Personal secretaries
-
టీచర్లను పీఏలు, పీఎస్లుగా కొనసాగించొద్దు
తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు స్పష్టం చేసిన సుప్రీంకోర్టు అక్టోబర్ 1 నుంచి పాఠశాలల విధుల్లో చేరాలని టీచర్లకు ఆదేశం సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రజాప్రతినిధుల వద్ద పీఏలు, పీఎస్లుగా కొనసాగే విధానాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. తెలుగు రాష్ట్రాల్లోని పాఠశాలల్లో సదుపాయాలలేమి, ఉపాధ్యాయుల కొరతపై దాఖలైన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం బుధవారం విచారించింది. ఉపాధ్యాయులు ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులకు పీఏలు, పీఎస్లుగా కొనసాగేందుకు వీల్లేదని జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ నాగప్పన్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ఇలా కొనసాగడం పూర్తిగా చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది. ఉపాధ్యాయులు పీఏ, పీఎస్లుగా కొనసాగే విధానం దేశంలో ఎక్కడైనా ఉందా? అని అదనపు సొలిసిటర్ జనరల్‌ను ధర్మాసనం ప్రశ్నించగా.. ఎక్కడా లేదని ఆయన సమాధానమిచ్చారు. దీంతో ఈ తరహా విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల్ని వారంలోగా పాఠశాలలకు కేటాయించాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు ధర్మాసనం ఆదేశాలు జారీచేసింది. ఇలాంటి ఉపాధ్యాయులంతా అక్టోబర్ 1 నుంచి పాఠశాలల్లో విధుల్లో చేరాలని ఆదేశించింది. ఈ సందర్భంగా తమ పిల్లల చదువుల నేపథ్యంలో పీఏలు, పీఎస్లుగా ఈ ఒక్క ఏడాది కొనసాగేందుకు అనుమతించాలని ఉపాధ్యాయులు న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. దీంతో వారి పిల్లల చదువులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. టీచర్లను పీఏలు, పీఎస్లుగా కొనసాగిం చేందుకు అంగీకరిస్తే.. రాజ్యాంగాన్ని కాపాడాలన్న బాధ్యతను ‘సుప్రీం’ పాటించనట్లేనని ధర్మాసనం ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. -
ముగ్గురు మంత్రుల పీఎస్‌ల నియామకం నిలిపివేత
నియామకానికి కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం అవసరమన్న సిబ్బంది శాఖ యూపీఏ మంత్రుల వద్ద పనిచేసిన వారి పునర్నియామకంపై విముఖం! న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ సహా ముగ్గురు కేంద్రమంత్రుల వ్యక్తిగత కార్యదర్శుల (పీఎస్‌ల) నియామకాన్ని ప్రభుత్వం నిలిపివేసినట్లు ఉన్నతస్థాయి వర్గాలు వెల్లడించాయి. మంత్రులకు సంబంధించి వ్యక్తిగత కార్యదర్శులు, ప్రత్యేక విధిలో అధికారులు సహా వ్యక్తిగత సిబ్బంది నియామకాలన్నిటికీ కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం అవసరమని సిబ్బంది శాఖ సర్క్యులర్ జారీ చేసిన నేపధ్యంలో.. ఈ ముగ్గురు కేంద్రమంత్రుల వ్యక్తిగత కార్యదర్శుల నియామకాన్ని నిలిపివేసినట్లు తెలుస్తోంది. సిబ్బంది, శిక్షణ శాఖ గత నెల 26వ తేదీన అన్ని శాఖల కార్యదర్శులకూ ఈ సర్క్యులర్‌ను పంపించింది. అన్ని మంత్రిత్వ శాఖలూ, విభాగాలూ అన్ని నియామకాలకూ ఈ విధానాలను కచ్చితంగా పాటించాలని స్పష్టంచేసింది. రాజ్‌నాథ్‌సింగ్‌కు వ్యక్తిగత కార్యదర్శిగా 1995 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి అలోక్సింగ్ను ప్రతిపాదించారు. ఆయన గత యూపీఏ ప్రభుత్వంలో విదేశీ వ్యవహారాల మంత్రి సల్మాన్‌ఖుర్షీద్‌కు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేశారు. ఖుర్షీద్ జలవనరుల శాఖ మంత్రిగా, న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు కూడా అలోక్‌సింగ్ ఆయనకు ప్రైవేటు సెక్రటరీగానే పనిచేశారు. అలోక్‌సింగ్ పదవీ కాలం వచ్చే ఫిబ్రవరి 14 వరకూ ఉంది. ఈ అంశంపై సిబ్బంది శాఖ నుంచి ఎలాంటి సమాచారం లేనప్పటికీ.. గత ప్రభుత్వంలో మంత్రిత్వ శాఖల్లో సిబ్బందిగా పనిచేసిన అధికారులను తిరిగి నియమించేందుకు ఎన్డీఏ ప్రభుత్వం సుముఖంగా లేదని ఉన్నతస్థాయి వర్గాలు చెప్తున్నాయి. అలాగే.. హోంశాఖ సహాయ మంత్రి కిరెన్ రిజిజు వ్యక్తిగత కార్యదర్శిగా అభినవ్‌కుమార్, విదేశీ వ్యవహారాల సహాయమంత్రి వి.కె.సింగ్ వ్యక్తిగత కార్యదర్శిగా రాజేశ్కుమార్ల నియామకం కూడా సందిగ్ధంలో పడింది. అభినవ్ గత ప్రభుత్వంలో శశిథరూర్‌కు, రాజేశ్‌కుమార్ గత ప్రభుత్వంలో కేబినెట్ మంత్రి చంద్రేశ్‌కుమారి కటోచ్కు వ్యక్తిగత కార్యదర్శులుగా పనిచేశారు.