Europe : వలసల వలలో యూరప్
యూరప్ ను వలసలు చుట్టుముట్టేస్తున్నాయి. ఈ ఖండంలోని చాలా దేశాలు విలవిలలాడిపోతున్నాయి. ప్రభుత్వాలు కూలిపోతున్నాయి. అల్లర్లు,నేరాలు,ఘోరాలు,అశాంతి ఆ దేశాలను అల్లకల్లోలం చేస్తున్నాయి.వీటికి పరిష్కారం లభించకపోగా,మరింత రగిలే ప్రమాదఘంటికలే వినిపిస్తున్నాయి. వలసలు ఏ ఖండానికి,ఏ దేశానికి కొత్తకాదు.ఇతర దేశాల నుంచి అక్రమంగా వలస వచ్చినవారితోనూ, సక్రమంగా వలస వచ్చినవారితోనూ సమస్యలు పెరుగుతూనే వున్నాయి.భారతదేశం కూడా అందుకు మినహాయింపు కాదు.
వలసలతో అశాంతి
ప్రస్తుత అంశం యూరప్ విషయానికి వస్తే, వలసలు ప్రబలి,రోజుకొకరకమైన దుర్వార్త అక్కడి నుంచి వినాల్సివస్తోంది.ఇప్పటికే ఫ్రాన్స్ లో అల్లర్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. నెదర్లాండ్ లో ప్రభుత్వమే కూలిపోయింది.స్వీడన్ లో ఘర్షణలు లేని రోజంటూ లేదు. స్విట్జర్లాండ్ లో అశాంతి రాజ్యమేలుతోంది. బెల్జియం,జర్ననీలో అల్లర్లు,నేరాలుఘోరాలకు అదుపే లేదు.మానవతా దృక్పధంతో శరణు ఇచ్చినందుకు యూరప్ మొత్తం మూల్యం చెల్లించాల్సి వస్తోంది.శరణుకోరి ఆయా దేశాలలో ప్రవేశించినవారి సంఖ్య కోట్లకు చేరుకుంది.వీరంతా మిగిలిన సామాజిక సమస్యలను సృష్టించడమే గాక,రాజకీయాలను ప్రభావితం చేస్తున్నారు.ప్రభుత్వాల మనుగడే ప్రశ్నార్ధకమవుతోంది.
శరణార్థుల దారి యూరపే.!
యుద్ధాలు, అంతర్యుద్ధాల కారణంతో యుగొస్లావియా, ఉక్రెయిన్,సిరియా,ఆఫ్ఘనిస్థాన్ మొదలైన దేశాలలో బాధపడేవారు యూరప్ దేశాల వైపు వస్తున్నారు. అతి ప్రమాదకరమైన విధానాల్లో సముద్ర ప్రయాణాలు చేస్తూ, కొందరు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు.ముఖ్యంగా 2015లో వలసలు పెద్దఎత్తున పోటెత్తాయి.ఆ సంవత్సరాన్ని 'వలసల సంవత్సరం'గా అభివర్ణించారు.2007-2011మధ్య కూడా వలసలు పెద్ద సంఖ్యలోనే జరిగాయి.ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదం పెరగడం కూడా వలసలపైన కీలక ప్రభావం చూపించింది, ఇంకా చూపిస్తూనే వుంది.
లక్షల మంది వలస
2022నాటికి వలస వచ్చిన జనాభా చూస్తే, జర్మనీలో 10.9మిలియన్లు, స్పెయిన్ లో 5.4మిలియన్లు, ఫ్రాన్స్ లో 5.3మిలియన్లు,ఇటలీలో 5మిలియన్లు ఉన్నట్లు సమాచారం. ఒక్క 2022లోనే యూరోపియన్ యూనియన్ లో ఆశ్రమం కోరిన వారి సంఖ్య 6,32,430.అందులో ఆమోదం పొందిన వారి సంఖ్య 3.10 లక్షలు.ఇన్నేళ్ల పాటు వచ్చినవారు,వస్తున్నవారిలో అధికారికంగా కంటే అనధికారికంగా వచ్చిన వారి సంఖ్య అంచనాలకు మించి వుంటుంది. లక్షల్లో వలసవస్తున్న వీరిని కొన్ని దేశాలు అడ్డుకుంటున్నాయి. జర్మనీ వంటికొన్ని దేశాలు మాత్రం ఆదుకుంటున్నాయి.
నాటి పాపం నేడు అనుభవిస్తున్నారు
పశ్చిమాసియా, దక్షిణాసియా, ఆఫ్రికా నుంచి పెద్దసంఖ్యలో వలసలు జరిగాయి. అరబ్ విప్లవం తర్వాత టునీసియా, లిబియా,ఈజిప్ట్,యెమెన్, అల్జీరియా వంటి దేశాల నుంచి వలసలు వెల్లువెత్తాయి. చట్టవిరుద్ధంగా ప్రవేశించినవారిలో ఎక్కువమంది గ్రీస్ ద్వారా వెళ్లినట్లు తెలుస్తోంది.వలసల ప్రభావం ఆర్ధిక, సామాజిక,రాజకీయ వ్యవస్థలపై పడుతోంది.నివాసం,ఉపాధి కల్పించడం ప్రభుత్వాలకు పెనుసమస్యగా మారింది. వివిధ సమాజాల మధ్య సాంస్కృతిక ప్రయాణం పెద్దసవాల్ విసురుతోంది. ప్రస్తుతం యూరప్ లో ప్రముఖంగా కనిపిస్తున్న ఈ జాఢ్యం మిగిలిన ఖండాలలోనూ రేపోమాపో శృతిమించకపోదు.
సున్నితం.. కీలకం
భిన్న సంస్కృతులకు, మతాలకు నిలయమై,అనేక దాడులకు ఆలవాలమై,ప్రపంచంలోనే అతిపెద్ద దేశంగా అవతరిస్తున్న భారతదేశం వలసల విషయంలో,ముఖ్యంగా మిగిలిన దేశాల నుంచి అక్రమంగా చొరబడిన వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. యూరప్ వలసల అంశంపై ప్రపంచ దేశాధినేతలు దృష్టి పెట్టాలి. ఆయా దేశాల అంతర్గత సమస్యలను అరికట్టడంలోనూ, మతోన్మాద ఉగ్రవాదం ప్రబలకుండా చూడడంలోనూ అందరూ కలిసి సాగాలి.యూరప్ అనుభవాలు మిగిలిన ఖండాలకు పెద్దగుణపాఠం కావాలి.
- మాశర్మ, సీనియర్ జర్నలిస్టు