penumudi
-
Mandali Venkata Krishna Rao: దివిసీమ గాంధీ
మండలి వెంకట కృష్ణారావు అవనిగడ్డ నుంచి 1972లో ఏకగ్రీవంగా ఎన్నికైన శాసన సభ్యుడు, గాంధేయవాది. రాజకీయ విలువల్లో, భాషా భిమానంలో ఆయనకు వారసులు – మాజీ రాష్ట్రమంత్రి మండలి బుద్ధప్రసాద్. కృష్ణారావు 1926 ఆగస్టు 4న కైకలూరు మండలం పల్లెవాడలో జన్మించారు. వీరి స్వస్థలం నాగాయలంక మండలంలోని భావదేవరపల్లి. మండలి కృషి వల్లే దివిసీమలోని నిరుపేదలకు బంజరు భూము లను పంచే కార్యక్రమం ప్రారంభమైంది. 15 వేల ఎకరాల భూములను పేదలకు పంచారు. 1974లో ఆయన విద్యా, సాంస్కృతిక వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 1975 రాక్షస నామ సంవత్సర ఉగాది నాడు ప్రథమ ప్రపంచ తెలుగు మహాసభలను హైదరాబాద్‌లో నిర్వహించారు. నిర్వహణ కమిటీకి మండలి కార్యనిర్వాహక అధ్యక్షునిగా వ్యవహరించారు. ‘అంతర్జాతీయ తెలుగు కేంద్రం’ సంస్థను 1975లో నాటి భారత రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహమ్మద్ ప్రారంభించారు. మండలి ఈ సంస్థకు ప్రథమ అధ్యక్షులుగా వ్యవహరించారు. (చదవండి: ప్రగతిశీల వైద్య శిఖామణి) ప్రథమ ప్రపంచ తెలుగు మహాసభల కార్యనిర్వాహక అధ్యక్షులుగా, అంతర్జాతీయ తెలుగు కేంద్రం ప్రథమ అధ్యక్షులుగా వ్యవహరించిన మండలి కృషిని గుర్తించి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అంతర్జాతీయ తెలుగు కేంద్రం పేరును ‘మండలి వెంకట కృష్ణారావు అంతర్జాతీయ తెలుగు కేంద్రం’గా మార్చారు. దివిసీమలోని పులిగడ్డ – పెనుమూడి వంతెనకు మండలి పేరు పెట్టారు. ‘దివిసీమ గాంధీ’గా ప్రజల మన్ననలు అందుకున్న మండలి 1997 సెప్టెంబర్ 27న మరణించారు. ‘బాధలలో ఉన్న వారిని మనమే వెళ్లి ఓదార్చాలని’ వారు ఆచరించి చెప్పిన మాటలు దివిసీమ ప్రజలకు భగవద్గీతలా వినిపిస్తూనే ఉంటాయి. (చదవండి: మనువును జయించిన విశ్వనరుడు) – డా. జె. వి. ప్రమోద్ కుమార్, పైడిమెట్ట (సెప్టెంబర్ 27న మండలి వెంకట కృష్ణారావు 25వ వర్ధంతి) -
‘పెనుమూడి’ కన్నెర్ర
రేపల్లె : మండలంలోని పెనుమూడిలో ఆలయాల తొలగింపు చర్యలపై గ్రామస్తులు కన్నెర్ర చేశారు. ప్రభుత్వం, అధికారుల తీరుపై ధ్వజమెత్తారు. సోమవారం పెనుమూడి– పులిగడ్డ వారధి వద్ద పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. 214–ఎ జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఆదివారం పెనుమూడి పుష్కర ఘాట్ పరిశీలనకు వచ్చిన కలెక్టర్ కాంతిలాల్ దండే అక్కడి ఆంజనేయస్వామి, శివాలయాలను తొలగించాలని గతంలోనే చెప్పినా ఎందుకు తొలగించలేదని తెనాలి ఆర్డీవో, స్థానిక తహసీల్దారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వారు ఆలయాల తొలగింపునకు సిబ్బందికి ఆదేశమిచ్చారు. దీనిపై మండిపడిన గ్రామస్తులు సోమవారం ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ తాము నదిలో వేటకు వెళ్లే సమయంలో ఆంజనేయస్వామికి పూజలు చేయటం ఆచారమని, తమ పూర్వీకుల నుంచి కొనసాగుతున్న ఈ సంప్రదాయానికి ఆలయం తొలగింపు ద్వారా భంగం కలిగించొద్దని కోరారు. తమ నమ్మకాలకు గౌరవమివ్వాలన్నారు. పుష్కర ఘాట్‌కు ఏవిధంగానూ అడ్డుగా లేని ఆంజనేయస్వామి ఆలయాన్ని కూల్చివేసేందుకు సన్నద్ధమవటం దారుణమన్నారు. కనీసం తమతో సంప్రదింపులు కూడా జరపకుండా ఆలయాన్ని కూల్చే ప్రయత్నాలు చేస్తే సహించేది లేదన్నారు. గ్రామస్తులతో చర్చించిన తహసీల్దార్... రాస్తారోకో నిర్వహిస్తున్న గ్రామస్తులతో తహసీల్దార్ ఎం.నాగిరెడ్డి చర్చలు జరిపారు. దేవాలయాలను తొలగించే పక్షంలో స్థల కేటాయింపు చేసి పునర్నిర్మాణానికి చర్యలు తీసుకునే దిశగా అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు చెప్పారు. దీంతో శాంతించిన గ్రామస్తులు రాస్తారోకోను విరమించారు. అనంతరం ఆలయాల పునర్నిర్మాణానికి స్థలం, నిధుల కేటాయింపు జరిగే వరకు తొలగిస్తే సహించేది లేదంటూ మూకుమ్మడిగా ఆలయాల వద్దకు చేరుకుని బైఠాయించారు. తహసీల్దార్ వెంట ఎంపీడీవో ఎం.శోభారాణి తదితరులు పాల్గొన్నారు. రాస్తారోకోతో పెనుమూడి– పులిగడ్డ, పెనుమూడి– రేపల్లె వైపు వాహనాలు అధిక సంఖ్యలో నిలిచిపోయాయి. -
భారీ ఎత్తున రేషన్ బియ్యం పట్టివత
గుంటూరు: గుంటూరు జిల్లా రేపల్లె మండలం పెనుమూడిలో గ్రామ శివారులో భారీ ఎత్తున అక్రమంగా తరలిస్తున్న 170 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని రేపల్లె సబ్ ఇన్స్పెక్టర్ సురేష్ బుధవారం స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు రహదారిపై కాపు కాసిన పోలీసులు రేషన్ బియ్యం లోడుతో భీమవరం వైపు వెళ్తున్న లారీని పట్టుకున్నారు. లారీని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.