తమిళనాడులో మరో సంచలనం
చెన్నై: జయలలిత మరణం తర్వాత సంచలనాలకు నెలవుగా మారిన తమిళనాడులో తాజాగా మరో సంచలన విషయం బయటకు వచ్చింది. కొడనాడు ఎస్టేట్‌ను జయలలిత, ఆమె నెచ్చెలి శశికళ బలవంతంగా లాక్కున్నారని దాని అసలు యజమాని పీటర్ కర్ల్ ఎడ్వార్డ్ క్రెగ్ జోన్స్ ఆరోపించారు. చాలా కాలం తర్వాత ఆయన ముందుకు వచ్చారు. కొడనాడు ఎస్టేట్‌ను తిరిగి దక్కించేందుకు న్యాయపోరాటం చేస్తానని స్పష్టం చేశారు. తన ఎస్టేట్‌ను జయలలిత ఏవిధంగా దక్కించుకున్నారో వివరించారు.
‘1990 ప్రాంతంలో జయలలిత కన్ను ఈ ఎస్టేట్‌పై పడింది. దీన్ని తమకు అమ్మాలని జయలలిత సన్నిహితులు, శశికళ, అన్నాడీఎంకే నేతలు కొంత మంది రెండేళ్లపాటు మాపై ఒత్తిడి తీసుకువచ్చారు. 150 మంది గుండాలను పంపి బెదిరించారు. అయిష్టంగా అమ్మాల్సివచ్చింద’ని జోన్స్ వాపోయారు. కొడనాడు ఎస్టేట్‌కు కేవలం రూ.7.5 కోట్లు మాత్రమే ఇచ్చారని, మిగతా డబ్బు ఎగ్గొట్టారని తెలిపారు. ఈ వ్యవహారంలో కొంతమంది వ్యాపారవేత్తలు, మంత్రులు, అధికారులు, అన్నాడీఎంకే విధేయుడు రాజాత్తినమ్ కీలకపాత్ర పోషించారని ఆరోపించారు.
‘కనీసం రిజిస్ట్రేషన్ కూడా చేయలేదు. మేము రిజిస్ట్రేషన్ ఆఫీసు వెళ్లలేదు. ఇదంతా బినామీ వ్యవహారం. చెన్నైలోని మద్యం వ్యాపారి ఉదయార్ ఇంట్లో నేను, మా నాన్న భాగస్వామ్య మార్పిడి పత్రాలపై మాత్రమే సంతకాలు చేశాం. తర్వాత రోజే కొడనాడు ఎస్టేట్‌ను మా నుంచి స్వాధీనం చేసుకున్నార’ని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఎస్టేట్‌ను తిరిగి దక్కించుకోవాలనుకుంటున్నట్టు చెప్పారు. ఇందుకోసం న్యాయం పోరాటం చేస్తానని, తనలా దోపిడీకి గురైన వారందరినీ కలుపుకుపోతానని చెప్పారు.
కొడనాడు ఎస్టేట్‌లో గత నెల 23వ తేదీన 11 మందితో కూడిన గుర్తుతెలియని వ్యక్తులు ప్రవేశించి అక్కడి సెక్యూరిటీ గార్డును హతమార్చి, మూడు గదుల్లోని దాచి ఉంచిన భారీ నగదు, ముఖ్యమైన డాక్యుమెంట్లు ఎత్తుకెళ్లిన సంగతి తెలిసిందే.