Personal Health Policy
-
ప్రీమియం భారమైతే.. పరిష్కారం?
హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు మరోసారి ప్రీమియం బాదుడు షురూ చేశాయి. ‘కర్ణుడి చావుకి కోటి కారణాలన్నట్టు’.. బీమా సంస్థలు కూడా ప్రీమియం పెంచడానికి ఎన్నో కారణాలు చూపిస్తుంటాయి. లోకల్ సర్కిల్స్ సంస్థ ఇటీవలే నిర్వహించిన ఒక సర్వేలో.. గడిచిన ఏడాది కాలంలో తమ వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రీమియం 25 శాతం పెరిగినట్టు 52 శాతం మంది చెప్పారు. హెల్త్ ఇన్సూరెన్స్ నూతన పాలసీల ప్రీమియం సైతం ఈ ఏడాది మొదటి మూడు నెలలల్లోనే 5.54 శాతం మేర పెరిగినట్టు బీమా పంపిణీ ప్లాట్‌ఫామ్ ‘పాలసీఎక్స్’ చెబుతోంది. రెక్కలు తొడిగిన పక్షి మాదిరిగా ఇలా ప్రీమియం గణనీయంగా పెరుగుతూ పోతుంటే కొత్తగా పాలసీ తీసుకునే వారికే కాదు, అప్పటికే పాలసీ తీసుకున్న వారిపైనా అదనపు భారం పడుతుంది. మరి ఈ పరిస్థితుల్లో ప్రీమియం భారం కొంత తగ్గించుకునే మార్గాలేంటన్నది చూద్దాం. ప్రీమియం ఎందుకు పెరుగుతోంది..హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీల ప్రీమియం గణనీయంగా పెరిగిపోవడానికి వైద్య ద్రవ్యోల్బణం ప్రధాన కారణంగా కనిపిస్తోంది. సాధారణంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించే ద్రవ్యోల్బణం నిత్యావసరాలకు (వినియోగ ధరల, టోకు ధరల ఆధారిత) సంబంధించినది. ఇది 5–6 శాతం మధ్య ఉంటోంది. కానీ, వైద్య రంగంలో ద్రవ్యోల్బణం ఇంతకు రెట్టింపు 14–15 శాతంగా ఉంటోంది. చికిత్సల వ్యయాలు ఈ స్థాయిలో ఏటా పెరిగిపోతుండడంతో, బీమా సంస్థలకు పెద్ద మొత్తంలో క్లెయిమ్‌లు వస్తున్నాయి. దీంతో వాటిపై చెల్లింపుల భారం పడుతోంది. ‘‘వైద్య రంగంలో ఎప్పటికప్పుడు అధునాతన టెక్నాలజీలు, చికిత్సలు అందుబాటులోకి వస్తున్నాయి. ఆరోగ్య సంరక్షణ వసతులు మెరుగుపడడం, ప్రాణాలను కాపాడే అధునాతన చికిత్సలు అందుబాటులోకి రావడం.. ఇవన్నీ వ్యయాలు పెరగడానికి దారితీస్తున్నాయి’’ అని రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ సీఈవో రాకేశ్ జైన్ తెలిపారు. ఔషధాలు, ఇంప్లాంట్లు, ఇతరత్రా వ్యయాలు పెరగడం వల్లే ఆస్పత్రుల చికిత్సల ధరలు పెరిగేందుకు కారణమవుతున్నట్టు కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ అండర్ రైటింగ్, క్లెయిమ్స్ హెడ్ మనీష్ దొదేజా సైతం పేర్కొన్నారు. జీవనశైలి, ఇతర వ్యాధుల రిస్క్ పెరగడం కూడా అధిక క్లెయిమ్‌లకు దారితీస్తున్నట్టు చెప్పారు. ‘‘మనదేశం ప్రపంచ మధుమేహం రాజధానిగా మారుతోంది. అధిక రక్తపోటు, గుండె జబ్బులు, కేన్సర్ రిస్క్ సైతం పెరుగుతోంది’’అని ఇన్సూరెన్స్ సమాధాన్ సంస్థ సహ వ్యవస్థాపకురాలు శిల్పా అరోరా తెలిపారు. కరోనా సమయంలో, ఆ తర్వాత కూడా ఆరోగ్య సమస్యలతో ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య పెరిగింది. దీంతో బీమా సంస్థలకు పరిహారం కోరుతూ వచ్చే క్లెయిమ్‌లు గణనీయంగా పెరిగాయి. ఈ భారాన్ని దింపుకునేందుకు బీమా సంస్థలు విడతలవారీగా పాలసీదారులకు ప్రీమియం వాత పెడుతున్నట్టు విశ్లేషకులు చెబతున్నారు. కరోనా తర్వాత ఆరోగ్య బీమా ప్రీమియం సవరణ ఇప్పడే మొదటిసారి కాదు. లోగడ ఒకటి రెండు సార్లు కూడా అవి సవరించాయి.అందరికీ కవరేజ్ లేకపోవడమూ కారణమే...ఇక మనదేశంలో హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ అందరికీ లేకపోవడం కూడా ప్రీమియం అధికంగా ఉండడానికి మరొక కారణమంటున్నారు నిపుణులు. ఎక్కువ మంది హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే బీమా సంస్థలు వ్యయాలను మరింత మంది పాలసీదారులతో పంచుకోవడానికి వీలు ఏర్పడుతుంది. దీంతో విడిగా ఒక్కొక్కరిపై పడే ప్రీమియం భారం తగ్గుతుంది. ప్రీమియంపై 18 శాతం జీఎస్టీ సైతం మరో పిడుగులాంటిదే. ఉదాహరణకు రూ.10వేల వార్షిక ప్రీమియంపై రూ.1,800 జీఎస్టీని కేంద్రం వసూలు చేస్తోంది. బీమా