ఐ యామ్ ఏబుల్.. వైకల్యాన్నే కాదు, మా నైపుణ్యాలనూ చూడండి..!
మానసిక, శారీరక వైకల్యాలున్న పిల్లలను ఎవరో ఒకరు ప్రత్యేకంగా చూసుకోవాల్సి ఉంటుంది. ఒకరి మీద ఆధారపడే ఈ పిల్లలు.. ‘వైకల్యాన్నే కాదు... మా నైపుణ్యాలనూ చూడండి మేమూ కొన్ని సాధించగలం’ అని చేసి చూపుతున్నారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు తమంతట తాము చక్కగా సొంతంగా చక్కగా చదువుకోవడమేగాక, తమ భవిష్యత్‌ను తీర్చిదిద్దుకునే క్రమంలో ‘ఐ యామ్ ఏబుల్’ అంటూæడబ్బు కూడా సంపాదిస్తున్నారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ఐ యామ్ ఏబుల్’ అనే హ్యాండిక్రాఫ్ట్స్ ఆన్లైన్ స్టోర్ సంచలనాలు సృష్టిస్తోంది. మానసిక, శారీరక వైకల్యం ఉన్న పిల్లలు కొన్ని వస్తువులను తయారు చేసి ఈ స్టోర్‌లో విక్రయిస్తున్నారు. వివిధ రకాల ఉత్పత్తుల తయారీ నుంచి బిల్లింగ్ చేసేంత వరకు అన్ని పనులు వారే చూసుకోవడం విశేషం. ఇటీవల డెభ్బై జార్లు కావాలని ఓ కార్పొరేట్ సంస్థ నుంచి ఆర్డర్ రావడంతో విజయవంతంగా జార్లను డెలివరీ చేశారు. వీరి సామర్థ్యాలను చూసిన వారంతా అభినందనలతో ముంచెత్తుతున్నారు. దీంతో ఈ పిల్లలంతా పట్టరాని సంతోషంతో చిందులు వేస్తున్నారు.
జినీషా..
వయసు వచ్చినా ఇంకా పసినవ్వులను చిందిస్తోన్న అభం శుభం తెలియని దివ్యాంగ బాలలకు తోడుగా నేనున్నానంటూ వెన్నుతట్టి వెనుక ఉండి నడిపిస్తోంది జినీషా ఛేదా. ముంబైలోని స్పెషల్లీ ఏబుల్డ్ చిల్డ్రన్ స్కూల్ ‘జిన్శిక్షా’ను నడుపుతోన్న జినీషా.. రకరకాల యాక్టివిటీల్లో బిజీగా ఉండే పిల్లలకు ఉపాధి కల్పించాలనుకుంది. తన స్కూలు సభ్యులతో చర్చించి.. పిల్లలు ఉత్పత్తి చేస్తోన్న వస్తువులతో కేఫ్ లేదా సూపర్ మార్కెట్ ప్రారంభించాలనుకుంది.
కానీ ఈ రెండింటి ఏర్పాటుకూ చాలా ఖర్చు అవుతుంది. అందువల్ల తక్కువ ఖర్చులో ఏం చేయాలి అని ఆలోచించి గతేడాది డిసెంబర్లో ‘ఐ యామ్ ఏబుల్’ పేరిట ఆన్లైన్ స్టోర్‌ను ప్రాంభించింది. ఉత్పత్తుల తయారీ నుంచి బిల్లింగ్ వరకు అన్ని పనులు పిల్లలే చూసుకునే విధంగా ఏర్పాట్లు చేసింది. దీనిద్వారా పిల్లల్లో ఉద్యోగ అనుభవంతో పాటు ఉపాధిని కల్పిస్తోంది. హ్యాండీక్రాఫ్ట్స్‌ను తయారు చేసిన ప్రతి ఒక్కరికి జీతం కూడా ఇస్తోంది.
పిల్లల ఉత్పత్తులను మార్కెట్లో ప్రవేశపెట్టి వీళ్లు కూడా కొన్ని చేయగలరు అని ప్రపంచం ముందు ఉంచడమే లక్ష్యంగా పనిచేస్తోన్న జినీషా.. ప్రస్తుతం ముంబైలో మాత్రమే ఉన్న ఈ స్టోర్‌ను దేశవ్యాప్తంగా విస్తరించడానికి ప్రయత్నిస్తోంది.