Penguin bird
-
పెంగ్విన్లు ఏలియన్లా?
ఏలియన్స్ అంటే భూమి అవతల ఎక్కడో గ్రహాల్లోనో, సుదూర సౌర వ్యవస్థల్లోనో ఉన్నాయని అనుకుంటున్నాం. కానీ ఏలియన్స్ ఎప్పుడో భూమ్మీదికి వచ్చి ఉంటాయని, ఇప్పటికీ వాటి అవశేషాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరి ఆ ఏలియన్స్ ఏమిటో తెలుసా..? మంచు ప్రాంతాల్లో తిరిగే పెంగ్విన్ పక్షులట. మరి ఈ విశేషాలు ఏమిటో చూద్దామా? ఉండటమే చిత్రంగా.. భూమి ఉత్తర, దక్షిణ ధృవాల్లోని మంచు ప్రాంతాల్లో జీవించే పక్షులు పెంగ్విన్లు. మామూలుగానే అవి చిత్రంగా ఉంటాయి. పేరుకు పక్షులే అయినా ఎగరలేవు. నిటారుగా రెండు కాళ్లపై నిలబడతాయి, అలాగే నడుస్తాయి. నీటిలో బుడుంగున మునుగుతూ, తేలుతూ వేగంగా ఈదుతాయి. గుంపులు గుంపులుగా జీవిస్తాయి. ఇంతవరకు బాగానే ఉన్నా.. భూమ్మీద ఏ జీవిలోనూ లేని ఓ ప్రత్యేకమైన రసాయన పదార్థం పెంగ్విన్లలో ఉన్నట్టు తాజాగా గుర్తించడం ఆసక్తి రేపుతోంది. శుక్రగ్రహంలోని రసాయనం యూకేకు చెందిన లండన్ ఇంపీరియల్ కాలేజీ ప్రొఫెసర్ డేవ్ క్లెమెంట్స్ ఆధ్వర్యంలోని శాస్త్రవేత్తలు ఫాక్లాండ్ ప్రాంతంలోని గెంటూ రకం పెంగ్విన్లపై కొద్దిరోజులుగా పరిశోధన చేస్తున్నారు. ఈ క్రమంలోనే వాటి విసర్జితాలను పరిశీలిస్తుండగా.. ‘ఫాస్పైన్’ అనే రసాయనం ఆనవాళ్లు లభించాయి. భాస్వరం, హైడ్రోజన్ మూలకాల సమ్మిళితం అయిన ఈ రసాయనం.. సాధారణంగా భూమ్మీది ఏ జీవిలోనూ ఉండదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. గత ఏడాదే శుక్రగ్రహ వాతావరణంలో ‘ఫాస్పైన్’ జాడను కనిపెట్టిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. హా 6.1 కోట్ల కిలోమీటర్ల దూరంలోని శుక్రుడిలో ఉన్న రసాయనం పెంగ్విన్ల విసర్జితాల్లో ఉండటం అంటే.. అవి బహుశా మరో ప్రపంచానికి చెందిన జీవులు (ఏలియన్లు) అయి ఉండవచ్చని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అసలు పెంగ్విన్లలో ఈ రసాయనం ఎలా ఉత్పత్తి అవుతోందన్న దానిని పరిశీలిస్తున్నామని ప్రకటించారు. ఫాస్పైన్.. వెరీ డేంజర్ ఫాస్పైన్ ప్రమాదకర వాయువు. అత్యంత విషపూరితమైనది. పీల్చుకుంటే నిమిషాల్లోనే ప్రాణాలు తీస్తుంది. వేగంగా మండిపోయే స్వభావం ఉంటుంది. దీనిని పారిశ్రామికంగా తయారు చేస్తారు. కీటక నాశనులు, ఎలుకల మందు వంటివాటి తయారీలో వినియోగిస్తారు. కొన్ని పరిశ్రమల్లో మంటలకు ఇంధనంగా, సెమీకండక్టర్ల తయారీ ప్రక్రియలో వినియోగిస్తారు. ఏలియన్ల జాడ తెలుసుకోవచ్చా? పెంగ్విన్ల జీవన విధానం, వాటి శరీరంలోని రసాయనాలను పరిశీలించడం ద్వారా.. భవిష్యత్తులో ఏలియన్ల జాడను గుర్తించేందుకు వీలవుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. గతంలో ఎప్పుడో గ్రహాంతర వాసులు భూమ్మీదికి వచ్చి వెళ్లి ఉంటారని.. ఆ క్రమంలోనే పెంగ్విన్ల వంటి ప్రత్యేక జాతులు అభివృద్ధి చెంది ఉంటాయని మరికొందరు శాస్త్రవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