సంస్థలు వయసుల వారీగా ప్రీమియం పెంచుతుంటాయి. ఉదాహరణకు ఒక వ్యక్తి 35 ఏళ్లు నిండి 36వ సంవత్సరంలోకి ప్రవేశించినప్పుడు ప్రీమియం పెరిగిపోతుంది. అలాగే 45 ఏళ్లు నిండి 46లోకి ప్రవేశించినప్పుడు కూడా ప్రీమియం టారిఫ్‌లను బీమా సంస్థలు సవరిస్తుంటాయి. ఎందుకంటే వయసు పెరుగుతున్న కొద్దీ ఆరోగ్య సమస్యలు అధికమవుతుంటాయి. దీంతో చికిత్సల క్లెయిమ్‌ల రిస్క్ పెరిగిపోతుంటుంది. దీన్ని ఎదుర్కొనేందుకు బీమా సంస్థల ముందున్న ఏకైక పరిష్కారం ప్రీమియం బాదుడే. ఇక బీమా పాలసీ తీసుకున్న వారు కూడా పెద్ద పట్టణాల్లోని ప్రముఖ హాస్పిటల్స్‌లో చికిత్సలు తీసుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. పేరొందిన కార్పొరేట్ ఆస్పత్రుల్లో సాధారణంగానే వైద్య చికిత్సల చార్జీలు ఎక్కుగా ఉంటాయి. దీంతో బీమా సంస్థలకు పెద్ద మొత్తంలో క్లెయిమ్ బిల్లులు వస్తున్నాయి. ఇది కూడా ప్రీమియం పెరిగేందుకు కారణమవుతోంది. ఇటీవలే బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐర్‌డీఏఐ) ముందస్తు వ్యాధులకు వెయిటింగ్ పీరియడ్‌ను నాలుగేళ్ల నుంచి మూడేళ్లకు తగ్గించింది. మారటోరియం పీరియడ్‌ను ఎనిమిదేళ్ల నుంచి ఐదేళ్లకు తగ్గించింది. దీనివల్ల కూడా క్లెయిమ్‌లు పెరుగుతాయన్న అంచనాతో బీమా సంస్థలు ప్రీమియంను సవరిస్తున్నాయి. వచ్చే 12 నెలల కాలంలోనూ ప్రీమియంలు పెరుగుతాయన్న విశ్లేషణలు ఉన్నాయి. అసలు హెల్త్ ప్లాన్ అవసరమా?హెల్త్ ప్లాన్ లేకపోతే ఆర్థికంగా కుటుంబం గుల్ల కాక తప్పదు. ప్రీమియం భారంగా మారిందని హెల్త్ ప్లాన్ ప్రీమియం కట్టడం మానేయవద్దు. ఎందుకంటే జీవనశైలి వ్యాధులు పెరిగిపోయాయి. అదే సమయంలో అత్యాధునిక చికిత్సా విధానాలతో వ్యయాలు కూడా పెరిగాయి. హెల్త్ ప్లాన్ తీసుకోకపోతే.. అనుకోకుండా ఏదైనా అనారోగ్యం బారిన పడినప్పుడు లేదా రోడ్డు ప్రమాదం కారణంగా ఆస్పత్రిలో చేరాల్సి వస్తే, రుణాలతో గట్టెక్కాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. దీనివల్ల ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. అందుకని ఆరోగ్య బీమా రక్షణ ఉండేలా చూసుకోవడం తప్పనిసరి.– లోకల్ సర్కిల్స్ సర్వే వివరాలివి...→ 21 % మంది గడిచిన ఏడాదిలో తమ పాలసీ ప్రీమియం 50 శాతం కంటే ఎక్కువే పెరిగినట్టు చెప్పారు. 31 % మంది 25–50 % మధ్య ప్రీమియం గతేడాదితో పోలిస్తే పెరిగినట్టు తెలిపారు. → 15 శాతం మంది తమ ప్రీమియంలో ఎలాంటి మార్పు లేదన్నారు. వీరిలో ఎక్కువ మంది గ్రూప్ హెల్త్ ప్లాన్‌లో ఉన్నవారే.→ మొత్తం 11,000 మంది ఈ సర్వేలో పాల్గొన్నారు. భారం ఎలా తగ్గించుకోవాలి? పోరి్టంగ్: ఆరోగ్య బీమా ఒకసారి కొనుగోలు చేసి మర్చిపోయే వస్తువు కాదు. కాలమాన పరిస్థితులకు అనుగుణంగా మీ పాలసీలోని సదుపాయాలు ఉన్నాయా? అన్నది ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలి. సహేతుక ప్రీమియంపై మరింత మెరుగైన ఫీచర్లను వేరొక బీమా సంస్థ ఆఫర్ చేస్తుంటే, అందులోకి మారిపోవడం మంచి నిర్ణయమే అవుతుంది. హెల్త్ ఇన్సూరెన్స్‌ను ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి పోర్ట్ పెట్టుకోవచ్చు. కేవలం ప్రీమియం కొంత తక్కువగా ఉందని చెప్పి పోరి్టంగ్ ఆప్షన్‌ను పరిశీలించడం సరైనది కాదు. ప్రీమియంలో చెప్పుకోతగ్గ వ్యత్యాసానికి తోడు, కొత్త సంస్థ ప్లాన్‌లో సదుపాయాలు మెరుగ్గా ఉన్నప్పుడే పోరి్టంగ్ను పరిశీలించొచ్చు. పోరి్టంగ్తో వేరొక బీమా సంస్థకు మారిపోయిన తర్వాత.. అక్కడ కూడా పాలసీ రెన్యువల్ (పునరుద్ధరణ) సమయంలో ప్రీమియం పెంచరని చెప్పలేం. అన్ని బీమా సంస్థలూ తమ క్లెయిమ్, ప్రీమియం నిష్పత్తి ఆధారంగానే ప్రీమియం పెంపు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాయి. కనుక ప్రీమియం పెంచినప్పుడల్లా దాన్ని తగ్గించుకునేందుకు కంపెనీని మారడం సరైన నిర్ణయం అనిపించుకోదు. ఒకేసారి మూడేళ్లు: ప్రీమియంను