నిప్పు రాజేసిన ‘ చేపల చెరువు లీజు’
ప్రత్తికోళ్లలంక (ఏలూరు రూరల్) : చేపల చెరువుల లీజు వ్యవహారం కొల్లేరు గ్రామం ప్రత్తికోళ్లలంకలో మరోసారి నిప్పు రాజేసింది. గ్రామంలో రెండు వర్గాల మధ్య తగాదా జరగడంతో పోలీసులు పికెటింగ్ ఏర్పాటుచేశారు. ఇద్దరు సీఐలు, నలుగురు ఎస్సైలతో పాటు పదుల సంఖ్యలో పోలీసులు గ్రామంలో గస్తీ తిరుగుతున్నారు. గ్రామస్తుల మధ్య వివాదానికి టీడీపీ నాయకులు కేంద్ర బిందువుగా నిలిచారు. గ్రా మంలో 261 ఎకరాల వివాదస్పద చేపల చెరువులు ఉన్నా యి. వీటిలో చేపలు పట్టరాదంటూ హైకోర్టు రెండేళ్ల క్రితం ఉత్తర్వులు జారీచేసింది. వీటిని బేఖాతరు చేస్తూ కొద్దిరోజుల క్రితం టీడీపీ నాయకులు కోట్ల రూపాయల విలువ చేసే చేప లు పట్టి అమ్మేశారు. అధికారులూ చూసీచూడనట్టు వ్యవహరించారు. ఈ నేపథ్యంలో చెరువులను మళ్లీ కొత్తగా వేలం వేసేందుకు టీడీపీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిని కొందరు గ్రామస్తులు వ్యతిరేకించారు. వీరిని అధికారపార్టీకి చెందిన వారు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఎలాగైన చెరువుల వేలం నిర్వహించాలని భావించిన అధికార పార్టీ నేతలు పోలీసులను ఉసిగొల్పారు. శనివారం స్థానిక ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సమక్షంలో వేలం పా ట జరిగింది. దీనిని వ్యతిరేకిస్తున్న గ్రామస్తులను పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు.