Persists
-
బ్యూటిప్స్
ఆరు టీ స్పూన్ల పెట్రోలియమ్ జెల్లీలో రెండు టీ స్పూన్ల గ్లిజరిన్, రెండు టీ స్పూన్ల నిమ్మరసం కలపాలి. ఈ విధంగా తయారు చేసుకున్న మాయిశ్చరైజర్‌ని రాత్రి పడుకోబోయే ముందు శరీరానికంతటికీ పట్టించాలి. వారంలో కనీసం రెండుసార్లయినా ఇలా చేస్తే చర్మం పొడిబారడం తగ్గి మృదువవుతుంది. అర టీ స్పూన్ నిమ్మరసంలో కొద్దిగా గంధం తీసుకుని పే‹స్ట్లా కలుపుకోవాలి. ఇందులో బొప్పాయి గుజ్జుని కలపాలి. వేళ్లతో ఈ మిశ్రమాన్ని తీసుకుని ముఖంపై వలయాకారంలో సుతిమెత్తగా మర్దనా చేయాలి. ఇది స్క్రబ్‌లా ఉపయోగపడడమే కాకుండా, చర్మకాంతి కూడా మెరుగవుతుంది. -
అందమె ఆనందం
పావు టేబుల్ స్పూన్ తేనెలో రెండుటేబుల్ స్పూన్ల పచ్చిపాలను కలపాలి. దూదిని ఈ మిశ్రమంలో ముంచి దాంతో ముఖమంతా రాయాలి. ఈ మిశ్రమం మంచి క్లెన్సర్‌గా ఉపయోగపడుతుంది. కాలుష్యం వల్ల పేరుకుపోయే మలినాలు దీని వల్ల త్వరగా తొలగిపోతాయి. ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు ఇలా చేస్తే చర్మం శుభ్రపడుతుంది. కొద్ది రోజుల్లోనే ముఖ ఛాయలో మార్పుని గమనించవచ్చు. అర టీ స్పూన్ తేనెని స్నానం చేసే నీటిలో కలపాలి. ఈ నీటితో స్నానంచేస్తే చర్మం నిగారింపును సంతరించుకుంటుంది. తేనెలో నిమ్మరసాన్ని కలిపి ముఖంపై మృదువుగా పదిహేను నిమిషాలపాటు మసాజ్ చేసి చన్నీటితో శుభ్రపరుచుకోవాలి. రోజూ ఇలా చేస్తూ ఉంటే ముఖ వర్ఛస్సు పెరుగుతుంది. పచ్చిపాలలో బాదం పొడిని కలిపి ముఖానికి పట్టించాలి. ఆరిన తర్వాత చల్లని నీళ్లతో కడిగేయాలి. క్రమం తప్పకుండా ప్రతిరోజూ ఉదయం ఈ మిశ్రమాన్ని ఫేస్‌ప్యాక్‌లా వాడితే చర్మ కాంతి నిగనిగలాడుతుంది. శనగపిండిలో పసుపు, గ్లిజరిన్, రోజ్ వాటర్ కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. ఆరిన తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రపరిస్తే చర్మం నునుపుగా తయారవుతుంది. -
సున్నితమైన పెదవుల కోసం
బ్యూటిప్స్ పెదవులు పొడిబారి, పగిలి నిర్జీవంగా కనిపిస్తాయి. ఒక్కోసారి పెదవులపై డెడ్ స్కిన్ ఏర్పడుతుంది. దీనిని బలవంతంగా లాగితే రక్తం వస్తుంది. కాబట్టి ఏ సీజన్ అయినా పెదవులు సున్నితంగా ఉండేలా తగినంత శ్రద్ధ తీసుకోవాలి. ఇంట్లోనే దొరికే పదార్థాలతో కొన్ని చిట్కాలు మీ కోసం.... పుదీనా లేదా కొత్తిమీర రసాన్ని పెదవులకు రాసుకుని ఐదు నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. కొన్ని గులాబీ రేకులను పేస్ట్ చేసి అందులో గ్లిజరిన్ చుక్కలు వేసి రాత్రి పడుకునేటప్పుడు పెదవులకు రాసుకుని ఉదయం కడుక్కోవాలి. ఉదయం లేవగానే పెదవులకు తేనె లేదా పాలమీగడ రాసుకుని పావుగంట సేపు ఉంచుకుని కడిగేయాలి. ఇలా నెలరోజుల పాటు చేస్తే పెదవులు సున్నితంగా ఉండడంతో పాటు గులాబీరంగులోకి వస్తాయి. రాత్రి పడుకునేటప్పుడు కాటన్‌తో పెదవులను తుడుచుకుని కొబ్బరినూనె లేదా వెన్నను అప్లై చేసి రెండుమూడు నిమిషాల పాటు మర్దన చేయాలి. -
