రిమ్స్‌లో మెడికో ఆత్మహత్యాయత్నం
- వైద్యుడు లైంగికంగా వేధించాడని ఆరోపణ
- ఆస్పత్రి భవనం పైనుంచి దూకేందుకు ప్రయత్నం
ఆదిలాబాద్ రిమ్స్ : వైద్యుడి వేధింపులు తట్టుకోలేక ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ వైద్య కళాశాల లో రెండో సంవత్సరం ఎంబీబీఎస్ విద్యార్థిని స్రవంతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. మంచిర్యాల మం డలం తర్లపాడుకు చెందిన మెడికో స్రవంతి ఆత్మహత్య చేసుకుంటానంటూ శనివారం రిమ్స్ ఆస్పత్రి ఓపీ భవ నం ఎక్కింది. దీంతో అక్కడి సిబ్బంది, తోటి విద్యార్థులు ఆమెను అడ్డుకున్నారు. పోలీసులకు సమాచారం అందించడంతో వారు వచ్చి ఆమెతో మాట్లాడి కిందకు దించారు. రిమ్స్‌లో పనిచేస్తున్న జనరల్ ఫిజీషియన్ తనను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని స్రవంతి ఆరోపించింది.
మానసికంగా కుంగిపోయానని, అందుకే ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించానని చెప్పింది. తల్లిదండ్రులు కూడా తాను చెప్పింది నమ్మకపోవడంతో మనస్తాపం చెందినట్లు పేర్కొంది. తండ్రి మధునయ్యకు సమాచారం అందించడంతో ఆయన వెంటనే వచ్చారు. తన కూతురు ఆరోగ్య పరిస్థితి బాగోలేదని తెలిపినట్లు టూటౌన్ ఎస్సై విష్ణు తెలిపారు. వారితో మాట్లాడి చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు పంపించినట్లు ఎస్సై పేర్కొన్నారు. ఆమె ఆరోపణల వెనుక ఎంత వరకు వాస్తవం ఉందనేది ఆమె పరిస్థితిలో మార్పు వస్తే తప్ప వాస్తవం తెలియదు. స్రవంతి మానసిక ఆరోగ్య పరిస్థితి సరిగా లేదని రిమ్స్ ఇన్చార్జి డెరైక్టర్ అనంత్‌రావు తెలిపారు. ఇప్పటికే సైకియార్టిస్టు వద్ద చికిత్స తీసుకుంటోందన్నారు. గతంలో కూడా ఇలాంటి ప్రయత్నాలు చేసిందని పేర్కొన్నారు. చికిత్స తీసుకొని సాధారణ పరిస్థితికి వచ్చిన తర్వాత దీనిపై విచారణ చేపడతామని ఆయన పేర్కొన్నారు.