ఒకేసారి మూడేళ్లకు చెల్లించే ఆప్షన్ కూడా ఉంది. ఇలా ఒకేసారి మూడేళ్లకు ప్రీమియం చెల్లిస్తే 10–15 శాతం ప్రీమియంలో తగ్గింపు లభిస్తుంది. దీనివల్ల మూడేళ్ల పాటు ప్రీమియం పెంపు భారాన్ని తప్పించుకోవచ్చు. వయసువారీ శ్లాబు మారే ముందు మూడేళ్ల ప్రీమియం ఒకేసారి చెల్లించడం వల్ల.. అక్కడి నుంచి మూడేళ్ల పాటు పెంపు లేకుండా చూసుకోవచ్చు. సూపర్‌టాపప్: ప్రస్తుత పాలసీలో ఎంత కవరేజీ ఉందన్నది ఒక్కసారి గమనించండి. ఒకవేళ రూ.10 లక్షల కవరేజీ ఉంటే, దాన్ని రూ.5 లక్షలకు తగ్గించుకుని, రూ.5 లక్షల డిడక్టబుల్‌తో రూ.20–50 లక్షలకు సూపర్ టాపప్ ప్లాన్ తీసుకోవడం మరో మార్గం. దీనివల్ల బేస్ ప్లాన్ ప్రీమియం తగ్గుతుంది. సూపర్ టాపప్ చౌకగా వస్తుంది. దీనివల్ల మొత్తం మీద ప్రీమియంలో 10–15 శాతం తగ్గుతుంది. ఫ్లోటర్ ప్లాన్: అవివాహితులు ఇండివిడ్యువల్ ప్లాన్ తీసుకుని ఉంటే.. వివాహం తర్వాత జీవిత భాగస్వామితో కలసి కొత్త ప్లాన్‌కు వెళ్లొద్దు. అప్పటికే ఉన్న ప్లాన్‌ను ఫ్లోటర్‌గా మార్చుకుని, జీవిత భాగస్వామిని చేర్చుకోవాలి. దీనివల్ల జీవిత భాగస్వామి ఒక్కరికే వెయిటింగ్ పీరియడ్ తదితర నిబంధనలు వర్తిస్తాయి. కొంత ప్రీమియం కూడా తగ్గుతుంది. గ్రూప్ ప్లాన్: ప్రీమియం భారంగా పరిణమిస్తే.. అప్పుడు పనిచేస్తున్న సంస్థ నుంచి గ్రూప్ ప్లాన్ తీసుకోవడాన్ని పరిశీలించొచ్చు. లేదంటే దాదాపు అన్ని ప్రైవేటు బ్యాంక్‌లు గ్రూప్ హెల్త్‌ప్లాన్లను తమ కస్టమర్లకు తక్కువ ప్రీమియానికే ఆఫర్ చేస్తున్నాయి. వీటిని పరిశీలించొచ్చు. యాక్టివ్ హెల్త్ ప్లాన్: కొన్ని బీమా సంస్థలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించే వారికి ప్రీమియంలో రాయితీ ఇస్తున్నాయి. రోజువారీ వ్యాయామం, నడక తదితర సాధనాలు చేయడం వల్ల అనారోగ్యం రిస్క్ తగ్గుతుందని తెలుసు. దీనివల్ల బీమా సంస్థలకు క్లెయిమ్‌ల రిస్క్ తగ్గుతుంది. పాలసీదారులను ఆరోగ్య సంరక్షణ దిశగా ప్రోత్సహించి, తమ క్లెయిమ్‌లను తగ్గించుకునేందుకు బీమా సంస్థలు ఇలాంటి ప్లాన్లను ఆఫర్ చేస్తున్నాయి. వీటిల్లో 50 శాతం వరకు ప్రీమియం ఆదా చేసుకోవచ్చు. కోపే: బీమా ప్రీమియం కట్టలేనంత భారంగా మారిపోతే.. అప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ రద్దు కావడం కంటే.. కో పే ఆప్షన్‌కు వెళ్లొచ్చు. ఉదాహరణకు 20 % కో పే ఎంపిక చేసుకుంటే.. ప్రీమియంలోనూ అంతే మేర డిస్కౌంట్ వస్తుంది. హాస్పిటల్లో చేరి చికిత్స తీసుకున్నప్పుడు వచ్చే బిల్లులో 80 శాతాన్నే బీమా సంస్థ చెల్లిస్తుంది. 20 శాతాన్ని పాలసీదారు సొంతంగా భరించాల్సి వస్తుంది. నో క్లెయిమ్ బోనస్: దాదాపు అన్ని బీమా సంస్థలు నో క్లెయిమ్ బోనస్‌ను ఆఫర్ చేస్తున్నాయి. అంటే ఒక పాలసీ సంవత్సరంలో ఎలాంటి క్లెయిమ్ లేకపోతే, మరుసటి సంవత్సరం రెన్యువల్ అనంతరం 10–100 శాతం వరకు ఏటా కవరేజీని పెంచుతుంటాయి. ఇలా గరిష్టంగా 100–200 శాతం వరకు కవరేజీ పెరుగుతుంది. ఉదాహరణకు రూ.10 లక్షల హెల్త్ ప్లాన్‌పై 50 శాతం నో క్లెయిమ్ బోనస్ ఆఫర్ ఉందనుకుంటే.. ఒక ఏడాదిలో క్లెయిమ్ లేకపోతే మరుసటి సంవత్సరం కవరేజీ రూ.15 లక్షలకు పెరుగుతుంది. రెండో ఏడాది కూడా క్లెయిమ్ లేకపోతే రూ.20 లక్షలకు పెరుగుతుంది. మూడో ఏడాది క్లెయిమ్ వస్తే, అప్పుడు పెరిగిన రూ.10 లక్షల నుంచి 50 శాతం అంటే రూ.5 లక్షలను తగ్గిస్తాయి. కానీ కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ అయితే సుప్రీమ్ ప్లాన్‌లో సమకూరిన నో క్లెయిమ్ బోనస్‌ను క్లెయిమ్ చేసుకున్నా డిడక్షన్ అమలు చేయడం లేదు. అంటే నో క్లెయిమ్ బోనస్ కూడా కవరేజీగానే మిగిలిపోతుంది. కనుక బేస్ కవర్ రూ.5 లక్షలు తీసుకోవడం ద్వారా ఈ ప్లాన్‌లో మెరుగైన కవరేజీని పొందొచ్చు. దీనివల్ల ప్రీమియం కూడా తగ్గుతుంది. పెద్దలు ఉంటే వారిని ప్రత్యేక ప్లాన్ కింద వేరు చేయాలి. -
హెల్త్ బీమా ఎందుకు తప్పనిసరి?