బ్యూటిప్స్
పసుపు రంగులోకి మారిన అరటిపండు తొక్కతో చర్మ కాంతిని మెరుగుపరచుకోవచ్చు. అరకప్పు తాజా పాలు తీసుకుని దానిలో అరటిపండు తొక్కను వేసి మరగపెట్టాలి. పాలు చల్లారిన తర్వాత టీ స్పూను పాలలో దూది ఉండను (కాటన్ బాల్) ముంచి ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇది మంచి క్లెన్స్‌ర్‌గా పనిచేస్తుంది. మిగిలిన పాలల్లో ఉన్న అరటిపండు తొక్కను మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి అప్లై చేసుకుని అరగంటపాటు ఆరనివ్వాలి. తర్వాత ముఖాన్ని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికోసారి చేస్తే చాయ మెరుగవుతుంది. చర్మం వదులుగా అవ్వకుండా ఉంటుంది, అలాగే ముడతలు కూడా పోతాయి. ఒక్కోసారి ముక్కు రంధ్రాల చుట్టూ, చుబుకం దగ్గర చర్మం నల్లగా, దళసరిగా మారిపోతుంటుంది. అలాంటప్పుడు స్నానానికి వెళ్ళే ముందుగా ఒక స్పూన్ గ్లిజరిన్, మూడు స్పూన్ల తేనె కలుపుకుని, ముఖానికి, కంటి చుట్టూ అప్లై చేసుకోవాలి. ఈ ప్యాక్‌ను 10-15నిముషాల పాటు ఉంచుకోవాలి. తర్వాత ముఖాన్ని నీటితో కడగాలి. ఇలా రోజూ చేస్తుంటే వారం రోజుల్లోపే మీ ముఖం కాంతివంతంగా తయారవుతుంది. జిడ్డు చర్మం ఉన్నవాళ్ళు గ్లిజరిన్, తేనె మిశ్రమంలో కొద్దిగా నిమ్మరసం లేదా చిటికెడు పసుపు కులుపుకోవచ్చు. -
కళ్ల కింది వలయాలకు...
బ్యూటిప్స్ టొమాటో రసంలో కొద్దిగా నిమ్మరసం, కాసింత పుదీనారసం వేసి బాగా కలపాలి. దీన్ని కళ్ల చుట్టూ పూసి, ఆరిన తర్వాత కడిగేయాలి. తరచూ ఇలా చేస్తే కళ్ల చుట్టూ ఉండే నల్లని వలయాలు పోతాయి. కంప్యూటర్ల ముందు ఎక్కువ పనిచేసేవాళ్లు ఈ చిట్కాను పాటిస్తూ ఉంటే నల్లని వలయాలు ఏర్పడకుండా ఉంటాయి. రాత్రి పడుకోబేయే ముందు బాదం నూనెతో కళ్ల కింది వలయాల మీద మృదువుగా రుద్దుతూ కాసేపు మర్దనా చేయాలి. రాత్రంతా అలా వదిలేసి, ఉదయాన్నే చల్లని నీటితో కడిగేసుకోవాలి. వారం పది రోజుల పాటు రోజూ ఇలా చేస్తే నలుపు తగ్గుతుంది. బంగాళాదుంపను సన్నగా తురిమి, ఓ బట్టలో వేసి గట్టిగా పిండి రసం తీయాలి. దీనిలో కొద్దిగా పాల క్రీమ్‌ను కలిపి కళ్ల కింద పూసి, ఆరిన తర్వాత కడిగేయాలి. తరచూ ఇలా చేస్తే డార్క్ సర్కిల్స్ తగ్గిపోతాయి. కీరాదోస రసాన్ని, నిమ్మరసాన్ని సమపాళ్లతో కలిపి కళ్లకింద పూయాలి. రోజుకు రెండుసార్లు చొప్పున వారం రోజుల పాటు ఇలా చేస్తే నల్లని వలయాలు మాయమైపోతాయి. చెంచాడు ఆరెంజ్ జ్యూస్‌లో కొన్ని చుక్కల గ్లిజరిన్ కలిపి పది నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తర్వాత కళ్ల కింద రాసుకుని, ఆరిన తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. వారానికి మూడుసార్లు ఉదయం లే వగానే ఇలా చేస్తే... డార్క్ సర్కిల్స్ పోతాయి. -
నల్ల మచ్చలకు చెక్..
