కొంటున్నారు. తహశీల్దార్లకు అధికారాల విస్తృత పంపిణీ అవకాశం ప్రస్తుతానికి లేదని ప్రభుత్వ వర్గాలు వివరిస్తున్నా యి. అయితే ధరణి దరఖాస్తుల పరిష్కారంలో తహశీల్దార్ నివేదికలే ప్రాతిపదికలని, ఆ నివేదికల ఆధారంగానే ఉన్న తాధికారులు దరఖాస్తులను పరిష్కరిస్తారని ధరణి కమిటీ సభ్యుడొకరు చెప్పారు. ఈ మేరకు తహశీల్దార్లు క్రియాశీల పాత్ర పోషించాల్సి ఉంటుందని, గతంలో మాదిరి కాకుండా దరఖాస్తుల ఆమోదం, తిరస్కారం కోసం కచ్చితంగా కార ణాలతో కూడిన రాతపూర్వక ఉత్తర్వులివ్వాల్సి ఉంటుందని వెల్లడించారు. ధరణి దరఖాస్తుల పరిష్కారంలో ఎవరైనా రైతులు తమకు నష్టం కలిగిందని భావిస్తే రెవెన్యూ అధికారు లిచ్చే రాతపూర్వక ఉత్తర్వులపై కోర్టులను ఆశ్రయించే వెసులుబాటు ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈనెల 1వ తేదీనుంచి 9వ తేదీ వరకు నిర్వహించే స్పెషల్ డ్రైవ్‌తో ధరణి దరఖాస్తుల ప్రక్రియ నిలిచిపోదని, ఈ డ్రైవ్‌లో తీసుకున్న నిర్ణయాలను సవాల్ చేస్తూ కూడా మరోమారు ధరణి పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని, ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని రెవెన్యూ వర్గాలు చెపుతున్నాయి. -
'రైతులకు నష్టం కలిగించేలా వ్యవహరించొద్దు'
హైదరాబాద్ : పాస్ బుక్, టైటిల్ డీడ్ లేకుండా భూముల హక్కుల బదలాయింపు నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని టీడీపీ ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం అధ్యక్షుడు నాగిరెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం హైదరాబాద్‌లో నాగిరెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ... ప్రభుత్వం నిర్ణయం వల్ల ప్రమాదకర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు సర్కార్ నిర్ణయం వల్ల ప్రభుత్వ భూములన్నీ అన్యాక్రాంతం అయ్యే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోవాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. అలా కాని పక్షంలో రైతు సంఘాలతో కలసి ఉద్యమిస్తామని నాగిరెడ్డి హెచ్చరించారు. రైతులకు నష్టం కలిగించే నిర్ణయంపై మొండిగా వ్యవహరించ వద్దని టీడీపీ ప్రభుత్వానికి నాగిరెడ్డి హితవు పలికారు. -
ఈ-పాస్‌బుక్ విధానంతో రైతులకు తీవ్రనష్టం
హైదరాబాద్ : పట్టాదారు పాసు పుస్తకాల రద్దు నిర్ణయం సరైంది కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి అభిప్రాయపడ్డారు. ఆయన సోమవారమిక్కడ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ఈ-పాస్బుక్లంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్త విధానాన్ని తీసుకొస్తున్నారని, ఈ విధానంతో రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని అభ్యంతరం వ్యక్తం చేశారు. పాస్ పుస్తకాల స్థానంలో ప్రవేశపెడుతున్న ఈ-పాస్‌బుక్ విధానంతో ఎలాంటి ఫలితం ఉండదన్నారు. రైతులకు తెలియకుండా వారి భూములు మరొకరికి బదలాయించే అవకాశం ఉంటుందని నాగిరెడ్డి పేర్కొన్నారు. అవగాహన లేకుండా జీవోలు జారీ చేయటం సరైన పద్ధతి కాదన్నారు. కనుక తక్షణమే ఈ పాస్‌బుక్ విధానాన్ని ఉపసంహరించుకోవాలని నాగిరెడ్డి డిమాండ్ చేశారు. -
