PIL in SC
-
‘బిల్కిస్ బానో’ దోషుల విడుదలపై సుప్రీం కోర్టులో పిల్
న్యూఢిల్లీ: బిల్కిస్ బానో అత్యాచారం కేసులో 11 మంది దోషులను విడుదల చేయటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో దోషుల విడుదలను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు పలువురు మహిళా హక్కుల కార్యకర్తలు. సామూహిక అత్యాచారం, హత్య కేసుల్లో దోషులుగా తేలిన వారిని విడుదల చేయొద్దని పిటిషన్లో పేర్కొన్నారు. బిల్కిస్ బానో కేసు దోషుల రెమిషన్‌ను వెనక్కి తీసుకోవాలంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు మహిళా హక్కుల కార్యకర్తలు సుభాషిని అలీ, రేవతి లాల్, రాప్ రేఖ వర్మలు. ఈ కేసును భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు తీసుకెళ్లారు సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్, అపర్నా భట్. 14 మంది హత్య, గర్భిణీపై అత్యాచారానికి సంబంధించిన కేసులో దోషులను విడుదల చేయటాన్ని సవాల్ చేసినట్లు కపిల్ సిబాల్ పేర్కొన్నారు. ఈ పిల్‌ను విచారించేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది. అంతకు ముందు.. సుమారు 6వేల మంది హక్కుల కార్యకర్తలు, చరిత్రకారులు దోషుల విడుదలను వెనక్కి తీసుకునేలా ఆదేశించాలని సుప్రీం కోర్టును కోరారు. ఇదీ చదవండి: నమ్మకం పోయింది.. జీవితాంతం భయంతో మనశ్శాంతి లేకుండా బతకాల్సిందేనా?: దోషుల విడుదలపై బిల్కిస్ ఆవేదన -
షాకిచ్చిన కోర్టు.. ఐదు లక్షల ఫైన్
న్యూఢిల్లీ: శీతల పానీయాలు థమ్సప్, కోకాకోలాలు ఆరోగ్యానికి హానికరం.. నిషేధించాలంటూ పిల్ దాఖలు చేసిన వ్యక్తికి సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. పిటిషనర్ చట్ట ప్రక్రియను దుర్వినియోగం చేశారని, ఆయన చేసిన వాదనలను నిరూపించలేకపోయారంటూ రూ.5లక్షల జరిమానా విధించింది. వివరాలు.. చావ్డా అనే వ్యక్తి కోకాకోలా, థమ్స్ అప్ ఆరోగ్యానికి హానికరం.. వాటిని నిషేధించాలంటూ సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. పిటిషనర్ తరపు వాదనలు విన్న తరువాత న్యాయమూర్తులు డి.వై.చంద్రచుడ్, హేమంత్ గుప్తా, అజయ్ రాస్తోగిలతో కూడిన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ‘పిటిషనర్ ఒక 'సామాజిక కార్యకర్త' అని చెప్పుకుంటున్నారు. పిటిషనర్‌కు ఈ విషయంపై సాంకేతిక పరిజ్ఞానం లేకుండానే పిటిషన్ దాఖలైంది. అతని వాదనలు నిరూపించబడలేదు. అతనికి జరిమానా విధించడం సమంజసం. అందుకే అతడికి రూ. 5లక్షల జరిమానా విధిస్తున్నాం’ అని తెలిపారు. ఒక నెలలోపు 5 లక్షల రూపాయలను టాప్ కోర్ట్ రిజిస్ట్రీలో జమ చేయాలని.. అదే మొత్తాన్ని సుప్రీంకోర్టు న్యాయవాదుల రికార్డ్ అసోసియేషన్‌కు పంపిణీ చేయాలని కోర్టు చావ్డాను ఆదేశించింది. -
సీజేఐ అధికారాలపై స్పష్టత ఇవ్వండి
