పెండింగ్‌కు సర్కారు బాసట
* ప్రాజెక్టుల పూర్తికి ఆర్థిక శాఖ మద్దతు
* నీటి పారుదల శాఖ వినతికి సుముఖం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సాగునీటి పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి తమవంతు సహాయం అందించేందుకు ఆర్థిక శాఖ సమ్మతించింది. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో నిలిచిపోయిన పనులకు మద్దతుగా నిలవడంతో పాటు, జిల్లాలో 2,500 ఎకరాల భూసేకరణకు అవసరమైన రూ.100కోట్ల నిధులను ఇచ్చేందుకు అంగీకరించింది.
పెండింగ్‌లో ఉన్న ఇరిగేషన్ శాఖ ఫైళ్ల పరిష్కార విషయమై మంగళవారం ఆ శాఖ మంత్రి హరీశ్‌రావు ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌తో సచివాలయంలో సమావేశమయ్యారు. మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులు సైతం హాజరయ్యారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యంవల్ల జైకా, నాబార్డ్, ట్రిపుల్ ఆర్, ఏఐబీపీ, ఎస్సీపీ నిధులతో జరగాల్సిన 96 సాగునీటి పథకాల పనులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటికి నిధులు కేటాయించాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ పథకాలను పూర్తి చేస్తే 96వేల ఎకరాల ఆయకట్టు వృద్ధిలోకి వస్తుందని, వీటికి అవసరమైన భూసేకరణకు నిధులు మంజూరు చేస్తే వచ్చే ఖరీఫ్ నాటికి రైతులకు మేలు జరుగుతుందని తెలిపారు. ఆగిపోయిన పనులకు కాంట్రాక్టులను రద్దు చేసే అధికారాన్ని చీఫ్ ఇంజనీర్లకు కట్టబెట్టాలనే ప్రతిపాదనకు ఆర్థిక శాఖ అంగీకారం తెలిపింది. మిగిలిన పనులను కొత్తరేట్లతో అంచనాలు సిద్ధం చేసి టెండర్లు పిలవాలని, వీటికి ప్రభుత్వం ఆమోదం తెలిపిన వెంటనే ఒప్పందాలు చేసుకొని పనులు ఆరంభించాలని సమావేశంలో నిర్ణయించారు.
వీటితో పాటే ప్రైస్ ఎస్కలేషన్ జీవో ఆర్థిక శాఖ వద్దకు రాగానే క్లియర్ చేయాలని, తోటపల్లి రిజర్వాయర్ టెండర్ రద్దు ప్రతిపాదన ఫైల్‌కు ఆమోదం తెలపాలని కోరగా అందుకు సానుకూలత వ్యక్తమైంది. కాగా, ఇదే సమయావేశంలో నాగార్జునసాగర్ పరిధిలో ప్రపంచబ్యాంకు నిధులతో జరుగుతున్న ఆధునికీకరణ పనులపైనా చర్చ జరిగింది. ఈ పనుల తీరుపై ఇటీవల ప్రపంచబ్యాంకు బృందం సంతృప్తి వ్యక్తం చేసిన అంశాన్ని మంత్రి హరీశ్‌రావు వివరించారు.