నేటి జీవనశైలి, ఆరోగ్య పరిస్థితుల నేపథ్యంలో ప్రతి కుటుంబానికీ హెల్త్ ఇన్సూరెన్స్ అవసరం ఎంతో ఉంది. అయినా, ప్రీమియం భారంగా భావించి హెల్త్ కవరేజీ తీసుకోని వారు మన సమాజంలో ఇప్పటికీ చాలా మందే ఉన్నారు. కనుక అందరూ కాకపోయినా కొందరు అయితే నూటికి నూరు శాతం హెల్త్ కవరేజీ ఉండేలా చూసుకోవాలి. లేదంటే, ఆర్థిక పరమైన సంక్షోభాన్ని హెల్త్ రిస్క్ రూపంలో ఎదుర్కోవాల్సి రావచ్చు. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల ఎవరికి ఎక్కువ ప్రయోజనం..? అనారోగ్యం లేదా ప్రమాదం కారణంగా ఆస్పత్రిలో చేరాల్సి వస్తే హెల్త్ కవరేజీ ఉంటే ఆ నిశ్చింతే వేరు. వయసు పెరుగుతున్న కొద్దీ పలు అనారోగ్యాలు, వ్యాధులు పలకరిస్తుంటాయి. కొందరికి చిన్న వయసులోనే ఆరోగ్య సమస్యలు ఎదురుకావచ్చు. ఫిట్నెస్తో సంబంధం లేకుండా వచ్చే కేన్సర్ వంటి మహమ్మారులూ ఉన్నాయి. అందుకని ఆరోగ్య బీమాను మంచి పెట్టుబడిగా.. ధైర్యాన్నిచ్చే, అవసరంలో రక్షణనిచ్చే మంచి ఆయుధంగా చూడాలి. సంపాదన మొదలు పెట్టిన నాటి నుంచి లేదా కనీసం పెళ్లయిన వెంటనే ఆరోగ్య బీమా తీసుకోవాలి. ముఖ్యంగా కుటుంబంలో వ్యాధుల చరిత్ర ఉన్నవారు ఆరోగ్య బీమాను ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించడం లేదా ఆలస్యం చేయడం సరికాదు. నిర్లక్ష్యం చేస్తే రిస్క్‌ను ఆహ్వానించినట్టే అవుతుంది. వంశపారంపర్యంగా వచ్చే వ్యాధులు ఎన్నో ఉన్నాయి. అలాగే, పిల్లల్ని కనే వయసులోని మహిళలు, అంటువ్యాధులు ఎక్కువగా కనిపించే ప్రాంతాల్లో ఉండేవారు, తరచూ ప్రయాణించే వారు (విమాన ప్రయాణం కావచ్చు.. ఉద్యోగరీత్యా తరచూ వాహన ప్రయాణం చేసే వారు) ఆరోగ్య బీమాను వెంటనే తీసుకోవాలి. తీసుకుంటే పాలసీదారులకే ప్రయోజనం. బీమా కంపెనీలకు కాదు. వీలైనంత చిన్న వయసులోనే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం అన్నది ఎంతో ప్రయోజనకరం. ఎందుకంటే ఆ వయసులో వ్యాధుల రిస్క్ ఉండదు. తక్కువ ప్రీమియానికే మెరుగైన కవరేజీ లభిస్తుంది. హెల్త్ ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరికీ ఉండాలి. కానీ, ఇక్కడ చెప్పుకున్న విభాగాల్లోని వారికి హెల్త్ ప్లాన్ పక్కా ఉండాల్సిందే. కుటుంబ చరిత్ర కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు నేడు వంశపారంపర్యంగా మారాయి. ఇందుకు ఆయా కుటుంబాల జీవనశైలి, ఆహార నియమాలు, జీన్స్ ఇలా ఎన్నో అంశాలు నేపథ్యంగా ఉండొచ్చు. గుండె జబ్బులు, మధుమేహం, పలు రకాల కేన్సర్ సమస్యలు ఇవన్నీ వంశపారంపర్యంగా వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మరణాలకు కూడా ఇవి కారణమవుతున్నాయి. కుటుంబ చరిత్రలో ఎవరికైనా ఈ సమస్యలు ఉంటే కనుక తప్పకుండా బీమా కవరేజీ తీసుకుని రక్షణ కల్పించుకోవాలి. ఆయా వ్యాధులు పలకరించక ముందు నుంచే బీమా ఉంటుంది కనుక.. ముందు నుంచి ఉన్న వ్యాధుల పరిధిలోకి అవి రావు. ముందు నుంచి ఉన్న వ్యాధులకు హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థలు పాలసీ తీసుకున్న నాటి నుంచి కనిష్టంగా రెండేళ్లు.. గరిష్టంగా నాలుగేళ్ల వరకు వేచి ఉండాలని కోరుతుంటాయి. కంపెనీల మధ్య ఈ వెయిటింగ్ పీరియడ్ వేర్వేరుగా ఉండొచ్చు. ఆలస్యం చేస్తే ఏమవుతుందంటే.. ఆరో గ్య సమస్యలు వెలుగుచూస్తాయి. దీంతో బీమా కంపెనీలు నిర్ణీత కాలం పాటు వెయిటింగ్ తర్వాతే వాటికి కవరేజీని ఆఫర్ చేస్తాయి. అది కూడా అధిక ప్రీమియానికే అని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే వీరి నుంచి క్లెయిమ్‌ల రిస్క్ ఉంటుంది. అవన్నీ మదింపు వేసి, అందుకు తగ్గ ప్రీమియాన్ని అవి వసూలు చేస్తాయి. ఆరోగ్యవంతులకు, ఆరోగ్య సమస్యలున్న వారికి ఒక్కటే ప్రీమియం వసూలు చేయ డం అన్నది అసాధ్యం. వెయిటిం గ్ పీరియడ్ వల్ల ఆయా కాలంలో అవే ఆరోగ్య సమస్య లతో ఆస్పత్రిలో చేరాల్సి వస్తే.. ఖర్చంతా పాలసీదారు స్వయంగా భరించా ల్సి వస్తుందని గుర్తుంచుకోవాలి. అందుకనే చిన్న వయసులోనే