peoples facing problems
-
టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్గా నాతాల రాంరెడ్డి
సూర్యాపేటరూరల్ : టీడీపీ సూర్యాపేట నియోజకవర్గ ఇన్చార్జ్గా చివ్వెంల మండలం గుంపుల తిరుమలగిరికి చెందిన నాతాల రాంరెడ్డి నియామకమైనట్టు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పెద్దిరెడ్డి రాజా వెల్లడించారు. బుధవారం అంజనాపురి కాలనీలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో పెద్దిరెడ్డి రాజా మాట్లాడుతూ కార్యకర్తల అభిష్టం మేరకు నాతాల రాంరెడ్డిని పార్టీ అధిష్టానం నియమించిందని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం జిల్లాలోని హుజూర్‌నగర్‌లో ఇప్పటికే పల్లెపల్లెకు తెలుగుదేశం కార్యక్రమాన్ని ప్రారంభించామని, త్వరలో సూర్యాపేట నియోజకర్గంలోనూ మొదలు పెడతామన్నారు. ఈ నెల 29న నిర్వహించే టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. అనంతరం చౌడోజు వీరాచారి ఆధ్వర్యంలో గజమాలతో రాంరెడ్డిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండలాల అధ్యక్షుడు కుంచం అంజయ్య, రాధాకృష్ణ, శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు వీరారెడ్డి, పగడాల లింగయ్య, శంకర్‌నాయక్, వంశీ, జానిమియా, జితేందర్, మోహన్, రామాచారి తదితరులు పాల్గొన్నారు. -
మురుగు.. ముప్పు
వీపనగండ్ల : మండలంలోని వివిధ గ్రామాల్లో పారిశుద్ధ్యం లోపించింది. వీధుల్లోని రోడ్లపైనే మురుగు ప్రవహిస్తోంది. రోడ్లపై ఎక్కడపడితే అక్కడ చెత్తాచెదారం.. పందులు, దోమలు స్వైర విహారం చేస్తుండటంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. ముక్కు మూసుకోవాల్సిందే.. గ్రామాల్లోని అంతర్గత రోడ్లపై నడవాలంటే ముక్కు మూసుకెళ్లాల్సిందే. రోడ్లపైనే మురుగు, వ్యర్థపదార్థాలు పడేస్తుండటంతో పందులు సంచరిస్తున్నాయి. పరిస్థితి దారుణంగా ఉన్నా పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు .. పారిశుద్ధ్యం పేరుతో నిధులు డ్రా చేసుకున్నారని ప్రజలు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. పారిశుద్ధ్యం పేరుతో నిధులు డ్రా మండలంలో పారిశుద్ధ్యం, అంతర్గత , ఆపరేటర్ల నిర్వాహణ పేరుతో అధిక మొత్తంలో డబ్బులు డ్రా చేశారు. సంపట్రావుపల్లిలో పారిశుద్ధ్యం, ఆపరేటర్ పేరుతో రూ.లక్షా 10వేలు డ్రా చేసినట్లు అధికారులు రికార్డుల్లో నమోదు చేశారు. సంగినేనిపల్లిలో పారిశుధ్యం నిర్వాహణ కోసం రూ.60 వేలు, ఆపరేటర్ వేతనం కోసం రూ.8824 , తూంకుంటలో రూ.75 వేలు, గోవర్దనగిరిలో రూ.35 వేలు, కల్వరాళ్లలో రూ.40వేలు ఖర్చు చే సినట్లు అధికారులు లెక్కలు వేసి ఆయా గ్రామ పంచాయతీల నిధుల నుంచి డ బ్బులు డ్రా చేశారు. కానీ చాలా గ్రామా ల్లో పారిశుధ్య పనులు చేపట్టిన దాఖ లాలు లేవని ప్రజలు ఆరోపిస్తున్నారు. విచారణ జరపాలి గ్రామాల్లో పారిశుద్ధ్యం పనులు చేపట్టకపోయినా అధికారులు, ప్రజాప్రతినిధులు డ్రా చేసిన నిధులపై జిల్లా ఉన్నతాధికారులు విచారణ జరిపించాలి. గ్రామాల్లో ఉన్న మురికి గుంతలను పూడ్చి వృథా నీరు ఊర చివరకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలి. లేకుంటే ఆయా గ్రామాల ప్రజలను సమీకరించి ఆందోళనకు శ్రీకారం చుడుతాం. – శేఖర్‌రెడ్డి, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు దృష్టి సారిస్తాం గ్రామాల్లో లోపించిన పారిశుద్ధ్యంపై దృష్టిసారిస్తాం. ప్రజా ప్రతినిధులు డ్రా చేసిన నిధులపై విచారణ జరుపుతాం. గ్రామాల్లో పర్యటించి శాశ్వత పారిశుద్ధ్య నిర్వాహణ పనుల కోసం నిధుల మంజూరుకు జిల్లా అధికారులకు నివేదికలు పంపుతాం. – బద్రినాథ్, ఇన్చార్జ్ ఈఓఆర్డీ -