'సాయం చేయబోయి ప్రాణాలమీదికి తెచ్చుకున్నాడు'
మెదక్: పట్టాదారు పాస్‌బుక్‌లు తనఖా పెట్టి ట్రాక్టర్ ఇప్పించి సాయం చేసిన ఓ రైతు చివరకు తన ప్రాణాన్నే కోల్పోవాల్సి వచ్చింది. పోలీసుల నిర్లక్ష్యం వల్లే దాసయ్య ఆత్మహత్య చేసుకున్నాడంటూ మృతుడి బంధువులు ఆందోళనకు దిగారు. ఈ సంఘటన మెదక్ జిల్లా పాపన్నపేట మండలం మిన్పూర్ గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన గోదారి దాసయ్య (45) అదే గ్రామానికి చెందిన తన మిత్రుడైన పెద్ద పాపన్నగారి సాయిలుకు 2011లో పట్టాదార్ పాస్ బుక్‌లు తనఖా పెట్టి రుణంతో ట్రాక్టర్ ఇప్పించాడు. ఇందుకు ప్రతిగా ఐదేళ్లు సాయిలు తన పొలాన్ని ఉచితంగా దున్ని ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నారు. కొంతకాలం ఒప్పందం అమలైనప్పటికీ రెండేళ్ల నుంచి సాయిలు పొలం దున్నడం మానేశాడు. దీంతో ఆగ్రహించిన దాసయ్య సాయిలుకు చెందిన ట్రాక్టర్ ట్రాలీ తీసుకెళ్లి తన పొలం వద్ద పెట్టుకున్నాడు. అనంతరం సాయిలు గుట్టు చప్పుడు కాకుండా దాసయ్య పొలం వద్ద ఉన్న ట్రాలీని ఎత్తుకెళ్లి నిజామాబాద్ జిల్లాలో అమ్ముకున్నాడు. పైగా తన ట్రాలీ తనకివ్వాలంటూ దాసయ్యపై ఒత్తిడి తెచ్చాడు. దీంతో దాసయ్య మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో ఊరూ.. పల్లెపల్లెల వెంట తిరిగి చివరకు నిజామాబాద్‌లో సాయిలు అమ్ముకున్న ట్రాలీని పట్టుకున్నాడు. అనంతరం మిన్పూర్ గ్రామంలో ఈ విషయమై పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించారు. కాగా ట్రాలీని వెతకడానికి దాసయ్యకు అయిన ఖర్చుతోపాటు జరిమానా కింద రూ.50 వేలను సాయిలు చెల్లించాలని పెద్దలు తీర్పునిచ్చారు. ఈ మేరకు అంగీకరించిన సాయిలు ఎంతకు డబ్బులు చెల్లించక పోవడంతో మూడు నెలల క్రితం దాసయ్య పాపన్నపేట పోలీసులను ఆశ్రయించాడు. అప్పట్లో సాయిలు మేనల్లుడు మల్లికార్జున్ ఈ డబ్బులు ఇస్తామని పోలీస్ స్టేషన్లో ఒప్పుకున్నాడు. ఈ మేరకు గత ఫిబ్రవరి 8న వాయిదాకు డబ్బులు చెల్లించాల్సి ఉంది. వాయిదా దాటిపోయినప్పటికీ డబ్బులు ఇవ్వకపోవడంతో ఆందోళనకు గురైన గోదారి దాసయ్య శుక్రవారం మిన్పూర్ శివారులోని సాయిలు మేనమామ లింగయ్య పొలం వద్ద చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు దాసయ్యకు భార్య భూమవ్వ, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. పోలీసుల నిర్లక్ష్యమేనంటూ ఆందోళన : పోలీసుల నిర్లక్ష్యం వల్లే దాసయ్య ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందని ఆరోపిస్తూ బాధిత బంధువులు శుక్రవారం ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేసే వరకు మృతదేహాన్ని చెట్టు పైనుంచి కిందకు దించనివ్వబోమంటూ భీష్మించారు. విషయం తెలుసుకున్న మెదక్ రూరల్ సీఐ రామకృష్ణ సంఘటనా స్థలానికి చేరుకుని మృతుడి బంధువులతో మాట్లాడారు. ఈ సంఘటనలో పోలీసులు, సాయిలు పాత్రలపై విచారణ జరిపి న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. దాసయ్య బంధువులు పెద్ద పాపన్నగారి సాయిలు, అతని అల్లుడు మల్లికార్జున్, మేనమామ లింగయ్యపై ఫిర్యాదు చేయగా ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామని సీఐ రామకృష్ణ తెలిపారు. (పాపన్నపేట)