బీమా రక్షణ కల్పించుకో వాలని నిపుణులు సూచిస్తుంటారు. కొన్ని ప్రాంతాలు వేరు.. దేశంలోని చాలా ప్రాంతాల్లో వేడి వాతావరణ పరిస్థితులు ఉంటుంటాయి. ఆయా ప్రాంతాల్లో డెంగీ, చికెన్ గున్యా, మలేరియా కేసులు అప్పుడప్పుడు పెద్ద సంఖ్యలో కనిపిస్తుంటాయి. అందుకని వీటికి కవరేజీని ఆఫర్ చేసే బీమా ప్లాన్లను ఆయా ప్రాంతాల్లో నివసించే వారు తప్పకుండా తీసుకోవాలి. ముఖ్యంగా అవుట్ పేషెంట్ కవరేజీతో ఈ ప్లాన్లు ఉండేలా చూసుకోవాలి. కొన్ని ప్రాంతాల్లో అక్కడి ప్రత్యేక పరిస్థితుల కారణంగా కొన్ని వ్యాధులు తరచూ కనిపిస్తుంటాయి. స్థానికులు వాటిపై అవగాహనతో కవరేజీ ఉండేలా జాగ్రత్త పడాలి. ఇలాంటి సమస్యలకు అవుట్ పేషెంట్‌గా వైద్యం చేయించుకోవాలన్నా భారీగా ఖర్చవుతుంది. హెల్త్ప్లాన్లలో ఇన్‌పేషెంట్ (ఆస్పత్రిలో చేరి తీసుకునే చికిత్సలు) కవరేజీ విషయంలో సందేహం అక్కర్లేదు. అదే సమయంలో అవుట్ పేషెంట్‌గా చేసే ఖర్చును కూడా దృష్టిలో పెట్టుకుని పాలసీ ఎంపిక జరగాలి. నేడు చాలా బీమా సంస్థలు అవుట్ పేషెంట్ కవరేజీ (ఓపీడీ)ని అందిస్తున్నాయి. వీటికి కొన్ని పరిమితులు, షరతులు, కొంత అదనపు ప్రీమియం అమలవుతుంది. ఐసీఐసీఐ లాంబార్డ్ బీఫిట్, రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ డిజిటల్ కేర్ ప్లాన్లు రూ.1,000 నుంచి రూ.10,000 ఓపీడీ కవరేజీ కోసం రూ.300 నుంచి రూ.3,000 వరకు ప్రీమియం వసూలు చేస్తున్నాయి. వీటిని యాడాన్‌గా లేదంటే పాలసీలో భాగంగా తీసుకోవచ్చు. ఓపీడీ కవరేజీలో టెలిమెడికల్ కన్సల్టేషన్లు, వార్షిక హెల్త్ చెకప్‌లు ఉచితంగా లభిస్తాయి. తరచూ ప్రయాణాలు.. ప్రమాదకరమైన వృత్తుల్లో పనిచేసే వారికి అన్ని బీమా సంస్థలు ప్లాన్లను ఆఫర్ చేయడం లేదు. కొన్ని మాత్రం కఠిన అండర్ రైటింగ్ నిబంధనలకు లోబడి కవరేజీని ఇస్తున్నాయి. తరచూ ప్రయాణాలు చేసే వారికి కూడా ఎన్నో రకాల రిస్క్‌లు ఎదురవుతుంటాయి. వీరు సులభంగానే హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవచ్చు. ఇతర వృత్తులతో పోలిస్తే ఇలా తరచూ ప్రయాణించే వారికి ఆరోగ్య సమస్యల రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఈ తరహా వ్యక్తులు క్యాష్‌లెస్ కవరేజీ నెట్‌వర్క్‌లో ఎక్కువ ఆస్పత్రులు ఉండే బీమా సంస్థ నుంచి ప్లాన్ తీసుకోవడం మంచిది. ప్రయాణ సమయంలో ఎక్కడ ఇబ్బంది వచ్చినా సమీపంలోని నెట్వర్క్ హాస్పిటల్‌కు వెళ్లి నగదు రహిత వైద్యాన్ని పొందడానికి వీలుంటుంది. క్యాష్‌లెస్ హాస్పిటల్స్ ఎక్కువగా ఉన్న బీమా సంస్థల ప్లాన్లలోని సదుపాయాలను విశ్లేషించిన తర్వాత ఒకదానిని ఎంపిక చేసుకోవాలి. సొంత ప్రాంతంలో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చినప్పుడు నగదు రహిత చికిత్సల ఆస్పత్రి కాకపోయినా.. ఎవరో ఒకరి నుంచి బదులు తీసుకుని చికిత్స తీసుకోవచ్చు. కానీ, ప్రయాణాల సమయంలో సమస్య వస్తే అప్పుడు ఆదుకునేది నగదు రహిత వైద్యమే అని గుర్తు పెట్టుకోవాలి. అంతర్జాతీయ ప్రయాణాలు చేసే వారు ఈ విషయంలో మరింత శ్రద్ధ చూపించాల్సి ఉంటుంది. విదేశాల్లోనూ కవరేజీ లభించే విధంగా చూసుకోవాలి. ఇందుకోసం ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను కూడా తీసుకోవాల్సి రావచ్చు. దీనికంటే కూడా ప్రయాణాలు చేసే వృత్తుల్లోని వారు డొమెస్టిక్ హెల్త్ప్లాన్లోనే విదేశీ వైద్యానికి కూడా కవరేజీ ఉండే ఆప్షన్‌తో తీసుకోవడం మంచిది. మణిపాల్ సిగ్నా లైఫ్ టైమ్ హెల్త్‌ప్లాన్ 27 రకాల క్రిటికల్ ఇల్నెస్లకు విదేశాల్లో కవరేజీని ఆఫర్ చేస్తోంది. అలాగే, ఆదిత్య బిర్లా యాక్టివ్ హెల్త్‌ప్లాన్ 16 రకాల తీవ్ర ఆరోగ్య సమస్యలకు విదేశాల్లో క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ను అందిస్తోంది. ఈ తరహా వ్యక్తులు అధిక కవరేజీ (రూ.