టీచర్లను పీఏలు, పీఎస్‌లుగా కొనసాగించొద్దు | SC slams AP, Telangana for using teachers as netas' PAs | Sakshi
Sakshi News home page

టీచర్లను పీఏలు, పీఎస్‌లుగా కొనసాగించొద్దు

Published Thu, Sep 8 2016 2:42 AM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM

టీచర్లను పీఏలు, పీఎస్‌లుగా కొనసాగించొద్దు - Sakshi

టీచర్లను పీఏలు, పీఎస్‌లుగా కొనసాగించొద్దు

తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు స్పష్టం చేసిన సుప్రీంకోర్టు
అక్టోబర్ 1 నుంచి పాఠశాలల విధుల్లో చేరాలని టీచర్లకు ఆదేశం
 
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రజాప్రతినిధుల వద్ద పీఏలు, పీఎస్‌లుగా కొనసాగే విధానాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. తెలుగు రాష్ట్రాల్లోని పాఠశాలల్లో సదుపాయాలలేమి, ఉపాధ్యాయుల కొరతపై దాఖలైన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం బుధవారం విచారించింది. ఉపాధ్యాయులు ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులకు పీఏలు, పీఎస్‌లుగా కొనసాగేందుకు వీల్లేదని జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ నాగప్పన్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ఇలా కొనసాగడం పూర్తిగా చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది. ఉపాధ్యాయులు పీఏ, పీఎస్‌లుగా కొనసాగే విధానం దేశంలో ఎక్కడైనా ఉందా? అని అదనపు సొలిసిటర్ జనరల్‌ను ధర్మాసనం ప్రశ్నించగా.. ఎక్కడా లేదని ఆయన సమాధానమిచ్చారు.
 
 దీంతో ఈ తరహా విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల్ని వారంలోగా పాఠశాలలకు కేటాయించాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు ధర్మాసనం ఆదేశాలు జారీచేసింది. ఇలాంటి ఉపాధ్యాయులంతా అక్టోబర్ 1 నుంచి పాఠశాలల్లో విధుల్లో చేరాలని ఆదేశించింది. ఈ సందర్భంగా తమ పిల్లల చదువుల నేపథ్యంలో పీఏలు, పీఎస్‌లుగా ఈ ఒక్క ఏడాది కొనసాగేందుకు అనుమతించాలని ఉపాధ్యాయులు న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. దీంతో వారి పిల్లల చదువులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. టీచర్లను పీఏలు, పీఎస్‌లుగా కొనసాగిం చేందుకు అంగీకరిస్తే.. రాజ్యాంగాన్ని కాపాడాలన్న బాధ్యతను ‘సుప్రీం’ పాటించనట్లేనని ధర్మాసనం ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement