ఓ మనిషి కోసం 5,000 మైళ్లు ఈదుకుంటూ వస్తున్న పెంగ్విన్ | Bird swims 5,000 MILES every year to visit Brazilian man | Sakshi
Sakshi News home page

ఓ మనిషి కోసం 5,000 మైళ్లు ఈదుకుంటూ వస్తున్న పెంగ్విన్

Published Wed, Mar 9 2016 5:24 PM | Last Updated on Sun, Sep 3 2017 7:21 PM

ఓ మనిషి కోసం 5,000 మైళ్లు ఈదుకుంటూ వస్తున్న పెంగ్విన్

ఓ మనిషి కోసం 5,000 మైళ్లు ఈదుకుంటూ వస్తున్న పెంగ్విన్

బ్రసీలియా: మనిషి, కుక్క మధ్య ఆప్యాయత, అనుబంధం ఉంటుందని మనకు తెలుసు. అదే మనిషి, పెంగ్విన్ పక్షి మధ్య అలాంటి ఆప్యాయత, అనుబంధమే ఏర్పడితే విచిత్రమంటాం. బ్రెజిల్‌కు చెందిన 71 ఏళ్ల వృద్ధుడు జొహావో పీరా డిసౌజా, పెంగ్విన్ మధ్య ఇలాంటి ప్రేమానుబంధం గత నాలుగేళ్లుగా కొనసాగుతోంది. ప్రతి ఏటా మనిషి మిత్రుడిని కలుసుకునేందుకు పెంగ్విన్ పక్షి  5,000 మైళ్ల దూరంలోని ఆర్జెంటీనా, చిలీ తీరం నుంచి ఈదుకుంటూ వస్తుంది. 8 నెలల పాటు డిసౌజాతో గడుపుతోంది. తిరిగి బ్రీడింగ్ కోసం ఐదువేల మైళ్లు ఈదుకుంటూ వెళుతోంది.

2011 నాటి నుంచి ఇప్పటి వరకు పెంగ్విన్ పక్షి ప్రతి ఏడాది వచ్చి పోతోందని, జూన్ నెలలో వచ్చి ఫిబ్రవరి నెలలో గుడ్లు పెట్టేందుకు, తన పిల్లలను చూసుకునేందుకు వెళ్లి పోతుందని డిసౌజా ఓ టీవీ ఇంటర్వ్యూలో తాజాగా వెల్లడించారు. తాపీ పనిచేసే తాను అప్పుడప్పుడు చేపల వేటకు వెళుతుంటానని, అలా 2011లో ఒకనాడు చేపల వేటకు వెళ్లినప్పుడు సముద్రం పక్కన దట్టమైన చమురులో చిక్కుకొని ఆకలితో బాధ పడుతున్న పెంగ్విన్ పక్షి తనకు తారసపడిందని, దాన్ని కాస్త నీటితో కడిగి ఇంటిని తీసుకెళ్లానని, రెక్కలకంటిన చమురును పూర్తిగా తొలగించేందుకు తనకు వారం రోజులు పట్టిందని డిసౌజా వివరించారు. మరో వారం రోజులపాటు పూర్తిగా కోలుకునే వరకు తనతోనే ఉంచుకున్నానని, ఆ తర్వాత దాన్ని తీసుకొచ్చి సముద్ర తీరాన వదిలిపెడితే వెళ్లిపోయిందని, మళ్లీ కనిపించదని కూడా అనుకున్నానని ఆయన చెప్పారు.

 ఓ నాలుగు నెలల తర్వాత మరోసారి సముద్ర తీరానికి చేపల వేటకు వచ్చినప్పుడు ఆ పెంగ్విన్ పక్షి తన కోసం నిరీక్షిస్తూ కనిపించడం ఆశ్చర్యం వేసిందని డిసౌజా తెలిపారు. తన ఇంట్లో ఉన్నప్పుడు దానికి ఆహారంగా రోజు చేపలు తీసుకొచ్చి పెట్టేవాడినని, అలా తమ మధ్య విడదీయ అనుబంధం ఏర్పడిందని ఆయన చెప్పారు. ఎప్పుడూ తన వద్దకు వచ్చి ఒళ్లో కూర్చుంటుందని, తన ముక్కుతో ముఖమంతా తడుముతూ తన ప్రేమను చాటుతుందని ఆయన అన్నారు. సకాలంలో దాన్ని తాను ఆదుకోకపోతే పెంగ్విన్ చనిపోయి ఉండేదని, తనకు ప్రాణదానం చేసినందుకు ఇంత అభిమానం చూపిస్తుందేమోనని ఆయన వ్యాఖ్యానించారు. దానికి ముద్దుగా డిండిమ్ అని కూడా పేరు పెట్టినట్లు చెప్పారు.

బ్రెజిల్‌లోని రియో డి జనిరో దీవిలో ఉండే డిసౌజా వద్దకు దక్షిణ అమెరికా ప్రాంతానికి చెందిన పెంగ్విన్ దాదాపు 5000 వేల మైళ్లు ఈదుకుంటూ రావడం నిజంగా ఓ అద్భుతమేనని, తాము పెంగ్విన్ పక్షుల్లో ఇలాంటి ప్రవర్తనను ఇంతవరకు చూడలేదని బయోలోజిస్ట్ పావులో క్రెజివిస్కీ వ్యాఖ్యానించారు. పెంగ్విన్ పక్షి డిసౌజాను అచ్చం తన కుటుంబానికి చెందిన పెంగ్విన్‌లానే చూస్తోందని, అలాగే డిసౌజా కూడా తన కుటుంబంలోని వ్యక్తిగానే దాన్ని చూసుకుంటున్నారని ఆయన అన్నారు.

Advertisement
Advertisement