Peshawar School
-
పెషావర్లో పేలుడు: ఏడుగురు దుర్మరణం
పెషావర్ : పాకిస్తాన్లోని పెషావర్ బాంబు పేలుడుతో దద్దరిల్లింది. ఈ దారుణ ఘటనలో ఏడుగురు విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు పోల్పోయారు. ఒక శిక్షణా స్కూల్లో మంగళవారం శక్తివంతమైన పేలడంతో ఈ విషాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో మరో 70 మంది తీవ్రంగా గాయపడ్డారు. దీనిపై దర్యాప్తు ప్రారంభించామని పేషావర్ పోలీసు ఆఫీసర్ మన్సూర్ అమన్ తెలిపారు. గాయపడిన వారిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉందని, మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆసుపత్రి అధికారులు చెబుతున్నారు. పెషావర్ శివార్లలోని ఇస్లామిక్ సెమినరీ ద్వారా శక్తివంతమైన బాంబు పేలుడు సంభవించిందని అధికారుల తెలిపారు. జామియా జుబైరియా మదర్సా ప్రధాన హాలులో ఇస్లాం బోధనా ఉపన్యాసం ఇస్తుండగా ఈ బాంబు దాడి జరిగిందని పోలీసు అధికారి వకార్ అజీమ్ వెల్లడించారు. మదర్సా వద్ద ఎవరో ఒక బ్యాగ్ వదిలిపెట్టిన కొద్ది నిమిషాల తరువాత బాంబు పేలిందన్నారు. ఆత్మాహుతి దాడి కాదనిపోలీసులు ప్రాథమిక విచారణలో తేల్చారు. కాగా క్వెట్టాలో జరిగిన బాంబు దాడిలో ముగ్గురు వ్యక్తులు మరణించిన రెండు రోజుల తరువాత జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. -
'కావాలంటే నన్ను చంపండి'
న్యూఢిల్లీ: పాకిస్థాన్లోని పెషావర్ ఆర్మీ స్కూల్పై ఉగ్రవాద దాడి ఘటనను నోబెల్ శాంతి బహుమతి గ్రహీతలు కైలాస్ సత్యార్థి, యూసఫ్ జాయ్ మలాలా ఖండించారు. ఉగ్రవాదులు కావాలంటే తనను చంపి, పిల్లల్ని విడుదల చేయాలని కైలాస్ అన్నారు. ఇదో చీకటి దినమని కైలాస్ సత్యార్థి అభివర్ణించారు. ఉగ్రవాద దాడి పిరికిపందల చర్యని మలాలా ఖండించారు. చిన్నారులను చంపడం హేయమని అన్నారు. బాలల హక్కుల కోసం పోరాడిన కైలాస్, మలాలా ఇటీవల సంయుక్తంగా నోబెల్ శాంతి బహుమతి స్వీకరించిన సంగతి తెలిసిందే. పెషావర్ ఆర్మీ స్కూల్లో ఉగ్రవాదుల దాడిలో విద్యార్థులతో సహా దాదాపు 126 మంది మరణించారు. ఉగ్రవాద దాడులు జరుగుతున్న సమయంలో కైలాస్, మలాలా స్పందించారు. -
ఆర్మీ యూనిఫాంలో స్కూల్లోకి వచ్చిన ఉగ్రవాదులు
కరాచీ: పాకిస్థాన్లోని పెషావర్ ఆర్మీ స్కూల్లోకి ఉగ్రవాదులు ఆర్మీ యూనిఫాంలో వచ్చినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. శ్మశాన వాటిక నుంచి ఆరుగురు ఉగ్రవాదులు స్కూలు వెనుక గేటు ద్వారా ప్రవేశించినట్టు చెప్పారు. ఉగ్రవాదులు స్కూల్లోకి ప్రవేశించిన వెంటనే ఓ వాహనానికి నిప్పు పెట్టారు. అనంతరం విచక్షణ రహితంగా కాల్పులు జరిపారని తెలిపారు. ఈ దుర్ఘటనలో వందమందికి పైగా విద్యార్థులు మరణించిగా, మరో 80 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. బాధితుల్లో టీచర్లు, పాఠశాల సిబ్బంది ఉన్నారు. ఉగ్రవాదులు స్కూల్లోకి ప్రవేశించినపుడు పరీక్షలు నిర్వహిస్తున్నామని ఓ టీచర్ చెప్పారు. ఉగ్రవాదులు అరగంట పాటు కాల్పులు జరిపిన అనంతరం సైన్యం పాఠశాల చుట్టుముట్టినట్టు తెలిపారు. సైన్యం స్కూల్లో నుంచి విద్యార్థులను తరలిస్తున్నట్టు చెప్పారు.