కోటి వరకు) తీసుకోవడం అత్యవసర పరిస్థితుల్లో అర్థవంతంగా ఉంటుంది. కూర్చుని చేసే ఉద్యోగాలు కదలికలు తక్కువగా ఉండి, సిస్టమ్ ముందు గంటలపాటు కూర్చుని పనిచేసే వారికి దీర్ఘకాలంలో వ్యాధుల రిస్క్ ఎక్కువ. వీరికి జాయింట్స్, స్పైన్ సమస్యలు, మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బుల రిస్క్ ఎక్కువగా ఉంటున్నట్టు పలు అధ్యయనాలు తేల్చాయి. కనుక వ్యక్తిగత ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపిస్తూనే.. మరోవైపు హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీకి కూడా ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. అందులోనూ సమగ్ర కవరేజీ ఉండేలా చూసుకోవాలి. పెళ్లయిన మహిళలు వివాహ బంధంలోకి అడుగుపెట్టి పిల్లల కోసం ప్లాన్ చేసుకునే మహిళలు బీమా కవరేజీ పట్ల ముందుగా దృష్టి సారించాలి. దాదాపు అన్ని బీమా సంస్థలు మెటర్నిటీ కవరేజీ కోసం వెయిటింగ్ పీరియడ్ అమలు చేస్తున్నాయి. కేవలం కొన్ని ప్లాన్లు వెయిటింగ్ పీరియడ్ లేకుండా పరిమితంగా మెటర్నిటీ కవరేజీ ఇస్తున్నాయి. ఉద్యోగం చేస్తుంటే సంస్థ నుంచి గ్రూపు హెల్త్ ప్లాన్ తీసుకోవడం మంచిది. ఎందుకంటే గ్రూపు హెల్త్ ప్లాన్లలో మొదటి రోజు నుంచే కవరేజీ లభిస్తుంది. స్టార్హెల్త్ యంగ్ స్టార్ గోల్డ్ ప్లాన్, టాటా ఏఐజీ మెడికేర్ ప్రీమియర్ ప్లాన్, ఫ్యూచర్ జనరాలి ప్రోహెల్త్ ప్లస్ మెటర్నిటీ కవరేజీని రూ.30,000–50,000 మధ్య ఆఫర్ చేస్తున్నాయి. వీటిల్లో వెయిటింగ్ పీరియడ్ ఉంది. పుట్టే బేబీలకు మొదటి రోజు నుంచి కవరేజీ ఆప్షన్‌తో ఉన్న ప్లాన్ మెరుగైనది అవుతుంది. బజాజ్ అలియంజ్ హెల్త్ సుప్రీమ్ ప్లాన్‌లో.. ఆస్పత్రిలో చేరడానికి ముందు, ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత అయ్యే వ్యయాలకూ చెల్లింపులు చేస్తుంది. బేబీకి 90 రోజుల వరకు ఇచ్చే టీకాలకూ క్లెయిమ్ లభిస్తుంది. ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీలు అన్నీ కూడా కొత్తగా వచ్చే పిల్లలకూ కవరేజీని ఇచ్చే ఆప్షన్‌తోనే ఉంటాయి. గ్రూపు హెల్త్ ప్లాన్లలో వెయిటింగ్ పీరియడ్ ఉండదు. అందుకని పనిచేసే చోట గ్రూపు హెల్త్‌ప్లాన్ తీసుకుని, విడిగా ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ ఎంపిక చేసుకోవాలి. వ్యక్తులు వారి కుటుంబ ఆరోగ్య చరిత్ర, జీవనశైలి, వయసు ఇలాంటి అంశాలన్నీ పరిశీలించుకుని, ఆయా సమస్యలకు కవరేజీనిచ్చే, సమగ్ర ఆరోగ్య ప్లాన్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. కారణం ఏదైనా కానీ, పాలసీ తీసుకునే నాటికి ఏవైనా వ్యాధులు ఉంటే వాటి కోసం వేచి చూడక తప్పదు. అటువంటి సందర్భంలో అప్పటికే ఉన్న ఆరోగ్య సమస్యలకు సైతం కవరేజీ కోరుకునేట్టు అయితే.. కొన్ని సంస్థలు అధిక ప్రీమియంతో వెంటనే కవరేజీనిస్తున్నాయి. కొన్ని బీమా కంపెనీలు తక్కువ వెయిటింగ్ పీరియడ్‌తో పాలసీలను ఆఫర్ చేస్తున్నాయి. కాకపోతే వీటి ప్రీమియం ధరలు అధికంగా ఉంటాయని మర్చిపోవద్దు. ఎందుకంటే అండర్‌రైటింగ్ (వాటి రిస్క్‌ను సర్దుబాటు చేసుకోవడం) నిబంధనలను కఠినంగా అమలు చేయాల్సి వస్తుంది. గుండె జబ్బులు, కేన్సర్ తదితర తీవ్ర అనారోగ్య సమస్యలకు కవరేజీనిచ్చే క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్లు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇవి మొదటి 30 రోజుల వెయిటింగ్ పీరియడ్‌తో కవరేజీని ఆఫర్ చేస్తున్నాయి. కానీ, రెగ్యులర్ ప్లాన్‌లో వేచి ఉండే కవరేజీతో పోలిస్తే ఇలా తీసుకునే వాటి ప్రీమియం చాలా ఎక్కువ. పైగా తీసుకునే బీమా కవరేజీ కూడా ఇక్కడ కీలకమవుతుంది. కుటుంబంలో తీవ్ర ఆరోగ్య సమస్యల చరిత్ర ఉన్నా.. తీసుకునే నాటికి ఆరోగ్య సమస్యలు పలకరించినా.. రూ.5 లక్షల కవరేజీ ఏ మూలకు సరిపోకపోవచ్చు. ము ఖ్యంగా కేన్సర్ చికిత్సకు రూ.5 లక్షల కవరేజీ చాలదు. క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్లలో బెనిఫిట్ ఆప్షన్‌తో ఉన్న వాటికి ఎంపిక చేసుకుంటే జాబితాలోని వ్యాధి నిర్ధారణ అయిన వెంటనే ఆ మేరకు మొత్తం చెల్లించేస్తాయి. -
వ్యక్తిగతమా.. గ్రూప్ పాలసీనా...
