'వర్గీకరణపై తాడోపేడో తేల్చుకుంటాం'
విజయవాడ (గాంధీనగర్): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మాదిగలకు తీరని అన్యాయం చేస్తున్నారని, వర్గీకరణపై ఇక తాడోపేడో తేల్చుకుంటామని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు అన్నారు. విజయవాడలోని కందుకూరి కల్యాణమండపంలో బుధవారం జరిగిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్గీకరణ చేపట్టి పెద్ద మాదిగనవుతానని ఎన్నికల ముందు నిర్వహించిన పాదయాత్రలో చంద్రబాబు హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చాక వర్గీకరణ అంశాన్ని పక్కన బెట్టి కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు.
ఇప్పటికే తెలంగాణ సీఎం అసెంబ్లీలో తీర్మానం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఇద్దరు సీఎంలు కలిసి వర్గీకరణ కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచాలని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన, వర్గీకరణ కోసం సెప్టెంబర్ 10న కర్నూలు జిల్లాలో మాదిగల రణభేరి సదస్సు, మహిళలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలకు వ్యతిరేకంగా ఆగస్టు 30న విజయవాడలో మహిళా ఆత్మగౌరవ సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.సుబ్బయ్య (కర్నూలు), విజయరామ్ (పశ్చిమ గోదావరి), పి.సుబ్బయ్య (నెల్లూరు), రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు నల్లూరి చంద్రలీల, రాష్ట్ర కార్యదర్శి కృష్ణ మాదిగ, గౌరవాధ్యక్షురాలు బూదాల నందకుమారి, వివిధ జిల్లాల నాయకులు పాల్గొన్నారు.