‘మండలి’లో టీడీపీ సెల్ఫ్‌గోల్
సాక్షి, అమరావతి: గత వైఎస్ జగన్ ప్రభుత్వం రాష్ట్ర సచివాలయ భవనాలను తాకట్టు పెట్టేసిందంటూ ‘మండలి’లో టీడీపీ ప్రశ్న వేసి సెల్ఫ్‌గోల్ చేసుకుంది. 2019–24 మధ్య రాష్ట్ర సచివాలయ భవనాలు తాకట్టు పెట్టిన విషయం వాస్తవమేనా అని టీడీపీ ఎమ్మెల్సీలు భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి, పరుచూరి అశోక్‌బాబు, దువ్వారపు రామారావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనికి.. సీఎం చంద్రబాబు తరఫున మంత్రులు బుధవారం ‘మండలి’లో సమాధానం ఇవ్వాల్సి ఉండగా, సభ్యులు ప్రశ్నను ఉపసంహరించుకున్నారని ప్రకటించారు. పరువుపోతుందని విత్‌డ్రా ‘మండలి’లో బుధవారం ఈ ప్రశ్న పోస్ట్ అవడంతో ప్రభుత్వం ఇచ్చే సమాధానం ఆధారంగా అనుబంధ ప్రశ్నలు వేయడంతో పాటు, గత ప్రభుత్వంపై బురద జల్లడానికి వీలుగా టీడీపీ ఎమ్మెల్సీలు సిద్ధమైనట్లు తెలిసింది. పైగా ఆ పత్రికలో ప్రచురించిన తప్పుడు కథనం తాలూకు ప్రతులను సైతం వెంటబెట్టుకుని వచ్చారు. అయితే, ఈ ఆరోపణలు అవాస్తవమని ప్రభుత్వం ‘మండలి’కి సమాధానం ఇచ్చినట్లు సమాచారం. దీంతో.. టీడీపీ నేతలు, ప్రభుత్వ పెద్దల గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లైంది. ఈ అంశంపై యథావిధిగా సమాధానమిస్తే తమ పరువే పోతుందని ప్రభుత్వ పెద్దలు భావించారో ఏమో.. ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా, సభ్యులే ప్రశ్నను విరమించుకున్నారని ప్రకటించారు. వాస్తవాలు పరిశీలిస్తే.. రూ.370 కోట్లకు రాష్ట్ర సచివాలయ భవనాలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం తాకట్టు పెట్టిందని ‘తాకట్టులో సచివాలయం’ అంటూ గతేడాది మార్చి 3న బూతు పత్రిక ఓ తప్పుడు కథనం ప్రచురించింది. ఈ కథనం అవాస్తమని హెచ్డీఎఫ్సీ బ్యాంకు ప్రతినిధులు అప్పట్లోనే కొట్టిపారేశారు. అయినా, ఇదే అంశంపై శాసన మండలిలో టీడీపీ ప్రశ్నవేసి తోక ముడిచింది.