payments hike
-
డిజిటల్ చెల్లింపుల్లో 90 శాతం వాటా యూపీఐదే
న్యూఢిల్లీ: దేశీయంగా ఏకీకృత చెల్లింపుల విధానం (యూపీఐ)లో లావాదేవీలు క్రమంగా పెరుగుతున్నాయి. ఇవి 2026–27 నాటికి రిటైల్ డిజిటల్ చెల్లింపుల్లో 90 శాతం వాటా ఆక్రమించనున్నాయి. రోజుకు 100 కోట్ల స్థాయికి చేరనున్నాయి. పీడబ్ల్యూసీ ఇండియా ఒక నివేదికలో ఈ అంశాలు వెల్లడించింది. దీని ప్రకారం 2022–23లో రిటైల్ సెగ్మెంట్లో మొత్తం లావాదేవీల పరిమాణంలో యూపీఐ లావాదేవీల వాటా 75 శాతంగా ఉంది. దేశీయంగా మొత్తం డిజిటల్ పేమెంట్స్ మార్కెట్ ఏటా 50 శాతం (పరిమాణం పరంగా) పెరుగుతూ వస్తోంది. ఇది 2022–23లో 103 బిలియన్ లావాదేవీల స్థాయిలో ఉండగా 2026–27 నాటికి 411 బిలియన్ లావాదేవీలకు చేరనుంది. ఇందులో ప్రస్తుతం యూపీఐ లావాదేవీలు 83.71 బిలియన్లుగా ఉండగా అప్పటికి 379 బిలియన్లకు (రోజుకు దాదాపు 1 బిలియన్) చేరతాయని పీడబ్ల్యూసీ ఇండియా నివేదికలో వివరించింది. నివేదికలో మరిన్ని విశేషాలు.. ► క్రెడిట్ కార్డ్ సెగ్మెంట్ మెరుగ్గా వృద్ధి చెందుతోంది. 2024–25 నాటికి డెబిట్ కార్డు లావాదేవీలను మించనుంది. ► క్రెడిట్ కార్డుల జారీ వచ్చే అయిదేళ్లలో 21 శాతం మేర వృద్ధి చెందనుండగా.. డెబిట్ కార్డుల జారీ మాత్రం స్థిరంగా 3 శాతం స్థాయిలోనే కొనసాగనుంది. డెబిట్ కార్డును ఎక్కువగా నగదు విత్‌డ్రాయల్‌కే ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు యూపీఐతో కూడా విత్‌డ్రా చేసుకునే వీలుండటంతో డెబిట్ కార్డుల వినియోగం తగ్గనుంది. ► 2022–23లో బ్యాంకులు, ఫిన్‌టెక్, నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలకు కార్డుల ద్వారా వచ్చిన మొత్తం ఆదాయంలో క్రెడిట్ కార్డుల వ్యాపారం వాటా 76 శాతంగా ఉంది. దీంతో ఆయా సంస్థలకు ఇది ఆకర్షణీయమైన వ్యాపారంగానే కొనసాగనుంది. 2021–22తో పోలిస్తే 2022–23లో క్రెడిట్ కార్డుల జారీ ద్వారా ఆదాయం 42 శాతం పెరిగింది. వచ్చే అయిదేళ్లలో ఇది వార్షికంగా 33 శాతం వృద్ధి చెందనుంది. -
ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లకు రికార్డు వేతనాలు
కాన్బెర్రా: ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లు దేశంలోనే అత్యధిక ఆదాయం పొందుతున్న క్రీడాకారిణులుగా రికార్డుల కెక్కనున్నారు. ఆ దేశ క్రికెట్ సంఘం క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) మహిళా క్రికెటర్లకు భారీగా జీత భత్యాలను పెంచింది. ప్రస్తుతం సంవత్సరానికి 1.8 మిలియన్ ఆస్ట్ర్రేలియన్ డాలర్లుగా ఉన్న వీరి ఆదాయం త్వరలో 3.2 మిలియన్లకు చేరనుంది. దీంతో టాప్ లిస్ట్‌లో ఉన్న మహిళా క్రికెటర్లు దాదాపు ఆరు రెట్లు, తర్వాతి స్థానాల్లో ఉన్న క్రికెటర్లకు రెండు రెట్లు అధిక జీతాలను అందుకోనున్నారు. మరే ఇతర క్రీడల్లోనూ ఇంత పెద్ద మొత్తంలో క్రీడాకారిణులకు జీతభత్యాలు లేవు. దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మహిళా క్రికెటర్లకు 37,000 నుంచి 50,000 ఆస్ట్రేలియన్ డాలర్లకు జీతాలను పెంచారు. మహిళ బిగ్ బాష్ లీగ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న వారికి 12,000 ఆస్టేలియన్ డాలర్లకు పెంచారు. ఆస్ట్రేలియా తరపు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తమ ప్లేయర్లకు 62,000 ఆస్ట్రేలియన్ డాలర్లతో పాటు రవాణా ఖర్చులు, టూర్ ఛార్జీలను అదనంగా సీఏ భరించనుంది. సాధారణ మహిళా క్రికెటర్లకు సైతం 14,000 నుంచి 30,000 ఆస్ట్రేలియన్ డాలర్లకు సంవత్సర ఆదాయాన్ని పెంచింది క్రికెట్ ఆస్ట్ర్రేలియా. క్రికెట్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచి ప్రతిభను ప్రోత్సహించేందుకే జీతభత్యాలు భారీగా పెంచుతున్నట్టు క్రికెట్ ఆస్ట్రేలియా సీఈవో జేమ్స్ సదర్లాండ్ వివరించారు. రాబోయే కాలంలో సీఏ మరింతగా మహిళలను ప్రోత్సహించనున్నట్లు తెలిపారు. మహిళలు క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకునే విధంగా సీఏ పనిచేస్తుందని అన్నారు.