బ్యూటిప్స్ రెండు తమలపాకులను మెత్తగా పేస్ట్‌లా చేసుకోవాలి. ఆ మిశ్రమంలో ఒక టీ స్పూన్ కొబ్బరి నూనె వేసి బాగా కలుపుకోవాలి. రోజులో ఎప్పుడైనా ఒకసారి ఆ పేస్ట్‌ను నల్లమచ్చలపై స్క్రబ్ చేయాలి. క్రమం తప్పకుండా అలా చేస్తే నల్లమచ్చలు త్వరగా మాయమవుతాయి. తేయాకును రాత్రంతా పాలలో నానబెడ్డండి. అవి దొరక్కపోతే నాణ్యమైన టీ పొడినైనా తీసుకోండి. ఉదయం లేచిన వెంటనే చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకున్నాక ఆ మిశ్రమాన్ని నల్ల మచ్చలపై అప్లై చేయాలి. 10 నిమిషాల తర్వాత ముఖాన్ని మర్దన చేసుకుంటూ గోరువెచ్చని నీటితో కడిగేసుకుంటే సరి. ఈ నల్ల మచ్చలు పోవాలంటే మరో చిన్న చిట్కా ఉంది. అదేమిటంటే రోజూ ముఖానికి పసుపుకు కొద్దిగా గ్లిజరిన్ కలిపి రాసుకోవాలి. అది పూర్తిగా ఆరిపోయాక పాలతో కానీ గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే మచ్చలు తగ్గుముఖం పడతాయి. -
హోలీ... రంగెలా వదిలేది?
హోలీ... అందరికీ ఎంతో ఇష్టమైన, సరదా అయిన పండుగ. రంగులు వెదజల్లుకునే ఆ పండుగ నాడు... జీవితానికే ఓ కొత్త రంగును వచ్చినట్టుగా అనిపిస్తుంది. ప్రపంచమంతా కలర్ఫుల్గా మారిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. అయితే పండుగ వరకూ ఓకే గానీ... ఆ తర్వాతే వస్తుంది అసలు తంటా. ఒంటికి, బట్టలకి అయ్యే రంగుల్ని వదిలించేసరికి తల ప్రాణం తోకకొస్తుంది. అలా అని రంగులు చల్లుకోకుండా ఉండలేం కదా. అందుకే హ్యాపీగా పండుగ చేసుకోండి. ఆ తర్వాత రంగుల్ని వదిలించుకోవడానికి ఈ చిట్కాలు ఫాలో అయిపోండి! ఒంటి రంగులకి: శెనగపిండిలో పాలు, పెరుగు, బాదం నూనె, రోజ్‌వాటర్ కలిపి పేస్ట్‌లా చేసి, ఒళ్లంతా పట్టించి, కాసేపుంచి కడిగేసుకుంటే రంగు వదిలిపోతుంది. కొబ్బరినూనెని కొద్దిగా వెచ్చబెట్టి, దానితో ఒళ్లంతా మర్దనా చేసుకోవాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే ఫలితముంటుంది. కలబంద గుజ్జులో నిమ్మరసం కలిపి ఒళ్లంతా రుద్దుకుని, ఆపైన స్నానం చేస్తే రంగులు పోతాయి. కొన్నిసార్లు ఒళ్లంతా వదిలిపోయినా, ముఖానికి అంటిన రంగు మాత్రం త్వరగా వదలదు. అలాంటప్పుడు ముల్తానీ మట్టితో ప్యాక్ వేసుకుంటే మంచిది. రంగులు చర్మానికి అంటుకుపోయి దురదగా అనిపిస్తే... గ్లిజరిన్, రోజ్ వాటర్ కలిపి రాసుకుని, గోరు వెచ్చని నీటితో స్నానం చేస్తే దురద పోతుంది.తలకు అంటిన రంగుల్ని వదిలించడానికి... పెరుగులో గుడ్డు తెల్లసొనను కలిపి తలకు పట్టించాలి. గంట తర్వాత షాంపూతో తలంటుకుంటే సరిపోతుంది. బట్టల రంగులకి బట్టలపై రంగుల మరకలు ఉండిపోతే... నిమ్మరసంతో రుద్ది, వేడి నీళ్లతో ఉతికితే పోతాయి.అరకప్పు వైట్ వెనిగర్‌లో చెంచాడు లిక్విడ్ డిటర్జెంట్‌ను వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని చల్లని నీటిలో వేసి కలిపి, అందులో బట్టల్ని నానబెట్టాలి. కాసేపటి తర్వాత తీసి ఉతికితే రంగులు తేలికగా పోతాయి. వేడి నీటిలో బ్లీచింగ్ పౌడర్ వేసి నానబెట్టి ఉతికితే ఫలితముంటుంది. అయితే క్లోరిన్ లేని బ్లీచ్నే వాడాలి.మార్కెట్లో కలర్ రిమూవర్స్ కూడా దొరుకుతాయి. వాటిని ఉపయోగిస్తే అసలు సమస్యే ఉండదు. వాషింగ్ మెషీన్లో ఉతకాలనుకుంటే... విప్పిన బట్టల్ని ముందు నీటిలో జాడించి అప్పుడు మెషీన్లో వేయండి. అలాగే డిటర్జెంట్ పౌడర్‌తో పాటు కాస్త వైట్ వెనిగర్‌ను వేస్తే, రంగులు మెషీన్‌కు అంటుకోకుండా ఉంటాయి!