వైజాగ్‌లో ప్రారంభమైన స్ప్రింగ్ కాన్ఫరెన్స్ 2017
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ‘స్ప్రింగ్ కాన్ఫరెన్స్ 2017’ కార్యక్రమం గురువారం విశాఖ నగరంలో ప్రారంభమైంది. ఫైనాన్షియల్ టెక్నాలజీ (ఫిన్‌టెక్)కి సంబంధించి నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు పరిశ్రమ వర్గాలు, విద్యాసంస్థలు, పెట్టుబడిదారులు, స్టార్టప్‌లు తదితర వర్గాలన్నింటినీ ఒక్కతాటిపైకి తీసుకొచ్చేందుకు వీలుగా ప్రభుత్వం ఫిన్‌టెక్ వ్యాలీ వైజాగ్ పేరుతో ఓ వేదిక(కంపెనీ)ను ఏర్పాటు చేసింది. బ్యాంకింగ్, ఆర్థిక రంగాలకు సంబంధించి సరికొత్త టెక్నాలజీలకు వీలుగా ఐడియాలతో వచ్చే వారికి ఆర్థిక సహకారం, సదుపాయాలు, మార్గదర్శకత్వం ఈ వేదిక నుంచి లభిస్తాయి.
ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే ఉద్దేశ్యంతో ఈ సంస్థ వైజాగ్ స్ప్రింగ్ కాన్ఫరెన్స్ 2017 పేరుతో గురు, శుక్రవారాల్లో సదస్సు నిర్వహిస్తోంది. ఫిన్‌టెక్ రంగంలో వస్తున్న మార్పులు, అవకాశాలను గుర్తించేందుకు వీలుగా ఈ సమావేశంలో ప్రతినిధుల మధ్య చర్చలు జరగనున్నాయి. విప్లవాత్మక మార్పులకు కారణమయ్యే ఆలోచనలతో వచ్చే సంస్థలు, ఇంక్యుబేటర్లు, స్టార్టప్‌లు, ఇన్వెస్టర్లకు ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సదస్సుకు హాజరైన ప్రతినిధులతో సంప్రదింపులు జరిపారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఐటీ సలహాదారు జేఏ చౌదరితోపాటు సింగపూర్‌కు చెందిన ఫిన్‌టెక్ అండ్ ఇన్నోవేషన్ గ్రూప్ డైరెక్టర్ రాయ్టియో, కేజీఎంజీ పార్ట్నర్ ఉత్కర్‡్ష పాల్నిత్కర్, ఫిడెలిటీ ఫైనాన్షియల్ సర్వీసెస్ సీవోవో జార్జ్ ఇనసు, సింగపూర్‌కు చెందిన టీఐఈ చైర్మన్ పునీత్ పుష్కర్న సహా 30 మంది అంతర్జాతీయ ప్రతినిధులు పాల్గొన్నారు.