ఇక సొంతంగానే యూఏఎన్: ఈపీఎఫ్ఓ
న్యూఢిల్లీ: ఉద్యోగ భవిష్య నిధి(ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్) సంస్థ తమ చందాదారుల కోసం కొత్త సౌకర్యాన్ని శుక్రవారం అందుబాటులోకి తీసుకువచ్చింది. సార్వత్రిక ఖాతా సంఖ్య(యూఏఎన్)ను ఉద్యోగులు ఇకపై సొంతంగా ఆన్లైన్లో పొందవచ్చు. ఉద్యోగాలు మారినా యూఏఎన్ ఒకటే ఉంటుందన్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు యూఏఎన్‌ను పొందాలంటే తమ యాజమాన్యం ద్వారా పొందాల్సి వచ్చేది. ఇకపై ఉద్యోగులు ఈపీఎఫ్ఓ వెబ్ సైట్ ద్వారా తామే యూఏఎన్‌ను జనరేట్ చేసుకోవచ్చు. అలాగే, 65 లక్షల పెన్షన్ ఖాతాదారులకు కూడా ఈపీఎఫ్ఓ మరో సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. వారు తమ పెన్షన్ పేమెంట్ ఆర్డర్‌ను ఇకపై డిజీలాకర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. భవిష్య నిధి సంస్థ 67వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కార్మిక శాఖ మంత్రి సంతోష్ గాంగ్వర్ ఈ సౌకర్యాలను ప్రారంభించారు.