కోవిడ్–19 రాకతో ఆరోగ్య సంరక్షణ ప్రాధాన్యత గురించి అవగాహన పెరిగింది. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీల అవసరాన్ని గుర్తించి, కొనుగోలు చేసే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ప్రస్తుతం రకరకాల హెల్త్ పాలసీలు ఉన్నాయి. వీటిలో వ్యక్తిగత ఆరోగ్య బీమా పాలసీ, గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అనేవి ఎక్కువగా ప్రాచుర్యంలో కనిపిస్తుంటాయి. వీటి గురించి వివరించేదే ఈ కథనం. గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్.. సాధారణంగా ఒక గ్రూప్‌గా ఉండే వ్యక్తుల కోసం ఈ తరహా పాలసీలను కంపెనీలు రూపొందిస్తుంటాయి. ఉదాహరణకు ఒకే కంపెనీలో పనిచేసే వ్యక్తుల కోసం ఇలాంటి పాలసీలు ఉంటాయి. పాలసీదారు కుటుంబ సభ్యులకు కూడా చాలా సందర్భాల్లో పాలసీ ప్రయోజనాలను వర్తింపచేసినా .. ఒక్కో సభ్యుడికి ఒక్కో రకమైన కవరేజ్ అంటూ ఉండదు. ప్రాథమికంగా గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది.. పాలసీదారులు ప్రమాదం కారణంగానైనా లేదా కోవిడ్–19 సహా ఇతరత్రా ఏదైనా అనారోగ్యంతోనైనా ఆస్పత్రిలో చేరితే కవరేజ్ ఇస్తుంది. ఇలాంటి పాలసీల కోసం బీమా కంపెనీలు మెడికల్ చెకప్ గురించి అడగవు. వ్యక్తిగత పాలసీలతో పోలిస్తే వీటి ప్రీమియంలు తక్కువగానే ఉంటాయి. గ్రూప్ అంగీకరించే కొటేషన్‌ను బట్టి ప్రతీ ఏడాది కవరేజీ మారవచ్చు. ఈ పాలసీల ప్రీమియాన్ని కంపెనీయే భరించవచ్చు లేదా సభ్యుడి నుంచి వసూలు చేయవచ్చు. గ్రూప్‌లో అందరికీ ఒకే రకమైన ప్రయోజనాలు ఉంటాయి. వ్యక్తిగత ఆరోగ్య బీమా.. ఈ పాలసీలను వ్యక్తులు నేరుగా కొనుగోలు చేస్తారు. వివిధ రకాల అస్వస్థతలు, ఆస్పత్రిలో చేరితే అయ్యే ఖర్చులు, ఇతరత్రా చికిత్సాపరమైన ఖర్చుల నుంచి రక్షణ పొందేందుకు .. పాలసీదారు తన అవసరాలకు అనుగుణంగా ఈ పాలసీల కవరేజీని ఎంచుకోవడానికి వీలు ఉంటుంది. జీవిత భాగస్వామి, పిల్లలు, తల్లిదండ్రులు, అత్త మామలు వంటి మీ మీద ఆధారపడిన వారికి కూడా కవరేజీ లభించేలా దీన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. పాలసీ తీసుకున్న వ్యక్తి నేరుగా ప్రీమియంను కట్టాల్సి ఉంటుంది. సకాలంలో పునరుద్ధరించుకోకపోతే పాలసీ గడువు ముగిసిపోతుంది. పాలసీ తీసుకునే వ్యక్తికి సంబంధించిన ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకుంటారు. అవసరమైతే వైద్య పరీక్షలు చేయించుకోవాలని కూడా బీమా కంపెనీ అడగవచ్చు. ఎవరికి ఏవి అనువైనవంటే.. ప్రీమియంలు చౌకగా ఉండటంతో పాటు యజమానే కడతారు కాబట్టి యుక్తవయస్కులకు గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ అర్థవంతంగానే ఉంటుంది. కానీ కుటుంబ బాధ్యతలు ఉన్నవారు.. తగినంత కవరేజీతో కూడిన వ్యక్తిగత ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవడం శ్రేయస్కరం. ఒకవేళ సంస్థ నుంచి గ్రూప్ ఇన్సూరెన్స్ కవరేజీ భారీగానే ఉన్నట్లయితే.. గ్రూప్ ఇన్సూరెన్స్ సమ్ ఇన్సూర్డ్‌తో సరిపోయే టాప్–అప్ కవర్ని తీసుకోవచ్చు. ఇది చౌకగానే రావడంతో పాటు మీకు తగినంత స్థాయిలో కవరేజీనీ అందిస్తుంది. కొన్ని కంపెనీలు భవిష్యత్తులో అవసరమైతే టాప్–అప్ను బేస్ కవర్‌గా మార్చుకునేందుకు కూడా అవకాశమిస్తున్నాయి. కాబట్టి హెల్త్ పాలసీని తీసుకునేటప్పుడు ఇవన్నీ పరిగణనలోకి తీసుకోవడం మంచిది. సుధా రెడ్డి, హెడ్ (హెల్త్ విభాగం) డిజిట్ ఇన్సూరెన్స్ -
ఆరోగ్య బీమా.. జాగ్రత్త సుమా
ఎంత త్వరగా తీసుకుంటే అంత మంచిది మనకు బీమా అవసరం రాకముందుగానే పాలసీ తీసుకోవడం మంచిది. ఎందుకంటే.. మనకు అవసరం పడినప్పుడు వైద్య బీమా లభించకపోవచ్చు. కనుక.. యుక్త వయసులో, సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నప్పుడే వైద్య బీమా పాలసీ తీసుకుంటే తక్కువ ప్రీమియానికే అధిక కవరేజి లభిస్తుంది. వయసు మీద పడ్డ తర్వాత కన్నా యుక్త వయసులో పాలసీ తీసుకున్నప్పుడు విస్తృతమైన కవరేజి లభిస్తుంది. వయసు పెరుగుతున్న కొద్దీ.. ప్రీమియంలు పెరుగుతాయి. ఒకవేళ అప్పటికే ఏదైనా అనారోగ్యం బారిన పడిన పక్షంలో, సదరు అనారోగ్యానికి కవరేజి లభించదు. ఫలితంగా మొత్తం పాలసీనే నిరర్థకమవుతుంది. చాలా కంపెనీల హెల్త్ ప్లాన్లకు నిర్దిష్టమైన ఎంట్రీ వయసుపై పరిమితి ఉంటుంది. అంటే, రిటైర్మెంట్ దగ్గరపడుతున్న కొద్దీ కవరేజీ పరిధి తగ్గిపోతుంటుంది. మరో విషయం.. ఏదైనా సంవత్సరంలో క్లెయిము చేయకపోయిన పక్షంలో పాలసీని రెన్యువల్ చే సుకునేటప్పుడు నో క్లెయిమ్ బోనస్ కూడా లభిస్తుంది. పన్ను ప్రయోజనాలు ఉంటాయి..