ఎమ్మెల్యేపై దాడి.. పరిస్థితి విషమం
శ్రీనగర్: జమ్ము కశ్మీర్ లో అధికార పీడీపీ ఎమ్మెల్యేపై దాడి జరిగింది. తప్పించుకునే క్రమంలో తీవ్రంగా గాయపడిన ఎమ్మెల్యేను ఆర్మీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉంది. పుల్వామా ఎమ్మెల్యే మహ్మద్ ఖలీద్ బంధ్ ఆదివారం రాత్రి శ్రీనగర్ వెళ్తుండగా ఆయన కారుపై ఆందోళనకారులు రాళ్లతో దాడిచేశారు. దాడి నుంచి తప్పించుకునేందుకు డ్రైవర్ కారును వేగంగా నడిపాడు. దీంతో కారు పల్టీలు కొట్టింది.
ఈ ప్రమాదంలో ఖలీద్ తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ఆర్మీ ఆస్పత్రికి చేరుకుని ఆయనను పరామర్శించారు. పలువురు అధికారపార్టీ నేతలపై ఆందోళనకారులు దాడులకు దిగుతున్నారు. హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది బర్హాన్ వనీ ఎన్ కౌంటర్ అనంతరం గడిచిన 11 రోజులుగా ఆ రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. ఈ అల్లర్లలో ఇప్పటి వరకు 39 మంది మృతి చెందగా 3,100 మంది గాయపడ్డారు.