పీజీ కాలేజీలపై తేలని లెక్కలు
* అఫిలియేషన్లపై జేఎన్టీయూహెచ్ స్టాండింగ్ కమిటీ తర్జనభర్జన
* కాలేజీల యాజ మాన్యాల పడిగాపులు
* ముంచుకొస్తున్న వెబ్ కౌన్సెలింగ్ గడువు
సాక్షి, హైదరాబాద్ : మరో 48గంటల్లో పీజీఈసెట్ వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుండగా, జేఎన్టీయూహెచ్ పరిధిలో కళాశాలల అఫిలియేషన్‌పై ఇంతవరకు స్పష్టత రాలేదు. లోపాలను సరిదిద్దుకునే విషయమై యాజమాన్యాల నుంచి హామీలు తీసుకొని, అన్ని కళాశాలలను పీజీ కౌన్సెలింగ్‌కు అనుమతించాలని హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.
హైకోర్టు ఆదేశాల మేరకు రెండురోజులు ఆయా కళాశాలల నుంచి లోటుపాట్లు సరిదిద్దిన నివేదిక (డీసీఆర్)లను జేఎన్టీయూహెచ్ అధికారులు స్వీకరించారు. నివేదికలను పరిశీలించిన యూనివర్సిటీ స్టాండింగ్ కమిటీ తుది నిర్ణయం వెలువరించడంలో తర్జనభర్జన పడుతోంది. వర్సిటీ పరిధిలోని ఎంటెక్, ఎంఫార్మసీ కళాశాలలకు అఫిలియేషన్ ఇచ్చే అంశంపై ఆది వారం మధ్యాహ్నం వైస్‌చాన్సలర్ నివాసంలో సమావేశమైన స్టాండింగ్ కమిటీ సభ్యులు తుది నిర్ణయాన్ని ఆయనకే వదిలేసినట్లు తెలిసింది.
యాజమాన్యాలకు టెన్షన్
ఎంసెట్ కౌన్సెలింగ్‌కు అఫిలియేషన్ దక్కక తీవ్రంగా నష్టపోయిన తమ కళాశాలలకు పీజీఈసెట్ కౌన్సెలింగ్కైనా అవకాశం కల్పిస్తారో, లేదోన ని యాజమాన్యాలకు టెన్షన్ మొదలైంది. హైకోర్టు ఆదేశాలు యాజమాన్యాలకు సానుకూలంగా ఉన్నా, వాటిని అమలు చేయడంలో జేఎన్టీయూహెచ్ అధికారులు ఎలాంటి వైఖరిని అవలంభిస్తారోనన్నది ఎవరికీ అంతుబట్టడంలేదు. ఈనేపథ్యంలో.. పలు కళాశాలల యాజమాన్యాలు వర్సిటీ ఉన్నతాధికారులను ప్రసన్నం చేసుకునేందుకు జేఎన్టీయూహెచ్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాయి. వీసీ, రిజిస్ట్రార్లు యూనివర్సిటీలో కనిపించకున్నా, వారి ఇళ్లవద్ద అర్ధరాత్రి వరకు పలువురు యాజమాన్య ప్రతినిధులు పడిగాపులు కాస్తున్నారు.
శనివారం రాత్రి వీసీని కలిసేందుకు సెక్యూరిటీ అనుమతించకున్నా, గేటు తోసుకొని లోనికి వెళ్లిన యాజమాన్య ప్రతినిధులకు, వీసీకి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తన ఆరోగ్యం బాగోలేనందున విసిగించవద్దని వీసీ చెప్పాగా, తాము వారం రోజులుగా టెన్షన్ భరించలేకపోతున్నామని యాజ మాన్యాలు వాపోయాయి. ఆదివారం వీసీ ఇంట్లో స్టాండింగ్ కమిటీ సమావేశం ఉందని తెలిసి మరికొందరు యాజమాన్య ప్రతినిధులు అక్కడికి చేరుకున్నారు. అరుుతే ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని తెలిసి నిరాశగా వెనుదిరిగారు.
జేఎన్టీయూహెచ్ జాబితా రాలేదు..
జేఎన్టీయూహెచ్లో పరిస్థితి ఇలా ఉంటే..వర్సిటీ అఫిలియేటెడ్ కళాశాలల జాబితా కోసం పీజీఈసెట్ వెబ్ కౌన్సెలింగ్ అధికారులు ఎదురు చూస్తున్నారు. ఈనెల 10నుంచి వెబ్ కౌన్సెలింగ్ ఆప్షన్ల ప్రక్రియ ఉన్నందున జాబితాను 24గంటల ముందు ఇస్తే తప్ప, కళాశాలల పేర్లను కౌన్సెలింగ్‌లో చేర్చలేమని కీలక అధికారి ఒకరు పేర్కొన్నారు. వెబ్ కౌన్సెలింగ్ నిమిత్తం జేఎన్టీయూకే నుంచి 202, జేఎన్టీయూఏ నుంచి 106, కాకతీయ యూనివర్సిటీ నుంచి 42, ఏఎన్‌యూ నుంచి 10, ఓయూ నుంచి 10 ఎంటెక్, ఎంఫార్మసీ కళాశాలల జాబితాలు అందినట్లు సమాచారం. పెద్ద సంఖ్యలో అఫిలియేటెడ్ కళాశాలలు ఉన్న జేఎన్టీయూహెచ్ నుంచి ఇప్పటివరకు ఎటువంటి సమాచారం అందలేదని వెబ్ కౌన్సెలింగ్‌కు సంబంధించిన అధికారులు ‘సాక్షి’కి తెలిపారు.