ఈ‘సారీ’ కూపన్లే..
- శాశ్వత కార్డులు లేనట్లేనా..?
- మరో మూడు నెలలు కూపన్లతోనే రేషన్
- జిల్లాకు చేరిన 42,251 కూపన్లు
కలెక్టరేట్ : జిల్లాలోని రచ్చబండ రేషన్ కూపన్ దారులకు శాశ్వత రేషన్‌కార్డులు అందని ద్రాక్షగా మారాయి. లబ్ధిదారులకు శాశ్వత తెల్లకార్డులను ఇప్పట్లో జారీ చేసే యోచన లో ప్రభుత్వం లేనట్లుగా తెలుస్తోంది. గత ప్రభుత్వం రచ్చబండ ద్వారా రేషన్ కూపన్లు అందించి సరుకులు తీసుకునేలా వీలు కల్పించింది. 2013 నవంబర్‌లో ఆరు నెలలకు సరిపడా కూపన్లు జారీ చేసింది.
ఆ కూపన్లు మే నెలతో ముగిశాయి. జూన్ నెలకు సరుకులు తీసుకునేందుకు కూపన్లు లేకపోవడంతో తాత్కాలిక కార్డుదారులకు అధికారుల ఆదేశాల మేరకు డీలర్లు సరుకులు పంపిణీ చేశారు. ఇక జూలై, ఆగష్టు, సెప్టెంబర్ మూడు నెలలకు సరిపడా 42,251 కూపన్లు శనివారం జిల్లా పౌర సరఫరాల శాఖ కార్యాలయానికి చేరాయి.
జిల్లాకు 42,251 కూపన్లు..
జిల్లాకు 42,251 రేషన్ కూపన్లు వచ్చాయి. వీటి ద్వారా మూడు నెలలు చౌకధరల దుకాణాల ద్వారా సరుకులు పొందవచ్చు. మూడు నెలలకు సరిపడా కూపన్లు పౌర సరఫరాల శాఖ కమిషనర్ కార్యాలయం నుంచి జిల్లాకు చేరాయి. వీటిని ఆయా మండలాలకు పంపిణీ చేశారు. త్వరలో ఈ కూపన్లు రచ్చబండ కార్డుదారులకు ఇవ్వనున్నారు.
సోమవారం జిల్లా సంయుక్త కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూపన్లకు సంబంధించిన అంశాలపై ఆయా మండలాల అధికారులు, డీలర్లతో చర్చించనున్నారు. డీలర్లు, అధికారులు సమావేశానికి హాజరుకావాలని ఆదేశాలు కూడా జారీ చేశారు. కూపన్లు తీసుకునే వారు రూ.5 చెల్లించి తీసుకోవాల్సి ఉంటుందని పౌర సరఫరాల శాఖ అధికారులు పేర్కొంటున్నారు.