సెప్టెంబర్‌లో కొత్త పారిశ్రామిక విధానం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సర్వీసు ఇండస్ట్రీకి హైదరాబాద్ హబ్‌గా మారిందని, మరిన్ని ఇన్నోవేషన్, ప్రోడక్ట్ కంపెనీలు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని తెలంగాణ రాష్ట్ర ఐటీ పంచాయితీ రాజ్ శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సింగపూర్ పర్యటన అనంతరం కొత్త పారిశ్రామిక విధానాన్ని ప్రకటిస్తామని, ఇందుకోసం టాటా, ఆదాని, కొకోకోలా వంటి కంపెనీ ప్రతినిధుల నుంచి సూచనలు సలహాలు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. కొత్త పరిశ్రమలను ఆకర్షించే విధంగా ఈ నూతన పారిశ్రామిక విధానం ఉంటుందన్నారు.
అలాగే ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీల అభివృద్ధికోసం ప్రత్యేకంగా ఐటీ పాలసీని కూడా రూపొందిస్తున్నామని, పారిశ్రామిక విధానం వెలువడిన తర్వాత కొత్త ఐటీ విధానాన్ని ప్రకటిస్తామన్నారు. గత రెండు నెలల నుంచి ఐటీ, మాన్యుఫాక్చరింగ్, ఫుడ్ ప్రోసెసింగ్ పరిశ్రమలపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నట్లు తెలిపారు. అక్టోబర్‌లో జరగనున్న పెగా డెవలపర్స్ కాన్ఫెరెన్స్ వివరాలను తెలియచేయడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పలు అంతర్జాతీయ సదస్సులకు హైదరాబాద్ వేదికగా మారిందన్నారు.
అక్టోబర్ 12, 13 తేదీల్లో నిర్వహించే ఈ సదస్సుకు సుమారు 3,000 మంది పాల్గొనే అవకాశం ఉందని, గతేడాది ఈ సదస్సుకు 1,500 మంది హజరయ్యారన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెగా సిస్టమ్స్ మేనేజింగ్ డెరైక్టర్ సుమన్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం దేశంలో 12,000 మంది డిజైనర్లు, డెవలపర్స్‌కి డిమాండ్ ఉందని, వచ్చే నాలుగేళ్లలో ఈ సంఖ్య 50,000కి చేరుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.