వానరకం
దమ్మపేట : మండల కేంద్రమైన దమ్మపేటలో ప్రజలు కోతులతో వేగలేకపోతున్నారు. అవి ఎప్పడు ఎవరి మీద దాడి చేస్తాయో..ఏ ఇంట్లో దూరి సామగ్రి ఎత్తుకుపోతాయో తెలియక జనం భయపడుతున్నారు. దమ్మపేటలో కొంత కాలంగా కోతులు విచ్చిల విడిగా తిరుగుతున్నాయి. ఇళ్ల తలుపులు తెరచి ఉంటే చాలు ఇంట్లోకి జొరబడి సామగ్రిని చిందరవందర చేయడమే కాకుండా ఎత్తుకుపోతున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. రోడ్ల పక్కన కిరణా షాపులు, పండ్ల దుకాణాల్లో అయితే యజమానులున్నా లోనికి దూరిపోయి చేతికందిన వాటిని తీసుకుపోతున్నాయి. రోడ్లపై నడిచే వ్యక్తుల చేతుల్లో కవర్లు కనిపిస్తే వారి నుంచి కవర్లును లాక్కెళ్తున్నాయి. దీంతో కూరగాయలు, ఇతర సామగ్రిని చేతపట్టుకోవాలంటే జనం జంకిపోతున్నారు. ఉదయం, సాయంత్రం అని సమయం లేకుండా ఇళ్ల పైకప్పులపై చేరి పెంకులను తొలగిస్తూ నానా భీవత్సం సృష్టిస్తున్నాయి. వాటి బెడద నుంచి తట్టుకోలేక ప్రజలు ఇళ్ల వద్ద కర్రలతో కాపలా కాస్తున్నారు. ఇటీవల మల్కారం రోడ్డులో నివాసముంటున్న ఒక వ్యక్తిపై కోతులు పడి విపరీతంగా కరిశాయి. దమ్మపేటలో కోతుల సమస్య పరిష్కరించాలని పట్టణ ప్రజలు పంచాయతీ అధికారులను, పాలకవర్గాన్ని కోరుతున్నారు. దమ్మపేటలో కోతులతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పట్టణ ప్రజలు వాపోతున్నారు. ఇంటి ఆవరణలో కూరలు తయారు చేయడానికి సిద్ధం చేసిన కూరగాయలను ఎత్తుకెళ్తున్నాయని అంటున్నారు. వాటితో పాటు బయట ఆరవేసిన దుస్తులను ఎత్తుకెళుతు జనాలను భయబ్రాంతులను చేస్తున్నాయి. దమ్మపేటలో కోతుల సమస్యకు పరిష్కారం చూపాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. వాటి వల్ల ప్రజలు, చిన్న పిల్లలు చాలా ఇబ్బందులకు గురువుతున్నారు. గతంలో ఒకసారి దమ్మపేటలో కోతులను పట్టి దూరంగా వదిలారు. కొంతకాలం కోతుల సమస్యలేదు. కొద్దికాలంగా సమస్యల మళ్లీ పునరావృతం అయిందని, కోతుల సమస్యకు పరిష్కారం చూపాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. -
నిర్వహణ లోపంతో మూలనపడుతున్న తాగునీటి పథకాలు
ఒంగోలు, న్యూస్‌లైన్: గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కోట్లాది రూపాయలు వెచ్చించి ప్రభుత్వం వాటర్ ట్యాంకులు నిర్మించినా నిర్వహణ లోపం కారణంగా అవి పనికిరాకుండా పోతున్నాయి. జిల్లాలోని తాగునీటి పథకాలను ‘న్యూస్‌లైన్’ బృందం ఆదివారం పరిశీలించింది. వందలాది పథకాలు ఎంత అధ్వానంగా, నిరుపయోగంగా ఉన్నాయో వెలుగు చూసింది. జిల్లాలో 38 సమీకృత రక్షిత మంచినీటి పథకాలు, 1672 రక్షిత మంచినీటి పథకాలు ఉన్నాయి. ఇటీవల పర్చూరు, కొండపి, ఒంగోలు, అద్దంకి, మార్కాపురం, సంతనూతలపాడు నియోజకవర్గాల్లోని 36 వాటర్ ట్యాంకులు మరమ్మతులకు గురయ్యాయి. కొన్ని ఫిల్టర్బెడ్లు అపరిశుభ్రంగా మార గా, పలుచోట్ల మోటార్లు కాలిపోవడం, పైపులైను మరమ్మతులకు గురయ్యాయి. వీటి మరమ్మతులకు * 30.50 లక్షలు అవసరమని అధికారులు ప్రభుత్వానికి నివేదికలు పంపినా నేటికీ ఒక్కపైసా కూడా విడుదల కాలేదు. ఒంగోలు నియోజకవర్గంలో సర్వేరెడ్డిపాలెం చెరువుకు గండిపడడంతో చెరువులో నీరు మొత్తం బయటికి పోయి రెండు ఓవర్‌హెడ్ ట్యాంకులు అలంకార ప్రాయంగా మారాయి. కరువది, చేజర్ల, మండువవారిపాలెం, పెళ్లూరు గ్రామాలకు ఓవర్‌హెడ్ ట్యాంకులు ఉన్నప్పటికీ అవి ఆశించిన ప్రయోజనం కల్పించలేకపోతున్నాయి. గ్రామీణ తాగునీటి పథకాల ఓవర్‌హెడ్ ట్యాంకుల నిర్వహణ పంచాయతీలకు సంబంధించింది కావడం, సుదీర్ఘ కాలం పంచాయతీలు ప్రత్యేకాధికారుల పాలనలో ఉండడంతో చాలా వరకు పథకాలు మూలనపడ్డాయి. ఒంగోలు నగరంలోనే కొత్తపట్నం బస్టాండు సెంటర్లో ఉన్న ఓవర్‌హెడ్ ట్యాంకు నిర్మాణం పూర్తయి నిరుపయోగంగా ఉంది. పేర్నమిట్ట పంచాయతీ పరిధిలోని అరుణోదయ కాలనీలో ప్రజల దాహార్తి తీర్చేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి * 30 లక్షలు మంజూరు చేసిన ట్యాంకు నిర్మాణం పూర్తయి 2011లో ప్రారంభించినా..ఇంత వరకు చుక్క నీరు విడుదల కాలేదు. గార్లపాడు ఆర్ఆర్ కాలనీలో 2007లో నిర్మించిన ఓవర్‌హెడ్ ట్యాంకు ఇంకా ప్రారంభానికి నోచుకోలేదు. టంగుటూరు మండలంలోని తూర్పునాయుడుపాలెం, మల్లవరప్పాడు ఓవర్‌హెడ్ ట్యాంకులు దశాబ్ద కాలంగా నిరుపయోగంగా ఉన్నాయి. పొన్నలూరు మండలం విప్పగుంట స్కీం కేవలం స్విచ్వేసేవారు లేక నాలుగేళ్లుగా నిరుపయోగంగా ఉంది. పామూరు కొత్తపల్లిలో *10 లక్షలు వెచ్చించి ఓహెచ్‌ఆర్ ట్యాంక్ నిర్మించారు. కానీ పైప్‌లైన్, డీప్బోర్వెల్కు విద్యుత్ సరఫరాలేక ఐదునెలల నుంచి నిరుపయోగంగా ఉంది. కనిగిరి మండలంలో *175 కోట్లతో నిర్మిస్తున్న మంచినీటి పథకం పనులు నత్తనడకన కొనసాగుతుండడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడంలేదు. మార్కాపురం, తర్లుపాడు, కొనకనమిట్ల, పొదిలి మండలాల్లో లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ఓవర్ హెడ్ ట్యాంకులు నిరుపయోగంగా మారాయి. మార్కాపురం పట్టణంలో లక్షమంది జనాభాకు గాను 30 వేలమందికి మాత్రమే సాగర్‌నీరు అందుతోంది. యర్రగొండపాలెం, దోర్నాల మండలాల్లోని 48 గ్రామాల ప్రజలకు సాగర్‌నీరు సరఫరా చేసేందుకు యర్రగొండపాలెంలో పాలకేంద్రం ఎదురుగా నిర్మించిన పంప్‌హౌస్, ట్యాంకు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. రెండు గ్రామాలకు సైతం నీరందించలేని పరిస్థితి నెలకొంది. ఉమ్మడివరంలో 18 నెలలుగా రక్షిత మంచినీటి పథకం మూలనపడింది. పర్చూరు మండలంలో ఆరు గ్రామాల్లో ఫిల్టర్బెడ్లు పనిచేయడం లేదు. నాలుగు గ్రామాల్లో ట్యాంకులు శిథిలావస్థకు చేరాయి. మార్టూరు మండలంలోని బొల్లాపల్లిలో తాగునీటి కోసం రక్షిత మంచినీటి పథకం నిర్మించినా పదేళ్ల నుంచి చుక్క నీరు విడుదల కాలేదు. బొబ్బేపల్లిలో కోటి రూపాయల నిధులతో తాగునీటి పథకాన్ని నిర్మించారు. అయితే ట్యాంకులోకి నీరు ఎక్కకపోవడం వల్ల ఆగ్రామ ప్రజలకు రక్షిత నీరు అందడం లేదు. గిద్దలూరు, బేస్తవారిపేట మండలాల్లో విద్యుత్ సరఫరా అంతరాయం, మోటార్లు కాలిపోవడం వంటి పలు కారణాలతో మంచినీటి పథకాలు పనిచేయడం లేదు. కందుకూరు నియోజకవర్గంలో దాదాపు 20 పథకాలు ప్రజలకు చుక్కనీరు కూడా అందించలేకపోతున్నాయి. వేటపాలెం మండలంలో *70 లక్షలతో నిర్మించిన రెండు తాగునీటి పథకాలు, చీరాల మండలంలో నాంది స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్లు సైతం పనిచేయకపోతుండడంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. అద్దంకి నియోజకవర్గంలోను నిర్మాణం పూర్తయిన ఓవర్‌హెడ్ ట్యాంకులు, మినరల్ వాటర్ ప్లాంట్లు ఏళ్ల తరబడి ప్రారంభానికి నోచుకోకపోవడంతో సమస్యలు ఎదురవుతున్నాయి.