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో జడ్జీలకు కేసుల కేటాయింపు విషయంలో భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)కున్న నిర్వహణ అధికారాలపై స్పష్టత ఇవ్వాలని కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ న్యాయవాది శాంతిభూషణ్ సుప్రీంకోర్టులో శుక్రవారం ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలుచేశారు. మాస్టర్ ఆఫ్ రోస్టర్‌గా ఉన్న సీజేఐ ఇతర జడ్జీలకు కేసుల కేటాయింపులో అనుసరిస్తున్న నిబంధనలు, విధివిధానాలపైనా స్పష్టత ఇవ్వాలని కోరారు. శాంతిభూషణ్ తరఫున ఆయన కొడుకు సీనియర్ లాయర్ ప్రశాంత్ భూషణ్ సుప్రీంలో పిల్ వేశారు. సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్‌కు లేఖ రాసిన ప్రశాంత్.. సీజేఐ నేతృత్వంలోని బెంచ్ ముందుకు ఈ పిల్ విచారణకు రాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. రాజకీయంగా సున్నితమైన, అధికార/ప్రతిపక్ష పార్టీలకు చెందిన కేసుల్ని నచ్చినవారికి కేటాయిస్తూ సీజేఐ, రిజిస్ట్రార్లు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. పిటిషన్లో సీజేఐ జస్టిస్ మిశ్రాను ప్రతివాదిగా చేర్చారు. సుప్రీంకోర్టులో అవాంఛనీయ ఘటనలు జరుగుతున్నాయనీ, సీజేఐ జస్టిస్ దీపక్‌మిశ్రా కేసుల కేటాయింపులో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ నలుగురు సీనియర్ న్యాయమూర్తులు జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గొగొయ్, జస్టిస్ మదన్ లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్‌లు జనవరి 12న మీడియా ముందుకొచ్చిన నేపథ్యంలో తాజాగా అదే అంశంపై పిల్ దాఖలుకావడం గమనార్హం. బహుభార్యత్వం కంటే అయోధ్య కేసే ముఖ్యం అయోధ్య–బాబ్రీ మసీదు కేసులో దాఖలైన అన్ని పిటిషన్లను విచారించిన తర్వాతే కేసును విస్తృత ధర్మాసనానికి సిఫార్సు చేస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ సందర్భంగా కోర్టులో ముస్లిం ప్రతినిధుల తరఫున సీనియర్ న్యాయవాది రాజీవ్ ధావన్ వాదనలు విన్పిస్తూ.. ‘ముస్లింలలో ఉన్న బహుభార్యత్వం సమస్య విచారణ కంటే అయోధ్య–బాబ్రీ మసీదు కేసు విచారణ ముఖ్యమైనది. ఈ సమస్య పరిష్కారమవ్వాలని దేశం కోరుకుంటోంది’ అని అన్నారు. తదుపరి విచారణను కోర్టు ఏప్రిల్ 27కు వాయిదా వేసింది. -
విభజనపై సుప్రీంలో పయ్యావుల పిల్
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ విభజనకు కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని, విభజన ప్రక్రియ తీరుతెన్నులను సవాల్ చేస్తూ టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం రాజ్యాంగబద్ధతను ప్రశ్నిస్తూ హైదరాబాద్‌కు చెందిన సదాశివరెడ్డితో కలిసి 32వ అధికరణం కింద ప్రజా ప్రయోజనం వ్యాజ్యం(పిల్) దాఖలు చేశామన్నారు. కేంద్ర హోం శాఖ కార్యదర్శి, కేబినెట్ కార్యదర్శి, పీఎంవో కార్యదర్శి, రాష్ట్ర హోంశాఖ కార్యదర్శిని ప్రతివాదులుగా పేర్కొన్నారు. విభజనపై కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని రాజ్యాంగ విరుద్ధమైనదిగా ప్రకటించాలని కోరుతూ వైఎస్సార్సీపీ నేత, పారిశ్రామికవేత్త రఘురామ కృష్ణంరాజు ఇప్పటికే సుప్రీంలో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.