కానీ.. వైద్య బీమా కోసం కట్టే ప్రీమియంల మీద పన్నుపరమైన ప్రయోజనాలు కూడా లభిస్తాయి. ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 80డీ కింద ఈ ప్రీమియాలకు పన్ను మినహాయింపులు వర్తిస్తాయి. మీ వయసు 65 ఏళ్ల కన్నా తక్కువ ఉంటే.. మీకు, మీ జీవిత భాగస్వామి, పిల్లలు, మీ తల్లిదండ్రుల కోసం కట్టే హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం కింద రూ. 15,000 దాకా మినహాయింపులను క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంది. అంతే కాదు.. తల్లిదండ్రులు సీనియర్ సిటిజన్స్ అయి ఉండి, వారికీ కవరేజీ ఉండేలా తీసుకున్న పక్షంలో గరిష్టంగా రూ. 20,000 దాకా పన్ను మినహాయింపులను క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే, కేవలం పన్ను ప్రయోజనాలను మాత్రమే దృష్టిలో పెట్టుకుని హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోకూడదు. మీకెంత కవరేజీ అవసరమవుతుందో ముందు అంచనా వేసుకోవాలి. ఇందుకోసం కావాలంటే బీమా సలహాదారు సహాయం తీసుకోవడం మంచిది. హెల్త్ ఇన్సూరెన్స్‌లో వివిధ రకాల కవరేజీలు ప్రధానంగా రెండు రకాల వైద్య బీమా కవరేజీలు ఉన్నాయి. అవి.. వ్యక్తిగత వైద్య బీమా ఇది చాలా సింపుల్ హెల్త్ ఇన్సూరెన్స్ పథకం. పాలసీదారు ఆస్పత్రి పాలైనప్పుడు సమ్ అష్యూర్డ్ పరిమితి దాకా బీమా కవరేజి లభిస్తుంది. ఉదాహరణకు.. నలుగురు సభ్యులున్న కుటుంబంలో ఒక్కొక్కరు విడిగా రూ. 3 లక్షలకు వైద్య బీమా తీసుకున్నారనుకుందాం. అప్పుడు చికిత్సా వ్యయం రూ.3 లక్షలు దాటినా కవరేజ్ కేవలం సమ్ అష్యూర్డ్ రూ.3 లక్షల వరకే లభిస్తుంది. అంతేకాని నలుగురుకి కలిపి రూ.12 లక్షల వరకు బీమా ఉన్నా దాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోలేము. అలా కాకుండా కుటుంబంలోని నలుగురు సభ్యులు ఒకేసారి ఆసుపత్రిపాలైతే మాత్రం ఒక్కొక్కరు వ్యక్తిగతంగా రూ. 3 లక్షలు చొప్పున మొత్తం రూ.12 లక్షలు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్.. హెల్త్ ఇన్సూరెన్స్‌కి సంబంధించి ఇది మరింత మెరుగైన పథకం. ఇది కుటుంబ సభ్యులందరికీ కూడా కవరేజీని అందిస్తుంది. సమ్ అష్యూర్డ్ పరిమితి దాకా మొత్తం కుటుంబానికి కవరే జీ లభిస్తుంది. ఒక్కొక్కరికీ ఒక్కో పథకం తీసుకున్న దానికన్నా అందరికీ కలిపి వర్తించేలా ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ తీసుకుంటే ప్రీమియంలు తక్కువగా ఉంటాయి. ఉదాహరణకు.. మీ ఇంట్లో నలుగురు కుటుంబ సభ్యులు ఉన్నారనుకుందాం. అందరికీ కలిపి రూ. 5 లక్షలకు ఫ్యామిలీ ఫ్లోటర్‌ను తీసుకోవచ్చు. ఇప్పుడు కుటుంబంలోని ఒక్కొక్కరికీ గరిష్టంగా రూ. 5 లక్షల దాకా కవరేజీ ఉంటుంది. ఒకవేళ ఎవరైనా ఆస్పత్రి పాలై, వైద్య ఖర్చులు రూ. 3 లక్షలు అయ్యాయనుకుంటే.. ఆ మొత్తాన్ని బీమా కంపెనీ చెల్లిస్తుంది. మొత్తం కుటుంబం గురించి ఆలోచించినప్పుడు ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ తీసుకోవడం మంచిది. ఎందుకంటే, తక్కువ ప్రీమియంతో ఒకే ప్లాన్ ద్వారా అందరికీ పెద్ద ఎత్తున కవరేజీ లభిస్తుంది. పైగా.. అంతా ఒకేసారి అనారోగ్యం పాలయ్యే అవకాశాలు తక్కువ కాబట్టి, ఇది మరింత లాభదాయకంగా ఉంటుంది. కాబట్టి, మీకు అనువైన హెల్త్ పాలసీని సాధ్యమైనంత త్వరగా తీసుకోవడం ఉత్తమం. మీకు అవసరం రాక ముందే పాలసీ కొనుక్కోండి.. అదీ యుక్తవయసులోనే తీసుకోండి. గ్రూప్ మెడిక్లెయిమ్.. ఎంత ఉపయోగం.. ప్రస్తుతం చాలా సంస్థలు బేసిక్ హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీని కల్పిస్తున్నాయి. అయినప్పటికీ.. మీరు వ్యక్తిగతంగా వైద్య బీమా తీసుకుని ఉంచుకోవడం మంచిది. ఎందుకంటే .. గ్రూప్ మెడిక్లెయిమ్ కింద కంపెనీ నుంచి బీమా కవరేజి లభించినప్పటికీ.. ఇలాంటి పాలసీల్లో సమ్ అష్యూర్డ్ పరిమాణం తక్కువగానే ఉంటుంది. వైద్య బీమా ఖర్చులు ఏటా పెరిగిపోతున్న నేపథ్యంలో తీవ్రమైన సమస్య వచ్చినప్పుడు ఈ కవరేజీ సరిపోకపోవచ్చు. ఒకవేళ మీ కంపెనీ గానీ బీమా పాలసీల వ్యయాలను తగ్గించుకోవాలనుకున్న పక్షంలో మొత్తానికే కవరేజీ లేకుండా పోవచ్చు. పలు గ్రూప్ మెడిక్లెయిమ్ పాలసీల్లో ఉండే నిర్దిష్ట నిబంధనల వల్ల కొన్ని సందర్భాల్లో పాలసీదారు సొంత జేబు నుంచి కొంత కట్టుకోవాల్సి కూడా రావొచ్చు. ప్రీమియం విషయంలో వయసు చాలా కీలక పాత్ర పోషిస్తుంది. వయసు పెరిగిన కొద్దీ.. ప్రీమియం పెరుగుతూ పోతుంది. కాబట్టి.. పర్సనల్ హెల్త్ పాలసీ ఎంత ముందుగా తీసుకుంటే అంత మంచిది.