అమెరికా ఆఫీసుల్లో వాటిపై నిషేధం
న్యూఢిల్లీ: రాజధాని ఢిల్లీ, ముంబై, కోల్కతాలోని తమ దౌత్య కార్యాలయాల్లోకి సందర్శకులు ల్యాప్టాప్లు, ట్యాబ్లెట్లు, ఐప్యాడ్లు లాంటి పరికరాలను తీసుకురాకుండా అమెరికా నిషేధం విధించింది. గురువారం నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వస్తున్నట్లు పేర్కొంది. చెన్నై కేంద్రంలో అన్ని రకాల ఎలక్ట్రానిక్ పరికరాలను ఇప్పటికే నిషేధించారు. ప్రపంచవ్యాప్తంగా తమ అన్ని కేంద్రాల్లోనూ అమెరికా ఇలాంటి చర్యలే చేపట్టింది. యూఎస్ ప్రభుత్వ కార్యాలయాల్లో భద్రతను పెంచేందుకే ఈ మార్పులు చేస్తున్నామని ఢిల్లీ దౌత్య కార్యాలయం అధికార ప్రతినిధి వెల్లడించారు.
వ్యక్తిగత ఎలక్ట్రానిక్ వస్తువులు ల్యాప్టాప్లు, ట్యాబ్లెట్లు, ఐప్యాడ్లతో పాటు నెట్బుక్స్, క్రోమ్బుక్స్, ఐపాడ్లు, కిండిల్స్, మ్యాక్బుక్స్లను కూడా అనుమతించబోమని స్పష్టం చేశారు. ఢిల్లీ, ముంబై, కోల్కతా దౌత్య కార్యాలయాల్లోకి సందర్శకులను మొబైల్ఫోన్లతో అనుమతిస్తామని చెప్పారు. చెన్నై కార్యాలయంలో మొబైల్ఫోన్లను కూడా అనుమతించబోమన్నారు. సందర్శకుల ఎలక్ట్రానిక్ వస్తువులు కార్యాలయం వెలుపల పెట్టుకునేందుకు ఎటువంటి ఏర్పాట్లు లేవని వెల్లడించారు.