‘పెనుమూడి’ కన్నెర్ర
Published Tue, Aug 9 2016 4:20 PM | Last Updated on Mon, Sep 4 2017 8:34 AM
రేపల్లె : మండలంలోని పెనుమూడిలో ఆలయాల తొలగింపు చర్యలపై గ్రామస్తులు కన్నెర్ర చేశారు. ప్రభుత్వం, అధికారుల తీరుపై ధ్వజమెత్తారు. సోమవారం పెనుమూడి– పులిగడ్డ వారధి వద్ద పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. 214–ఎ జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఆదివారం పెనుమూడి పుష్కర ఘాట్ పరిశీలనకు వచ్చిన కలెక్టర్ కాంతిలాల్ దండే అక్కడి ఆంజనేయస్వామి, శివాలయాలను తొలగించాలని గతంలోనే చెప్పినా ఎందుకు తొలగించలేదని తెనాలి ఆర్డీవో, స్థానిక తహసీల్దారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వారు ఆలయాల తొలగింపునకు సిబ్బందికి ఆదేశమిచ్చారు. దీనిపై మండిపడిన గ్రామస్తులు సోమవారం ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ తాము నదిలో వేటకు వెళ్లే సమయంలో ఆంజనేయస్వామికి పూజలు చేయటం ఆచారమని, తమ పూర్వీకుల నుంచి కొనసాగుతున్న ఈ సంప్రదాయానికి ఆలయం తొలగింపు ద్వారా భంగం కలిగించొద్దని కోరారు. తమ నమ్మకాలకు గౌరవమివ్వాలన్నారు. పుష్కర ఘాట్‌కు ఏవిధంగానూ అడ్డుగా లేని ఆంజనేయస్వామి ఆలయాన్ని కూల్చివేసేందుకు సన్నద్ధమవటం దారుణమన్నారు. కనీసం తమతో సంప్రదింపులు కూడా జరపకుండా ఆలయాన్ని కూల్చే ప్రయత్నాలు చేస్తే సహించేది లేదన్నారు.
గ్రామస్తులతో చర్చించిన తహసీల్దార్...
రాస్తారోకో నిర్వహిస్తున్న గ్రామస్తులతో తహసీల్దార్ ఎం.నాగిరెడ్డి చర్చలు జరిపారు. దేవాలయాలను తొలగించే పక్షంలో స్థల కేటాయింపు చేసి పునర్నిర్మాణానికి చర్యలు తీసుకునే దిశగా అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు చెప్పారు. దీంతో శాంతించిన గ్రామస్తులు రాస్తారోకోను విరమించారు. అనంతరం ఆలయాల పునర్నిర్మాణానికి స్థలం, నిధుల కేటాయింపు జరిగే వరకు తొలగిస్తే సహించేది లేదంటూ మూకుమ్మడిగా ఆలయాల వద్దకు చేరుకుని బైఠాయించారు. తహసీల్దార్ వెంట ఎంపీడీవో ఎం.శోభారాణి తదితరులు పాల్గొన్నారు. రాస్తారోకోతో పెనుమూడి– పులిగడ్డ, పెనుమూడి– రేపల్లె వైపు వాహనాలు అధిక సంఖ్యలో నిలిచిపోయాయి.
Advertisement
Advertisement