photocopy
-
మూడు రూపాయల దాన్ని..ముక్కు పిండేదాకా తెచ్చుకున్నాడు!
మూడు రూపాయల చిల్లర ఇవ్వడానికి నిరాకరించిన జిరాక్స్ షాప్ యజమానికి భారీ షాక్ తగిలింది. పైగా బెగ్గర్ అంటూ కస్టమర్‌ని దుర్బాష లాడాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన సదరు కస్టమర్ వినియోగదారుల కోర్టును ఆశ్రయించాడు. దీంతో రూ.25,000 జరిమానా చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఒడిశాలోని సంబల్పూర్లోని ఈ సంఘటన చోటు చేసుకుంది. ఒక ఫోటోకాపీ దుకాణం యజమాని కస్టమర్‌కు రూ.3 తిరిగి ఇవ్వడానికి నిరాకరించిన కేసును విచారించిన సంబల్పూర్ కోర్టు రూ. 25 వేలు 30 రోజుల్లోపు చెల్లించాలని ఆదేశించింది. అంతేకాదు నిర్ణీత గడువులోగా జరిమానా చెల్లించకుంటే సంవత్సరానికి 9 శాతం చొప్పున వడ్డీ చెల్లించాలని కూడా తీర్పునిచ్చింది. బుధరాజా ప్రాంతానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ ప్రఫుల్ల కురార్ దాస్ ఏప్రిల్ 28న జిరాక్స్ కోసం ఫోటో కాపీ సెంటర్‌కి వెళ్లాడు. కాపీ రూ.2 ల చార్జీకి గాను రూ. 5 దుకాణదారుడికిచ్చాడు. మిగిలిన రూ. 3 తిరిగి అడగ్గా ఇవ్వడానికి నిరాకరించాడు. అంతేకాదు బెగ్గర్ అంటూ దుర్భాషలాడాడు. అడగ్గా .అడగ్గా. ..పైగా బిచ్చమేశా అనుకుంటూ అంటూ అనుచితంగా ప్రవర్తించాడు. దీంతో తనకు చిల్లర ఇవ్వకపోగా, దురుసుగా ప్రవర్తించడంతోపాటు రసీదు కూడా ఇవ్వలేదంటూ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమీషన్‌కు ఫిర్యాదు చేశారు. తనకు ఆర్థిక నష్టంతోపాటు, మానసిక వేదన, అవమానానికి గురయ్యానంటూ పేర్కొన్నారు. ఇది కేవలం వ్యక్తిగత కేసు మాత్రమే కాదు. వినియోగ దారులందరి హక్కులకు సంబంధించింది. అందుకే కోర్టును ఆశ్రయించి, న్యాయం పొందాను అంటూ తెలిపారు. -
దొంగిలించలేదు.. జిరాక్స్ తీశారంతే!
న్యూఢిల్లీ: భారత రక్షణశాఖ కార్యాలయం నుంచి రఫేల్ ఒప్పంద పత్రాలు దొంగతనానికి గురయ్యాయని చెప్పిన అటార్నీ జనరల్ వేణుగోపాల్ మాటమార్చారు. రఫేల్ ఒప్పందానికి సంబంధించిన పత్రాల ఫొటోకాపీలను మాత్రమే తీసుకెళ్లారని, నిజమైన పత్రాలు రక్షణశాఖ ఆఫీసులోనే ఉన్నాయని చెప్పారు. ‘రక్షణశాఖ నుంచి రఫేల్ ఒప్పంద పత్రాలు అదృశ్యమయ్యాయని నేను సుప్రీంకోర్టుకు చెప్పినట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయని తెలిసింది. ఇది ఎంత మాత్రం నిజం కాదు. యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరీ, ప్రశాంత్ భూషణ్ దాఖలుచేసిన పిటిషన్‌కు రఫేల్ ఒప్పంద పత్రాల ఫొటోకాపీలను జతచేశారు’ అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేత రణ్‌దీప్ సూర్జేవాలా స్పందిస్తూ..‘మోదీ ప్రభుత్వపు ఏజీకి రఫేల్ పత్రాల దొంగతనం, ఫొటోకాపీలకు మధ్య వ్యత్యాసం తెలియదు. భారత్ సురక్షితమైన చేతుల్లో ఉందని ఆ ప్రభుత్వమే ప్రజలకు హామీ ఇస్తోంది. మోదీజీ ఈ మోసం ఏంటి? ఇప్పటివరకూ అనితరసాధ్యమైన అబద్ధాలన్నీ ఇప్పుడు సుసాధ్యంగా కనిపిస్తున్నాయి’ అని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ, అబద్ధాలు పర్యాయపదాలని బీజేపీ చీఫ్ అమిత్ షా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పటేల్ విగ్రహం చైనాలో రూపొందించారంటూ రాహుల్ అబద్ధం చెప్పారన్నారు. -
కొత్త 2వేల రూపాయల నోటు అంటూ మోసం
చిక్‌మగళూరు: అత్యంత భద్రత ప్రమాణాలతో తయారు చేసిన కొత్త 2000 రూపాయల నోటు పేరు చెప్పి ఓ వ్యక్తి రైతును బురిడీ కొట్టించాడు. ఒరిజినల్ 2వేల రూపాయల నోటు ఫొటోకాపీని అంతే సైజులో రైతుకు ఇచ్చాడు. కర్ణాటకలోని చిక్మగళూరులో ఈ ఘటన జరిగింది. అశోక్ అనే రైతు ఉల్లిపాయలను అమ్మేందుకు శనివారం మార్కెట్‌కు తీసుకెళ్లాడు. ఓ గుర్తు తెలియనివ్యక్తి ఆయన వద్ద ఉల్లిపాయలు కొనుగోలు చేసి, ఓ నోట్ ఇచ్చి కొత్తగా వచ్చిన 2వేల రూపాయల నోటు అని చెప్పాడు. నిజమేనని భావించిన అశోక్ ఆ నోటును తీసుకెళ్లాడు. దీన్ని స్నేహితులకు చూపించగా అది ఒరిజినల్ నోటు కాదని, ఫొటో కాపీ అని చెప్పారు. చిక్‌మగళూరు ఎస్పీ అన్నామలై మాట్లాడుతూ.. ఒరిజినల్ నోటు ఫొటో కాపీని గుర్తుతెలియని వ్యక్తి రైతుకు ఇచ్చాడని, ఎవరైనా ఈ విషయాన్ని సులభంగా గుర్తించగలరని చెప్పారు. కాగా కేంద్ర ప్రభుత్వం కొత్తగా విడుదల చేసిన 2 వేల రూపాయల నోట్లు అందరికి అందుబాటులోకి రాకపోవడం, వాటిని చూసి ఉండకపోవడంతో కొందరు పొరపాటుపడే అవకాశం ఉందని కొందరు అభిప్రాయపడ్డారు.