Phlasing
-
పళ్లు శుభ్రం చేసే చేసే పద్ధతితో డేంజర్!
మనకు పెద్దగా అలవాటు లేదుగానీ.. ఇతర దేశాల్లో పళ్లను శుభ్రం చేసుకునే పద్ధతిలో ఫ్లాసింగ్ ఒకటి. బ్రష్ చేసిన తరువాత పళ్ల మధ్య చిక్కుకున్న ఆహారాన్ని ఒక దారం సాయంతో తొలగించుకోవడాన్ని ఫ్లాసింగ్ అంటారు. బాగుందిగానీ.. ఈ ఫ్లాసింగ్ కోసం వాడుతున్న ప్రత్యేకమైన దారం కారణంగా పళ్ల మధ్య పాలిఫ్లూరోర అల్కైల్ (పీఎఫ్ఏ) రసాయన పదార్థాలు పోగుపడుతున్నట్లు తాజా అధ్యయనం ఒకటి చెబుతోంది. కాలిఫోర్నియా పబ్లిక్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొంతమంది కార్యకర్తల రక్తనమూనాలను పరీక్షించడం ద్వారా ఈ నిర్ధారణకు వచ్చారు. ఫర్నిచర్ మొదలుకొని అనేక ఇతర వస్తువుల్లో నీటిని దూరంగా ఉంచేందుకు ఈ పీఎప్ఏలను వాడుతున్నారు. పైగా అంత తేలికగా నాశనమయ్యే రసాయనమూ కాదిది. మార్కెట్లో అందుబాటులో ఉన్న 18 కంపెనీలు ఈ పీఎఫ్ఏను ఫ్లాసింగ్ దారాల పై పూతగా వాడుతున్నట్లు తెలిసింది. పళ్లమధ్య ఈ దారాన్ని ఉంచి కదిలించినప్పుడు పూతలోని రసాయనాలు అక్కడే పోగుపడుతున్నాయని.. తరువాత కండరాల్లోకి కూడా చేరిపోతున్నాయని తాము గుర్తించినట్లు కేటీ బోరోనౌ అనే శాస్త్రవేత్త తెలిపారు. పీఎఫ్ఏలతో కేన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉందన్నది తెలిసిందే. అనేక ఇతర పదార్థాల నుంచి కూడా ఈ పీఎఫ్ఏ శరీరంలోకి ప్రవేశించేందుకు అవకాశం ఉంది. -
హెల్త్ క్విజ్
1. మన టూత్‌బ్రష్ బ్రిజిల్స్ ఎలా ఉండాలి? 2. బ్రష్ చేసుకోవడంలో సరైన ప్రక్రియ అంటే ఎలా ఉండాలి? 3. పళ్లకు మధ్య బ్రష్ చేరుకోని ప్రాంతాలను శుభ్రం చేయడానికి ఏం చేయాలి? 4. బ్రషింగ్ ప్రక్రియ ఎంత సేపు చేయాలి? 5. నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంకోసం బ్రషింగ్‌తో పాటు చేయాల్సిందేమిటి? 6. ఎన్నాళ్లకు ఒకసారి బ్రష్ మార్చాలి? జవాబులు: 1. దంతాలను, చిగుళ్లను గాయపరచనంత మృదువుగా ఉండాలి. 2. పైన చిగుళ్లూ, పళ్లూ కలిసే చోటి నుంచి కింద మళ్లీ చిగుళ్లూ, పళ్లూ కలిసే చోటు వరకు నిలువుగా బ్రష్ చేసుకోవాలి. 3. ఫ్లాసింగ్ (దారంలాంటిదానితో శుభ్రం చేయడం) ప్రక్రియ ద్వారా వ్యర్థాలను తొలగించాలి. 4. మూడు నిమిషాల పాటు మాత్రమే బ్రష్ చేయాలి. అదేపనిగా బ్రష్ నములుతూ బ్రష్ చేయకూడదు. 5. నాలుకపై ఉండే బ్యాక్టీరియాను తొలగించడం కోసం టంగ్ క్లీనింగ్ చేసుకోవాలి. 6. {పతి మూడు నెలలకోమారు బ్రష్ మార్చాలి.