ఓ మనిషి కోసం 5,000 మైళ్లు ఈదుకుంటూ వస్తున్న పెంగ్విన్
బ్రసీలియా: మనిషి, కుక్క మధ్య ఆప్యాయత, అనుబంధం ఉంటుందని మనకు తెలుసు. అదే మనిషి, పెంగ్విన్ పక్షి మధ్య అలాంటి ఆప్యాయత, అనుబంధమే ఏర్పడితే విచిత్రమంటాం. బ్రెజిల్‌కు చెందిన 71 ఏళ్ల వృద్ధుడు జొహావో పీరా డిసౌజా, పెంగ్విన్ మధ్య ఇలాంటి ప్రేమానుబంధం గత నాలుగేళ్లుగా కొనసాగుతోంది. ప్రతి ఏటా మనిషి మిత్రుడిని కలుసుకునేందుకు పెంగ్విన్ పక్షి 5,000 మైళ్ల దూరంలోని ఆర్జెంటీనా, చిలీ తీరం నుంచి ఈదుకుంటూ వస్తుంది. 8 నెలల పాటు డిసౌజాతో గడుపుతోంది. తిరిగి బ్రీడింగ్ కోసం ఐదువేల మైళ్లు ఈదుకుంటూ వెళుతోంది. 2011 నాటి నుంచి ఇప్పటి వరకు పెంగ్విన్ పక్షి ప్రతి ఏడాది వచ్చి పోతోందని, జూన్ నెలలో వచ్చి ఫిబ్రవరి నెలలో గుడ్లు పెట్టేందుకు, తన పిల్లలను చూసుకునేందుకు వెళ్లి పోతుందని డిసౌజా ఓ టీవీ ఇంటర్వ్యూలో తాజాగా వెల్లడించారు. తాపీ పనిచేసే తాను అప్పుడప్పుడు చేపల వేటకు వెళుతుంటానని, అలా 2011లో ఒకనాడు చేపల వేటకు వెళ్లినప్పుడు సముద్రం పక్కన దట్టమైన చమురులో చిక్కుకొని ఆకలితో బాధ పడుతున్న పెంగ్విన్ పక్షి తనకు తారసపడిందని, దాన్ని కాస్త నీటితో కడిగి ఇంటిని తీసుకెళ్లానని, రెక్కలకంటిన చమురును పూర్తిగా తొలగించేందుకు తనకు వారం రోజులు పట్టిందని డిసౌజా వివరించారు. మరో వారం రోజులపాటు పూర్తిగా కోలుకునే వరకు తనతోనే ఉంచుకున్నానని, ఆ తర్వాత దాన్ని తీసుకొచ్చి సముద్ర తీరాన వదిలిపెడితే వెళ్లిపోయిందని, మళ్లీ కనిపించదని కూడా అనుకున్నానని ఆయన చెప్పారు. ఓ నాలుగు నెలల తర్వాత మరోసారి సముద్ర తీరానికి చేపల వేటకు వచ్చినప్పుడు ఆ పెంగ్విన్ పక్షి తన కోసం నిరీక్షిస్తూ కనిపించడం ఆశ్చర్యం వేసిందని డిసౌజా తెలిపారు. తన ఇంట్లో ఉన్నప్పుడు దానికి ఆహారంగా రోజు చేపలు తీసుకొచ్చి పెట్టేవాడినని, అలా తమ మధ్య విడదీయ అనుబంధం ఏర్పడిందని ఆయన చెప్పారు. ఎప్పుడూ తన వద్దకు వచ్చి ఒళ్లో కూర్చుంటుందని, తన ముక్కుతో ముఖమంతా తడుముతూ తన ప్రేమను చాటుతుందని ఆయన అన్నారు. సకాలంలో దాన్ని తాను ఆదుకోకపోతే పెంగ్విన్ చనిపోయి ఉండేదని, తనకు ప్రాణదానం చేసినందుకు ఇంత అభిమానం చూపిస్తుందేమోనని ఆయన వ్యాఖ్యానించారు. దానికి ముద్దుగా డిండిమ్ అని కూడా పేరు పెట్టినట్లు చెప్పారు. బ్రెజిల్‌లోని రియో డి జనిరో దీవిలో ఉండే డిసౌజా వద్దకు దక్షిణ అమెరికా ప్రాంతానికి చెందిన పెంగ్విన్ దాదాపు 5000 వేల మైళ్లు ఈదుకుంటూ రావడం నిజంగా ఓ అద్భుతమేనని, తాము పెంగ్విన్ పక్షుల్లో ఇలాంటి ప్రవర్తనను ఇంతవరకు చూడలేదని బయోలోజిస్ట్ పావులో క్రెజివిస్కీ వ్యాఖ్యానించారు. పెంగ్విన్ పక్షి డిసౌజాను అచ్చం తన కుటుంబానికి చెందిన పెంగ్విన్‌లానే చూస్తోందని, అలాగే డిసౌజా కూడా తన కుటుంబంలోని వ్యక్తిగానే దాన్ని చూసుకుంటున్నారని ఆయన అన్నారు.