'సాయం చేయబోయి ప్రాణాలమీదికి తెచ్చుకున్నాడు' | a former committed suicide of helping other former | Sakshi
Sakshi News home page

'సాయం చేయబోయి ప్రాణాలమీదికి తెచ్చుకున్నాడు'

Published Fri, Mar 13 2015 9:14 PM | Last Updated on Sat, Sep 2 2017 10:47 PM

'సాయం చేయబోయి ప్రాణాలమీదికి తెచ్చుకున్నాడు'

'సాయం చేయబోయి ప్రాణాలమీదికి తెచ్చుకున్నాడు'

మెదక్: పట్టాదారు పాస్‌బుక్‌లు తనఖా పెట్టి ట్రాక్టర్ ఇప్పించి సాయం చేసిన ఓ రైతు చివరకు తన ప్రాణాన్నే కోల్పోవాల్సి వచ్చింది. పోలీసుల నిర్లక్ష్యం వల్లే దాసయ్య ఆత్మహత్య చేసుకున్నాడంటూ మృతుడి బంధువులు ఆందోళనకు దిగారు. ఈ సంఘటన మెదక్ జిల్లా పాపన్నపేట మండలం మిన్‌పూర్ గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన గోదారి దాసయ్య (45) అదే గ్రామానికి చెందిన తన మిత్రుడైన పెద్ద పాపన్నగారి సాయిలుకు 2011లో పట్టాదార్ పాస్ బుక్‌లు తనఖా పెట్టి రుణంతో ట్రాక్టర్ ఇప్పించాడు. ఇందుకు ప్రతిగా ఐదేళ్లు సాయిలు తన పొలాన్ని ఉచితంగా దున్ని ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నారు. కొంతకాలం ఒప్పందం అమలైనప్పటికీ రెండేళ్ల నుంచి సాయిలు పొలం దున్నడం మానేశాడు. దీంతో ఆగ్రహించిన దాసయ్య సాయిలుకు చెందిన ట్రాక్టర్ ట్రాలీ తీసుకెళ్లి తన పొలం వద్ద పెట్టుకున్నాడు. అనంతరం సాయిలు గుట్టు చప్పుడు కాకుండా దాసయ్య పొలం వద్ద ఉన్న ట్రాలీని ఎత్తుకెళ్లి నిజామాబాద్ జిల్లాలో అమ్ముకున్నాడు. పైగా తన ట్రాలీ తనకివ్వాలంటూ దాసయ్యపై ఒత్తిడి తెచ్చాడు. దీంతో దాసయ్య మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో ఊరూ.. పల్లెపల్లెల వెంట తిరిగి చివరకు నిజామాబాద్‌లో సాయిలు అమ్ముకున్న ట్రాలీని పట్టుకున్నాడు. అనంతరం మిన్‌పూర్ గ్రామంలో ఈ విషయమై పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించారు.

కాగా ట్రాలీని వెతకడానికి దాసయ్యకు అయిన ఖర్చుతోపాటు జరిమానా కింద రూ.50 వేలను సాయిలు చెల్లించాలని పెద్దలు తీర్పునిచ్చారు. ఈ మేరకు అంగీకరించిన సాయిలు ఎంతకు డబ్బులు చెల్లించక పోవడంతో మూడు నెలల క్రితం దాసయ్య పాపన్నపేట పోలీసులను ఆశ్రయించాడు. అప్పట్లో సాయిలు మేనల్లుడు మల్లికార్జున్ ఈ డబ్బులు ఇస్తామని పోలీస్ స్టేషన్‌లో ఒప్పుకున్నాడు. ఈ మేరకు గత ఫిబ్రవరి 8న వాయిదాకు డబ్బులు చెల్లించాల్సి ఉంది. వాయిదా దాటిపోయినప్పటికీ డబ్బులు ఇవ్వకపోవడంతో ఆందోళనకు గురైన గోదారి దాసయ్య శుక్రవారం మిన్‌పూర్ శివారులోని సాయిలు మేనమామ లింగయ్య పొలం వద్ద చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు దాసయ్యకు భార్య భూమవ్వ, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.
పోలీసుల నిర్లక్ష్యమేనంటూ ఆందోళన : పోలీసుల నిర్లక్ష్యం వల్లే దాసయ్య ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందని ఆరోపిస్తూ బాధిత బంధువులు శుక్రవారం ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేసే వరకు మృతదేహాన్ని చెట్టు పైనుంచి కిందకు దించనివ్వబోమంటూ భీష్మించారు. విషయం తెలుసుకున్న మెదక్ రూరల్ సీఐ రామకృష్ణ సంఘటనా స్థలానికి చేరుకుని మృతుడి బంధువులతో మాట్లాడారు. ఈ సంఘటనలో పోలీసులు, సాయిలు పాత్రలపై విచారణ జరిపి న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. దాసయ్య బంధువులు పెద్ద పాపన్నగారి సాయిలు, అతని అల్లుడు మల్లికార్జున్, మేనమామ లింగయ్యపై ఫిర్యాదు చేయగా ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామని సీఐ రామకృష్ణ తెలిపారు.
(పాపన్నపేట)
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement