పోలవరంపై పోరు ఉధృతం చేస్తాం
చింతూరు, న్యూస్‌లైన్: ఆదివాసీలను జలసమాధి చేస్తున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకునేందుకు పోరును మరింత ఉధృతం చేస్తామని పీపుల్స్ ఎగెనైస్ట్ పోలవరం ప్రాజెక్టు(పీఏపీపీ)కమిటీ ప్రకటించింది. కమిటీ ఆధ్వర్యంలో ఆంధ్రా, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లకు చెందిన ఆదివాసీలతో కలసి మూడు రాష్ట్రాల కూడలైన ఒడిశా రాష్ట్రం మల్కనగిరి జిల్లా మోటులో మంగళవారం నిరసన దీక్ష చేపట్టారు.
ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షుడు ప్రభాకర్ హంతల్ మాట్లాడుతూ గ్రామసభల తీర్మానం లేకుండా కేంద్ర, ఆంధ్రా ప్రభుత్వాలు ఏకపక్షంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్నాయని, గ్రామసభ తీర్మానం లేదనే కారణంగా సుప్రీంకోర్టు ఆదేశాలతో తమ రాష్ట్రంలో బాక్సైట్ తవ్వకాలు నిలిపి వేశారని, ఇదే క్రమంలో పోలవరం ప్రాజెక్టును కూడా నిలిపివేయాలని డిమాండ్ చేసారు. పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఒడిశా ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన కేసుకు సంబంధించి ఎలాంటి తీర్పు వెలువడకుండానే కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టుకు జాతీయహోదా కల్పించడం ఎంతవరకు సబబని ఆయన ప్రశ్నించారు.
1986 వరద అంచనా ప్రకారం పోలవరం వలన ఒడిశాలోని 4 బ్లాకుల పరిధిలో 129 గ్రామాలు ముంపునకు గురవుతున్నాయని, వీటికి నష్టపరిహారం ఎలా చెల్లిస్తారనేది ఆంధ్రా ప్రభుత్వం ఇంతవరకు స్పష్టం చేయలేదని తెలిపారు. ఇప్పటికే గోదావరి నదిపై అనేక చిన్నతరహా ప్రాజెక్టులు నిర్మించి సాగునీరు అందిస్తున్నా పెట్టుబడిదారులకు లబ్ధి చేకూర్చేందుకే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్నారని ఆయన ఆరోపించారు.ప్రభుత్వం బయోడైవర్శిటీ సదస్సు నిర్వహించి వన్యప్రాణులను రక్షించాలని ఓ ప్రక్క చెబుతూ పోలవరం ప్రాజెక్టుతో లక్షలాది ప్రజలు నిరాశ్రయులవుతున్నా పట్టించుకోవడం లేదని ఆయన పేర్కొన్నారు.
ప్రాజెక్టు నిర్మాణం వలన పాపికొండలు, పొరింగ వంటి అభయారణ్యాలతో పాటు వందల ఏళ్ల చరిత్ర కలిగిన భద్రాద్రి రామయ్య మునిగిపోతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చీమ కుట్టినట్లు కూడా లేదని కమిటీ ప్రధాన కార్యదర్శి సున్నం వెంకటరమణ విమర్శించారు. లక్షలాది మంది ఆదివాసీలను నిరాశ్రయులను చేస్తున్న పోలవరం ప్రాజెక్టును అడ్డుకోవాలని కోరుతూ రాష్ట్రపతికి రాసిన లేఖను మోటు తహశీల్దార్‌కు సమర్పించారు.
శబరినదిలో జలదీక్ష:
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకంగా ఆంధ్రా, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఆదివాసీలు వినూత్నంగా శబరినదిలో జలదీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం డౌన్ డౌన్, ఆంధ్రా సర్కార్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. పోలవరం ప్రాజెక్టును నిలిపివేయాలని పర్యావరణాన్ని కాపాడాలంటూ నినదించారు. ఈ సందర్భంగా మోటు గ్రామం నుంచి శబరినది వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పీఏపీపీ ఆర్గనైజింగ్ కార్యదర్శి రుద్రపాత్రో, ఉపాధ్యక్షుడు సోడె మురళి, ఆదివాసీ కొండరెడ్ల సంఘం గౌరవ అధ్యక్షుడు ముర్ల రమేష్, రేల స్వచ్ఛందసంస్థ ప్రధాన కార్యదర్శి కె.రమేష్, తెలంగాణ నిర్వాసితుల సంఘం ప్రధాన కార్యదర్శి జంజర్ల రమేష్, జల్లి నరేష్, దారలింగ, ధనం తదితరులు పాల్గొన్నారు.